సంజీవని కోసం సుషేణుడి సూచన
Ramayanam Story in Telugu- పూర్వకాలంలో దేవతలకు రాక్షసులకు మధ్య భీకరమైన యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో రాక్షసులు తమ విశేషమైన అస్త్రాలతో దేవతలను తీవ్రంగా బాధించారు. ఎందరో దేవతలు ప్రాణాలు కోల్పోతూ, శరీరాలు గాయపడుతుంటే, దేవగురువైన బృహస్పతి విశల్యకరణి, సంజీవకరణి, సంధానకరణి అనే అద్భుతమైన ఓషధులు కలిగిన మొక్కల రసం తీసి వారి ముక్కులకు చూపించగా, ఆ దేవతలందరూ తిరిగి జీవించారు. 🔗 బక్తివాహిని – రామాయణం
ప్రస్తుతం ఆ ఓషధులు పాల సముద్రంలో ఉండే రెండు పర్వత శిఖరాలపై ఉన్నాయి. మన వానర సైన్యంలో హనుమంతుడు, సంపాతి, ఋషభుడు, నీలుడు వంటి కొందరు మాత్రమే ఆ ఓషధులను గుర్తుపట్టగలరు. వారిని పంపి ఆ ఓషధులను తెప్పించి రాముడికి, లక్ష్మణుడికి వాసన చూపిస్తే వారు బ్రతికే అవకాశం ఉంటుంది అని సుషేణుడు చెప్పాడు.
ఔషధం పేరు | ఉపయోగం |
---|---|
విశల్యకరణి | శరీరంలోని బాణములను వెలికితీసి గాయాలను నయం చేస్తుంది |
సంజీవకరణి | చనిపోయినవారిని మళ్ళీ ప్రాణాలతో ఉంచుతుంది |
సంధానకరణి | శరీర భాగాల మధ్య సంధానాన్ని కలిగిస్తుంది |
గరుత్మంతుని రాక – రామలక్ష్మణులకు స్వస్థత
సుషేణుడు చెప్పిన ప్రకారం వెళ్దామని వానరులు అనుకుంటుండగా, అక్కడ ఒక గొప్ప శబ్దం వినిపించింది. ఆ ధ్వని ఎక్కడి నుండి వస్తోందని అందరూ సముద్రం వైపు చూడగా, బ్రహ్మాండమైన కాంతితో, రెక్కలు విప్పుతూ ఒక మహా స్వరూపం వారి వైపు వస్తోంది. అది వస్తుండగా దాని యొక్క కాంతికి, వేగానికి సముద్రపు ఒడ్డున ఉన్న వేలకొద్దీ చెట్లు నేలకూలాయి. కాంతివంతమైన స్వరూపంతో గరుత్మంతుడు వచ్చి అక్కడ నిలబడ్డాడు. ఆయనను చూడగానే అందరూ ఆశ్చర్యపోయి నమస్కరించారు.
అప్పటివరకు రామలక్ష్మణులను గట్టిగా పట్టుకుని ఉన్న నాగపాశాలు గరుత్మంతుడు వచ్చి వాలగానే వారిని విడిచిపెట్టి పారిపోయాయి. నాగపాశాలు తొలగగానే రామలక్ష్మణులు స్వస్థత పొంది పైకి లేచారు. గరుత్మంతుడు వారిద్దరినీ దగ్గరకు తీసుకుని గట్టిగా ఆలింగనం చేసుకుని వారి ముఖాలను తన చేతులతో నిమిరాడు. గరుత్మంతుడు అలా కౌగలించుకోగానే ఇంతకుముందు రాముడికి ఎంత బలం, ఎటువంటి పరాక్రమం, ఎటువంటి బుద్ధి, ఎటువంటి తేజస్సు ఉండేవో వాటికి రెండింతలు పొందాడు. వారి ఒంటి మీద ఉన్న గాయాలన్నీ మానిపోయాయి.
గరుత్మంతుని హెచ్చరిక మరియు పరిచయం
గరుత్మంతుడు రాముడితో ” రామా! ఇక మీదట నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు. కద్రువ యొక్క సంతానమైన భయంకరమైన కోరలున్న పాములను ఇంద్రజిత్ తన మాయతో బాణాలుగా మార్చుకున్నాడు. ఈ నాగపాశం నుండి దేవేంద్రుడు కూడా విడిపించుకోలేడు. యక్షులు, గంధర్వులు, కిన్నెరులు అందరూ కలిసి ఇక్కడికి వచ్చినా ఈ నాగపాశాలను విడదీయలేరు. ఇది కేవలం నన్ను చూసి మాత్రమే విడిపోతుంది” అన్నాడు.
రాముడు ” మీరు ఎవరు?” అని అడిగాడు.
గరుత్మంతుడు బదులిస్తూ ” రామా! నేను గరుత్మంతుడిని. నేను ఎందుకు వచ్చానో ఇప్పుడు అడగవద్దు. నీకు నాకు ఒక గొప్ప స్నేహం ఉంది. నీకు నాకు ఉన్న అనుబంధం ఏమిటో యుద్ధం అయ్యాక చెబుతాను. ఇప్పుడు చెప్పడం కుదరదు. నువ్వు నన్ను అడగనూ కూడదు. కొద్ది కాలంలోనే ఈ లంకలో వృద్ధులు, బాలురు తప్ప ఓపిక ఉన్న రాక్షసుడు ఎవ్వడూ ఉండకుండా నువ్వు వారిని సంహరించి సీతమ్మను పొందుతావు. మరి నేను బయలుదేరడానికి నాకు అనుమతిని ప్రసాదించు” అన్నాడు.
రాముడు ” చాలా సంతోషం. మీరు వెళ్ళండి” అన్నాడు.
గరుత్మంతుడు ఎలా వచ్చాడో అలా తన బంగారు రెక్కలను ఊపుకుంటూ సముద్రం మీద నుంచి వెళ్ళిపోయాడు.
వానరుల ఆనందం – రావణుడి ఆందోళన
రెట్టింపు ఉత్సాహంతో, బలంతో ఉన్న రామలక్ష్మణులను చూడగానే అక్కడున్న వానరులందరూ ఆనందంతో భేరీలు మ్రోగించారు. కుప్పిగంతులు వేశారు, పాటలు పాడారు, పెద్ద పెద్ద కేకలు వేశారు. లోపల సంతోషంగా కూర్చుని ఉన్న రావణుడికి ఈ కేకలు వినిపించి ” ఏమి జరిగిందో చూడండి” అన్నాడు.
అక్కడున్న రాక్షసులు ప్రాసాదం మీదకి ఎక్కి చూసేసరికి రెండు ఏనుగులు స్నానం చేసి వచ్చి నిలబడితే ఎలా ఉంటుందో అలా రామలక్ష్మణులిద్దరూ నిలబడి ఉన్నారు. వారు వెంటనే చూసిన విషయాన్ని రావణుడికి చెప్పారు. ఆ మాటలు విన్న రావణుడు మొదట ఆశ్చర్యాన్ని పొంది తరువాత ఆగ్రహంతో ఊగిపోయాడు.
ధూమ్రాక్షుడిని యుద్ధానికి పంపడం
రావణుడు ధూమ్రాక్షుడు అనే రాక్షసుడిని పిలిచి ” నువ్వు వెంటనే వెళ్ళి రాముడిని, లక్ష్మణుడిని, సుగ్రీవుడిని సంహరించి తిరిగి రా! నీకన్నా బంధువు నాకు లేడు. నువ్వు అపారమైన శౌర్యం ఉన్నవాడివి. నీకు కావలసినంత సైన్యాన్ని తీసుకుని వెళ్ళు” అన్నాడు.
అపశకునాలు – ధూమ్రాక్షుడి మరణం
ధూమ్రాక్షుడు పశ్చిమ ద్వారంగుండా బయటికి వెళ్ళాడు. ఆయన అలా బయటికి వెళ్ళగానే ఆకాశం నుండి ఒక మేఘం వచ్చి రక్తాన్ని వర్షించింది. ఆకాశంలో తిరుగుతున్న ఒక గ్రద్ద వాడి రథం మీద వాలింది. రక్తంతో తడిసిపోయిన ఒక తెల్లటి మొండెం సూర్యమండలంలో నుంచి వాడి రథం ముందు పడింది. ఇన్ని అపశకునాలు కనిపించినా ఆ ధూమ్రాక్షుడు యుద్ధానికి వెళ్ళాడు.
ధూమ్రాక్షుడు తన బాణాలతో వానరులను కొట్టి వారి శరీరాలను చీల్చేస్తున్నాడు. హనుమంతుడు ఒక పెద్ద శిలను పెకలించి పరుగు పరుగున వచ్చి దానిని ధూమ్రాక్షుడి మీదకి విసిరాడు. హనుమ వేసిన శిలను గమనించిన ధూమ్రాక్షుడు ఆ రథం నుంచి బయటికి దూకేశాడు. ఆ రథం తుత్తునియలు అయిపోయింది.
ధూమ్రాక్షుడు కొన్ని బాణాలతో హనుమంతుడిని కొట్టాడు. హనుమంతుడు ఒక పర్వత శిఖరాన్ని పీకి ఆ ధూమ్రాక్షుడి మీద వేస్తే నజ్జునజ్జయిపోయి ఆ ధూమ్రాక్షుడు మరణించాడు.
వజ్రదంష్ట్రుడిని యుద్ధానికి పంపడం – అతని మరణం
రావణుడు వజ్రదంష్ట్రుడు అనే రాక్షసుడిని యుద్ధానికి పంపాడు. ఆయన సైన్యంతో కలిసి దక్షిణ ద్వారం నుంచి బయటికి వచ్చాడు. ఆ వజ్రదంష్ట్రుడు బయటికి రాగానే అరణ్యంలో ఉన్న నక్కలు అరిచాయి. అన్ని మృగాలు ఏడ్చాయి. ఆ వజ్రదంష్ట్రుడు ఒకేసారి 7-8 బాణాలను ప్రయోగించేవాడు. అన్ని వైపులకూ బాణాలను ప్రయోగించి వానరులను కొట్టాడు.
ఇక వీడిని ఉపేక్షించకూడదని అంగదుడు భావించి ఒక పెద్ద వృక్షాన్ని పట్టుకొచ్చి వజ్రదంష్ట్రుడిని కొట్టబోయాడు. ఆ వృక్షాన్ని తన బాణాల చేత వజ్రదంష్ట్రుడు నరికేశాడు.
అంగదుడు ఒక పెద్ద పర్వతాన్ని పట్టుకొచ్చి దానిని విసిరేశాడు. ఆ దెబ్బకు వజ్రదంష్ట్రుడి రథం ముక్కలయిపోయింది. అంగదుడు ఒక పర్వత శిఖరాన్ని పట్టుకొచ్చి విసిరేసరికి దాని కింద పడి వజ్రదంష్ట్రుడు మరణించాడు.
అకంపనుడిని యుద్ధానికి పంపడం – అతని మరణం
ఈసారి రావణుడు అకంపనుడు అనే రాక్షసుడిని పంపాడు. ఆ అకంపనుడు యుద్ధానికి వస్తుండగా ఆయన ఎడమ కన్ను అదిరింది. అకారణంగా వాడి కంఠం బొంగురుపోయింది. పక్షులు, మృగాలు ఆయన చుట్టూ తిరుగుతూ దీనంగా ఏడుస్తున్నాయి. ఎత్తుపల్లాలు లేని మార్గంలో వెళుతున్న గుర్రాలు తొట్రుపడి మోకాళ్ళ మీద కిందపడి పైకి లేచాయి.
ఈ అకంపనుడు కూడా పశ్చిమ ద్వారంగుండానే బయటికి వెళ్ళాడు. ఆయన కొంతసేపు భయంకరమైన యుద్ధం చేసి వానరులను కొట్టాడు. హనుమంతుడు ఆయన మీదకి ఒక పర్వతాన్ని విసరగా దానిని ముక్కలు చేశాడు. హనుమంతుడు వేసిన ఒక పెద్ద చెట్టుని 14 బాణాలతో కొట్టి బద్దలు చేశాడు.
ఆ హనుమంతుడు ఇంకొక పెద్ద చెట్టుని పట్టుకుని పరిగెత్తుకుంటూ వస్తూ దారిలో ఉన్న రాక్షసులను కొట్టుకుంటూ ఏనుగుల్ని ఎడమ చేతితో విసిరేస్తూ మహా రౌద్రరూపంతో ఆ చెట్టును పట్టుకెళ్ళి అకంపనుడిని కొట్టాడు. ఆ దెబ్బకు వాడు పచ్చడై చనిపోయాడు.
ప్రహస్తుడితో రావణుడి సంభాషణ – అతని యుద్ధానికి సన్నద్ధత
రావణుడు తన సర్వసైన్యాధికారి అయిన ప్రహస్తుడిని పిలిచి ” ప్రహస్తా! యుద్ధం చాలా తీవ్రంగా ఉంది. నేను వెళ్ళాలి, కుంభకర్ణుడు వెళ్ళాలి, నికుంభుడు వెళ్ళాలి లేకపోతే తత్తుల్యమైన పరాక్రమం ఉన్న నువ్వు వెళ్ళాలి. వెళ్ళిన వాడు తిరిగి రావడం లేదు. ఇప్పుడు కాని నువ్వు వెళితే యుద్ధం చేద్దాము. మనం యుద్ధం చెయ్యలేము అని నువ్వు అంటే యుద్ధం ఆపేద్దాము” అన్నాడు.
ప్రహస్తుడు ” మీరు ఈ మాట ఇంతకుముందు ఒకసారి సభలో అడిగారు. అప్పుడు కొంతమంది ‘ సీతమ్మని ఇచ్చెయ్యండి’ అన్నారు. మీరు అప్పుడే ఇవ్వలేదు. ఇప్పుడు యుద్ధం ఆపడమేమిటి? యజ్ఞంలో వేసిన దర్భలా వెళ్ళి పడిపోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఇప్పుడు నన్ను వెళ్ళమనా మీ ఉద్దేశ్యం?” అన్నాడు.
రావణుడు ” ప్రహస్త! నీ కంఠం గట్టిది. నువ్వు యుద్ధానికి వెళ్ళి గట్టిగా అరువు. వానరులకు యుద్ధం చెయ్యడం రాదు. వాళ్ళు చపలబుద్ధులు. నువ్వు గట్టిగా అరిస్తే అన్ని వానరములు పారిపోతాయి. యుద్ధ భూమిలో ఒక్క రామలక్ష్మణులు తప్ప ఎవరూ ఉండరు. నువ్వు వాళ్ళని సునాయాసంగా కొట్టేయొచ్చు” అన్నాడు.
ప్రహస్తుడు రావణుడికి ప్రదక్షిణ చేసి, రథానికి ప్రదక్షిణ చేసి కొన్ని లక్షల సైన్యంతో యుద్ధానికి వెళ్ళాడు. ఈయనకు కూడా అనేకమైన అపశకునాలు కనిపించాయి. ఈయన కూడా మిగతా వాళ్ళలాగానే వాటిని లెక్కచేయకుండా తూర్పు ద్వారం నుంచి ముందుకెళ్ళాడు.
ప్రహస్తుడు – నీలుడి యుద్ధం – ప్రహస్తుడి మరణం
ప్రహస్తుడికి నీలుడికి యుద్ధం జరిగింది.
ప్రహస్తుడు చాలా గొప్ప యుద్ధం చేసి ఎందరో వానరులను చంపాడు. ప్రహస్తుడు నీలుడి మీద బాణాలను ప్రయోగిస్తే ఆబోతు మీద వర్షం పడితే అది ఎంత సంతోషంగా ఉంటుందో నీలుడు కూడా ఆ బాణాలు పడుతుంటే అంత సంతోషంగా ఉన్నాడు.
నీలుడు ఒక చెట్టుని పెకలించి ప్రహస్తుడి రథాన్ని కొడితే రథం పడిపోయింది. తరువాత ఆయన ఒక పెద్ద సాల వృక్షంతో ప్రహస్తుడి గుర్రాలను కొట్టాడు. ఒక శిలను తీసుకొచ్చి ప్రహస్తుడి మీద పడేశాడు. దాంతో ఆ ప్రహస్తుడు కూడా మరణించాడు.
రావణుడి ఆగ్రహం – స్వయంగా యుద్ధానికి సన్నద్ధం
ప్రహస్తుడు మరణించాడన్న వార్త విన్న రావణుడు ఉద్విగ్నత చెంది తన సైన్యం అంతటినీ పిలిచి ” ఇప్పుడు నేనే యుద్ధానికి వెళుతున్నాను. నేను బయటికి వెళ్ళాక వానరులు లోపలికి రావచ్చు. మీరందరూ జాగ్రత్త వహించి కోట శిఖరాల మీద నిలబడండి” అని చెప్పి రథం ఎక్కి సైన్యాన్ని తీసుకుని యుద్ధానికి వెళ్ళాడు.
రాముడు – రావణుడిని చూసి ఆశ్చర్యం – విభీషణుడి వివరణ
రాముడంతటివాడు కూడా యుద్ధ భూమిలోకి వస్తున్న రావణుడిని చూసి ‘ మిట్ట మధ్యాహ్నం వేళ సూర్యుడిని చూస్తే స్పష్టంగా కనపడకుండా ఆయన తేజస్సు చేత కళ్ళు అదిరినట్టు ఈయనను చూస్తే కూడా కళ్ళు అదురుతున్నాయి. ఎవరీ వస్తున్నవాడు?’ అని ఆశ్చర్యపోయి వస్తున్నవాడు ఎవరని విభీషణుడిని అడిగాడు.
విభీషణుడు ” రామా! ఆ ఏనుగు మీద వస్తున్నవాడు అకంపనుడు (ఇందాక చనిపోయినవాడు కూడా అకంపనుడే. వీడు ఇంకొక అకంపనుడు). వాడిది సామాన్యమైన యుద్ధం కాదు. వాడిని కనీసం పర్వత శిఖరాలతో కొట్టాలి. లేకపోతే వాడికి ఇష్టం ఉండదు. ఆయన పక్కన రథంలో వస్తున్నవాడు ఇంద్రజిత్. వాడి రథం యజ్ఞాగ్నిలో నుంచి బయటికి వస్తుంది.
సింహాలు పూన్చిన రథం మీద వస్తాడు. ఈ పక్కన మహేంద్ర పర్వతం, వింధ్య పర్వతం ఎంత శరీరాలతో ఉంటాయో, ఎంత ధైర్యంతో ఉంటాయో, అంతటి ధైర్యం, శరీరం ఉన్న అతికాయుడు వస్తున్నాడు. పర్వత శిఖరం కదిలి వస్తున్నదా అన్నట్టుగా ఉన్న ఆ ఏనుగు మీద వస్తున్నవాడు మహోదరుడు. అక్కడ ఒక గుర్రం ఎక్కి పాశం పట్టుకుని వస్తున్నవాడు పిశాచుడు. వాడు అరవీరభయంకరుడు. వృషభం ఎక్కి చేతిలో శూలం పట్టుకుని వస్తున్నవాడు త్రిశిరస్కుడు, వాడు మహా ఘోరమైన యుద్ధం చేస్తాడు. తన ధ్వజానికి సర్పాన్ని గుర్తుగా పెట్టుకుని, ధనుస్సు పట్టుకుని వస్తున్నవాడు కుంభుడు. పర్వతాలను గులకరాళ్ళుగా విసరగల బాహుపరాక్రమం కలిగినవాడు ఆ పక్కన వస్తున్నాడు. వాడి పేరు నరాంతకుడు. భోజనం చెయ్యడం అందరికీ ఎంత సంతోషమో యుద్ధం చెయ్యడం అంత సంతోషంగా ఉండేవాడు నికుంభుడు.
అదుగో అక్కడ పది తలకాయలతో, ఇరవై చేతులతో, కిరీటాలు వేసుకొని, కుండలాలు తొడుక్కొని, బ్రహ్మాండమైన పర్వతంవంటి భీమకాయం కలిగినవాడు, మహేంద్రుడు, యముడు, దేవతలు మొదలైనవారిని యుద్ధరంగంలో పరుగులు తీయించినవాడు, అందరినీ శాసించగలిగినవాడు, ఎవడి పేరు చెబితే లోకాలు ఏడుస్తాయో అటువంటి రావణుడు ఆ ఏనుగు మీద వస్తున్నాడు.”
రాముడి ప్రశంస – యుద్ధానికి సన్నద్ధత
రాముడు రావణుడిని చూసి ” ఏమి తేజస్సు! ఏమి కాంతి! ఏమి స్వరూపం! ఏమి పరాక్రమం! మిట్ట మధ్యాహ్న సూర్యుడిలా ప్రకాశిస్తున్నాడు. ఇప్పటివరకు నేను దేవతలలో కాని, యక్షులలో కాని, గంధర్వులలో కాని ఇంత తేజస్సు కలిగినవాడిని చూడలేదు. ఇన్నాళ్ళకు రావణుడిని చూసే అదృష్టం కలిగింది. ఇక వీడు తిరిగి ఇంటికి వెళ్ళడు.
ఎవరితో యుద్ధం చెయ్యాలని చూస్తున్నానో అటువంటివాడు ఇవ్వాళ యుద్ధ భూమిలోకి వచ్చాడు” అని సంతోషంగా ధనుస్సును చేతితో పట్టుకుని టంకారం చేశాడు.
సుగ్రీవుడి దాడి – రావణుడి ప్రతిదాడి
రావణుడిని చూడగానే సుగ్రీవుడు ఒక పెద్ద పర్వత శిఖరాన్ని పెకలించి గబగబా వెళ్ళి రావణుడి మీద పడేశాడు. తన మీదకి వస్తున్న ఆ పర్వత శిఖరాన్ని రావణుడు అర్థచంద్రాకార బాణాలతో తుత్తునియలు చేసి, బంగారు కొనలు కలిగిన బాణాలతో సుగ్రీవుడి గుండెల్లో కొట్టాడు. ఆ దెబ్బకు భూమిలో నుంచి జలం పైకొచ్చినట్టు సుగ్రీవుడి గుండెల్లో నుంచి రక్తం పైకి వచ్చింది. అంతటి సుగ్రీవుడు కూడా గట్టిగా అరుస్తూ కిందపడి మూర్ఛపోయాడు.
గవాక్షుడు, గవయుడు, సుషేణుడు, ఋషభుడు, నలుడు మొదలైన వానర వీరులందరి మీద 4, 6, 8, 12 బాణాలను ఏకకాలమునందు విడిచిపెట్టి వారి మర్మస్థానాల మీద కొట్టాడు. వారందరూ కింద పడిపోయారు.
హనుమంతుని సవాల్ – రావణుడితో పోరు
వానర వీరులందరినీ రావణుడు కొడుతున్నాడని హనుమంతుడు గబగబా వచ్చి రావణుడి రథం ముందు నిలబడి కుడి చెయ్యి బిగించి ” రావణా! నీకు బ్రహ్మగారి వరములు ఉన్నాయని మిడిసిపడ్డావు. సీతమ్మని అపహరించావు. నా పిడికిలి గుద్దు చేత నీలోని జీవాత్మని పైకి పంపించేస్తాను రా ” అన్నాడు.
రావణుడు ” నువ్వంత మొనగాడివైతే అది చాలా గొప్ప విషయమే. నన్ను గుద్దు చూస్తాను ” అన్నాడు.
హనుమంతుడు తన పిడికిలిని బిగించి రావణుడి శిరస్సు మీద ఒక గుద్దు గుద్దాడు. ఆ దెబ్బకి రావణుడు స్పృహ తప్పినట్టయ్యి అటు ఇటూ తూలి ” ఆహా! ఏమి దెబ్బ కొట్టావు. చేస్తే నీలాంటి వాడితో యుద్ధం చెయ్యాలి ” అన్నాడు.
హనుమంతుడు ” ఛీ దురాత్ముడా ! ఇన్నాళ్ళకి నా పిడికిలి పోటు మీద నాకు అసహ్యము వేసింది. దీనితో గుద్దాక నువ్వు బ్రతికి ఉన్నావు. ఎంత ఆశ్చర్యం! నేను ఇంక నిన్ను కొట్టను. నువ్వు నా వక్షస్థలం మీద గుద్దు. నా శక్తి ఏమిటో నువ్వు చూద్దువు కాని. అప్పుడు నేను నిన్ను మళ్ళీ తిరిగి గుద్దుతాను ” అన్నాడు.
రావణుడు తన కుడి చేతిని బిగించి హనుమ యొక్క వక్షస్థలం మీద ఒక గుద్దు గుద్దాడు. ఆ దెబ్బకి హనుమంతుడు గిరగిరా తిరిగి నెత్తురు కక్కుతూ నేల మీద పడిపోయాడు.
నీలుడి పరాక్రమం – రావణుడి ఆగ్రహం
సర్వసైన్యాధికారి అయిన నీలుడు చీమ అంత రూపాన్ని పొంది రావణుడిని బాగా విసిగించాడు. రావణుడి బాణముల మధ్య నుండి తప్పించుకుంటూ వెళ్ళి ఆయన కిరీటం మీదకి దూకి, అక్కడినుంచి కిందకి దూకి ఆయన చెవులు, బుగ్గలు కొరికాడు. తరువాత ఆయన అటు ఇటూ పాకుతూ నానా అల్లరి పెట్టాడు. అప్పుడు రావణుడు అగ్నేయాస్త్రాన్ని నీలుడి మీదకి అభిమంత్రించి వదిలాడు. అప్పుడా అస్త్రం మంటలు కక్కుతూ నీలుడి మీద పడిపోయింది. అదృష్టవశాత్తు నీలుడు అగ్ని యొక్క అంశకి జన్మించినవాడు కనుక ఆ మంటలని తట్టుకోగలిగాడు. స్పృహ కోల్పోయి నెత్తురు కక్కుతూ నేల మీద పడిపోయాడు.
లక్ష్మణుని యుద్ధానికి సన్నద్ధత – రాముడి సూచన
రావణుడిని ఉపేక్షించకూడదని అనుకొని రాముడు ముందుకి వెళుతుండగా లక్ష్మణుడు రాముడి పాదాలు పట్టుకొని ” అన్నయ్యా ! నువ్వు వెళ్ళకూడదు. ఇటువంటి వాడితో యుద్ధం చెయ్యడానికి నువ్వు వెళితే మేమంతా ఎందుకు? నేను వెళతాను. నన్ను ఆశీర్వదించు ” అన్నాడు.
రాముడు ” నాయనా! వచ్చినవాడు సామాన్యుడు కాదు. వాడు వేసిన బాణములని నిగ్రహిస్తూ నీ బాణములతో వాడి మర్మస్థానములయందు గురి చూసి కొడుతూ రావణుడిని నొప్పించు. లోపల మంత్రములని మననము చేసుకుంటూ వెళ్ళు ” అని చెప్పాడు.
లక్ష్మణుడి పోరాటం – మూర్ఛ
” దుష్టాత్ముడవై మా వదినని అపహరించావు. ఇప్పుడు యుద్ధ భూమిలో కనపడ్డావు కనుక నువ్వు ఇక ఇంటికి వెళ్ళే సమస్య లేదు ” అని చెప్పి లక్ష్మణుడు రావణుడి మీద బాణములను ప్రయోగించాడు. లక్ష్మణుడు వేసిన బాణములను రావణుడు దారిలోనే సంహారం చేసి తాను కొన్ని బాణములను ప్రయోగించాడు.
రావణుడు వేసిన బాణములను లక్ష్మణుడు నిగ్రహించాడు. లక్ష్మణుడిని ఉపేక్షించకూడదని రావణుడు భావించి బ్రహ్మగారు ఇచ్చిన శక్తి(ఈ అస్త్రం ఎవరిమీదన్నా ప్రయోగిస్తే ఇంక వాళ్ళు మరణించవలసిందే) అనే భయంకరమైన ఆయుధాన్ని అభిమంత్రించి ఆయన మీద వేశాడు. లక్ష్మణుడు దాని మీదకి వేసిన అనేకమైన బాణములను కూడా అది నిగ్రహించుకుంటూ వచ్చి ఆయన వక్షస్థలం మీద పడింది.
అప్పుడు లక్ష్మణుడు ‘ నేను విష్ణు అంశ ‘ అని స్మరించాడు. అయినా ఆ బాణము యొక్క దెబ్బకి లక్ష్మణుడు స్పృహ కోల్పోయి నేల మీద పడిపోయాడు.
హనుమంతుని ఆగ్రహం – రావణుడికి గుణపాఠం
రావణుడు లక్ష్మణుడిని తన రథంలో లంకకి తీసుకు వెళదామని అనుకొని పరుగు పరుగున వచ్చి తన ఇరవై చేతులతో లక్ష్మణుడిని ఎత్తబోయాడు. ఆ చేతులతో మేరు పర్వతాన్ని, మందర పర్వతాన్ని, హిమవత్ పర్వతాన్ని కదిపిన రావణుడు ఇవ్వాళ ఆ చేతులతో లక్ష్మణుడిని ఎత్తలేకపోయాడు( లక్ష్మణుడు పడిపోయేముందు ‘ నేను విష్ణు అంశని ‘ అని పడిపోయాడు కనుక రావణుడు ఎత్తలేకపోయాడు). ఇంతలో హనుమంతుడు మూర్చనుండి తేరుకుని చూసేసరికి రావణుడు రథం దిగి లక్ష్మణుడిని పైకెత్తడానికి ప్రయత్నిస్తూ కనపడ్డాడు.
అప్పుడు హనుమంతుడికి ఎక్కడలేని కోపం వచ్చి ‘ నీ దిక్కుమాలిన చేతులతో లక్ష్మణుడిని పట్టుకుని ఎత్తి తీసుకు పోదామనుకుంటున్నావా? ‘ అని పరుగు పరుగున వచ్చి తన కుడిచేతితో రావణుడి వక్షస్థలంలో ఒక పోటు పొడిచాడు. ఆ దెబ్బకి రావణుడి చెవుల నుండి, ముక్కు నుండి, కనుగుడ్ల పక్కనుండి కూడా రక్తం కారి, మోకాళ్ళ మీద కిందకి పడి, మళ్ళీ స్పృహలోకి వచ్చి గబగబా తన రథంలోకి వెళ్ళి కూర్చుండిపోయాడు.
లక్ష్మణుడికి స్వస్థత – రాముడి యుద్ధోత్సాహం
లక్ష్మణుడిని హనుమంతుడు పరమభక్తితో, రక్షించుకోవాలనే భావనతో ముట్టుకునేసరికి ఆయన దూదిపింజలా పైకి లేచాడు. లక్ష్మణుడిని తీసుకెళ్ళి రాముడికి అప్పగించారు. వెంటనే లక్ష్మణుడు స్పృహ పొంది ” బ్రహ్మగారి శక్తిని నా మీదకి ప్రయోగించాడు అన్నయ్యా ! అప్పుడు నేను విష్ణుఅంశని స్మరించాను. నాకు ఏ ఉపద్రవము లేదు ” అన్నాడు.
లక్ష్మణుడి మాటలు విన్న రాముడు క్రోధముతో గబగబా అడుగులు వేసుకుంటూ యుద్ధానికి బయలుదేరాడు. హనుమంతుడు వచ్చి ” స్వామీ! ఏ విధంగా అయితే శ్రీ మహావిష్ణువు గరుగ్మంతుడి మీద కూర్చొని యుద్ధం చేస్తాడో అలా మీరు నా వీపు మీద కూర్చొని యుద్ధం చెయ్యండి. ఆ రావణుడు రథంలో కూర్చుంటే మీరు నేల మీద నిలబడి యుద్ధం చెయ్యడమేమిటి? నా మీద కూర్చొని యుద్ధం చెయ్యండి ” అన్నాడు.
రాముని ప్రతిజ్ఞ – రావణునిపై బాణవర్షం
రాముడు హనుమ మీద కూర్చొని యుద్ధానికి వెళ్ళి ” దురాత్ముడా! ఆచారభ్రష్టుడా! పర స్త్రీని అపహరించినవాడా ! ఈ రోజు నువ్వు అంతఃపురంలోకి వెళ్ళవు. ఇవ్వాళ నీ పదితలకాయలు కొట్టేస్తాను…………” అని రాముడు చెబుతుండగా రావణుడు విశేషమైన బాణ పరంపరని హనుమంతుడి మీద కురిపించాడు.
ఆ బాణపు దెబ్బలకి హనుమంతుడి శరీరము అంతా నెత్తురు వరదలై కారిపోతుంది. అలా ఉన్న హనుమని చూసిన రాముడికి పట్టరాని కోపము వచ్చి అర్థచంద్రాకార బాణములు, నారాచ బాణములు, వంకరలు లేని బాణములు రావణుడి మీద ప్రయోగించాడు.
రావణుని పరాజయం – రాముని దయాగుణం
అవి బాణములా? మెరుపులా? అని రావణుడు ఆశ్చర్యముతో చూస్తుండగా, ఆ బాణ పరంపరకి రావణుడి గుఱ్ఱములు పడిపోయాయి. సారధి చనిపోయాడు, ధ్వజం పడిపోయింది. చక్రాలు ఊడిపోయాయి. రావణుడు తూలి భూమి మీద నిలబడ్డాడు. ఆ రావణుడి చేతిలో కోదండము, ఖడ్గము ఉన్నాయి. రాముడు రావణుడి భుజంలోకి బాణాలు కొట్టాడు.
కోదండాన్ని బాణాలతో కొట్టి విరిచేశాడు. ఖడ్గాన్ని విరిచేశాడు. రావణుడి అన్ని మర్మస్థానాలని బాణములతో కొట్టాడు. ఆ దెబ్బలకి నెత్తురు వరదలై కారిపోయింది. రాముడు బాణములతో రావణుడి కిరీటాన్ని కొడితే అది దొర్లి కింద పడిపోయింది.
రాముడు ” భయంకరమైన యుద్ధం చేశావు రావణా ! నీ ఖడ్గం విరిగిపోయింది. నీ గుఱ్ఱములు చనిపోయాయి. నీ సారధి మరణించాడు. నీ ధ్వజం కిందపడిపోయింది. నీ రథం ముక్కలయ్యింది. నీ చేతిలో ఉన్న కోదండము విరిగిపోయింది. నీ కిరీటం కింద పడిపోయింది. నీ చేతిలో ఒక్క ఆయుధం లేదు. ఇప్పటివరకూ నా వాళ్ళని పడగొట్టి బాగా అలసిపొయావు.
నీ కళ్ళల్లో భయం కనపడుతున్నది. నీ ఒంటికి చెమట పట్టింది. నిన్ను విడిచిపెట్టేస్తున్నాను. పోయి ఇవ్వాళ రాత్రి పడుకో విశ్రాంతి తీసుకో. మళ్ళీ రేపు ఉత్తమమైన రథాన్ని ఎక్కి చేతిలో ఆయుధాన్ని పట్టుకొని యుద్ధానికి రా! నా పరాక్రమము ఏమిటో చూద్దువు కాని. ఇవ్వాల్టికి పో ” అన్నాడు.
రావణుని పశ్చాత్తాపం – కుంభకర్ణుని మేల్కొలపమని ఆదేశం
రావణుడు వెనక్కి తిరిగి అంతఃపురానికి వెళ్ళిపోయాడు. అప్పుడాయన మంత్రులందరినీ, సైన్యాన్ని పిలిచి, సిగ్గుతో తల వంచుకొని ” గరుత్మంతుడు పాములని తినేసినట్టు, ఏనుగులు సింహము చేత ఓడింపబడినట్టు, ఇవ్వాళ నేను రాముడి బాణముల చేత ఓడింపబడ్డాను. ఒక నరుడు నా రాజ్యానికి వచ్చి నన్ను కొట్టి చంపకుండా వదిలేసి ఇంటికి వెళ్ళి విశ్రాంతి తీసుకొని రేపు మళ్ళీ స్వస్థతని పొంది ఆయుధాన్ని పట్టుకొని రేపు రథం ఎక్కి రా ! నా పరాక్రమము చూపిస్తాను అన్నాడు.
ఒకనాడు బ్రహ్మగారు నాతో ‘ నువ్వు మనుష్యుల చేతిలో నశించిపోతావు ‘ అన్నమాట యథార్ధమవుతున్నది. ఆ బ్రహ్మగారి గురించి తపస్సు చేసినప్పుడు దేవ, దానవ, యక్ష, గంధర్వ, కిన్నెర, కింపురుషుల చేతుల్లో మరణించకూడదని కోరుకున్నాను. మనుష్యుల చేతిలో, వానరుల చేతిలో మరణించకూడదన్న వరము నేను అడగలేదు. నాకు ఇప్పుడు జ్ఞాపకము వస్తున్నది. ఇక్ష్వాకు వంశంలో అనరణ్యుడు( రావణుడు అనరణ్యుడిని యుద్ధంలో సంహరించాడు) అని ఒక రాజు ఉండేవాడు. ఆయన నన్ను ఒకనాడు ‘ ఒరేయ్ రాక్షసుడా! మా ఇక్ష్వాకు వంశంలో ఒకనాడు రాముడన్నవాడు జన్మిస్తాడు. ఆయన నిన్ను సంహరిస్తాడు ‘ అని శపించాడు. బహుశా ఆయనే ఇవ్వాళ ఇక్ష్వాకు వంశంలో రాముడిగా వచ్చి ఉంటాడు.
ఒకనాడు పర్వతం మీద తపస్సు చేసుకుంటున్న వేదవతిని అనుభవించాలని ప్రయత్నించాను. ఆ వేదవతి ‘ స్త్రీ కారణంగా నువ్వు నశించిపోతావు ‘ అని శపించింది. బహుశా ఆ వేదవాతే జనక మహారాజుకి కూతురిగా సీతగా పుట్టిందా? నేను సీతని నా మృత్యువు కోసమే తెచ్చిపెట్టుకున్నాను. ఒకనాడు కైలాస పర్వతం మీద పార్వతీదేవి నన్ను శపించింది. నందీశ్వరుడు శపించాడు.( నందీశ్వరుడిని చూసి రావణుడు ‘ కోతి ముఖంవాడా ‘ అని హేళన చేశాడు.
‘ ఆ వానరములే నీ కొంప ముంచుతాయి ‘ అని నంది అన్నాడు). నలకూభరుడి భార్య రంభయొక్క శాపము ఫలిస్తోంది. వరుణుడి కుమార్తె అయిన పుంజకస్థల శాపం ఫలిస్తోంది. ఇవ్వన్నీ నిజం చెయ్యడము కోసమని రాముడొచ్చాడని నేను అనుకుంటున్నాను.
నేను దేవ దానవులని ఓడించినవాడిని. నేను ఎవరికీ భయపడను. సీతని ఇవ్వను. మీరందరూ జాగ్రత్తగ కోట బురుజులు ఎక్కండి. ప్రాసాదాలు ఎక్కండి. నేను ఎవరిని పిలిస్తే వాళ్ళు రావాలి. యుద్ధానికి వెళ్ళాలి.
ఇంక మామూలు వాళ్ళు యుద్ధానికి పనికిరారు. నా తమ్ముడైన కుంభకర్ణుడు ఉన్నాడు. వాడి యుద్ధానికి ఇంద్రుడు మొదలైన వాళ్ళే హడలిపోయారు. వాడు మొన్ననే సభకి వచ్చాడు. ఇప్పుడు నిద్రపోతున్నాడు. వాడిని లేపడమే కష్టం. వాడు లేస్తే రాముడు ఎంత? వెంటనే వెళ్ళి కుంభకర్ణుడిని లేపి తీసుకురండి ” అన్నాడు.
ఈ ఘట్టం రామాయణంలో మైలురాయిగా నిలిచే అంశం. ఇది:
- గరుత్మంతుడి దైవిక పాత్రను,
- ఔషధ చిట్కాలతో కూడిన పురాణ సత్యాలను,
- రాముడికి ఉన్న విశిష్ట శక్తుల ప్రబలతను,
- వానర సైన్య ప్రావీణ్యాన్ని,
- రావణుడి రాక్షసులకు ఎదురయ్యే అపశకునాలను తెలియజేస్తుంది.