Karthika Puranam Telugu
బృంద శాప వృత్తాంతము
అప్పుడు ఆ ముని కరుణాకరమైన దృష్టులను ప్రసరిస్తూ ఆకాశం వంక చూశాడు. వెంటనే ఇద్దరు వానరులు వచ్చారు. ముని వారికి కనుబొమలతోనే కర్తవ్యాన్ని ఆజ్ఞాపించాడు. ఆ రెండు కోతులూ మళ్లా ఆకాశానికి ఎగిరి – అతి స్వల్ప కాలంలోనే – తెగవేయబడిన జలంధరుడి చేతులనూ, మొండెమునూ, తలనూ తెచ్చి వారి ముందుంచాయి. తన భర్త ఖండితావయవాలను చూసి బృంద ఘొల్లుమని ఏడ్చింది. అక్కడే వున్న ఋషి పాదాల పై పడి – తన భర్తను బ్రతికించవలసిందిగా ప్రార్థించింది.
అందుకా ముని నవ్వుతూ ‘శివోపహతులైన వాళ్లని బ్రతికించడం ఎవ్వరికీ సాధ్యం కాదు, అయినా నాకు నీ పట్ల ఏర్పడిన అవ్యాజమైన కరుణ వలన తప్పక బ్రతికిస్తాను’ అంటూనే అంతర్హితుడయ్యాడు. అతనలా మాయమైందే తడవుగా జలంధరుడి అవయవాలన్నీ అతుక్కుని, అతడు సజీవుడయ్యాడు. ఖిన్నురాలై వున్న బృందను కౌగిలించుకుని, ఆమె ముఖాన్ని పదే పదే ముద్దాడాడు. పునర్జీవితుడైన భర్తపట్ల అనురాగంతో బృంద పులకరించి పోయింది. వారిద్దరూ ఆ వనంలోనే వివిధ రకాలుగా సురత క్రీడలలో మునిగిపోయారు.
మరణించిన మనోహరుడు మరలా బ్రతికి వచ్చాడనే ఆనందంలో — బృంద – వెంటనే గుర్తు పట్టలేక పోయినా – ఒకానొక సురత సుఖానంతరం ఆమె అతనిని విష్ణువుగా గుర్తించి వేసింది. మగని వేషంలో వచ్చి తన పాతివ్రత్యాన్ని మంటగలిపిన ఆ మాధవునిపై విపరీతంగా ఆగ్రహించింది.
‘ఓ విష్ణుమూర్తీ! పర స్త్రీగామివై చరించిన నీ ప్రవర్తన నిందింపబడును గాక! నీ మాయతో ఇతః పూర్వం కల్పించిన వానరులిద్దరూ రాక్షసులై జన్మించి నీ భార్యనే హరించెదరుగాక! నువ్వు భార్యా వియోగ దుఃఖితుడవై, నీ శిష్యుడైన ఆదిశేషునితో సహితుడవై అడవులలో, పడి తిరుగుతూ – వానర సహాయమే గతియైన వాడివి ఆగురువుగాక!’ అని శపించి, తన నభిలషిస్తూ చేరువవుతూన్న శ్రీహరి నుండి తప్పుకుని, అగ్నిని కల్పించుకుని, అందులో పడి బూడిదై పోయింది.
అందుకు చింతించిన విష్ణువు మాటి మాటికీ ఆ బృందనే స్మరించసాగాడు. నిలువునా కాలిపోయిన ఆమె యొక్క చితాభస్మాన్ని తన తనువంతా పూసుకుని విలపింపసాగాడు. సిద్ధులు, ఋషులు – ఎందరెన్ని విధాల చెప్పినా విష్ణువు శాంతిని పొందలేకపోయాడు. అశాంతితో అల్లాడిపోసాగాడు.
ఇరువది మూడవ (బహుళ అష్టమి) రోజు పారాయణము సమాప్తము