పరిచయం
మహాశివరాత్రి హిందూ సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైన, విశిష్టత కలిగిన పండుగ. ఇది పరమ శివుడిని ఆరాధించే ముఖ్యమైన రోజు. 2025లో ఈ పండుగను ఫిబ్రవరి 26వ తేదీన, బుధవారం జరుపుకుంటారు. భక్తులు శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఉపవాసం, పూజలు, జాగరణ వంటి ఆచారాలను అనుసరిస్తారు.
మహాశివరాత్రి 2025 తేదీ మరియు పూజ సమయం
> తిథి ప్రారంభం: ఫిబ్రవరి 26 రాత్రి 9:33 గంటలకు
> తిథి ముగింపు: ఫిబ్రవరి 27 రాత్రి 11:12 గంటలకు
> నిశితకాల పూజ సమయం: ఫిబ్రవరి 27 తెల్లవారుజామున 12:09 నుండి 12:59 వరకు
ఈ సమయాలలో పూజలు నిర్వహించడం శ్రేష్ఠంగా భావించబడుతుంది.
ప్రాముఖ్యత
మహాశివరాత్రి శివుడు మరియు పార్వతిదేవి యొక్క భక్తి సమ్మేళననానికి గుర్తుగా జరుపుకునే పండుగ. పురాణాల్లో ఈ రోజున శివుడు తాండవ నృత్యం చేసాడని, పార్వతితో వివాహం జరుపుకున్నాడని తెలియజేస్తున్నాయి. ఈ పండుగ శక్తి మరియు శాంతి యొక్క సమతౌల్యాన్ని సూచిస్తుంది.
భక్తులు విశ్వసించే ముఖ్య నమ్మకాలు
> మహాశివరాత్రి ఉపవాసం పాపాలను తొలగించి ముక్తికి మార్గంగా నిలుస్తుంది అని భక్తుల విశ్వాసం.
> శివుడి అనుగ్రహం పొందడానికి ఇది అత్యంత విశిష్టమైన రోజుగా భక్తులు నమ్ముతారు.
> ఈ రోజున శివనామ స్మరణం, మోక్ష మార్గాన్ని సుగమం చేస్తుంది.
మహాశివరాత్రి ఆచారాలు మరియు పూజా విధానం
ఉపవాసం
భక్తులు పంచ ఇంద్రియాలను నియంత్రణలో ఉంచుకొని అత్యంత భక్తి శ్రద్ధలతో ఉపవాసం చేస్తారు. ఈ ఉపవాసం శరీర శుద్ధికి తోడ్పడటమే కాకుండా ఆధ్యాత్మిక శక్తిని పెంపొందించి భగవంతునిపై మరింత ధ్యాస పెరిగి అయన సానిత్యాన్ని పొందడానికి అవకాశం కలుగుతుంది.
అభిషేకం
శివలింగానికి పాలు, తేనె, గంగాజలం, పసుపు, కుంకుమ, విభూది, పళ్లరసాలు మరియు ఇతర పవిత్ర పదార్థాలతో అభిషేకం చేస్తారు. బిల్వ పత్రిని, పువ్వులను అర్పించి, దూప దీప నైవేద్యాలను ఎంతో పవిత్రంగా స్వామికి సమర్పిస్తారు.
జాగరణ
రాత్రంతా నిద్రించకుండా మేల్కొని పరమ శివుడిని ధ్యానం చేస్తూ పూజలు చేస్తూ ఆ నామ స్మరణలోనే గడుపుతారు. దీని వలన భక్తి మార్గంలో శ్రద్ధను మరింత బలపరుచుకుంటూ ఆ శివుని యొక్క కటాక్షాన్ని పొందుతారు.
శివనామస్మరణం
“ఓం నమః శివాయ” అనే మంత్రాన్ని జపించడంతో పాటు శివుని యొక్క శ్లోకాలను, స్తోత్రాలు ఎంతో పవిత్రంగా పఠిస్తూ ఆయన యొక్క ద్యాసలోనే మనసును నిలుపుకొని భక్తి శ్రద్ధలతో శివుని అనుగ్రహాన్ని పొందుతారు.
మహాశివరాత్రి వ్రత కథ
మహాశివరాత్రి వ్రత కథలో ఒక ముఖ్యమైన ధర్మపాఠం ఉంది, ఇది మనకు భక్తి, కర్మఫలితాల గొప్పతనాన్ని బోధిస్తుంది. పూర్వం ఒకరోజు ఒక వేటగాడు తన జీవనోపాధి కోసం అడవిలోకి వెళ్లి రాత్రి అయ్యే సరికి అక్కడే అడవిలో ఉండిపోతాడు. అప్పుడు అతను ఒక చెట్టు ఎక్కి అక్కడ సేదతీరుతాడు. ఆ చెట్టు కిందన ఒక శివలింగం ఉంది అన్న విషయం అతనికి తెలియదు. రాత్రంతా చెట్టు పై నుంచి ఆకులు రాలుతూ శివలింగంపై పడతాయి. అలా రాత్రంతా ఆకులు శివునిపై పడుతూ ఉంటాం వలన ఉదయానికి అతనికి తెలియకుండానే శివుని పూజ చేసినట్లుగా అయింది. ఆయన చేసిన ఈ అజ్ఞానపూర్వక పూజ కారణంగా, తన పాపాలు అన్ని తొలగిపోవడం జరిగింది అని పురాణాలు చెబుతున్నాయి. శివుని కృపతో అతనికి మోక్షం లభించిందని మనకు తెలుస్తుంది. అతని ఆచరణ అజ్ఞానపూర్వకమైనదైనా అది శివుడి వద్దకు చేరే సరికి పూజగా సమర్పితమవుతుంది. ఈ కథ ద్వారా, “శివుడు భక్తుల ఆచరణలను వారి మనసులోని నిష్కల్మషత్వంతోనే అంగీకరిస్తాడు. చిన్న క్రియ కూడా విశ్వాసంతో, శ్రద్ధతో చేస్తే అది మహోన్నత ఫలితాలను అందిస్తుంది” అనే సందేశాన్ని దీని వలన మనం తెలుసుకోవచ్చు.
ఇది మనకు ధర్మబద్ధమైన జీవన విధానం, భక్తి యొక్క సారాన్ని చెప్పే గొప్ప కథ. మహాశివరాత్రి రోజు ఉపవాసం ఉండడం, శివుని భజన చేయడం, పూజలు చేయడం వంటివి మన దినచర్యలో ఒక మంచి మార్గాన్ని ఏర్పరుస్తాయి. ఈ కథ ద్వారా మనం అనుసరించాల్సిన ధర్మానికి గాఢమైన ప్రేరణ పొందుతాం.
భక్తులకు సూచనలు
> పూజ చేస్తున్న ఈ ఒక్క రోజు శుచి, శుభ్రత, భగవతుని యందు ఏకాగ్రత కలిగి ఉండాలి.
> పూజ యొక్క విధివిధానాలను స్థానిక పండితులను అడిగి తెలుసుకొని వారు చెప్పిన విధంగా పాటించండి.
> బిల్వ పత్రి, పాలు మరియు ఇతర పూజాసామగ్రిని ముందుగా సిద్ధం చేసుకోండి.
ముగింపు
మహాశివరాత్రి 2025 ఒక పవిత్రమైన రోజుగా భక్తుల హృదయాలను ఆకర్షిస్తుంది. శివుడి అనుగ్రహం పొందడం కోసం ఈ రోజున ఆచారాలు, పూజలు అత్యంత శ్రద్ధగా పాటించాలి. ఈ పండుగ శివుడి యొక్క శాంతి, శక్తి, ఆధ్యాత్మికతకు నిదర్శనంగా నిలుస్తుంది.
శివోహమ్!
హర హర మహాదేవ్! శంభో శంకర!