Karthika Puranam Telugu – కార్తీక పురాణం | 8వ రోజు పారాయణ

Karthika Puranam

కార్తీక మాసంలో శ్రీహరి ప్రీతికి మార్గాలు

వశిష్ఠ మహర్షి జనక నరేంద్రుడితో ఇలా అన్నారు : “ఓ జనక నరేంద్రా! కార్తీక మాసములో ఎవరైతే శ్రీహరి ముందర నాట్యమును చేస్తారో, వాళ్లు శ్రీహరి ముందర నివాసులవుతారు.”

  • కార్తీక ద్వాదశి నాడు హరికి దీప మాలార్పణ చేసే వాళ్లు వైకుంఠములో సుఖిస్తారు.
  • కార్తీక మాస శుక్ల పక్ష సాయంకాలాలందు విష్ణువుని అర్పించే వాళ్లు స్వర్గ నాయకులౌతారు.
  • ఈ నెల రోజులూ నియమముగా విష్ణ్వాలయానికి వెళ్లి, దైవ దర్శనము చేసుకునే వాళ్లు సాలోక్య మోక్షాన్నందుకుంటారు.
    • అలా గుడికి వెళ్లేటప్పుడు వాళ్లు వేసే ఒక్కొక్క అడుగుకూ ఒక్కొక్క అశ్వమేధ యజ్ఞ ఫలాన్ని పొందుతారు.
    • కార్తీక మాసములో అసలు విష్ణుమూర్తి గుడికి వెళ్లని వాళ్లు ఖచ్చితముగా రౌరవ నరకానికో, కాలసూత్ర నరకానికో వెళతారు.

ద్వాదశి విశిష్టత & దీపారాధన ఫలం

కార్తీక శుద్ధ ద్వాదశినాడు చేసే ప్రతి సత్కర్మా అక్షయ పుణ్యాన్నీ, ప్రతి దుష్కర్మా అక్షయ పాపాన్ని కలిగించుతాయి.

  • శుక్ల ద్వాదశినాడు విప్రసహితుడై భక్తియుతుడై గంధ పుష్పాక్షత దీపధూపాజ్యభక్ష్య నివేదనలతో విష్ణువును పూజించే వారి పుణ్యానికి మితి అనేది లేదు.
  • కార్తీక శుద్ధ ద్వాదశినాడు శివాలయములో గాని, కేశవాలయములో గాని – లక్ష ద్వీపాలను వెలిగించి సమర్పించే వాళ్లు విమానారూఢులై దేవతల చేత పొగడబడుతూ విష్ణులోకాన్ని చేరి సుఖిస్తారు.
  • కార్తీకము నెల్లాళ్లూ దీపమును పెట్టలేని వాళ్లు ద్వాదశీ, చతుర్దశీ, పూర్ణిమ. ఈ మూడు రోజులైనా దీపమును పెట్టాలి.
  • ఆవు నుండి పాలు పితికేందుకు పట్టేటంత సమయమైనా దైవసన్నిధిలో దీపమును వెలిగించిన వాళ్లు పుణ్యాత్ములే అవుతారు.
  • ఇతరులు పెట్టిన దీపాన్ని ప్రకాశింప చేసిన వాళ్ల పాపాలు ఆ దీపాగ్నిలోనే కాలిపోతాయి.
  • ఇతరులు ఉంచిన దీపము ఆరిపోయినట్లయితే, దానిని పునః వెలిగించేవాడు ఘనమైన పాపాల నుండి తరించి పోతాడు. ఇందుకు ఉదాహరణగా ఒక కథ చెబుతాను విను.

ఎలుక దివ్య పురుషుడగుట కథ

సరస్వతీ నదీతీరంలో – అనాదికాలముగా పూజా పునస్కారాలు లేక శిథిలమై పోయిన విష్ణ్వాలయము ఒకటి ఉండేది. కార్తీక స్నానార్థమై వచ్చిన ఒక యతి ఆ గుడిని చూసి, అది తన తపోధ్యానాలకు అనువుగా ఉంటుందని భావించి , ఆ గుడిని తుడిచాడు, నీళ్లు చల్లాడు.

ఆ యతి చేరువ గ్రామానికి వెళ్లి – ప్రత్తి, నూనె, పన్నెండు ప్రమిదలూ తెచ్చి – దీపాలను వెలిగించి ‘నారాయణార్పణమస్తు’ అనుకుని ధ్యానము చేసుకోసాగాడు.

ఈ యతి ప్రతి రోజూ ఇలా చేస్తుండగా – కార్తీక శుద్ధ ద్వాదశి నాటి రాత్రి, ఆకలితో కడుపులో ఎలుకలు పరుగెడుతున్న ఒక ఎలుక గుడిలోనికి వచ్చింది. అది ఆహారాన్వేషణలో విష్ణు విగ్రహానికి ప్రదక్షిణముగా తిరిగి , మెల్లగా దీపాల దగ్గరకు చేరినది.

  • అప్పటికే ఒక ప్రమిదలో నూనె అయిపోవడం వలన ఆరిపోయిన వత్తి మాత్రమే ఉంది.
  • తడిగా వున్న ఆ వత్తి నుంచి వచ్చే నూనె వాసనకు భ్రమసిన ఎలుక, అదేదో ఆహారముగా భావించి ఆ వత్తిని నోట కరచుకుని ప్రక్కనే వెలుగుతూన్న మరో దీపము వద్దకు వెళ్లి పరిశీలించబోయింది.
  • ఆ పరిశీలనలో నూనెతో తడిసి వున్న ఆ ఆరిపోయిన వత్తికొన వెలుగుతూన్న వత్తి అగ్ని సంపర్కమైంది. దాంతో ఎలుక దానిని వదిలివేసినది.
  • అది ప్రమిదలో పడి రెండు వత్తులూ చక్కగా వెలగసాగాయి.

రాజా! కార్తీక శుద్ధ ద్వాదశినాడు విష్ణుసన్నిధిలో ఒక యతీంద్రుడు పెట్టిన దీపము ఆరిపోగా, అదే విధముగా ఎలుక వలన పునః ప్రజ్వలితమైంది. తన పూర్వపుణ్యవశాన, ఆ మూషికము ఆ రాత్రి ఆ గుడిలోనే విగతదేహియై దివ్యమైన పురుష శరీరాన్ని పొందడం జరిగింది.

ధ్యానములో నుండి లేచిన యతి ఆ అపూర్వ పురుషుణ్ణి చూసి ‘ఎవరు నువ్వు? ఇక్కడికి ఎందుకొచ్చావు?’ అని అడిగాడు.

దానికి ఆ అద్భుత పురుషుడు – ‘ఓ యతీంద్రా! నేనొక ఎలుకను. అటువంటి నాకు ఇప్పుడు ఈ దుర్లభమైన మోక్షము ఏ పుణ్యము వలన వచ్చిందో తెలియడం లేదు. పూర్వజన్మలో నేనెవరిని? ఏ పాపము వలన అలా ఎలుకనయ్యాను? ఏ పుణ్యము వలన ఈ దివ్యదేహమును పొందాను? దయగలవాడివై వివరించు. నేను నీ శిష్యుణ్ణి’ అని ప్రార్థించాడు.

ఆ యతి తన జ్ఞాన నేత్రముతో సర్వాన్నీ దర్శించి చెప్పసాగాడు. (అధ్యాయాలు ఈ కథను కొనసాగిస్తాయి.)

స్తంభదీపం వలన మొద్దుకు మోక్షం

తిల సమేతముగా దానిపై నేతితో దీపాన్ని వెలిగించి – విష్ణ్వర్పణము చేసి, పునః గుడిలోకి వెళ్లి పురాణ కాలక్షేపము చేయసాగారు.

అంతలోనే వారికి ఛటచ్ఛటారావాలు వినిపించడంతో వెనుదిరిగి స్తంభదీపము వైపు చూశారు. వాళ్లలా చూస్తుండగానే ఆ స్తంభము ఫటఫటరావాలతో నిలువునా పగిలి నేలను పడిపోయింది.

అందులో నుంచి ఒక పురుషాకారుడు వెలువడడంతో విస్మయచకితులైన ఆ ఋషులు ‘ఎవరు నువ్వు? ఇలా స్థాణువుగా ఎందుకు పడి వున్నావు? నీ కథ ఏమిటో చెప్పు’ అని అడిగారు.

అందుకు ఆ పురుషుడు ఇలా చెప్పసాగాడు:

  • ‘ఓ మునివరేణ్యులారా! నేను గతములో ఒక బ్రాహ్మణుడను. అయినా, వేదశాస్త్ర పఠనమునుగాని, హరి కథా శ్రవణమును గాని, క్షేత్ర యాత్రాటనలను గాని, చేసి ఎరుగను.
  • అపరిమిత ఐశ్వర్యము వలన బ్రాహ్మణ ధర్మాన్ని వదలి – రాజునై పరిపాలన చేస్తూ దుష్టబుద్ధితో ప్రవర్తించేవాడిని.
  • బ్రాహ్మణులను నీచాసనాలపై కూర్చో నియోగించి, నేను ఉన్నతాసనముపై కూర్చునే వాడిని.
  • ఎవరికీ దాన ధర్మాలు చేసే వాణ్ణి కాదు. ‘ఇంతిస్తాను-అంతిస్తాను’ అని వాగ్దానం చేసే వాణ్ణి తప్ప, ద్రవ్యాన్ని మాత్రం ఇచ్చే వాడిని కాను.
  • దేవబ్రాహ్మణ ద్రవ్యాలను స్వంతానికై ఖర్చు చేసుకునే వాడిని.
  • తత్ఫలముగా దేహాంతాన నరకగతుడనై, అనంతరము – 52 వేల మార్లు కుక్కగాను, పది వేల సార్లు కాకిగాను, మరో పదివేల పర్యాయాలు తొండగానూ, ఇంకో పది వేల సార్లు విష్ఠాశినైన పురుగుగానూ, కోటి జన్మలు చెట్టుగానూ గత కోటి జన్మలుగా ఇలా మొద్దువలెనూ పరిణమించి కాలమును గడుపుతూన్నాను.
  • ‘ఇంతటి పాపినైన నాకు ఇప్పుడెందుకు విమోచనము కలిగిందో – ఈ విశేష పురుషాకృతి ఎలా వచ్చినదో సర్వజ్ఞులైన మీరే చెప్పాలి’ అని కోరాడు.

కార్తీక వ్రతఫలం

ఆ ఉద్భూత పురుషుని మాటలు విన్న ఋషులు తమలో తాము ఇలా అనుకున్నారు:

  • ‘ఈ కార్తీక వ్రతఫలము యదార్థమైనది సుమా! ఇది ప్రత్యక్ష మోక్షదాయకము. మన కళ్ల ముందరే ఈ కొయ్యకు ముక్తి కలిగినది కదా!
  • అందునా కార్తీక పూర్ణిమనాడు స్తంభదీపమును పెట్టడం సర్వత్రా శుభప్రదము.
  • మనచే పెట్టబడిన దీపము వలన ఈ మొద్దు ముక్తిని పొందినది.
  • మొద్దయినా – మ్రాకైనా సరే కార్తీకములో దైవసన్నిధిని దీపాన్ని వహించడం వలన దామోదరుని దయవల్ల మోక్షమును పొందడం తథ్యము’.

ఇలా చెప్పుకుంటూన్న వారి మాటలను విన్న ఉద్భూత పురుషుడు – ‘అయ్యలారా! దేహి ఎవరు? జీవి ఎవరు? జీవుడు దేని చేత ముక్తుడూ – దేని చేత బద్ధుడూ అవుతున్నాడో, దేనిచేత దేహులకు ఇంద్రియాలు కలుగుతున్నాయో వివరింపుడు’ అని ప్రార్థించడముతో , ఆ తాపసులలో వున్న అంగీరసుడనే ముని అతనికి జ్ఞానబోధ చేయసాగాడు.

ఏవం శ్రీస్కాంద పురాణాంతర్గత కార్తీక మహాత్మ్యే పంచదశ, షోడశాధ్యాయౌ, (పదిహేను – పదహారు అధ్యాయములు)

ఎనిమిదవ రోజు (అష్టమదిన) నాటి పారాయణము సమాప్తము.

Related Posts

Karthika Puranam Telugu – కార్తీక పురాణం | 22వ రోజు పారాయణ

Karthika Puranam Telugu జలంధరుని యుద్ధ సన్నాహాలు ఓ పృథురాజా! రాహువు చెప్పిన విషయాలన్నీ వినగానే, క్రోధోద్రిక్తుడైన జలంధరుడు శివుని మీద రణభేరీ వేయించాడు. కోట్లాది సేనలతో అతడు కైలాసం వైపుకు దండు కదిలాడు. ఆ సందర్భంగా జలంధరునికి అగ్రభాగాన ఉన్న…

భక్తి వాహిని

భక్తి వాహిని
Karthika Puranam Telugu – కార్తీక పురాణం | 21వ రోజు పారాయణ

Karthika Puranam Telugu మారుమూలల్లో తలలు దాచుకున్నా కూడా వదలకుండా ముట్టడింప వస్తూన్న జలంధరునికి భయపడినవారై దేవతలంతా విష్ణు స్తోత్రం చేయసాగారు. సర్వదేవతా కృత విష్ణుస్తోత్రం నమో మత్స్య కూర్మాది నానా స్వరూపాయసదాభక్త కార్యద్యతా యార్తి హంత్రేవిధాత్రాధి సర్గస్థితి ధ్వంసకగదాశంఖ పద్మాది…

భక్తి వాహిని

భక్తి వాహిని