శ్రీరాముని వనవాస ఘట్టం: కౌసల్య దుఃఖం, లక్ష్మణుని ఆగ్రహం
Ramayanam Story in Telugu- అయోధ్య నగరంలో రాముని పట్టాభిషేకం జరగబోతోందన్న వార్త నలుదిక్కులా వ్యాపించింది. కౌసల్యాదేవి ఆనందానికి అవధుల్లేవు. తన కుమారుడు యువరాజుగా పట్టాభిషిక్తుడు కానున్నాడని తెలిసి ఆమె ఎంతో సంతోషించింది.
రాముడి సత్కార స్వభావం
రాముడు లోపలికి రాగానే, కౌసల్య దగ్గరికి వెళ్ళి, “నాయనా రామా! నీకు యువరాజ పట్టాభిషేకం జరుగుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉన్నది. మన వంశములో పుట్టిన ఎందరో గొప్పవాళ్ళలాగ నువ్వు కూడా కీర్తిని సంపాదించు” అని ఒక బంగారు ఆసనాన్ని చూపించి కూర్చోమంది.
రాముని వినయం, ధర్మనిరతి
రాముడు ఆ ఆసనాన్ని ఒకసారి ముట్టుకొని కౌసల్యతో “అమ్మా! నేను కూర్చోడానికి సమయం లేదు. నాన్నగారు భరతుడికి పట్టాభిషేకం చేస్తానన్నారు. నన్ను 14 సంవత్సరములు అరణ్యవాసం చెయ్యమన్నారు. అందుకని నేను దండకారణ్యానికి వెళ్ళిపోతున్నాను. నేను దర్భలతో చేసినటువంటి ఆసనముల మీద కూర్చోవాలి ఇటువంటి వాటి మీద కాదు. నీ ఆశీర్వాదం తీసుకొని వెళదామని వచ్చాను” అన్నాడు.
ఈ మాటలు విన్న కౌసల్య ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. కొంత సేపటికి తేరుకొని, తన దుఃఖాన్ని రాముని ముందు వెళ్లగక్కింది.
కౌసల్య దుఃఖం, ఆవేదన
“రామా! నువ్వు చెప్పిన మాటలు విన్నాక నాకు అసలు పిల్లలు పుట్టకుండా ఉండి ఉంటే బాగుండేదనిపిస్తుంది. పిల్లలు లేకపోతే నన్ను అందరూ గొడ్రాలు అంటారు. అంతకుమించి నాకు వేరే బాధ ఉండదు. ఇవ్వాళ నేను పొందుతున్న బాధ సామాన్యమైనది కాదు. నీకొక నిజం చెప్తాను. నేను దశరథుడికి భార్యగా ఉన్నప్పుడు ఏ మంగళమైన ఆనందాన్ని పొందలేదు. ఆయన కైకేయకి వశుడై ఉన్నాడు. కైకేయ మనస్సు నొచ్చుకుంటుందని ఒక జ్యేష్ఠ భార్యకి ఇవ్వవలసిన మర్యాద నాకు ఇవ్వకుండా కైకేయి యొక్క దాసీజనంతో సమానంగా చూసాడు. ఇవ్వాళ నీకు యుక్త వయస్సులో పట్టాభిషేకం జరిగి యువరాజుగా నిలబడితే నిన్ను చూసి, నీ పరిపాలన చూసి కనీసం రాజమాతగా ఆనందం అనుభవించచ్చని అనుకున్నాను. నాకు ఆ ఆనందం కూడా లేకుండాపోయింది. ఊసర క్షేత్రంలో విత్తనం వేస్తే అవి మొలకెత్తకుండా ఎలా నిష్ప్రయోజనం అవుతాయో అలా నేను చేసిన వ్రతాలు, పూజలు నిష్ప్రయోజనం అయ్యాయని అనుకుంటున్నాను. దైవానుగ్రహము నా మీద లేదు. నువ్వు వెళ్ళిపోతే నన్ను ఇక్కడ చూసుకునే వాళ్ళు ఎవరున్నారు? నేను ఈ రాజ్యంలో ఎవరిని చూసుకొని బతకాలి? నేను మరణిస్తాను” అని కౌసల్య వాపోయింది.
లక్ష్మణుని ఆగ్రహం, ప్రతిజ్ఞ
ఈ మాటలన్నీ వింటున్న లక్ష్మణుడు ఆగ్రహంతో “అన్నయ్యా! నాన్నగారికి వృద్ధాప్యం వచ్చింది కాని కామం తీరలేదు. విషయసుఖాలకి లొంగి కైకేయతో హాయిగా కాలం గడుపుతున్నాడు. ఏ అపరాధం చెయ్యని నిన్ను అడవులకు పంపిస్తున్నాడు. నువ్వేమో ధర్మము, పితృవాక్య పరిపాలన అని వెళ్ళిపోతున్నావు. అమ్మ ఇక్కడ ఇంత బాధపడుతోంది. చేతకానివాడిలా నువ్వు వెళ్ళిపోవడం ఎందుకు? నువ్వు ఒకసారి “ఊ” అను, నేను నా అస్త్ర-శస్త్రాల చేత ఈ అయోధ్యలోని ఏనుగుల తొండములతో పర్వతాల్ని పడేసినట్టు పడేస్తాను. భరతుడి పేరు చెప్పిన వాడిని, భరతుడు రాజుగా కావాలన్న వాళ్ళని ఒక బాణంతో కొన్ని వందల మందిని చంపేస్తాను. ఇంతటి ధర్మాత్ముడైన కొడుకుని అడవులకు పంపిస్తున్న దశరథుడిని బంధించి కారాగృహంలో తోసేస్తాను లేకపోతే చంపేస్తాను. నిన్ను రక్షించుకోలేకపోతే నీ పక్కన నేను ఉండి ఎందుకు? నాకు అనుమతి ప్రసాదించు” అని అన్నాడు.
కౌసల్య వేదన, రాముని ధర్మోపదేశం
పాత్ర | మాటలు |
---|---|
కౌసల్య | “రామా! నిన్ను విడిచి నేను ఉండలేను. ఉంటే నీతో పాటు నేను ఉండాలి లేదా నువ్వు నాతో ఉండాలి. నీతో పాటు నేను అడవులకు వస్తే నువ్వు ఏది తింటావో నాకు అదే పెట్టు. లేదంటే లక్ష్మణుడు చెప్పిన ఆలోచన గురించి ఆలోచించు. తండ్రి మాట బిడ్డ ఎలా వినాలో, తల్లి మాట కూడా అలానే వినాలి. తండ్రి అనుమతిచ్చాడు కనుక వెళ్ళిపోతానంటున్నావు. తల్లిగా నేను నీకు అనుమతిని ఇవ్వడంలేదు. ఒకవేళ నువ్వు నా మాట కాదని వెళితే నేను విషం తాగి చనిపోతాను. నువ్వు వెళ్ళడానికి వీలులేదు” |
రాముడు | “అమ్మా! నువ్వు చెప్పింది తప్పని నేను అనను. ఖండువు అని ఒక మహర్షి ఉండేవారు. ఆయన తండ్రి ఒకసారి పిలిచి గోవుని చంపమంటే ఆ మహర్షి గోవుని చంపేసాడు. పరశురాముడిని ఆయన తండ్రి జమదగ్ని పిలిచి నీ తల్లి అయిన రేణుక శిరస్సు నరకమన్నాడు. పరశురాముడు ఎందుకని అడగకుండా తన తల్లి కుత్తుక కోసేశాడు. మన వంశంలో పూర్వీకుడైన సగర చక్రవర్తి తన 60,000 కుమారులని పిలిచి ఈ భూమి మొత్తాన్ని తవ్వమంటే, అలా తవ్వడం పాపం కదా అని వాళ్ళు ఆలోచించలేదు. తండ్రి చెప్పాడని తవ్వేశారు. ఒకేసారి తల్లి మాట, తండ్రి మాట వినవలసి వస్తే తండ్రిమాటకే గౌరవం ఇవ్వాలి. నేను తల్లి మాట విని ఆగిపోతే పూర్వం మన వంశంలో తండ్రి మాట విన్నవాళ్ళు అవివేకులు అవుతారు. నేను వారి ప్రవర్తనని అవమానించకూడదు. నేను దశరథ మహారాజు మాట విని అడవులకు వెళ్లిపోవాలి” |
రాముని ధర్మనిరతి
“లక్ష్మణా! నువ్వు ఎంతటి పరాక్రమవంతుడివో నాకు తెలుసు. నువ్వు అన్నటువంటి మాటలు వలన అమ్మ దగ్గర అనుమతి తీసుకొని అరణ్యవాసానికి వెళదామని వచ్చిన నాకు ఎంత ఇబ్బందిగా ఉన్నాయో చూసావా! సత్యమేదో, శాంతికి స్థానమేదో తెలుసుకోవడంలో అమ్మ తత్తరపడుతున్నది. ధర్మమునందు సత్యము ప్రతిష్టితమై ఉంటుంది. ధర్మాన్ని విడిచిపెడితే సత్యధర్మములు రెండిటిని విడిచిపెట్టినట్టు అవుతుంది. ఒక ధర్మాన్నో, ఒక సత్యాన్నో పట్టుకోకూడదు. సత్యంతో కూడిన ధర్మాన్ని పట్టుకోవాలి. అమ్మా! నీకొక ధర్మాన్ని చెపుతాను. నాన్నగారు నిన్ను, సుమిత్రని, నన్ను, లక్ష్మణుడిని, సీతని శాసించచ్చు. మనమందరం దశరథుడు ఎలా చెప్తే అలా ప్రవర్తించాలి. (తండ్రి మాత్రమే కుటుంబానికి యజమాని). ఇది సనాతనమైన ధర్మము. లక్ష్మణా! ధర్మము, అర్థము, కామము అని మూడు పురుషార్ధములు ఉంటాయి. ధర్మం ఒక్కదాన్ని పట్టుకుంటే అది అర్థకామములను తీసుకువస్తుంది. ధర్మాన్ని వదిలి పట్టుకున్న అర్థం లోక ద్వేషాన్ని తీసుకొస్తుంది. ధర్మాన్ని వదిలి పట్టుకున్న కామం పతనాన్ని తీసుకొస్తుంది. ధర్మం భార్యవంటిది. (అందుకే మనం భార్యని కామపత్నిగా చూడము, ధర్మపత్ని అని అంటాము. ధర్మబద్ధమైన పత్ని వల్ల కలిగిన కామము వలన అర్థము లభిస్తుంది.) లక్ష్మణా! నువ్వు దశరథుడిని ఖైదు చేసి రాజ్యాన్ని తీసుకోమన్నావు. ధర్మబద్ధం కాని ఆ రాజ్యం నాకు అక్కరలేదు. తండ్రి చెప్పిన మాట పాటించడం కొడుకుకి ధర్మం. నేను అరణ్యానికి వెళ్ళడానికే నిశ్చయమయ్యాను. నువ్వు నాకు పట్టాభిషేకం జరుగుతుందని సంతోషంగా తెచ్చినటువంటి ఈ సంభారములన్నిటిని ఇక్కడినుంచి తీసెయ్యి. నేను అరణ్యాలకి తొందరగా వెళ్లిపోవాలి. లేకపోతే అమ్మ(కైక) బాధపడుతుంది. అమ్మ మనసులో అనుమానం అనే దుఖం ఎప్పటికి రాకూడదు. తొందరగా ఈ సంభారములన్నిటిని తీసెయ్యి. కైకమ్మ నన్నూ, భరతుడిని ఎన్నడూ వేరుగా చూడలేదు ఎంతగానో నన్ను ప్రేమించింది. నిన్న రాత్రి నన్ను పిలిచి పట్టాభిషేకం చేస్తాను అన్న నాన్నగారు ఇవ్వాళ తెల్లవారేసరికి నన్ను 14 సంవత్సరాలు అరణ్యవాసం చెయ్యమన్నారు అంటే ఒకటి గుర్తుపెట్టుకో లక్ష్మణా…… సుఖం, దుఖం, శుభం, అశుభం అన్ని వెనకనుండి శాసించేవాడు ఆ దైవం. ఆ దైవాన్ని తిరస్కరించి నువ్వు ఏమి చెయ్యలేవు. ఒక మంచిపని చేద్దామని అనుకుంటే దానికొక ప్రతిబంధకం రావడం కూడా దైవము చేసిన పనే” అని అన్నాడు.
లక్ష్మణుని నిస్సహాయత
పాత్ర | మాటలు | భావాలు |
---|---|---|
రాముడు | (చెప్పడం లేదు, కానీ శాంతంగా వింటున్నాడు) | ఓర్పు, ధర్మం పట్ల నిబద్ధత |
లక్ష్మణుడు | “నీకే చెల్లింది అన్నయ్యా! ఈ చేతకాని మాటలు మాట్లాడడం. అంత వృద్ధుడైన దశరథుడికి యవ్వనంలో ఉన్న కైకేయ పొందు కావలసి వచ్చిందా! ఇన్నాళ్ళు వరాలు జ్ఞాపకంలేవా? కైకమ్మకి. రాత్రి నిన్ను పిలిచి పట్టాభిషేకం అన్నాడు. రాత్రికి రాత్రే కైకేయకి రెండు వరాలు ఇచ్చి సత్య ధర్మాలకి కట్టుబడి నిన్ను అరణ్యాలకి పొమ్మని భరతుడికి రాజ్యం ఇస్తాడా! తండ్రి మాట నిలబెట్టడం ధర్మమని నువ్వు అరణ్యాలకి వెళతానంటావా! ఇంత ధనుర్విద్య నేర్చుకున్న నువ్వు దుంపలు తింటూ, తేనె తాగుతూ అడవుల్లో తిరుగుతావా! ఇదంతా దైవం చేశాడంటున్నావు కదా! ఆ దైవాన్ని ఒకసారి కనపడమను. నా ధనుస్సుకి బాణాలని సంధించి మొదట దశరథుడి తల, కైకేయ తల పడగొడతాను. నిన్ను తీసుకెళ్ళి సింహాసనం మీద కుర్చోపెడతాను. నన్ను ఆ దైవం నిగ్రహించగలిగితే, దైవం ఉందని ఒప్పుకుంటాను. దైవమో, లక్ష్మణుడో నెగ్గాలి. నువ్వు చెప్పిన మాటలు నాకు ఎంతమాత్రము నచ్చలేదు. నువ్వు అనుమతిని ఇవ్వు దశరథుడి మీద యుద్ధం ప్రకటిస్తాను” | కోపం, ఆవేశం, ధర్మం పట్ల ఆవేదన, రాముడి పట్ల ప్రేమ, తండ్రిపై కోపం. |
రాముని శాంతం, కౌసల్య ఆశీర్వాదం
రాముడు “లక్ష్మణా! నువ్వు మళ్ళీ పొరబడుతున్నావు. ఇదంతా చేస్తున్నది ఆ దైవమే నేను అనుమతించిననాడు కదా నువ్వు బాణం వెయ్యడము. దశరథ మహారాజు గారిని ఇచ్చిన మాట మీద నిలబెట్టడం కోసం అరణ్యాలకి వెళ్ళడం మినహా నాకు వేరొక మార్గం లేదని అడవులకు వెళుతున్న తనని ఆశీర్వదించమని” కౌసల్యతో అన్నాడు. కౌసల్య “సరే! అలాగే వెళ్ళు. కాని నా కన్నీళ్ళని దశరథుడు తుడుస్తాడన్న నమ్మకం లేదు. నన్ను నీతోపాటే తీసుకెళ్ళు. లేదా నేను ఇక్కడే విషం తాగి మరణిస్తాను. ఈ రెండిటిలో ఏది చెయ్యమంటావో చెప్పి బయలుదేరు” అని రాముడితో అన్నది. రాముడు, తండ్రిని విడిచి రావటం ధర్మం కాదు అని చెప్పి ఆమెను ఓదారుస్తాడు. కౌసల్య రాముడికి ఆశీర్వాదం ఇస్తుంది.
ఇంకా ఇలాంటి రామాయణంలోని విశేషాలను తెలుసుకోవడానికి, ఈ లింక్‌ను సందర్శించండి: రామాయణం
ఇంకా ఇతర పాఠాలను చదవడానికి: