కుంభకర్ణుడిని నిద్రలేపే ప్రయత్నాలు
Ramayanam Story in Telugu- రావణుడి ఆజ్ఞానుసారం, నిద్రపోతున్న కుంభకర్ణుడిని మేల్కొలపడానికి అనేకమంది సైనికులు అతని శయన గృహంలోకి వెళ్లారు. లోపల, కుంభకర్ణుడు మహా పర్వతాలైన వింధ్య, మేరు పర్వతాలు పడుకున్నట్లుగా నిద్రపోతున్నాడు. అతని నాసికా రంధ్రాలు పెద్ద కొండ గుహల్లా ఉన్నాయి. అతను ఊపిరి పీల్చినప్పుడు, తలుపులు తెరిచిన సైనికులందరూ అతని ముక్కులోకి లాగబడ్డారు. మళ్ళీ ఊపిరి విడిచినప్పుడు, లోపలికి వెళ్ళిన వారంతా గోడలకు, తలుపులకు ఢీకొని నేలకూలారు. 👉 రామాయణం కథలు – భక్తి వాహిని
అంశం | వివరాలు |
---|---|
శరీర స్థితి | వింధ్య, మేరు పర్వతాల వలె పడుకున్నాడు |
ముక్కు రంధ్రాలు | పర్వత గుహల వలె విస్తారంగా ఉన్నాయి |
ఊపిరి తీసే శక్తి | తలుపులు తెరిచినవారు ముక్కులోకి లాగబడ్డారు |
ఊపిరి విడిచినపుడు | గోడలకి, తలుపులకి ఢీకొని పడిపోయారు |
అతన్ని ఎలా నిద్రలేపాలని వారు తీవ్రంగా ఆలోచించారు. “ఇతనికి ఆహారం అంటే చాలా ఇష్టం. ఇష్టమైన భోజన పదార్థాలు తెచ్చి పెడదాం. ఎంత గాఢ నిద్రలో ఉన్నా వాసన పీల్చకుండా ఉండలేడు. పదార్థాల సువాసనకు తప్పకుండా మేల్కొంటాడు” అని వారు అనుకున్నారు. అందుకోసం, అతనికి ఇష్టమైన దున్నపోతులు, జింకలు మరియు ఇతర అనేక జంతువులను చంపి, వాటితో మంచి సువాసనలు వచ్చే వంటకాలు తయారు చేశారు. వండిన వాటిని పెద్ద పెద్ద పాత్రల్లో నింపి, అతను పడుకున్న గదిలో ఉంచారు. కొన్ని వేల కుండల నిండా మద్యం కూడా తెచ్చి పెట్టారు. అన్ని రకాల ఆహార పదార్థాలు ఉంచినా కుంభకర్ణుడికి స్పృహ రాలేదు.
ఇతర ప్రయత్నాలు మరియు కుంభకర్ణుడి మేల్కొలుపు
తెల్లటి శంఖాలను తెచ్చి పెద్దగా ఊదారు. భేరీలు, మృదంగాలు మ్రోగించారు. పెద్ద పెద్ద శూలాలు, ఇనుప గుదియలు, బల్లెములు తెచ్చి అతని శరీరంపై పొడిచారు. వందల మంది రాక్షసులు కలిసి కుంభకర్ణుడి చేతులను ఎత్తి కింద పడేశారు.
ఏనుగులు, గాడిదలు, ఎద్దులు, ఒంటెలను తెచ్చి అతని శరీరంపైకి నడిపించారు. అవి అతని శరీరంపై ఒకవైపు నుండి ఎక్కి మరోవైపు నుండి దిగుతున్నాయి. ఎన్ని ప్రయత్నాలు చేసినా కుంభకర్ణుడు మాత్రం కదలకుండా అలాగే నిద్రపోతున్నాడు.
వారు బాగా చల్లని నీటి కుండలను తెచ్చి అతని చెవుల్లో నీరు పోశారు. ఇక లాభం లేదని భావించి, ఆ రాక్షసులు అతని చెవులను కొరకడం ప్రారంభించారు. పర్వతాలంత ఎత్తు, బరువు ఉన్న వెయ్యి ఏనుగులను తెచ్చి అతని శరీరంపై ఎక్కించారు. ఏనుగులు తన శరీరంపై తిరుగుతుంటే కుంభకర్ణుడికి కొంచెం స్పృహ వచ్చినట్లు అనిపించింది.
అతను మళ్ళీ నిద్రలోకి జారుకుంటాడేమో అని అక్కడున్న రాక్షసులు వెంటనే భేరీలు, మృదంగాలు, శంఖాలు మ్రోగించారు. కొంతమంది పెద్దగా కేకలు వేస్తున్నారు. మరికొంతమంది పెద్ద కర్రలతో, శూలాలతో అతన్ని పొడుస్తున్నారు. అక్కడున్న రాక్షసులందరూ కలిసి ఒకేసారి గట్టిగా అరవడంతో కుంభకర్ణుడు నెమ్మదిగా కళ్ళు తెరిచి, రెండు చేతులూ కలిపి ఒళ్ళు విరుచుకుని పెద్దగా ఆవళించాడు.
అతను నిద్రలేస్తూనే అక్కడున్న పాత్రల్లో ఉన్న మాంసాహారాన్ని అంతా తినేశాడు. పక్కనే ఉన్న కల్లును కూడా తాగేశాడు.
లంకకు ముంచుకొచ్చిన ప్రమాదం
రాక్షసులు కుంభకర్ణుడితో “కుంభకర్ణా! ఎన్నడూ లేని ప్రమాదం ఈరోజు లంకకు వచ్చింది. మీ అన్నగారు సీతను అపహరించి తీసుకొచ్చారు. కేవలం ఒక మానవుడైన రాముడు వానరులను తన సైన్యంగా చేసుకుని నూరు యోజనాల సముద్రానికి వారధి కట్టి, ఆ సముద్రాన్ని దాటి లంకలోకి ప్రవేశించి యుద్ధానికి సిద్ధంగా తీవ్రమైన పోరాటం చేస్తున్నాడు. మన రాక్షస సైన్యంలో గొప్ప యోధులు, మహారథులు ఎందరో మరణించారు. ఇక దిక్కులేని పరిస్థితులలో మీ అన్నగారు నిన్ను నిద్రలేపమని మమ్మల్ని ఆదేశించాడు. అందుకనే మేము మిమ్మల్ని నిద్రలేపాము” అని చెప్పారు.
కుంభకర్ణుడు “ఈ మాత్రం దానికే నేను అన్నయ్య దగ్గరికి వెళ్లడం ఎందుకు? ఇలానే యుద్ధ భూమిలోకి వెళ్ళిపోతాను. నేను యుద్ధానికి వెళితే యముడు తన సైన్యంతో పారిపోతాడు. ఇంద్రుడు పారిపోతాడు. నరులైన రామలక్ష్మణులను సంహరించడం నాకు లెక్క కాదు. నాకు చాలా ఆకలిగా ఉన్నది. అందరూ యుద్ధ భూమిలోకి యుద్ధం చేయడానికి వెళితే నేను అక్కడున్న వానరులను, భల్లూకాలను తినడానికి వెళతాను” అన్నాడు.
ఆ రాక్షసులు “అలా వెళ్ళిపోవద్దు. మీ అన్నగారు మీ కోసం ఎదురుచూస్తున్నారు. ఆయనతో మాట్లాడి ఆయన ఎలా చెబితే అలా వెళ్ళు” అన్నారు.
“ఇవన్నీ తిన్నాక, స్నానం చేసి వస్తాను” అని కుంభకర్ణుడు అన్నాడు.
స్నానం చేసి బయటకు వచ్చిన కుంభకర్ణుడికి దాహం వేసి అక్కడ వెయ్యి కుండలలో ఉన్న కల్లును తాగి రావణుడి అంతఃపురానికి బయలుదేరాడు. రావణుడి అంతఃపురానికి వెళుతున్న కుంభకర్ణుడిని చూసిన వానరులు భయంతో పారిపోయారు. కుంభకర్ణుడిది పెద్ద శరీరం. లంకాపట్టణానికి దూరంగా యుద్ధ భూమిలో ఉన్న వానరులకు కూడా వాడు కనిపించాడు. కొంతమంది చెట్లు ఎక్కేశారు. కొంతమంది పర్వత గుహల్లోకి దూరిపోయారు. కొంతమంది వారధి ఎక్కి పారిపోయారు.
ఈ గందరగోళాన్ని చూసి సుగ్రీవుడు, అంగదుడు ఏమిటి విషయం? అని అడుగగా విభీషణుడు “మా అన్నయ్య నడిచి అంతఃపురంలోకి వెళుతున్నాడు. ఇంక కొంచెంసేపటిలో వాడు యుద్ధానికి రాబోతున్నాడు. ఇతను రావణుడి తమ్ముడు. ఇతను కూడా ఒక రాక్షసుడే అని వానరాలకు చెప్పవద్దు. అలా చెబితే వాళ్ళు భయపడతారు. అది కేవలం ఒక యంత్రమని చెప్పండి” అన్నాడు.
కుంభకర్ణుడిని యంత్రము అని ప్రకటించారు. అలా ప్రకటించగానే పారిపోయిన వానరాలన్నీ మళ్ళీ తిరిగి వచ్చాయి.
రాముడి ప్రశ్న మరియు విభీషణుడి సమాధానం
రాముడు విభీషణుడిని “విభీషణా! నీ అన్నయ్య ఇలా ఉన్నాడేమిటి? వీడు ఇంతేనా లేక పుట్టాక ఇలా పెరిగాడా?” అని అడిగాడు.
విభీషణుడు “కొంతమంది రాక్షసులు జన్మించిన తరువాత తపస్సు చేసి బలాన్ని సంపాదిస్తారు. మా అన్నయ్య గొప్పతనం పుట్టడమే ఇలా పుట్టాడు. వీడు పుట్టినప్పటి నుంచి ‘ఆకలి’ అని దేశం మీద పడి మనుష్యులను, రాక్షసులను, జంతువులను తినేవాడు. అలా గంటకు కొన్ని లక్షల మందిని తినేవాడు. వీడిని చూసి లోకమంతా భయపడి ఇంద్రుడిని ప్రార్థించారు. అప్పుడాయన కుంభకర్ణుడు ఆహారం తింటున్న ప్రాంతానికి ఐరావతం మీద వెళ్ళి ‘నీకు బుద్ధి లేదా? ఆ తినడము ఏమిటి? కొన్ని గంటల్లో ఈ ప్రపంచములోని ప్రాణి కోటిని బ్రతకనివ్వవా?’ అని అరిచాడు. అప్పుడు కుంభకర్ణుడు కోపంతో పైకి లేచి ‘నేను తింటుంటే నువ్వు ఎవడివి చెప్పడానికి?’ అని ఆ ఐరావతాన్ని ఒక్క తోపు తోస్తే ఐరావతం కింద పడిపోయింది. ఆ ఐరావతానికి ఉన్న దంతాన్ని పీకి దానితో ఇంద్రుడిని కొట్టాడు. ఇంద్రుడు భయపడి బ్రహ్మ దగ్గరికి వెళ్ళి జరిగినది చెప్పాడు. బ్రహ్మగారు అన్నారు ‘సృష్టిలో ఇలాంటివాడు ఒకడు వచ్చాడా! అలా తినడమేమిటి? వాడిని ఒకసారి ఇక్కడికి తీసుకురండి’ అన్నారు.
కుంభకర్ణుడిని బ్రహ్మగారి దగ్గరికి తీసుకువచ్చారు. కుంభకర్ణుడిని చూడగానే బ్రహ్మగారు ఉలిక్కిపడి ‘నువ్వు వెంటనే భూమి మీద పడి చచ్చినట్టు నిద్రపో’ అన్నారు.
కుంభకర్ణుడు అలా నిద్రపోతుంటే లోకమంతా సంతోషం పొందితే రావణుడికి బాధ కలిగింది. అప్పుడాయన బ్రహ్మగారితో ‘అదేమిటి తాతా అలా శపించావు? వాడు నీకు మునిమనవడు. అలా నిద్రపోమంటే ఎలా? కొన్నాళ్ళు లేచేటట్టు ఏర్పాటు చెయ్యి’ అన్నాడు.
బ్రహ్మగారు ‘వీడు ఆరు నెలలు నిద్రపోతాడు. ఒక్క రోజే నిద్రలేస్తాడు. ఆ ఒక్క రోజులోనే ఆరు నెలల తిండి తిని మళ్ళీ నిద్రపోతాడు’ అన్నారు.
అందుకని వాడు అలా నిద్రపోతుంటాడు. ఈరోజు మా అన్నయ్య వాడిని యుద్ధం కోసం నిద్రలేపాడు. వాడితో యుద్ధం అంటే సామాన్యమైన విషయం కాదు” అని విభీషణుడు చెప్పాడు.
రావణుడితో కుంభకర్ణుడి సంభాషణ
కుంభకర్ణుడు రావణుడి అంతఃపురానికి వెళ్ళాడు. అప్పుడు రావణుడు తన బాధ అంతా చెప్పుకుని కుంభకర్ణుడిని యుద్ధానికి వెళ్ళమన్నాడు.
కుంభకర్ణుడు “అన్నయ్యా! మనం ఏదైనా ఒక పని చేసేముందు ఆలోచించి చేయాలి. సీతను అపహరించే ముందు ఎవరితో అయినా ఆలోచన చేశావా! ఒక్కడివే ఎవరితో చెప్పకుండా వెళ్ళి తీసుకొచ్చావు. ఇప్పుడది ఉపద్రవము అయ్యి కూర్చుంది. నీకు చెప్పగలిగేంత వాడిని కాదు. నీకన్నా అవతలివాడి పౌరుష పరాక్రమాలు ఎక్కువ అనుకున్నప్పుడు సంధి చేసుకోవాలి. సమానుడు అనుకుంటేనే యుద్ధం చేయాలి. నీకంటే తక్కువ శక్తి కలిగిన వాడైతేనే యుద్ధం చేయాలి అని విభీషణుడు చెబితే ఆయనను రాజ్యం నుండి బయటకు పంపించేశావు.
అందరూ మరణించిన తరువాత నన్ను నిద్రలేపి యుద్ధానికి వెళ్ళమంటున్నావు. నీ మంత్రులైనా నీకు మంచి చెప్పరా? నీ ముఖ ప్రీతి కోసం మాట్లాడుతూ ఉంటారా? వచ్చే ఉపద్రవం కనిపెట్టి నీకు సలహా ఇవ్వగలిగిన మంత్రులు నీకు లేరా? ఏమి రాజ్య పాలన చేస్తున్నావు” అని అడిగాడు.
ఈ మాటలకు రావణుడికి కోపం వచ్చి “నేను తప్పే చేశాను అనుకో దానిని దిద్దుబాటు చేయమని నిన్ను నిద్రలేపాను తప్ప నా తప్పును పది మార్లు ఎత్తి చూపమని నిన్ను నిద్రలేపలేదు. నువ్వు ఉపకారం చేయగలిగితే రామలక్ష్మణులను సంహరించు. లేకపోతే వెళ్ళి పడుకో. ఈ రోజుతో నీకు నాకు ఉన్న అనుబంధం తెగిపోతుంది” అన్నాడు.
కుంభకర్ణుడు “ఎందుకన్నయ్యా అంత బెంగ పెట్టుకుంటావు? నేను ఉండి కూడా నీకు ఉపకారం చేయకపోతే నాకు వచ్చే ప్రయోజనం ఏమిటి? యుద్ధరంగానికి వెళ్ళి ఆ రాముడిని తప్పకుండా సంహరిస్తాను” అని బయలుదేరుతున్నాడు.
మహోదరుడి దుర్బుద్ధి మరియు కుంభకర్ణుడి నిశ్చయం
ఆ సమయంలోనే మహోదరుడు అనే రాక్షసుడు అక్కడికి వచ్చి “కుంభకర్ణా! రాముడు అంత బలవంతుడు అంటూనే యుద్ధానికి వెళతానంటావేమిటి? ఇలాంటప్పుడు యుద్ధం చేయకూడదు. మోసాన్ని ప్రయోగం చేయాలి. మనం ఒక అయిదుగురం బయలుదేరి రాముడి మీదకు యుద్ధానికి వెళదాము. అయిదుగురం రాముడి చుట్టూ చేరి ఆయనను నిగ్రహించగలిగితే అదృష్టవంతులము. ఒకవేళ రాముడిని నిగ్రహించలేకపోతే రామనామాంకితమైన బాణాలు మన శరీరంలో గుచ్చుకుని ఉంటాయి. అప్పుడు మనం యుద్ధ భూమిలో ఉండకుండా వెనక్కి తిరిగి వచ్చి రావణుడి కాళ్ళ మీద పడదాము. అప్పుడాయన ఫలానా అయిదుగురు వెళ్ళి రాముడిని సంహరించారు అని అందరికీ చెబుతాడు. రావణుడు సీత కూర్చున్న చోట ఒక సభ నిర్వహించి మనలను కోరికలు కోరమంటాడు. అప్పుడు మనము డబ్బు, బంగారం, వాహనములు అడుగుదాము. అవన్నీ రావణుడు సభలో మనకిస్తాడు. సీత అనుకుంటుంది ‘ఇంత సభ జరుగుతున్నది. బయట భేరీలు మ్రోగుతున్నాయంటే రాముడు మరణించి ఉంటాడు. ఇంక రాముడు ఎలాగూ లేడు కదా….’ అని చాలా కాలముగా సుఖములకు దూరమైన స్త్రీ కనుక రావణుడి పాన్పు ఎక్కుతుంది. రావణుడి కోరిక తీరుతుంది” అన్నాడు.
రావణుడు “ఈ మహోదరుడికి రాముడితో యుద్ధం అంటే భయం. అందుకని ఇలాంటి నాటకాలన్నీ చెబుతున్నాడు” అని అన్నాడు.
కుంభకర్ణుడు “మీరెవరు రానక్కరలేదు. నేనొక్కడినే వెళతాను” అన్నాడు.
రావణుడు “నువ్వు ఒక్కడివే వెళ్ళద్దు, రాక్షస సైన్యాన్ని తీసుకొని వెళ్ళు” అని చెప్పి కుంభకర్ణుడి మెడలో ఒక మాల వేశాడు.
కుంభకర్ణుడు మంచి ఉత్తరీయం వేసుకుని, ఒక మంచి పంచె కట్టుకుని, శూలాన్ని పట్టుకుని యుద్ధానికి బయలుదేరాడు. ఆయన వెనకాల కొన్ని లక్షల సైన్యం అనుసరించి బయలుదేరింది.
యుద్ధ భూమిలో కుంభకర్ణుడు
యుద్ధ భూమిలోకి వచ్చిన కుంభకర్ణుడిని ఆ వానరాలు యంత్రము అనుకుని చూస్తున్నాయి. హనుమంతుడికి, సుగ్రీవుడికి, సుషేణుడికి, గంధమాదనుడికి, నీలుడికి, మైందుడికి మొదలైన నాయకులకు వస్తున్నది యంత్రము కాదు కుంభకర్ణుడు అని తెలుసు. వాళ్ళు పెద్ద పెద్ద పర్వతాలు, శిలలు, చెట్లు పట్టుకెళ్ళి కుంభకర్ణుడిని కొడుతున్నారు. వాళ్ళు అలా కొడుతుంటే కుంభకర్ణుడు తన శూలాన్ని ఆడిస్తూ ఆ పర్వతాలను, చెట్లను కొట్టాడు. అప్పుడవి చూర్ణమయ్యి కిందపడ్డాయి. ఆయన తన అరచేతులతో కొడుతుంటే వేలకు వేల వానరాలు మరణిస్తున్నాయి. అలా మరణించిన వానరాలను నోట్లో వేసుకుని నములుతున్నాడు. ఆయన అలా నడుస్తూ వెళుతూ ఒక చేతితో రెండు వందల మంది వానరులను పట్టుకొని నోట్లో వేసుకునేవాడు. ఆయన నోట్లోకి వెళ్ళిన వానరములలో కొంతమంది ఆయన చెవుల నుండి బయటకు దూకేస్తున్నారు. కొంతమంది ఆయన ముక్కులో నుండి బయటకు దూకేస్తున్నారు. బయటకు వస్తున్న వాళ్ళని కుంభకర్ణుడు మళ్ళీ ఏరుకొని తినేస్తున్నాడు. పెద్ద పెద్ద భల్లూకాలను పట్టుకొని కొరుక్కుని తింటున్నాడు. ఆయన శూలం పెట్టి కొడుతుంటే కొన్ని వేల వానరాలు చనిపోయాయి.
వానరాలకు వచ్చింది యంత్రము కాదు రాక్షసుడే అని తెలిసిపోయింది. వాళ్ళు చనిపోయిన వాళ్ళ మీద నుంచి, పడిపోయిన వాళ్ళ మీద నుంచి దూకుకుంటూ పారిపోయారు. కొంతమంది చెట్లు ఎక్కేశారు. కొంతమంది పర్వత గుహలలో దాక్కున్నారు. కొంతమంది సముద్రములో దూకారు. కొంతమంది వారధి ఎక్కి పారిపోయారు.
అంగదుడు వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి అన్నాడు “మీరందరూ ఇలా పారిపోతున్నారు కదా! రేపు ఇంటికి వెళ్ళాక మీ భార్యలు మిమ్మల్ని అడిగితే ఏమి చెబుతారు? యుద్ధ భూమిలో కుంభకర్ణుడిని చూసి పారిపోయి వచ్చామని చెబుతారా! మీ పౌరుషము ఏమయింది” అని అందరినీ వెనక్కి తీసుకువస్తున్నాడు.
నీలుడు, ఋషభుడు, గంధమాధనుడు, సుగ్రీవుడు మొదలైనవారు కుంభకర్ణుడి దగ్గరికి వెళ్ళారు. కుంభకర్ణుడు ఓ ఇద్దరిని చేతితో పట్టుకుని నలిపాడు. అప్పుడు వాళ్ళ నోట్లో నుంచి, ముక్కులో నుంచి, కళ్ళల్లో నుంచి, చెవులలో నుంచి నెత్తురు వరదలై పారింది. వాళ్ళని అవతలికి విసిరేశాడు. కానీ వాళ్ళు చాలా బలవంతులు కనుక కిందపడి మూర్చపోయారు. ఆ కుంభకర్ణుడు కొంతమందిని పాదములతో తన్నాడు. కొంతమందిని మోకాళ్ళతో పొడిచాడు. ఈలోగా సుగ్రీవుడు ఒక పెద్ద పర్వత శిఖరాన్ని తీసుకొచ్చి ఆయన మీద పడేశాడు. అది ఆ కుంభకర్ణుడి శరీరానికి తగిలి చూర్ణమయ్యి కిందపడిపోయింది. అప్పుడాయన తన శూలంతో సుగ్రీవుడిని కొట్టాడు. ఆ దెబ్బకి సుగ్రీవుడు మూర్చపోయి కిందపడిపోయాడు. మళ్ళీ స్పృహ వచ్చి పైకి లేవబోతుంటే కుంభకర్ణుడు అన్నాడు “సుగ్రీవా! నీ జన్మ ఎటువంటిదో నీకు జ్ఞాపకం ఉన్నదా!
సుగ్రీవుడి జననం గురించిన కుంభకర్ణుడి వ్యాఖ్య
“…నువ్వు ఋక్షరజస్సు యొక్క కుమారుడివి. నేను నిన్ను వదిలిపెట్టను…” అని కుంభకర్ణుడు శూలం పట్టుకొని సుగ్రీవుడిని బలంగా కొట్టాడు. ఆ దెబ్బకు సుగ్రీవుడు రక్తం కక్కుకుంటూ కిందపడిపోయాడు.
హనుమంతుడి చర్య మరియు సుగ్రీవుడికి స్పృహ
హనుమంతుడు ఆ కుంభకర్ణుడి చేతిలో ఉన్న శూలాన్ని లాక్కొని తన తొడకు కొట్టి దానిని వంచేశాడు. కుంభకర్ణుడు హనుమంతుడిని ఒకసారి కొట్టాడు. ఆ దెబ్బకు హనుమంతుడు నోటి నుండి రక్తం కక్కుకుంటూ కలత చెంది పడిపోయాడు. ఆ తర్వాత కుంభకర్ణుడు కిందపడిపోయి ఉన్న సుగ్రీవుడిని తన చంకలో పెట్టుకొని తిరిగి లంకలోకి వెళ్ళిపోదామని బయలుదేరాడు. ఆ సమయంలో హనుమంతుడు చూసి ఇలా అనుకున్నాడు ‘నా యజమానిని శత్రువు తీసుకుపోతుండగా నేను సేవకుడిని అయి ఉండి ఆయనను రక్షించడానికి వెళితే, అది యజమానికి అవమానం. సుగ్రీవుడికే తెలివి వస్తుంది. వేచి చూద్దాము’ అని హనుమంతుడు భావించాడు.
సుగ్రీవుడి ప్రతిఘటన మరియు కుంభకర్ణుడి ఆగ్రహం
లంకలో ఉన్న రాక్షస స్త్రీలు సుగ్రీవుడిని తీసుకువస్తున్న కుంభకర్ణుడిని చూసి చాలా సంతోషించారు. వారు అంతఃపుర గోపురాల మీద నుండి, మేడల మీద నుండి చందన ద్రవాన్ని కుంభకర్ణుడి మీద పోశారు. సువాసనతో కూడిన గంధపు నీళ్ళు మీద పడగానే సుగ్రీవుడికి స్పృహ వచ్చి వెంటనే కుంభకర్ణుడి చెవులు, ముక్కు కొరికేశాడు. తర్వాత ఆయన డొక్కలను తన గోళ్ళతో చీల్చడంతో బాధతో కుంభకర్ణుడు సుగ్రీవుడిని వదిలేశాడు. సుగ్రీవుడు వెంటనే ఆకాశానికి ఎగిరి వెళ్ళిపోయాడు.
కుంభకర్ణుడు కోపంతో మళ్ళీ యుద్ధ భూమిలోకి వచ్చాడు. అతనికి కోపం ఎక్కువ కావడంతో వానరులతో, భల్లూకాలతో పాటు రాక్షసులను కూడా నోట్లో వేసుకొని తినేశాడు. ఆ సమయంలో లక్ష్మణుడు ఆ కుంభకర్ణుడి మీద బాణ ప్రయోగం చేశాడు. లక్ష్మణుడు ఎన్ని బాణాలు వేసినా అవి కుంభకర్ణుడికి తగిలి కిందపడిపోతున్నాయి. అప్పుడు అతడు లక్ష్మణుడితో “ఏమో అనుకున్నాను కానీ నువ్వు బాగానే పోరాడుతున్నావు. నువ్వు చిన్నవాడివి, నీతో నాకు యుద్ధం ఏమిటి? నిన్ను చంపితే లాభం ఏమిటి? నేను రాముడిని చంపి వెళ్ళిపోతాను. నన్ను వదిలిపెట్టు. నేను రాముడి దగ్గరికి వెళతాను” అన్నాడు.
లక్ష్మణుడి వ్యూహం మరియు వానరుల దాడి
లక్ష్మణుడు కొట్టిన బాణాలకు, సుగ్రీవుడు కొరికిన దెబ్బలకు ఆ కుంభకర్ణుడి శరీరం నుండి రక్తం కారుతోంది. లక్ష్మణుడు “వీడు ఇలా నిలబడి నడిచినంతసేపు అందరినీ చంపేస్తాడు. వీడు కిందపడిపోతే ప్రమాదం తప్పుతుంది. అందుకని మొత్తం వానర సైన్యం అంతా ఎగిరి వెళ్ళి వాడి మీద కూర్చోండి. ఆ బరువుకి వాడు కిందపడిపోతాడు” అన్నాడు.
కొన్ని కోట్ల వానరాలు ఎగిరి వాడి మీదకు దూకారు. ఇంతమంది మీద పడటంతో ఆ కుంభకర్ణుడు ఒకసారి తన శరీరాన్ని దులుపుకున్నాడు. అన్ని వానరాలు కిందపడిపోయాయి. అందరూ రాముడి దగ్గరికి వెళ్ళారు. “రామా! ఈ కుంభకర్ణుడిని నువ్వు తప్ప ఇంకెవ్వరూ అదుపు చేయలేరు. మీరొచ్చి ఈ కుంభకర్ణుడిని సంహరించండి” అని వేడుకున్నారు.
రాముడితో కుంభకర్ణుడి పోరాటం మరియు మరణం
రాముడిని చూసిన కుంభకర్ణుడు ఒక పెద్ద పర్వతాన్ని పట్టుకొని వేగంగా ఆయన వైపు వస్తున్నాడు. అప్పుడు రాముడు వాడి గుండెల్లోకి బాణాలతో కొట్టాడు. ఆ బాణాలు తగలడంతో రక్తం బాగా కారింది. ఆ కుంభకర్ణుడు మరింత ఉగ్రతతో రాముడి మీదకు వస్తున్నాడు. ఇక వీడిని అదుపు చేయకపోతే కష్టమని రాముడు భావించి తీవ్రమైన ములుకులు కలిగిన బాణాలను ప్రయోగించాడు. ఆ బాణాలు ఆ కుంభకర్ణుడి గుండెల్లో తగలడంతో వాడి చేతిలో ఉన్న ఆయుధాలు జారిపోయి కళ్ళు తిరిగినంత పని అయింది. రాముడు వాయువ్యాస్త్రాన్ని ప్రయోగించి ఆ కుంభకర్ణుడి కుడి చేయి నరికేశాడు. ఆ చేయి కిందపడినప్పుడు దాని కింద కొన్ని వేల వానరాలు పడి చనిపోయాయి. కుంభకర్ణుడు తన ఎడమ చేతితో ఒక చెట్టును పట్టుకొని రాముడి మీదకు వస్తే రాముడు ఐంద్రాస్త్రంతో వాడి ఎడమ చేతిని భుజం వరకు నరికేశాడు.
రెండు చేతులు పోయినా ఆ కుంభకర్ణుడు తన కాళ్ళతో వానరాలను తొక్కడం ప్రారంభించాడు. రాముడు రెండు అర్ధచంద్రాకార బాణాలతో వాడి రెండు తొడలను నరికేశాడు. తర్వాత వాడి తలను ఖండించారు. అప్పుడు వాడి శరీరంలో సగభాగం సముద్రంలో పడిపోయింది. మిగిలిన సగభాగం లంకా ద్వారం వరకు పడిపోయింది.
రావణుడి దుఃఖం మరియు అతని కుమారుల ప్రతిజ్ఞ
కుంభకర్ణుడు చనిపోయాడన్న వార్త విన్న రావణుడు ఏడుస్తూ “అయ్యో! నిద్రపోతున్న వాడిని లేపి కారణం లేకుండా యుద్ధానికి పంపాను. ఎవడు యముడిని, ఇంద్రుడిని ఓడించాడో అటువంటి నా తమ్ముడు ఈరోజు రాముడి చేతిలో మరణించాడు. నేను కుంభకర్ణుడిని పంపకపోయినా బాగుండేది. రాముడి ముందు నువ్వు కాదు, కుంభకర్ణుడు కాదు, మహోదర, మహాపార్శ్వ, ప్రహస్తులు ఎవ్వరూ నిలబడలేరని నా తమ్ముడు విభీషణుడు చెప్పాడు. ధర్మాత్ముడైన విభీషణుడిని అవమానించి వెళ్ళగొట్టాను. కుంభకర్ణుడు మరణించాడు. నా కుడి భుజం ఈరోజు విరిగిపోయింది” అని కిందపడి ఏడుస్తుంటే రావణుడి యొక్క కుమారులు, కుంభకర్ణుడి యొక్క కుమారులు అక్కడికి వచ్చారు.
“నాన్నగారు! మీరు అంత బాధ పడకండి. మేము యుద్ధంలోకి వెళ్ళి మీరు కోరుకున్నట్టుగా రామలక్ష్మణులను అదుపు చేసి వస్తాము” అన్నారు.
రావణుడు “ఇప్పటికైనా నా కోరిక తీర్చండి” అన్నాడు.
కుంభకర్ణుడి నిద్రలేపే ప్రక్రియలో మనకు రాక్షసుల ఆలోచనా విధానం, ఆయన శక్తి మరియు ఆకలికి సంబంధించిన భయంకరమైన స్వభావం అర్థమవుతుంది. ఈ సంఘటన రామాయణంలోని ఒక ముఖ్యమైన మలుపు, మరియు కుంభకర్ణుడు యుద్ధానికి వచ్చిన సందర్భం ఎంతో ఉద్వేగభరితమైనదిగా నిలిచిపోతుంది.