Kedareshwara Vrata Katha – Divine Story That Brings Peace & Prosperity | కేదారేశ్వర వ్రత కథ

Kedareshwara Vrata Katha

పూజాపీఠం, దైవస్థాపన

పూజకు సిద్ధం చేసే విధానంలో పాటించాల్సిన ముఖ్యమైన అంశాలు ఇక్కడ ఉన్నాయి:

అంశంవివరాలు (పాటించవలసిన పద్ధతి)
స్థలంఇంటిలో ఈశాన్య మూల (North-East Corner) అత్యంత శ్రేష్ఠమైనది.
శుద్ధిస్థలాన్ని శుభ్రం చేసి, ఆవు పేడతో అలికి, బియ్యపు పిండితోగాని, రంగుల చూర్ణములతోగాని అందమైన ముగ్గులు వేయాలి.
పీఠం స్థాపనదైవస్థాపన నిమిత్తమై ఒక పీటను వేయాలి. పీట మరీ ఎత్తుగాగాని, మరీ పల్లముగా గానీ ఉండకూడదు.
పీఠం అలంకరణపీటకు చక్కగా పసుపు రాసి, కుంకుమతో బొట్టు పెట్టి, వరి పిండి (బియ్యపు పిండి)తో ముగ్గు వేయాలి. సాధారణంగా దీనిపై అష్టదళ పద్మాన్నే వేయడం ఆనవాయితీ.
కూర్చునే దిశపూజ చేసేవారు తూర్పు ముఖంగా (East) కూర్చోవాలి.
దైవస్థాపనఏ దైవాన్ని పూజించబోతున్నారో ఆ దైవంయొక్క ప్రతిమనుగాని, చిత్రపటమునుగాని ఆ పీటపై ఉంచాలి.

పసుపు గణపతి పూజ

ప్రారంభంలో, విఘ్నాలు తొలగించే వినాయకుడిని ఈ విధంగా పూజించాలి:

  1. గణపతి తయారీ: ముందుగా పసుపు ముద్దను సుమారు అంగుళం సైజులో త్రికోణాకృతిలో ముద్దగా చేసి, దానికి కుంకుమ బొట్టు పెట్టి పసుపు గణపతిని తయారు చేయాలి.
  2. స్థాపన: ఒక పళ్ళెంలోగాని, క్రొత్త తుండుగుడ్డమీదగాని బియ్యం పోసి (రాశిగా), దానిపై ఒక తమలపాకును ఉంచి, అందు పసుపు గణపతిని ఉంచాలి.
  3. ధూపం: అగరువత్తులు వెలిగించి ధూపము చూపించాలి.
  4. ఇపుడు పూజకు కావలసిన మిగిలిన వస్తువులను సిద్ధం చేసుకోవాలి.

దీపారాధన విధానం

దీపారాధన చేయుటకు కుంది (ప్రమిద వెండిదిగాని, ఇత్తడిదిగాని, మట్టిదిగాని వాడవచ్చును. కుందిలో 3 అడ్డవత్తులు 1 కుంభ వత్తి (మధ్యలో) వేసి నూనెతో తడుపవలెను. ఇంకొక అడ్డవత్తి నూనెతో తడిపి ఏకహారతిలో (కర్పూర హారతికి వాడే వస్తువు) వేసి ముందుగా ఏకహారతిలో వేసిన వత్తిని అగ్గిపుల్లతో వెలిగించి, వెలిగించిన వత్తితో కుందిలోని 1 అడ్డవత్తి 1 కుంభవత్తి వెలిగించవలెను.

తర్వాత చేయి కడుక్కుని నూనె కుంది నిండావేసి పిదప ఆ కుందికి మూడు చోట్ల కుంకుమ అలంకారము చేయవలెను. తర్వాత అక్షతలు వేసి దీపారాధనను లక్ష్మీ స్వరూపముగా భావించి నమస్కారము చేయవలెను. కుందిలో మిగిలిన రెండు అడ్డవత్తులు పూజా సమయంలో ధూపము చూపిన తరువాత దీపము చూపించుటకు వాడవలెను. దీపారాధనకు నువ్వులనూనెగాని, కొబ్బరినూనెగాని, ఆవునెయ్యిగాని వాడవచ్చును.

కలశారాధన

మనము ఆచమనము చేసినటువంటి పంచపాత్రలోని నీళ్లు దేవుని పూజకు వినియోగించరాదు. పూజకు విడిగా ఒక గ్లాసుగాని, చెంబుగాని తీసుకొని దానిలో శుద్ధ జలమును పోసి ఆ చెంబునకు కలశారాధన చేసి ఆ నీళ్లు మాత్రమే దేవుని పూజకు ఉపయోగించవలెను.

కేదారేశ్వర వ్రతానికి కావలసిన ముఖ్య వస్తువులు

సాధారణ పూజా వస్తువులతో పాటు కేదారేశ్వర వ్రతానికి ప్రత్యేకంగా కావలసినవి:

వస్తువువివరాలు
సాధారణ వస్తువులుపళ్లు, కొబ్బరికాయలు, పువ్వులు.
ప్రతిమకేదారేశ్వర స్వామి యొక్క ప్రతిమ (బొమ్మ) లేదా చిత్రపటము.
పీఠంఒక పీట (దైవస్థాపనకు).
ధాన్యమువ్రతం కోసం ధాన్యము (సాధారణంగా బియ్యం)
కుండకొత్త కుండ (కలశ స్థాపనకు).
తోరముతెల్లని దారమును తీసుకొని పసుపు రాసుకొనవలెను. ముఖ్యముగా ఈ నోమునకు కావలసిన తోరములు 21 పోగులు, 21 ముళ్లు కలిగివుండవలెను.
నవరత్నాలు/బంగారంనవరత్నములు లేదా కొద్ది బంగారం (శక్తి కొలది) సమర్పించడానికి.
వస్త్రంపట్టు వస్త్రము (పీటమీద రాశిగా పోసిన ధాన్యముపై కప్పడానికి).

(ధాన్యము పోసిన పీటపైనే దైవాన్ని స్థాపించాలి, లేదా కలశాన్ని ఉంచాలి)

ఆచమనం, సంకల్పం

పూజ ప్రారంభించడానికి ముందు యజమానులు (పూజ చేసేవారు) ఈ క్రింది విధంగా 24 కేశవ నామాలను స్మరిస్తూ ఆచమనం చేయాలి.

కేశవ నామముఆచరించవలసిన పద్ధతి
ఓం కేశవాయ స్వాహాచేతిలో నీరు తీసుకొని లోనికి తీసుకోవాలి (సిప్ చేయాలి).
ఓం నారాయణాయ స్వాహాచేతిలో నీరు తీసుకొని లోనికి తీసుకోవాలి.
ఓం మాధవాయ స్వాహాచేతిలో నీరు తీసుకొని లోనికి తీసుకోవాలి.
ఓం గోవిందాయ నమఃచేతులు కడుగుకోవాలి.
ఓం విష్ణవే నమఃబొటనవ్రేలు, మధ్య వేళ్లతో కళ్లు తుడుచుకోవాలి.
ఓం మధుసూదనాయ నమఃపై పెదవిని కుడినుంచి ఎడమకి నిమురుకోవాలి.
ఓం త్రివిక్రమాయ నమఃక్రింది పెదవిని కుడినుంచి ఎడమకి నిమురుకోవాలి.
ఓం వామనాయ నమః & ఓం శ్రీధరాయ నమఃఈ రెండు నామాలు స్మరిస్తూ తలపై కొంచెం నీళ్లు చల్లుకోవాలి.
ఓం హృషీకేశాయ నమఃఎడమ చేతితో నీళ్లు చల్లాలి.
ఓం పద్మనాభాయ నమఃపాదాలపై ఒక్కొక్క చుక్క నీరు చల్లుకోవాలి.
ఓం దామోదరాయ నమఃశిరస్సుపై జలమును ప్రోక్షించుకోవలెను.
ఓం సంకర్షణాయ నమఃచేతివ్రేళ్లు గిన్నెలా వుంచి గడ్డము తుడుచుకోవలెను.
ఓం వాసుదేవాయ నమఃవ్రేళ్లతో ముక్కును వదులుగా పట్టుకోవలెను.
ఓం ప్రద్యుమ్నాయ నమః & ఓం అనిరుద్ధాయ నమఃనేత్రాలు (కళ్ళు) తాకవలెను.
ఓం పురుషోత్తమాయ నమః & ఓం అధోక్షజాయ నమఃరెండు చెవులూ తాకవలెను.
ఓం నారసింహాయ నమః & ఓం అచ్యుతాయ నమఃబొడ్డును (నాభిని) స్పృశించవలెను.
ఓం జనార్ధనాయ నమఃచేతివ్రేళ్లతో వక్షస్థలం (ఛాతి), హృదయం తాకవలెను.
ఓం ఉపేంద్రాయ నమఃచేతి కొనతో శిరస్సు తాకవలెను.
ఓం హరయే నమఃకుడిచేతితో ఎడమ భుజాన్ని (మూపురాన్ని) తాకవలెను.
ఓం శ్రీకృష్ణాయ నమఃఎడమచేతితో కుడి భుజాన్ని (మూపురాన్ని) తాకవలెను.

ముఖ్య గమనిక: కేశవనామాలు మొత్తం 24 కలవు. ఆచమనము పూర్తయిన తరువాత, ఈ దిగువ చెప్పబడిన ప్రక్రియలు ఆచరించి, వెంటనే సంకల్పము చెప్పుకోవలెను.

భూతోచ్చాటన
ఆచమనము అయిన తరువాత, కొంచెం నీరు చేతిలో పోసుకుని నేలపై చిలకరించుతూ ఈ శ్లోకమును పఠించవలెను:

శ్లో: ఉత్తిష్ఠంతు భూత పిశాచాః యేతే భూమిభారకాః
యేతేషామవిరోధన బ్రహ్మకర్మ సమారభే

ప్రాణాయామం
భూతోచ్చాటన తరువాత, ప్రాణాయామము చేయవలెను:

ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓగ్ సత్యం ఓం తత్ సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహీ ధియో యోనః ప్రచోదయాత్ ఓం ఆపోజ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోం

ఈ ప్రాణాయామం అయిన వెంటనే తమ గోత్ర నామాలు చెప్పుకొని, వ్రతకార్యము కోసం సంకల్పము చెప్పుకొనవలెను.

సంకల్పం

ఆచమనము చేసిన తరువాత, కొంచెం నీరు చేతిలో పోసుకుని నేలపై చిలకరించుతూ ఈ శ్లోకము పఠించవలెను.

ఉత్తిష్ఠంతు భూత పిశాచాః యేతే భూమిభారకాః యేతేషామవిరోధన బ్రహ్మకర్మ సమారభే

ప్రాణాయామము: ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓగ్ సత్యం ఓం తత్ సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహీధియోయోనః ప్రచోదయాత్ ఓం ఆపోజ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోం అని సంకల్పము చెప్పుకొనవలెను.

సంకల్పము: మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభన ముహూర్తే ఆద్య బ్రహ్మణః (ఇక్కడ శ్రీ మహావి రాజ్ఞయా అని కూడా చెప్పవచ్చు) ద్వితీయ పరార్థ శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూ ద్వీపే భరతవర్ష భరత ఖండే మేరోర్దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశ్ (మనకు శ్రీశైలము ప్రధాన క్షేత్రము కావున మనము శ్రీశైలమునకు ఏ దిక్కున ఉన్నామో ఆ దిక్కు చెప్పుకొనవలెను), కృష్ణా గోదావర్యో మధ్యప్రదేశ్ (మనం ఏ ఏ నదులకు మధ్యన ఉన్నామో ఆయా నదుల పేర్లు చెప్పుకొనవలెను), శోభన గృహే (అద్దె ఇల్లు అయినచో వసతిగృహే అనియు, సొంత ఇల్లయినచో స్వగృహే అనియు చెప్పుకొనవలెను), సమస్త దేవతా బ్రాహ్మణ హరిహర సన్నిధౌ అస్మిన్ వర్తమానే వ్యావహారిక చాంద్రమానేన ….. సంవత్సరరే, (ఇక్కడ తెలుగు సంవత్సరమను అంటే పూజ చేయునపుడు ఏ సంవత్సరము జరుగుచున్నదో ఆ సంవత్సరము యొక్క పేరును చెప్పుకోవలెను).. ….. అయనే (సంవత్సరమునకు రెండు అయనములు-ఉత్తరాయణము, దక్షిణాయనము. జనవరి 15 మకర సంక్రమణం మొదలు జూలై 14 కర్కాటక సంక్రమణం వరకు ఉత్తరాయణము, జూలై 15 కర్కాటక సంక్రమణం నుండి మరల జనవరి 14 పెద్దపండుగ అనగా మకర సంక్రమణం వరకు దక్షిణాయనం. పూజచేయునపుడు ఏ ఆయనము జరుగుచున్నదో దానిని చెప్పవలెను) ….. ఋతుః, (వసంత, గ్రీష్మ, వర్ష మొ॥ ఋతువులలో పూజ సమయములో జరుగుచున్న ఋతువు పేరు) ….. మాసే, (చైత్ర, వైశాఖ మొ॥ పన్నెండు మాసములలో పూజ సమయములో జరుగుచున్న మాసం పేరు) ….. పక్షే, (నెలకు రెండు పక్షములు పౌర్ణమికి ముందు శుక్లపక్షము, అమావాస్యకు ముందు కృష్ణపక్షములు వీటిలో పూజ జరుగుచున్న సమయమున గల పక్షము పేరు) …..తిథా, (ఆరోజు తిథి)…. వాసరే (ఆరోజు ఏ వారమనదీ చెప్పుకొని) శుభనక్షత్రే, శుభయోగే, శుభకరణే ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథా మమ ఉపాత్త సమస్త దురితక్షయద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం పురుషులైనచో శ్రీమాన్….. గోత్రస్య….. నామధేయః, శ్రీమత్యః, గోత్రస్య, నామధేయస్య అనియు, స్త్రీ లైనచో శ్రీమతి, గోత్రవతి, నామధేయవతి, శ్రీమత్యాః, గోత్రవత్యాః, నామధేయవత్యాః అనియు (పూజచేయువారి గోత్రము, నామము చెప్పి) నామధేయస్యః దర్మపత్నీ సమేతస్య (పురుషులైనచో) మమ సహకుటుంబస్య, క్షేమ స్థైర్య వీర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభి వృద్ధ్యర్థం, ధర్మార్థ కామ మోక్ష ఫలపురుషార్థ సిద్ధ్యర్థం, పుత్రపౌత్రాభివృద్ధ్యర్థం సకల విధమనోవాంఛాఫలసిద్ధ్యర్థం, శ్రీ పరమేశ్వరా దేవతా ముద్దిశ్య పరమేశ్వర దేవతా ప్రీత్యర్థం (ఏ దేవుని పూజించుచున్నామో ఆ దేవునియొక్క పేరు చెప్పుకొని) సంభవద్భిరుపచారైః సంభవతానియమేన సంభవతా ప్రకా రేణ యావచ్ఛక్తి (నాకు తోచిన రీతిలో, నాకు తోచిన నియమములతో, నాకు తోచిన విధముగా, భక్తి శ్రద్ధలతో సమర్పించుకొంటున్న పూజ) ధ్యానావాహనాది షోడశోపచారపూజాం కరిష్యే. తధంగ కలశపూజాం కరిష్యే | పిదప కలశారాధనను చేయవలెను.

కలశపూజ

వెండి, రాగి, లేక కంచు గ్లాసులు (లేదా పంచపాత్రలు) రెండింటిలో శుద్ధ జలమును తీసుకొని ఒకదానియందు ఉద్ధరిణిని, రెండవదానియందు అక్షతలు, తమలపాకు, పువ్వు ఉంచుకొనవలెను. రెండవపాత్రకు బయట మూడు వైపులా గంధమును వ్రాసి కుంకమను అద్దవలెను. ఇట్లు చేయునపుడు గ్లాసును గుండ్రముగా త్రిప్పుచూ గంధమును గాని, కుంకుమనుగాని పూయరాదు. గంధమును ఉంగరపు వేలితో పూయవలెను. కుంకుమ అక్షతలు వగైరా బొటన, మధ్య, ఉంగరపు వ్రేళ్లను కలిపి సమర్పించవలెను. యజమానులు (ఒక్క రైతే ఒకరు, దంపతులైతే ఇద్దరూను) ఆ కలశాన్ని కుడిచేతితో మూసివుంచి, ఈ విధముగా కలశమును తయారుచేసి పూజను చేయునపుడు మొదటగా ఈ శ్లోకమును చదువవలెను.

మం॥ కలశస్య ముఖే విష్ణుః కంఠే రుద్రస్సమాశితః మూలే తత్ర స్థితో బ్రహ్మామధ్యేమాతృ గణాస్మృతాః || ఋగ్వేదో థ యజుర్వేదస్సామవేదోహ్యధర్వణః అంగైశ్చ సహితాస్సర్వే కలశాంబు సమాశ్రితాః శ్లో| గంగైచ యమునే చైవ కృష్ణ, గోదావరి, సరస్వతీ, నర్మదా సింధు కావేర్యౌ జలేస్మిన్ సన్నిధిం కురు |

ఇక్కడ ఇలా శ్లోకము ముగిసిన తరువాత ఆయాతు శ్రీ కేదారేశ్వర దేవతా (ఏ దేవుని పూజైతే చేస్తున్నామో ఆ దేవుని పేరును చెప్పవలెను) పూజార్థం మమ | దురితక్షయకారకాః కలశోదకేన ఓం దేవం సంప్రోక్ష్య (కలశమందలి ఉదకమును దేవునిపై చల్లాలి), ఓం ఆత్మానం సంప్రోక్ష్య అని (ఆ నీటిని తనపై చల్లుకోవాలి) ఓం పూజా ద్రవ్యాణి సంప్రోక్ష్య (పూజాద్రవ్యములపై కూడా చల్లాలి) కలశమందలి నీటిని పై మంత్రం చదువుతూ పువ్వుతోగాని, ఆకుతోగానీ చల్లాలి.

మార్జనము: ఓం అపవిత్రః పవిత్రోవా సర్వావస్థాంగతోపివా యస్స్మరే త్పుండరీకాక్షం సబాహ్యాభ్యంతరశ్శుచిః ||

అని పిదప కాసిని అక్షతలు, పసుపు, గణపతిపై వేసి, ఆయనను తాకి నమస్కరించి ప్రాణప్రతిష్ఠాపన చేయవలెను. ప్రాణప్రతిష్ఠ అనగా శ్రీ మహా గణాధిపతయేనమః ప్రాణప్రతిష్ఠాపన ముహూర్తస్సుముహూర్తాస్తు తథాస్తు. తరువాత ఇలా చదువుతూ విఘ్నేశ్వరునికి నమస్కరించవలెను.

శ్లో|| శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్ ప్రసన్నవదనం ధ్యాయే త్సర్వవిఘ్నోపశాంతయే | సుముఖ శ్చైక దంతశ్చ కపిలో గజకర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో వినాయకః ధూమకేతు ర్గణాధ్యక్ష ఫాలచందో గజాననః వక్రతుండ శ్ళూర్పకర్ణో హేరంబ: స్కంధపూర్వజః షోడశైతాని నామాని యఃపఠేచ్ఛృణుయాదపి విద్యారంభే వివాహేచ ప్రవేశ నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య నజాయతే

షోడశోపచార పూజ

పై క్రియలన్నీ పూర్తయ్యాక, చివరగా షోడశోపచార పూజను చేయవలెను. ఈ షోడశోపచారములు (పదహారు ఉపచారములు) అనేవి దేవుడిని ఒక అతిథిలా భావించి చేసే సేవలు.

షోడశోపచార పూజ

పిదప షోడశోపచార పూజను చేయవలెను. షోడశోపచారములు అనగా ధ్యాన, ఆవాహన, ఆసనం, అర్థ్యం, పాద్యం, ఆచమనీయం, స్నానం, వస్త్రం, యజ్ఞోపవీతం, గంధం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం, తాంబూలం, నమస్కార ప్రదక్షిణములు మొదలగునవి.

షోడశోపచారపూజా ప్రారంభః

  1. ధ్యానమ్: శ్లో|| శూలం డమరుకంచైవ దధానం హస్తయుగ్మకే, కేదారదేవ మీశానం ధ్యాయే త్రిపురఘాతినం శ్రీ కేదారేశ్వరాయ నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి అని కేదారేశ్వరుని మనస్సున ధ్యానించి నమస్కరించవలెను.
  2. ఆవాహనం: శ్లో॥ కైలాసశిఖరే రమ్యే పార్వత్యా స్సహిత ప్రభో, ఆగచ్ఛ దేవదేవేశ మద్భక్త్యా చంద్రశేఖర కేదారేశ్వరాయ నమః ఆవాహయామి. ఆవాహనార్థం అక్షతాం సమర్పయామి. అనగా మనస్ఫూర్తిగా దేవుని మన ఇంట్లోకి ఆహ్వానించడం. అట్లు మనస్సున స్మరిస్తూ అక్షతలు దేవునిపై వేయవలెను.
  3. ఆసనం: శ్లో| సురాసుర శిరోరత్న ప్రదీపిత పదాంబుజ, కేదారదేవ మద్దత్త మాసనం ప్రతిగుహ్యతామ్. శ్రీ కేదారేశ్వరాయ నమః నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి. సింహాసనార్థం అక్షతాం సమర్పయామి. దేవుడు కూర్చుండుటకై మంచి బంగరు పీట వేసినట్లు అనుకుంటూ అక్షతలు వేయవలెను.
  4. పాద్యం: శ్లో| గంగాధర నమస్తేస్తు త్రిలోచన వృషధ్వజ, మౌక్తికాసన సంస్థాయ కేదారాయ నమోనమః శ్రీ కేదారేశ్వరాయ నమః పాదౌః పాద్యం సమర్పయామి. దేవుడు కాళ్లు కడుగుకొనుటకు నీరు ఇస్తున్నామని మనసున అనుకుంటూ పువ్వుతో పంచపాత్రలోని నీరు అదే గిన్నెలో ఉద్ధరిణెతో వదలవలెను.
  5. అర్ఘ్యం: శ్లో|| అర్ధ్యం గృహాణ భగవన క్త్యా దత్తం మహేశ్వరః, ప్రయచ్ఛమే మనస్తుష్టిం భక్తానామిష్టదాయకం. శ్రీ కేదారేశ్వరాయ నమః హస్తాః అర్థ్యం సమర్పయామి. దేవుడు చేతులు కడుగుకొనుటకై నీళ్ళిస్తున్నామని మనసున తలుస్తూ, ఉద్ధరిణితో నీరు వేరొక గిన్నెలో వదలవలయును.
  6. ఆచమనం: శ్లో మునిభిర్నారద ప్రఖ్యై ర్నిత్యమాఖ్యాత వైభవ, కేదారదేవ భగవన్ గృహాణాచమనం విభో. శ్రీ కేదారేశ్వరాయ నమః | ఆచమనీయం సమర్పయామి. అంటూ దేవుని ముఖము కడుగుకొనుటకై నీళ్ళిస్తున్నామని మనమున తలుస్తూ పైన చెప్పిన పాత్రలో ఉద్ధరిణెతో ఒకమారు నీరు వదలవలెను.
    • సూచన: అర్ఘ్యం, పాద్యం, ఆచమనం మొదలగు వాటికి ఉద్ధరిణెతో నీరు వేరొక పాత్రలో వదలవలెను. అరివేణంలో వదలరాదు.
  7. మధుపర్కం: శ్లో॥ కేదారదేవ భగవన్ సర్వలోకేశ్వర ప్రభో, మధుపర్కం ప్రదాస్యామి గృహాణత్వం శూభాననై శ్రీ కేదారేశ్వరాయ నమః మధుపర్కం సమర్పయామి అని స్వామివారికి స్నానం చేయుటకు వస్త్రమిచ్చుచున్నామని తలుస్తూ, ఈ మధుపర్కంను ఆయన ప్రతిమకు అద్దవలెను. (ప్రత్తిని పెద్దబొట్టుబిళ్ళ సైజులో గుండ్రముగా చేసి నీటిలో తడిపి ఆపైన రెండువైపులా పసుపులో అద్ది ఉంచుకొన్నదాన్ని మధుపర్కం అంటారు).
  8. పంచామృతస్నానం: శ్లో స్నానం పంచామృతైర్ధవ తతశ్శుద్ధోదకై రపి, గృహాణ గౌరీరమణ తద్భ క్తేన మయార్పితమ్. శ్రీ కేదారేశ్వరాయ నమః పంచామృత స్నానం సమర్పయామి అని స్నానమునకు పంచామృతములతో కూడిన నీరు ఇచ్చునట్లు భావించి ఆవునెయ్యి, ఆవుపాలు, ఆవు పెరుగు, తేనె, పంచదార కలిపిన పంచామృతమును స్వామిపై ఉద్ధరిణెతో చల్లవలెను.
  9. శుద్ధోదకస్నానం: శ్లో॥ నదీజలం సమాయుక్తం మయాదత్త మనుత్తమం. స్నానం స్వీకురు దేవేశ సదాశివ నమోస్తుతే. శ్రీ కేదారేశ్వరాయ నమః శుద్ధోదకస్నానం సమర్పయామి. పంచపాత్రలోని శుద్ధ నీటిని పువ్వుతో దేవునిపై చల్లవలెను.
  10. వస్త్రయుగ్మం: శ్లో| వస్త్రయుగ్మం సదాశుభ్రం మనోహర మిదం శుభం, దదామి దేవదేవేశ భక్త్యాదం ప్రతిగృహ్యతామ్ .! శ్రీ కేదారేశ్వరాయ నమః వస్త్రయుగ్మం సమర్పయామి అనుచు వస్త్రమును (ప్రత్తిని బొట్టు బిళ్ల ఆకారములో గుండ్రముగా చేసికొని కొద్దిగా తడిచేసి కుంకుమలో అద్దినచో అది వస్త్రమగును) స్వామివారి ప్రతిమకు అద్దవలెను.
  11. యజ్ఞోపవీతం: శ్లో| స్వర్ణయజ్ఞోపవీతం చ కాంచనం చోత్తరీయకం, రుద్రాక్షమాలయా యుక్తం దదామి స్వీకురు ప్రభో శ్రీ కేదారేశ్వరాయ నమః ఉపవీతం సమర్పయామి అనగా జందెమును ఇవ్వవలెను. ఇదియును ప్రత్తితో చేయవచ్చును. ప్రత్తిని తీసుకొని పసుపుచేత్తో బొటన వేలు, మధ్య వ్రేలితో మధ్య మధ్య నలుపుతూ పొడవుగాచేసి, కుంకుమ అద్దవలెను. దీనిని పురుష దేవతా పూజకు మాత్రమే సమర్పించవలెను.
  12. గంధం: శ్లో| సమస్త గంధ ద్రవ్యాణాం దేవత్వమసి జన్మభూః, భక్త్యా సమర్పితం ప్రీత్యా మధుగంధాది గృహ్యతాం. శ్రీ కేదారేశ్వరాయై నమః గంధాన్ సమర్పయామి. ముందుగా తీసి పెట్టుకున్న గంధమును కుడిచేతి ఉంగరం వ్రేలుతో స్వామివారి ప్రతిమపై చల్లవలెను.
  13. అక్షతాన్: శ్లో| అక్షతోసి స్వభావేన భక్తానా మక్షతం పదం, దదాసి నాథ మద్దత్తె రక్ష తైః ప్రీయతాం భవాన్. శ్రీ కేదారేశ్వరాయై నమః అక్షతాన్ సమర్పయామి. (అక్షతలకు కొద్ది బియ్యమును తడిపి పసుపు వేసి కలుపవలెను) అక్షతలు తీసుకొని స్వామివారి ప్రతిమపై చల్లవలెను.
  14. పుష్ప పూజ: శ్లో| కల్పవృక్ష ప్రసూనై స్త్వం పూర్వైరభ్యర్చితస్సు రైః, కుంకుమై పార్థివై రేభి రిదానీ మర్చతాం మయా. శ్రీ కేదారేశ్వరాయైనమః పుష్పాణి సమర్పయామి. స్వామివారికి పువ్వులతో అలంకారము చేసి, పుష్పములతో పూజించవలెను. తతః ఇంద్రాది లోకపాలకపూజాం కుర్యాత్ శివస్య దక్షిణేభాగే బ్రహ్మణే నమః ఉత్తరభాగే విష్ణవే నమః, మధ్యే కేదారేశ్వరాయ నమః.

అథ అంగ పూజ

పిదప అంగపూజను చేయవలెను. ఈ క్రింది అంగపూజలోని ఒక్కొక్క నామము చదువునప్పుడు పువ్వులుగాని, పసుపు లేదా కుంకుమతోగాని పూజించవచ్చును.

  • ఓం మహేశ్వరాయ నమః – పాదౌ పూజయామి
  • ఓం ఈశ్వరాయ నమః – జంఘే పూజయామి
  • ఓం కామరూపాయ నమః – జానునీ పూజయామి
  • ఓం హరాయ నమః – ఊరూం పూజయామి
  • ఓం త్రిపురాంతకాయ నమః – గుహ్యం పూజయామి
  • ఓం భవాయ నమః – కటిం పూజయామి
  • ఓం గంగాధరాయ నమః – నాభిం పూజయామి
  • ఓం మహాదేవాయ నమః – ఉదరం పూజయామి
  • ఓం పశుపతయే నమః – హృదయం పూజయామి
  • ఓం పినాకినే నమః – హస్తాన్ పూజయామి
  • ఓం శివాయ నమః – భుజా పూజయామి
  • ఓం శీతికంఠాయ నమః – కంఠం పూజయామి
  • ఓం విరూపాక్షాయ నమః – ముఖం పూజయామి
  • ఓం త్రినేత్రాయ నమః – నేత్రాన్ పూజయామి
  • ఓం రుద్రాయ నమః – లలాటం పూజయామి
  • ఓం శర్వాయ నమః – శిరః పూజయామి
  • ఓం చంద్రమౌళయే నమః – మౌళిం పూజయామి
  • పశుపతయే నమః – సర్వాంణ్యంగాని పూజయామి

అష్టోత్తర శతనామ పూజ

  • ఓం శివాయ నమః
  • ఓం మహేశ్వరాయ నమః
  • ఓం శంభవే నమః
  • ఓం పినాకినే నమః
  • ఓం శశి శేఖరాయ నమః
  • ఓం వామదేవాయ నమః
  • ఓం విరూపాక్షాయ నమః
  • ఓం కపర్దినే నమః
  • ఓం నీలలోహితాయ నమః
  • ఓం శంకరాయ నమః
  • ఓం శూలపాణినే నమః
  • ఓం ఖట్వాంగినే నమః
  • ఓం విష్ణువల్లభాయ నమః
  • ఓం శిపివిష్ణాయ నమః
  • ఓం అంబికానాథాయ నమః
  • ఓం శ్రీకంఠాయ నమః
  • ఓం భక్తవత్సలాయ నమః
  • ఓం భవాయ నమః
  • ఓం శర్వాయ నమః
  • ఓం త్రిలోకేశాయ నమః
  • ఓం శీతికంఠాయ నమః
  • ఓం శివప్రియాయ నమః
  • ఓం ఉగ్రాయ నమః
  • ఓం కపాలినే నమః
  • ఓం కామారినే నమః
  • ఓం గంగాధరాయ నమః
  • ఓం లలాటాక్షాయ నమః
  • ఓం కాలకాలాయ నమః
  • ఓం కృపానిధయే నమః
  • ఓం భీమాయ నమః
  • ఓం పరశుహస్తాయ నమః
  • ఓం మృగపాణినే నమః
  • ఓం జటాధరాయ నమః
  • ఓం కైలాసవాసినే నమః
  • ఓం కవచినే నమః
  • ఓం కఠోరాయ నమః
  • ఓం త్రిపురాంతకాయ నమః
  • ఓం వృషాంకాయ నమః
  • ఓం వృషభారూఢాయ నమః
  • ఓం భస్మోద్ధూళితవిగ్రహాయ నమః
  • ఓం సామప్రియాయ నమః
  • ఓం సర్వమయాయ నమః
  • ఓం త్రయీమూర్తయే నమః
  • ఓం అనీశ్వరాయ నమః
  • ఓం సర్వజ్ఞాయ నమః
  • ఓం పరమాత్మనే నమః
  • ఓం సోమసూర్యాగ్నిలోచనాయ నమః
  • ఓం హవిషే నమః
  • ఓం యజ్ఞమయాయ నమః
  • ఓం సోమాయ నమః
  • ఓం పంచవక్త్రాయ నమః
  • ఓం సదాశివాయ నమః
  • ఓం విశ్వేశ్వరాయ నమః
  • ఓం వీరభద్రాయ నమః
  • ఓం గణనాథాయ నమః
  • ఓం ప్రజాపతయే నమః
  • ఓం హిరణ్యరేతాయ నమః
  • ఓం దుర్ధరాయ నమః
  • ఓం గిరీశాయ నమః
  • ఓం గిరిశాయ నమః
  • ఓం భుజంగభూషణాయ నమః
  • ఓం భర్గాయ నమః
  • ఓం గిరిధన్వినే నమః
  • ఓం గిరిప్రియాయ నమః
  • ఓం కృత్తివాసాయ నమః
  • ఓం పురారాతయే నమః
  • ఓం భగవతే నమః
  • ఓం ప్రమథాధిపాయ నమః
  • ఓం మృత్యుంజయాయ నమః
  • ఓం సూక్ష్మతనవే నమః
  • ఓం జగద్వ్యాపినే నమః
  • ఓం జగద్గురవే నమః
  • ఓం వ్యోమవేశాయ నమః
  • ఓం మహాసేనజనకాయ నమః
  • ఓం చారువిక్రమాయ నమః
  • ఓం రుద్రాయ నమః
  • ఓం భూతపతయే నమః
  • ఓం స్థాణవే నమః
  • ఓం అహిర్బుధ్నాయ నమః
  • ఓం దిగంబరాయ నమః
  • ఓం అష్టమూర్తయే నమః
  • ఓం అనేకాత్మాయ నమః
  • ఓం సాత్వికాయ నమః
  • ఓం శుద్ధవిగ్రహాయ నమః
  • ఓం శాశ్వతాయ నమః
  • ఓం ఖండపరశవే నమః
  • ఓం అజాయ నమః
  • ఓం పాశవిమోచకాయ నమః
  • ఓం మృడాయ నమః
  • ఓం పశుపతయే నమః
  • ఓం దేవాయ నమః
  • ఓం మహాదేవాయ నమః
  • ఓం అవ్యయాయ నమః
  • ఓం హరియే నమః
  • ఓం పూషదంతభేత్రే నమః
  • ఓం దక్షాధ్వరహరాయ నమః
  • ఓం హరాయ నమః
  • ఓం భగనేత్రభిదే నమః
  • ఓం అవ్యక్తాయ నమః
  • ఓం సహస్రాక్షాయ నమః
  • ఓం సహస్రపాదవే నమః
  • ఓం అపవర్గ ప్రదాయ నమః
  • ఓం అనంతాయ నమః
  • ఓం తారకాయ నమః
  • ఓం పరమేశ్వరాయ నమః

ఓం శ్రీ కేదారేశ్వర వ్రతకల్పము లోని ఈ అష్టోత్తర శతనామ పూజాం సమర్పయామి.

పిమ్మట ఇరవై ఒక్క ముళ్లతో తయారుచేసుకున్న తోరమును తీసుకొని స్వామి వద్ద ఉంచి ఈ క్రింది మంత్రములు చదువుచూ పూజించవలెను.

అథ సూత్రగ్రంథి పూజా

  • ఓం శివాయ నమః ప్రథమ గ్రంథిం పూజయామి
  • ఓం శాంతాయ నమః ద్వితీయ గ్రంథిం పూజయామి
  • ఓం మహాదేవాయ నమః తృతీయ గ్రంథిం పూజయామి
  • ఓం వృషభధ్వజాయ నమః చతుర్థ గ్రంథిం పూజయామి
  • ఓం గౌరీశాయ నమః పంచమ గ్రంథిం పూజయామి
  • ఓం రుద్రాయ నమః షష్ఠమ గ్రంథిం పూజయామి
  • ఓం పశుపతయే నమః సప్తమ గ్రంథిం పూజయామి
  • ఓం భీమాయ నమః అష్టమ గ్రంథిం పూజయామి
  • ఓం త్ర్యంబకాయ నమః నవమ గ్రంథిం పూజయామి
  • ఓం నీలలోహితాయ నమః దశమ గ్రంథిం పూజయామి
  • ఓం హరాయ నమః ఏకాదశ గ్రంథిం పూజయామి
  • ఓం స్మరహరాయ నమః ద్వాదశ గ్రంథిం పూజయామి
  • ఓం భర్గాయ నమః త్రయోదశ గ్రంథిం పూజయామి
  • ఓం స్వయంభువే నమః చతుర్దశ గ్రంథిం పూజయామి
  • ఓం శర్వాయ నమః పంచదశ గ్రంథిం పూజయామి
  • ఓం సదాశివాయ నమః షోడశ గ్రంథిం పూజయామి
  • ఓం ఈశ్వరాయ నమః సప్తదశ గ్రంథిం పూజయామి
  • ఓం ఉగ్రాయ నమః అష్టాదశ గ్రంథిం పూజయామి
  • ఓం శ్రీకంఠాయ నమః ఏకోనవింశతి గ్రంథిం పూజయామి
  • ఓం నీలకంఠాయ నమః వింశతి గ్రంథిం పూజయామి
  • ఓం కేదారేశ్వరాయ నమః ఏకవింశతి గ్రంథిం పూజయామి

శ్రీ కేదారేశ్వరాయ నమః నానావిధ పరిమళ పుష్పాణి సమర్పయామి.

ధూపం

పిదప అగరువత్తిని వెలిగించి ధూపం సమర్పించాలి. శ్లోకం: దశాంగ ధూపముఖ్యంచ హ్యంగార వినివేశితం, ధూపం సుగంధై రుత్పన్నం త్వాం ప్రీణయతు శంకర

ఓం శ్రీ కేదారేశ్వరాయ నమః ధూప మాఘ్రాపయామి. ధూపం సమర్పయామి. అంటూ ఎడమచేత్తో గంట వాయిస్తూ కుడి చేత్తో అగరుబత్తిని తిప్పుతూ పొగను స్వామికి చూపవలెను.

దీపం

శ్లోకం: యోగినాం హృదయే నైవ జ్ఞానదీపాం కురోహ్యసి, బాహ్యదీపో మయాదత్తః గృహ్యతాం భక్తగౌరవాత్

ఓం శ్రీ కేదారేశ్వరాయ నమః సాక్షాత్ దీపం దర్శయామి అని మొదట్లో చెప్పిన విధంగా దీపారాధనలో ఉన్న అదనపు వత్తులలో ఒకదానిని తీసుకొని హారతి వెలిగించే దాంట్లో వేసి వెలిగించి గంట మ్రోగిస్తూ ఆ దీపం స్వామికి చూపుతూ పై శ్లోకమును చదువవలెను.

నైవేద్యం

శ్లోకం: త్రైలోక్యమపి నైవేద్యం న తే తృప్తిస్తథా బహిః నైవేద్యం భక్తవాతల్యాత్ గృహ్యతాం త్రయంబకంత్వయా.

ఒక బెల్లం ముక్క, పళ్ళు, కొబ్బరికాయ మొదలగునవి స్వామి వద్ద ఉంచి, దానిపై పువ్వుతో నీళ్లు చల్లుతూ ఎడమచేత్తో గంట వాయిస్తూ ఓం శ్రీ మహాగణాధిపతయే నమః గుడ శకల నైవేద్యం సమర్పయామి. ఓం ప్రాణాయ స్వాహా, ఓం అపానాయ స్వాహా, ఓం వ్యానాయ స్వాహా, ఓం ఉదానాయ స్వాహా, ఓం సమానాయ స్వాహా, ఓం శ్రీమహాగణాధిపతయే నమః అంటూ ఆరుమార్లు చేతిలోని ఉద్ధరిణెతో స్వామికి నివేదనం చూపించాలి.

పిదప ఓం శ్రీ కేదారేశ్వరాయ నమః నైవేద్యానంతరం ‘హస్తా ప్రక్షాళయామి’ అని ఉద్ధరిణెతో పంచపాత్రలోని నీరు ముందు చెప్పిన అర్థ్యపాత్ర (పంచపాత్ర కాకుండా విడిగా చెంబులో పెట్టుకొనే నీళ్ల పాత్ర) లో వదలాలి. తరువాత ‘పాదౌ ప్రక్షాళయామి’ అని మరోసారి నీరు అర్థ్య పాత్రలో ఉద్ధరిణెతో వదలాలి. ‘పునః శుద్ధాచమనీయం సమర్పయామి’ అని ఇంకొక పర్యాయం నీరు వదలాలి.

తాంబూలం

తదనంతరం తాంబూలం సమర్పించాలి. శ్లోకం: నిత్యానంద స్వరూపస్త్వం యోగిహృత్కమలే స్థితః, గృహాణభక్త్వా మద్దత్తం తాంబూలం ప్రతిగృహ్యతాం.

అని చెబుతూ మూడు తమలపాకులు, రెండు పోకచెక్కలు వేసి స్వామివద్ద ఉంచాలి. తాంబూలం వేసుకున్నాక నోరు కడుక్కొనుటకు నీరు ఇస్తున్నామని తలుస్తూ, ‘తాంబూల చరవణానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి’ అంటూ ఉద్ధరిణెతో నీరు అర్థ్యపాత్రలో వదలాలి.

పునరర్థ్యం

పిమ్మట కర్పూరం వెలిగించి పునరర్థ్యం ఇవ్వాలి. శ్లోకం: అర్థ్యం గృహాణ భగవన్ భక్త్యాదత్తం మహేశ్వర, ప్రయచ్ఛ మే మనస్తుష్టిం భక్తానా మిష్టదాయకం.

ఓం శ్రీ కేదారేశ్వరాయ నమః పునరర్యం సమర్పయామి. మరల దేవుడు చేతులు కడుగుకొనుటకై నీళ్ళిస్తున్నామని మనసున తలుస్తూ, ఉద్ధరిణెతో నీరు వేరొక గిన్నెలో వదలవలయును.

నీరాజనం

శ్లోకం: కర్పూరం చంద్రసంకాశం జ్యోతి సూర్యమివోదితం భక్త్యా దాస్యామి కర్పూర నీరాజన మిదం శివ.

ఓం శ్రీ కేదారేశ్వరాయ నమః నీరాజనం సమర్పయామి అని కర్పూర బిళ్ళలు హారతి కుందిలో వేసి ముందుగా దీపారాధనకు వెలిగించిన దీపంతో వెలిగించి, మూడుమార్లు త్రిప్పుచూ, చిన్నగా గంట వాయించవలెను. అనంతరం మళ్లీ పువ్వుతో నీరు హారతి కుంది చివర వదులుతూ ‘కర్పూర నీరాజనానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి’ అని చెప్పి నీరాజనం స్వామివారికి చూపించి తరువాత ఇంటిలోని వారందరూ హారతిని కళ్ళకు అద్దుకోవాలి.

ప్రదక్షిణం

తరువాత అక్షతలు, పువ్వులు, చిల్లర డబ్బులు చేతితో పట్టుకొని ప్రదక్షిణం చేయాలి. శ్లోకం: భూతేశ భువనాధీశ సర్వదేవాది పూజిత, ప్రదక్షిణం కరోమి త్వాం వ్రతం మే సఫలం కురు.

ఓం శ్రీ కేదారేశ్వరాయ నమః ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. శ్రీ స్వామికి చేతిలో అక్షతలు, పువ్వులు తీసుకొని లేచి నిలబడి మూడు సార్లు ఆత్మప్రదక్షిణ చేసి (అనగా తమలో తాము చుట్టూ తిరిగి) పిమ్మట సాష్టాంగ నమస్కారం చేసి (మగవారు పూర్తిగా పడుకుని తలను నేలకు ఆన్చి, ఆడువారు మోకాళ్లపై పడుకుని కుడికాలు ఎడమకాలు పై వేసి) తరువాత స్వామిపై చేతిలోనున్న అక్షతలు, పువ్వులు చల్లి మరల తమ స్థానమున ఆసీనులై నమస్కరించుచూ …

నమస్కారాన్

శ్లోకం: హరః శంభో మహాదేవ విశ్వేశా మర వల్లభ, శివ శంకర సర్వాత్మన్ నీలకంఠ నమోస్తుతే.

ఓం శ్రీ కేదారేశ్వరాయ నమః నమస్కారాన్ సమర్పయామి అని మనస్ఫూర్తిగా స్వామికి నమస్కరించవలెను.

ప్రార్థన

శ్లోకం: అభీష్ట సిద్ధిం కరు మే శివావ్యయ మహేశ్వర, భక్తానాం వరదానార్థం మూర్తీకృత కళేబర

ఓం శ్రీ కేదారేశ్వరాయ నమః ప్రార్థయామి అని స్వామిని ప్రార్థించవలెను.

సూత్రగ్రహణం

శ్లోకం: కేదార దేవదేవేశ భగవ న్నంబికాపతే, ఏకవింశ ద్ధినేతస్మిన్ సూత్రం గృష్ణమ్యహం ప్రభో.

ఓం శ్రీ కేదారేశ్వరాయ నమః సూత్రగ్రహణం కరిష్యే అని స్వామివద్ద ఉంచి పూజించిన తోరములను చేతిలోనికి తీసుకొని పై శ్లోకమును చదువుకొనవలెను.

తోరబంధన మంత్రం

శ్లోకం: ఆయుశ్చ విద్యాంచ తథా సుఖం చ సౌభాగ్యవృద్ధిం కురు దేవదేవ సంసార ఘోరాంబునిధౌ నిమగ్నం మాం రక్ష కేదార నమో నమస్తే.

ఓం శ్రీ కేదారేశ్వరాయ నమః తోరబంధనం కరిష్యే అని స్వామిని స్మరించి తోరమును దక్షిణ హస్తమున (కుడిచేతికి) కట్టుకొనవలెను.

వాయనదానం

శ్లోకం: కేదారః ప్రతిగృష్ణతు కేదారో వైదదాతి చ, కేదారస్తారకోభాభ్యాం కేదారాయ నమోనమః

ఓం శ్రీ కేదారేశ్వరాయ నమః వాయనదానం కరిష్యామి అని స్వామికి నైవేద్యము చేసిన పదార్థములతోపాటు దక్షిణ తాంబూలములను బ్రాహ్మణునికి వాయనమివ్వవలెను.

ప్రతిమాదానం

శ్లోకం: కేదారః ప్రతిమాం యస్మాద్రాజ్యం సౌభాగ్యవర్థినీ, తస్మాదస్యాః ప్రదానేన మాస్తు శ్రీరచంచలా.

ఓం శ్రీ కేదారేశ్వరాయ నమః ప్రతిమాదానం కరిష్యామి అని పూజకు తీసుకొన్న స్వామియొక్క ప్రతిమను (బొమ్మ) దక్షిణ తాంబూలములతో బ్రాహ్మణునకు దానమీయవలెను.

ఇతి పూజావిధానం సంపూర్ణమ్.

కేదారేశ్వర వ్రతకథా ప్రారంభము

సూతపౌరాణికుండు శౌనకుడు మొదలగు మహర్షులను చూచి ఈవిధంగా పలికెను.

ఓ ఋషి పుంగవులారా! మానవులకు సర్వసౌభాగ్యములను కలుగచేయునదియు, పార్వతీదేవిచే సాంబశివుని శరీరార్థము (శరీరములో సగము) పొందినదియునగు కేదారేశ్వర వ్రతము అను ఒక వ్రతము కలదు. ఆ వ్రతవిధానమును వివరించెదను వినండి. దీనిని బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు అందరును ఆచరించవచ్చును. ఈ వ్రతమును ఇరువదియొక్క మారులు (ఇరవైయొక్క సార్లు) ఆచరించువారు సకల సంపదలనుభవించి పిదప శివసాయుజ్యము (కైలాస ప్రాప్తి) పొందుదురు.

ఓ మునిశ్రేష్ఠులారా! ఈ వ్రతమాహాత్మ్యమును (వ్రతము యొక్క గొప్పతనమును) వివరించెదను వినుము. భూలోకమునందు ఈశాన్యభాగమున మెఱుపు గుంపులతో కూడియున్న శరత్కాల మేఘములను పోలిన నిఖిలమణి విచిత్రంబైన శిఖరములచేతను, అనేక రకములైన పువ్వుల తీగలతోను, అనేక రకములైన పుష్ప ఫలాదులచేతను, నానావిధములైన పక్షులచేతను మరియు అనేకములైన కొండకాలువల చేతను భాసిల్లునట్టి (ప్రకాశించునట్టి) ఉద్యానవనములచేత నిఖిల కల్యాణప్రదంబై జనులందరిచేత కైలాసమని పిలువబడిన ఒక పర్వతశ్రేష్ఠము కలదు.

అంత షడ్గుణైశ్వర్య సంపన్నులును, మహనీయులగు యోగులచేతను, సిద్ధ గంధర్వ కిన్నర కింపురుషాదులచేతను సేవింపబడి, మనోహరమైయున్న ఆ పర్వత శిఖరమునందు జగత్క ర్త యైన పరమేశ్వరుడు ప్రమథగణములచే పరివేష్టించబడి (ప్రమథగణములందరు కొలువైయుండగా) భవానీ సమేతుండై (పార్వతితో కలిసి) దేవమునిబృందములచేత నమస్కరింపబడుచు ప్రసన్నుడై కూర్చుండి ఒక సమయమున చతుర్ముఖాది దేవతల కందరికి దర్శనమిచ్చెను.

అంత సూర్యుడు, అగ్ని, వాయుదేవుడు, నక్షత్రములతో కూడిన చంద్రుడును మరియు ఇంద్రుడు మొదలగు దేవతలు, వసిష్ఠుడు మొదలగు ఋషులు, రంభ మొదలగు అప్సరసలు, గణపతియు, సేనానియు, నంది, భృంగి మొదలగు ప్రమథగణములు కొలుచుచుండగా ఆ అద్భుతమైన సభయందు నారదుడు మొదలగు దేవగాయకులు స్వామి అనుజ్ఞతో గానము చేశారు. అటువంటి అందమైన శ్రావ్యమైన గానము చేయుచుండగా మేనక మొదలయినవారు నృత్యము చేసిరి. అప్పుడు అందరిలో మిక్కిలి సొగసుతో కూడిన రంభ అందరి మనసులు సంతోషపడునట్లుగా నాట్యము చేసెను. అప్పుడు భృంగిరిటి అను భక్తుడు ఆ స్వామి సన్నిధియందు నాట్యము చేయగా సకల దేవతలకు మిక్కిలి హాస్యము జనించెను. అటువంటి ఆశ్చర్యంబగు హాసములవలన పర్వతగుహలు నిండునట్లు కలకలధ్వని కలిగెను.

కేదారేశ్వర వ్రతకల్పము

అప్పుడు శంకరుడు ఆ భృంగిరిటి నాట్యము చూచి ఆనందము చెంది ఆ భక్తుని అనుగ్రహించెను. అంతట భృంగిరిటి శివానుగ్రహము కలుగుటచేత మిక్కిలి ప్రీతి చెంది పార్వతిని వదిలి పరమేశ్వరునకు మాత్రము ప్రదక్షిణమొనర్చెను. ఇది చూచి పార్వతి “ఓ స్వామీ! ఈ భృంగిరిటి నన్ను వదలి మీకు మాత్రమే ప్రదక్షిణము చేయుటకు కారణమేమి” అని ప్రశ్నించగా, ఈశ్వరుడు “ఓ దేవీ! నీవలన పరమార్థ విదులగు యోగులకు ప్రయోజనము లేదని ఆతడు నాకు మాత్రమే నమస్కరించెను” అని చెప్పెను. ఆ మాటలకు పార్వతీదేవి మిగుల కోపించి భర్తయందున్న తన శక్తిని ఆకర్షించగా ఆ స్వామి శక్తిలేని కేవలం అర్థశరీరము కలవాడయ్యెను. అంత ఆ దేవి కూడ శక్తి లేనిదై వికటమైన రూపము కలదిగా మారెను.

పిదప ఆ దేవి కోపించి దేవతలచేత ఊరడింపబడినదైనను కైలాసమును వదలి తపస్సు చేసుకొనుటకు అనేక రకములైన మృగములచే సేవింపబడునది, అనేక రకముల చెట్లు, మొక్కలతోను, ఋషి శ్రేష్ఠులతోను కూడిన గౌతమాశ్రమమును ప్రవేశించెను. అంత ఆ గౌతముడు ఆశ్రమమున ప్రవేశించిన తామర రేకులవంటి కన్నులు కలిగి అలంకృతురాలై యున్న మహేశ్వరిని కనుగొని “పూజ్యురాలైన ఓ భగవతీ! నీవు ఇచ్చటకు వచ్చుటకు కారణమేమి?” అని అడుగగా, ఆ దేవి గౌతముని చూచి తన విషాదమునకు కారణమును చెప్పి నమస్కరించి, “ఓ మునీశ్వరా! ఏ వ్రతము యోగులకు సమ్మతమైనదో, ఏ వ్రతము చేత శంకరుని దేహములో అర్థము తిరిగి తనకు ప్రాప్తించునో అటువంటి వ్రతమును నాకు ఉపదేశింపుము” అని అడుగగా, ఆ మహర్షి సకల శాస్త్ర పురాణాలలోను ఇష్టముగా ఆచరించునటువంటిదైన కేదారేశ్వర వ్రతమును ఆచరింపుమని ఉపదేశించగా, ఆ దేవి ఆ వ్రతమును ఆచరించుటెట్లో సెలవీయవలసినదిగా కోరెను.

“అమ్మా! భాద్రపద శుక్లాష్టమియందు శుద్ధమనస్కురాలవై మంగళకరములగు ఏకవింశతి తంతువులచేత (21 వరుసల దారమును) పసుపు రాసి తోరముగా తయారుచేసుకొని హస్తమునందు ధరించి, పూజించి, ఆ దినమందు ఉపవాసమొనరించి, మరునాడు భోజనము చేయించి, అది మొదలు అమావాస్య వరకు ఈ వ్రతమునిట్లు చేయుచు ప్రతిదినము శ్రీ కేదారదేవుని ఆరాధింపవలయును. ఇంటియందు శుభ్రమైన ఒక ప్రదేశమున ధాన్యరాశిలో పూర్ణకుంభమును ఉంచి, ఇరువదియొక్క సూత్రముల (దారముల) చేత చుట్టి, పట్టువస్త్రములచే కప్పి, నవరత్నములుగాని, శక్తికొలది బంగారంకాని ఉంచి గంధపుష్పాక్షతలచే పూజించి ఇరువదియొక్కమంది బ్రాహ్మణులను పిలిపించి పాదప్రక్షాళనాది కృత్యములు ఆచరించి (కాళ్లు చేతులు కడిగించి) కూర్చొనబెట్టి అచ్చట ఆ కేదారదేవుని వుంచి, చందన (గంధం), ధూప, కుంకుమ, అన్నిరకాల పువ్వులతో పూజించి, తాంబూల వస్త్రములుంచి, 21 రకముల పిండివంటలతో, పళ్లు, కొబ్బరికాయ మొదలగు వాటితో నైవేద్యం పెట్టి, చక్కగా స్తోత్రము చేసి, బ్రాహ్మణులకు యధాశక్తి దక్షిణలిచ్చి ఈశ్వరునికి మనస్సును సంతుష్టి చేసినయెడల నీవు కోరిన వరములియ్యగలడు” అని చెప్పగా ఆ కాత్యాయని అటులే ఆచరించెను.

అంత పరమశివుడు సంతుష్టుడై దేవగణములతో అచ్చటికి వచ్చి “నా శరీరములో అర్థభాగము నీకు ఇచ్చెదను” అని ఇవ్వగా, పార్వతీదేవి మిక్కిలి సంతోషించి “ఈ వ్రతము ఆచరించువారలకు సకల అభీష్టములు (అన్ని కోరికలు) తీరునట్లు అనుగ్రహించినచో అందరును ఈ వ్రతమును ఆచరింతురు” అని శంకరునికి చెప్పగా, శివుడు “అటులే యగుగాక” అని అంగీకరించి అదృశ్యమయ్యెను.

కొంతకాలమునకు శివభక్తి కల చిత్రాంగదుడను గంధర్వుడు నందికేశ్వరుని వలన ఆ వ్రత విధానమును తెలుసుకొని మనుష్యలోకమునకు పోయి వారికి చెప్పవలెనను కోరికతో ఉజ్జయినీ పట్టణమును చేరి వజ్రదంతుడను రాజునకు ఆ వ్రతమును ఉపదేశించగా అతడు ఆ వ్రతము యథావిధిగా ఆచరించి సార్వభౌముడయ్యెను.

మరికొంత కాలమునకు ఆ పట్టణమున ఉన్న వైశ్యునకు పుణ్యవతియు, భాగ్యవతియు అను ఇద్దరు కుమార్తెలు కలిగిరి. వారిద్దరును తండ్రి దగ్గరకు పోయి కేదార వ్రతమాచరించుటకు ఆనతీయుమని అడుగగా అతడు, “అమ్మా! నేను మిగుల దరిద్రుడను, మీరు ఆ ఆలోచనను మానుడు” అనగా, “ఓ తండ్రీ! నీ అనుజ్ఞయే (అంగీకారమే) మాకు పరమ ధనము కావున ఆనతీయుము” అని అచ్చటనుండి ఒక వటవృక్షము (మర్రిచెట్టు) వద్ద కూర్చుండి తోరము కట్టుకొని యథావిధిగా పూజింపగా, వారి భక్తికి మెచ్చి ఈశ్వరుడు పూజకు కావలసిన సామగ్రి అచ్చట వారికి సమకూరునట్లుగా చేసెను. అంతట వారలు చక్కగా వ్రతము చేసికొనుటవలన ఆ మహాదేవుండు సంతుష్టుడై (గొప్ప సంతృప్తిని పొంది) ఆ కన్యలకు ఆయురారోగ్య ఐశ్వర్యములు, దివ్య రూపములు ఇచ్చి అంతర్థానమయ్యెను.

ఆ వ్రతముయొక్క మాహాత్మ్యము వలన వైశ్యుని కుమార్తెలను ఉజ్జయినీ పట్టణమును ఏలుచున్న (పాలించుచున్న) రాజు పుణ్యవతియను కన్యను, చోళ భూపాలుడు భాగ్యవతియను కన్యను పెండ్లి చేసికొనిరి. అందువలన ఆ వైశ్యుడు ధనసమృద్ధి కలిగి సామ్రాజ్య సంపదలను, పుత్రులను పొంది సుఖముగా వుండిరి.

కొన్ని రోజుల తరువాత రెండవదైన భాగ్యవతి ఐశ్వర్య మదమోహితురాలై (డబ్బుమీది ప్రేమతో) కొంతకాలమునకు ఆ వ్రతమును విడిచెను. అందువలన దరిద్రురాలై పుత్రునితోడను, భర్తతోడను అడవిలో తిరుగుతూ ఒక బోయవాని యిల్లు చేరెను. అచ్చట తన కుమారునితో “నా అక్క పుణ్యవతిని ఉజ్జయినీ రాజు వివాహమాడి యున్నాడు. నీవు అక్కడకు పోయి మన సంగతి తెలిపి బ్రతుకు తెరువునకై తగిన ధనము తీసికొని త్వరగా రమ్ము” అనగా, అతడు ఆ పట్టణమునకు పోయి పెద్ద తల్లితో తమ కష్టమును తెలుపగా ఆ పుణ్యవతి అతని చేతికి ఎక్కువ డబ్బును ఇచ్చెను. అంత అతడు ఆ ధనమును తీసికొని వచ్చుచుండగా, మార్గంలో దేవుని మహిమచే ఆ డబ్బు దొంగిలించబడగా అతడు మరల పెదతల్లి దగ్రకు వెళ్లి జరిగిన సంగతిని తెలుపగా ఆమె మరికొంత ధనమును ఇచ్చెను. ఆ ధనము కూడా దొంగిలించబడగా దిక్కుతోచక నిలబడియున్న ఆ కుమారునితో ఈశ్వరుడు అదృశ్య రూపుడై “ఓ చిన్నవాడా! వ్రత భ్రష్టులకు (వ్రతమునాచరించనివారికి) ఈ ధనము చెందదు” అని చెప్పగా అతడు మరల పెదతల్లి వద్దకు పోయి జరిగినది తెలుపగా ఆమె ఆలోచించి ఆ కుమారునిచే కేదారేశ్వర వ్రతమును ఆచరింపజేసి, తన చెల్లెలు కూడా ఆ వ్రతమును ఆచరించునట్లు చెప్పవలసినదిగా చెప్పుమని అతనికి ధనమును ఇచ్చి పంపెను. అతడు బయలుదేరి వెడుతుండగా అనుకోని విధముగా ముందు పోయిన ధనమంతయు కూడ దొరికినందున అతి సంతోషముతో అతడు కాంచీ పట్టణము ప్రవేశించుచుండగా చతురంగ బలములతో అతని తండ్రి ఎదురువచ్చి ఆ బాలునీ, అతని తల్లినీ కూడా వెంటబెట్టుకొని తన పట్టణమునకు వెళ్ళెను. అంతట ఆ రాజకుమారుడు తల్లిదండ్రులతో సుఖముగా ఉండెను. పిమ్మట తల్లియగు భాగ్యవతియు, తండ్రియగు చోళరాజును అది మొదలు ఈ వ్రతమును ఆచరించుచు సకల సంపదలనుభవించుచు సుఖముగానుండిరి.

వ్రత సమాప్తి

ఏతత్ఫలం శ్రీ ….రణమస్తు అంటూ అక్షతలు నీటితోపాటు అరవేణంలో వదలవలెను. పిమ్మట ‘ శ్రీ .. ప్రసాదం శిరసాగృష్ణమి ‘ అనుకొని స్వామివద్ద అక్షతలు తీసుకొని తమ తమ తలలపై వేసుకొనవలెను. ఆ పిదప పసుపు గణపతి ఉన్న పళ్లెము నొకసారి పైకి ఎత్తి తిరిగి క్రింద ఉంచి పళ్లెములో ఉన్న పసుపు గణపతిని తీసి దేవుని పీఠముపై నుంచవలెను. దీనిని ఉద్వాసన చెప్పటం అంటారు. నమః యధాస్థానం ప్రవేశయామి. శోభనార్థం పునరాగమనాయచ అని ఉద్వాసన పలుకుతారు.

శ్లో|| యస్య స్మృత్యాచ నోమోక్త్యాతపః పూజాక్రియాదిషు. న్యూనం సంపూర్ణతాం యాతి- సద్యో వందేతమచ్యుతం మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్ధన, యతూ జితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే, అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాయా చ భగవాన్సర్వాత్మకః శ్రీ దేవతా స్సుతోవరదోభవతు, శ్రీ. ప్రసాదం శిరసాగృష్ణమి.

  • Related Posts

    Dhanurmasam 2025 Start Date | ధనుర్మాసం | 16-12-2025

    Dhanurmasam 2025 Start Date ధనుర్మాసం అనేది కేవలం క్యాలెండర్లో మారే ఒక సాధారణ మాసం కాదు. ఇది మన జీవితంలో నెలకొన్న గందరగోళం, అశాంతి, నిరాశ మరియు భయాలను తొలగించి, మనసుకు సరైన దారి చూపే ఒక దివ్యమైన కాలం.…

    భక్తి వాహిని

    భక్తి వాహిని
    Skandotpatti -స్కందోత్పత్తి|షష్టి రోజు పఠించాల్సిన శ్లోకాలు

    Skandotpatti తప్యమానే తపో దేవే దేవాస్సర్షిగణాః పురాసేనాపతిమ్ అభీప్సంతః పితామహముపాగమన్ తతో బ్రువన్ సురాస్సర్వే భగవంతం పితామహమ్ప్రణిపత్య సురాస్సర్వే సేంద్రాస్సాగ్ని పురోగమాః యో నస్సేనాపతిర్దేవ దత్తో భాగవతా పురాతపః పరమమాస్థాయ తప్యతే స్మ సహోమయా యదత్రానంతరం కార్యం లోకానాం హితకామ్యయాసంవిధత్స్వ విధానజ్ఞ…

    భక్తి వాహిని

    భక్తి వాహిని