Ramayanam Story in Telugu – రామాయణం 56-సుందరకాండ

Ramayanam Story in Telugu- పెద్దలు సుందరకాండ గొప్పతనం గురించి ఏం చెప్పారంటే

రాముడు ఎంత అందగాడో కదా! సీతమ్మ కథ ఇంకా అందంగా ఉంటది. సీతమ్మ అయితే అందానికే అందం. అశోకవనం చూస్తే కన్నుల పండుగే. ఈ కావ్యం (సుందరకాండ) మహా అద్భుతం. హనుమంతుడు అయితే సాక్షాత్తు సౌందర్యానికే రూపం. ఇందులో ఉన్న మంత్రాలన్నీ దివ్యమైనవి. మరి సుందరకాండలో అందం లేనిది ఏముంటది చెప్పండి?

ఇంకో విషయం ఏంటంటే, సుందరకాండ “తత్” అనే మాటతో మొదలై, “తత్” అనే మాటతోనే అయిపోతుంది. “తత్” అంటే పరబ్రహ్మం అని అర్థం. అందుకే దీన్ని ఉపాసన కాండ అని కూడా అంటారు. పరమాత్ముడిని ఎలా పూజించాలో ఈ కాండ మనకు నేర్పిస్తుంది.

సీతమ్మ జాడ కోసం హనుమంతుడి ప్రయాణం

రావణాసురుడు ఎత్తుకుపోయిన సీతమ్మ ఎక్కడుందో వెతకడానికి హనుమంతుడు బయలుదేరాడు. ఆకాశంలో తిరిగే చారణులు వెళ్ళే దారిలో వెళ్లాలని అనుకున్నాడు. ఎవ్వరూ చేయలేని ప పని చేయడానికి బయలుదేరుతున్న హనుమంతుడు ఒక పెద్ద కొండ మీద నిలబడ్డాడు. అది చూడటానికి ఒక పెద్ద ఎద్దు నిలబడినట్టు ఉంది. ఆ కొండ శిఖరం వైఢూర్యాల్లా మెరిసిపోతోంది. దాని మీద ఉన్న పచ్చటి గడ్డిని తొక్కుకుంటూ అటూ ఇటూ తిరుగుతున్నాడు.

అప్పుడు హనుమంతుడు బయలుదేరే ముందు సూర్యుడికి, ఇంద్రుడికి, వాయుదేవుడికి, బ్రహ్మదేవుడికి, ఇంకా భూమి మీద ఉన్న అందరికీ దండం పెట్టుకున్నాడు. ఆ తరువాత మహేంద్రగిరి అనే పెద్ద కొండ మీద నిలబడి దక్షిణ దిక్కు వైపు బాగా చూశాడు. గట్టిగా తన కాళ్ళతో ఆ కొండ శిఖరాలను తొక్కాడు. అంతే, ఆ చెట్ల మీద ఉన్న పువ్వులన్నీ రాలి హనుమంతుడి మీద పడ్డాయి. ఆ కొండ మీద ఉన్న గుహలన్నీ అదిరిపోయాయి.

హనుమంతుడు ఇంకా గట్టిగా ఆ కొండను తొక్కాడు. ఎప్పటినుంచో ఆ కొండ మీద పుట్టల్లో ఉన్న పాములు ఆ పుట్టలు నొక్కుకుపోతున్నాయని బయటికి వచ్చేలోపే అవి నలిగిపోయాయి. ఆ బాధ తట్టుకోలేక ఆ పాములు అక్కడున్న రాళ్ళకు కాట్లు వేశాయి. ఆ విషం నుంచి పుట్టిన మంటలు ఆ మహేంద్ర పర్వత శిఖరాలను కాల్చివేశాయి. అప్పటిదాకా ఆ కొండ మీద తమ భార్యలతో సరదాగా ఉన్న గంధర్వులు ఒక్కసారిగా లేచి, ఎక్కడా ఆధారం లేకుండా ఆకాశంలోకి ఎగిరిపోయారు. వాళ్ళు హనుమంతుడిని చూసి ఆశ్చర్యపోయారు.

“ఇదిగో, ఈ కొండలాంటి శరీరం ఉన్న వాయుపుత్రుడు హనుమంతుడు, ఈరోజు మొసళ్ళతో నిండిన ఈ పెద్ద సముద్రాన్ని దాటి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నాడు” అని దేవతలు, మహర్షులు అనుకున్నారు. ఆకాశమంతా వాళ్ళతో నిండిపోయింది. వాళ్ళంతా హనుమంతుడిని దీవించారు.

హనుమంతుడు తన తోకను ఒక్కసారి పైకి ఎత్తి అటూ ఇటూ ఊపాడు. గట్టిగా గాలి పీల్చి తన గుండెల్లో నింపుకున్నాడు. మళ్ళీ గట్టిగా తన కాళ్ళతో ఆ కొండను తొక్కాడు. తన తొడలను బాగా చాపి, అక్కడున్న వానరాల వైపు ఒక్కసారి చూసి ఇలా అన్నాడు,

“రాముడి కోదండం నుంచి దూసుకొచ్చిన బాణంలా నేను లంక పట్టణానికి వెళ్తాను. అక్కడ సీతమ్మ కనిపిస్తే సంతోషం. లేకపోతే అక్కడి నుంచి స్వర్గానికి వెళ్ళి సీతమ్మను వెతుకుతాను. ఒకవేళ సీతమ్మ నాకు స్వర్గంలో కూడా కనపడకపోతే, అదే వేగంతో లంకకు తిరిగి వచ్చి రావణుడిని బంధించి రాముడి కాళ్ళ దగ్గర పడేస్తాను” అని గట్టిగా ప్రమాణం చేసి, తన కాలు పైకెత్తి ఆ కొండ మీద నుంచి దూకాడు.

హనుమంతుడు అలా వేగంగా పైకి లేచేసరికి, కొన్ని వేల సంవత్సరాల నుంచి ఆ కొండ మీద గట్టిగా పాతుకుపోయిన పెద్ద పెద్ద చెట్లు కూడా వేళ్ళతో సహా ఆయనతో పాటు పైకి లేచాయి. ఆకాశంలో వెళ్తున్న హనుమంతుడి మీద ఆ చెట్లు పువ్వులను కురిపించాయి. తేలికైన చెట్లు చాలా దూరం వెళ్ళాయి. బరువైన చెట్లు కాస్త దూరం వెళ్ళాక కింద పడిపోయాయి. అలా వెళ్తున్న హనుమంతుడిని చూసిన వాళ్ళకు “ఈయన ఆకాశాన్ని తాగుతున్నాడా? లేక సముద్రాన్ని తాగుతున్నాడా?” అని అనుమానం వచ్చింది.

పసుపుపచ్చని కళ్ళతో హనుమంతుడు మెరిసిపోతున్నాడు. ఆయన ఎర్రటి నోరు సూర్యమండలంలా వెలిగిపోతోంది. ఆయన తొడల వేగానికి సముద్రాన్ని చాపలా చుట్టి పైకి ఎత్తేశాడు. అప్పుడు ఆ నీళ్లలో ఉన్న తిమింగలాలు, తాబేళ్ళు, చేపలు, రాక్షసులు పైకి కనిపించారు. హనుమంతుడు ఒక్కోసారి మేఘాల్లోకి వెళ్ళిపోయి మళ్ళీ బయటికి వస్తూ ముందుకు సాగిపోతున్నాడు.👉 బక్తివాహిని – రామాయణం విభాగం

లక్షణంవర్ణన
కళ్ళుపసుపు రంగు
నోరుఎర్రటి, సూర్యమండలంలా
వేగంసముద్రాన్ని పైకి లేపినంత వేగం
గాలి పీల్చిన శబ్దంనీలగిరి లో నినాదంలా

మైనాకుడి ఆతిథ్యం

హనుమంతుడు అంత వేగంగా వెళ్ళిపోతుంటే కింద నుంచి సముద్రుడు చూశాడు. “ఈ సముద్రాలన్నీ ఇక్ష్వాకు వంశంలో పుట్టిన సగర చక్రవర్తి వల్ల ఏర్పడ్డాయి. ఇప్పుడు అదే వంశంలో పుట్టిన రాముడి పని మీద హనుమంతుడు నా మీదుగా వెళ్తున్నాడు. ఆయనకు ఆతిథ్యం ఇవ్వడం నా ధర్మం” అని అనుకున్నాడు. తనలో ఉన్న మైనాక పర్వతం వైపు చూసి ఇలా అన్నాడు.

“నిన్ను దేవేంద్రుడు ఇక్కడ ఎందుకు వదిలేశాడో తెలుసా? పాతాళ లోకంలో ఉన్న రాక్షసులు అప్పుడప్పుడు సముద్ర మార్గం గుండా భూమి మీదకు వచ్చేవారు. వాళ్ళు అలా రాకుండా ఉండడానికి పాతాళానికి ఉన్న పెద్ద రంధ్రానికి నువ్వు అడ్డంగా పడుకున్నావు. ఇక కింద వాళ్ళు పైకి రారని ఇంద్రుడు నిన్ను వదిలేశాడు. కానీ నీకు ఉన్న శక్తి వల్ల నువ్వు పైకి, కిందకి, పక్కలకి పెరగగలవు. నువ్వు హనుమంతుడికి ఆతిథ్యం ఇవ్వడం కోసం ఒకసారి పైకి లేస్తే ఆయన నీ శిఖరాల మీద దిగుతాడు.”

అంతే, మైనాక పర్వత శిఖరాలు సముద్రం నుంచి పైకి వచ్చాయి. బయటికి వచ్చిన ఆ బంగారు శిఖరాల మీద సూర్యకాంతి పడగానే ఆకాశమంతా ఎర్రటి రంగుతో నిండిపోయింది. ఆ శిఖరాలను చూసిన హనుమంతుడు “ఓహో, ఇప్పటి వరకు ఈ శిఖరాలు కనపడలేదు. ఇప్పుడే సముద్రం నుంచి ఈ బంగారు శిఖరాలు పైకి వస్తున్నాయి. ఎవరో నా ప్రయాణాన్ని ఆపడానికి అడ్డు వస్తున్నారు” అని అనుకుని తన గుండెలతో ఆ శిఖరాలను ఒక్కసారి కొట్టాడు. ఆ దెబ్బకు ఆ శిఖరాలు నుజ్జునుజ్జయి కింద పడిపోయాయి.

మైనాకుడు మనిషి రూపం తీసుకుని తన శిఖరాల మీదే నిలబడి ఇలా అన్నాడు: “అయ్యా! మామూలు అతిథి వస్తేనే వదలము. మరి నువ్వు మాకు ప్రత్యేకమైన సహాయం చేసిన గొప్ప అతిథివి. సహాయం చేసిన వాడికి తిరిగి సహాయం చేయడం మన ధర్మం. ఇక్ష్వాకు వంశం వాళ్ళ వల్ల సముద్రానికి మేలు జరిగింది. నీ తండ్రి వాయుదేవుడి వల్ల మాకు ఉపకారం జరిగింది. అందుకే నువ్వు ఒక్కసారి నా పర్వత శిఖరాల మీద కూర్చొని కాస్త తేనె తాగి, పళ్ళు తిని విశ్రాంతి తీసుకుని మళ్ళీ హాయిగా వెళ్ళు.”

హనుమంతుడు ఒక్కసారి ఆ మైనాకుడిని చేతితో తాకి “నేను చాలా సంతోషించాను. నువ్వు నాకు ఆతిథ్యం ఇచ్చినట్టే భావిస్తున్నాను. నా మీద కోపం తెచ్చుకోవద్దు. నాకు చాలా ముఖ్యమైన పని ఒకటి ఉంది. సూర్యాస్తమయం కాకముందే నేను వెళ్ళిపోవాలి. నేను ప్రతిజ్ఞ చేసి బయలుదేరాను. మధ్యలో ఎక్కడా ఆగకూడదు” అని చెప్పి వెళ్ళిపోయాడు.

బయటికి వచ్చిన మైనాకుడిని ఇంద్రుడు చూసి “ఓహో! ఇన్నాళ్ళకు నువ్వు పాతాళం నుంచి బయటికి వచ్చావు కదా!” అన్నాడు.

మైనాకుడు “ఈ ఇంద్రుడు నా రెక్కలను నరికేస్తే నరికేశాడు. ఉపకారం చేసిన వాళ్ళకు తిరిగి ఉపకారం చేయకుండా ఈ సముద్రంలో ఎంత కాలం పడి ఉండను” అనుకున్నాడు.

ఇంద్రుడు అన్నాడు “నాయనా మైనాక! ధైర్యంగా హనుమకు సహాయం చేయడానికి బయటికి వచ్చావు. రామకార్యం కోసం వెళ్తున్న వాడికి ఆతిథ్యం ఇవ్వడానికి బయటికి వచ్చావు కాబట్టి నీ రెక్కలు నరకను” అని అభయం ఇచ్చాడు.

సురస పరీక్ష

దేవతలు నాగమాత అయిన సురసతో (సురస దక్షుడి కుమార్తె) “చూశావా తల్లి! హనుమ వస్తున్నాడు. నువ్వు ఒక పెద్ద రాక్షసి వేషంలో వెళ్ళి అడ్డంగా నిలబడి మింగేస్తానని భయపెట్టి ఆయన శక్తిని పరీక్షించు” అన్నారు.

సురస ఒక భయంకరమైన రూపాన్ని పొంది సముద్రం నుంచి బయటికి వచ్చి హనుమంతుడితో “నిన్ను దేవతలు నాకు ఆహారంగా ఇచ్చారు. నేను నిన్ను తింటాను. నువ్వు నా నోట్లోకి రా” అన్నది.

హనుమంతుడు సంతోషంగా రామకథను సురసకు చెప్పి “నేను సీతమ్మ జాడ వెతకడానికి వెళ్తున్నాను. ఒక్కసారి సీతమ్మ జాడ కనిపెట్టి వెనక్కి వెళ్ళి రాముడికి ఆ విషయం చెప్పి నీ నోట్లోకి వస్తాను. ప్రస్తుతానికి నన్ను వదిలిపెట్టు తల్లీ! నేను నిజమే మాట్లాడుతున్నాను, మాట తప్పను” అన్నాడు.

సురస “అలా కుదరదు. నాకు బ్రహ్మగారి వరం ఉంది. నువ్వు నా నోట్లోకి ప్రవేశించవలసిందే” అని తన నోటిని పెద్దగా తెరిచింది. హనుమంతుడు తన శరీరాన్ని బాగా పెంచాడు. సురస కూడా తన నోటిని బాగా పెంచింది. అలా ఇద్దరూ నూరు యోజనాల వరకు పెరిగిపోయారు.

అప్పుడు హనుమంతుడు బొటనవేలంత చిన్నవాడిగా అయి ఆ సురస నోట్లోకి ప్రవేశించి బయటికి వచ్చి “అమ్మా! నువ్వు చెప్పినట్టు నీ నోట్లోకి వెళ్ళి వచ్చేశాను. సరిపోయింది కదా! ఇక నేను బయలుదేరతాను” అన్నాడు.

“ఎంతో తెలివైన వాడివి నువ్వు. రాముడితో సీతమ్మను కలిపినవాడు హనుమ అని పేరు పొందుతావు గాక” అని సురస హనుమంతుడిని దీవించింది.

సింహిక కామరూపిణి

హనుమంతుడు సురసకు ఒక నమస్కారం చేసి ముందుకు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతున్న హనుమంతుడిని సింహిక అనే రాక్షసి సముద్రం నుంచి చూసింది. సింహిక కామరూపిణి. ఆమెకు నీడను పట్టి లాగేసే శక్తి ఉంది. ఆమె హనుమంతుడి నీడను పట్టి లాగడం మొదలుపెట్టింది. తన వేగం తగ్గుతోందని గమనించిన హనుమంతుడు తన శరీరాన్ని ఒక్కసారిగా పెద్దగా చేశాడు.

ఆ సింహిక కూడా తన శరీరాన్ని పెద్దగా చేసింది. మళ్ళీ హనుమంతుడు చిన్నవాడిగా తన శరీరాన్ని మార్చి ఆ సింహిక నోటి ద్వారా లోపలికి ప్రవేశించి ఆమె గుండెకాయను తెంపేసి బయటికి వచ్చేశాడు. గిలగిల తన్నుకుని ఆ సింహిక చనిపోయింది.ముందుకు వెళ్ళిన హనుమంతుడు లంక పట్టణాన్ని చేరుకున్నాక తన శరీరాన్ని చిన్నదిగా చేసి లంబగిరి అనే పర్వతం మీద దిగాడు.

  • శక్తి, ధైర్యం, భక్తి, నిశ్చయబుద్ధి వంటి విలువలు హనుమంతుడి ద్వారా ప్రతిఫలించాయి.
  • ఈ కాండను పఠించేవారికి విజయం, కష్టాల నివారణ, శాంతి లభిస్తాయని విశ్వాసం.

ముగింపు

హనుమంతుడి ధైర్యం చూస్తే మనకు కూడా ధైర్యం వస్తుంది. ఆయనకున్న నమ్మకం మనలో విశ్వాసాన్ని నింపుతుంది. తన పనిని ఎంత శ్రద్ధగా చేశాడో చూస్తే మనకు కూడా మన బాధ్యతలను గుర్తుచేస్తుంది. ఆయన ప్రయాణం, ఆయన చేసిన పనులు మనకు ఒక స్ఫూర్తి.

గుర్తుపెట్టుకోండి: సుందరకాండను కేవలం చదివితే సరిపోదు. దాని అర్థం తెలుసుకోవాలి, అందులో చెప్పిన మంచి విషయాలను మన జీవితంలో పాటించాలి. అప్పుడే అది మనకు ఒక మంచి దారి చూపే వెలుగులా మారుతుంది.

MS Rama Rao Sundarakanda Telugu

https://youtu.be/bqDv7hjsgN8

  • Related Posts

    Ramayanam in Telugu-రామాయణం 63-కిష్కిందకు తిరుగు ప్రయాణం

    హనుమంతుని ఉత్సాహపూరిత ఆగమనం Ramayanam Story in Telugu- ఆకాశంలోని మేఘాలను తాగుతున్నాడా అన్నట్లుగా వేగంగా ఎగురుకుంటూ వెళ్ళిన హనుమంతుడు, ఉత్తర దిక్కున తన కోసం ఎదురుచూస్తున్న వానరుల వద్దకు చేరుకోగానే ఒక పెద్ద ధ్వని చేశాడు. ఆ శబ్దం విన్న…

    భక్తి వాహిని

    భక్తి వాహిని
    Ramayanam Story in Telugu – రామాయణం 62

    సీతమ్మ వద్ద సెలవు మరియు సంకల్పం Ramayanam Story in Telugu- హనుమంతుడు సీతమ్మ దగ్గర సెలవు తీసుకుని ఉత్తర దిక్కుకు వచ్చాడు. అప్పటికే లంకా పట్టణానికి రావడం, సీతమ్మ తల్లిని దర్శించడం పూర్తయ్యాయి. రావణుడికి ఒక మాట చెబితే ఏమైనా…

    భక్తి వాహిని

    భక్తి వాహిని