Gajendra Moksham Telugu
ఇట్లు కరిమకరంబులు రెండును నొండొండ సముద్దంఢదండం
బులై తలపడి నిఖిలలోకాలోకనభీకరంబులై యన్యోన్య విజయ
శ్రీవశీకరంబులై సంక్షోభిత కమలాకరంబులై హరి హరియును
గిరి గిరియునుం దాఁకి పిఱుతివియక పెనంగు తెఱంగున
నీరాటంబయిన పోరాటంబునం బట్టుచు వెలికి లోనికిం దిగుచుచుఁ
గొలంకు గలంకం బొందఁ గడువడి నిట్టట్టుఁ బడి తడఁబడి
బుడబుడానుకారంబులై బుగులు బుగుల్లను చప్పుళ్లతో
నురువులు గట్టుచు జలంబు లుప్పరం గయం జప్పరించుచుఁ
తప్పక వదనగహ్వరంబుల నప్పళించుచు నిశితనితాంత దురంత
దంత కుంతంబుల నింతింతలు దునియలయి నెప్పళంబునం
బునుకచిప్పలు గుదుళ్లు దప్పి రక్తంబులు గ్రమ్ముదేర హుమ్మని
యొక్కుమ్మడిం జిమ్ముచు నితరేతరసమాకర్షణంబులం గదలకు
పదంబుల మొదలిపట్టు వదలక కుదురై వర్తించుచుఁ
పరిభ్రమణవేగంబున జలంబులం తిరుగుచు మకరకమర
కర్మట గండకమండూకాది సలిల నిలయంబుల ప్రాణంబుల
క్షీణంబులుగా నొండొంటిం దాఁకు రభసంబున నిక్కలువడ
మ్రక్కుంద్రొక్కుచు మెండుచెడి బెండువడి నాఁచుగుల్ల చిప్ప
తండం బులఁ బరస్పరతాడనంబు లకు నడ్డంబుగా నొడ్డుచు
నోలమాసగొనక గెలుపుఁ దలంపులు బెట్టిదంబులై రెట్టింప
నహోరాత్రంబులంబోలెఁ గ్రమక్రమ విజృంభమాణంబులై
బహుకాలకలహవిహారంబులై నిర్గతని ద్రాహారంబులై యవక్ర
పరామఘోరంబులై పోరుచున్న సమయంబున.
అర్థాలు
పదం | అర్థం | పదం | అర్థం |
---|---|---|---|
ఇట్లు | ఈ విధంగా | కరిమకరంబులు రెండును | ఏనుగు, మొసలి కూడ |
ఒండు ఒండు | క్రమక్రమంగా | సముద్ధండ | మిక్కిలి భరించలేని |
దండములై | బాధతో కూడినవై | తలపడి | పోరాడి |
నిఖిలలోక | సమస్త లోకములోని వారికి | ఆలోకన | చూడడానికి |
భీకరంబులై | భయమును కలిగించేవిగా ఉండి | అన్యోన్య | ఎవరికి వారు |
విజయశ్రీ | గెలుపు అనే లక్ష్మిని | వశీకరంబులై | తమ అధీనము చేసుకొనుచున్నవై |
సంక్షోభిత | బాధపెట్టుచున్న | కమలాకరంబులై | తామరలకు నిలయమైన కొలనుగలవై |
హరిహరియు | సింహముతో సింహమును | గిరిగిరియున్ | కొండతో కొండయును |
తాకి | ఎదురుపోరుతూ | పిఱుతివియక | వెనుకడుగువేయక |
పెనంగు తెరంగునన్ | పెనుగులాడే విధానంలో | నీరాటంబయి | నీటియందు జరుగుచున్నటువంటి |
పోరాటంబునన్ | పోట్లాటచే | పట్టుచున్ | ఒక దానిని మరొకటి పట్టుకొనుచు |
వెలికిన్ | బయటికిని | లోనికిన్ | లోపలికిని |
తిగుచున్ | ఈడ్చుకుపోతూ | కొలను | తాము పోట్లాడుకొంటున్న తామర కొలను |
కలంకంబు + అందన్ | దోషభూయిష్ఠమగునట్లు | కడువడిన్ | మిక్కిలి వేగముతో |
ఇట్టు + అట్టుపడి | ఈ వైపుకి దొర్లి పడుతూ | తడబడక | తత్తరపాటును పొందక |
బుడ + బుడ + అనుకారంబులై | బుడ బుడమనే శబ్దానికి వలె | బుగుల్ బుగుల్ + అను చప్పుళ్ళతోన్ | బుగుల్ బుగుల్ అనే శబ్దములతో |
నురువులు గట్టుచున్ | నురుగులు వచ్చేవిధంగా చేస్తూ | జలంబులు | నీళ్ళు |
ఉప్పరం | ఆకాశమునకు | చప్పుడించుచున్ | చప్పుడు చేస్తూ |
వదన గహ్వరంబులన్ | నోటి రంధ్రములతో | అప్పశించుచున్ | పట్టుకొనుచు |
నిశిత | మిక్కిలి వాడియైన | నితాంత | మిక్కిలి |
దురంత | గెలుపు సాధించుటకు వీలుకాని | దంతకుంతంబులన్ | దంతములనే బల్లెముల చేత |
ఇంతింతలు | చిన్న చిన్నవైన | తునియలు + ఐ | ముక్కలై |
నెప్పళంబునన్ | వేగముతో | పునకచిప్పలు | తలలోని పుర్రెలు |
కుదుళ్ళు తప్పి | తమ స్థానములను వదలి | రక్తంబులు గమ్మదేఱన్ | నెత్తురులు కారుచుండగా |
హుమ్ అని | హుం అంటూ (ఊపిరి బిగపట్టి) | ఒక్క ఉమ్మడిన్ | మిక్కిలి ప్రయత్నముతో |
చిమ్ముచున్ | ఎగురగొట్టుచు | ఇతర ఇతర సమాకర్షంబులన్ | ఒకరిని మరొకరు ఈడ్చడం వలన కదలక |
పదంబుల మొదలి పట్టు | పాదముల మొదటి భాగములను పట్టును | వదలక | విడిచిపెట్టక |
పరిభ్రమణ వేగంబున్ | సుడుల యొక్క వేగము చేత | జలంబులన్ | నీటి యందు |
తిరుగుచూ | తిరుగుతూ | మకర | మొసళ్ళు |
కమఠ | తాబేళ్ళు | కర్కటి | ఎండ్రకాయలు |
గండక | ఒకవిధమైన చేపలు | మండూక | కప్పలు |
ఆది | మొదలైన | సలిల నిలయ | నీటి యందుండే జంతువుల యొక్క |
ప్రాణంబులు | ప్రాణములు | క్షీణంబులుగాన్ | నశించే విధంగా |
ఒండొంటిన్ | ఒకదానితో మరొకటి | తాకురసంబునన్ | ఎదిరించేటటు వంటి వేగముతో |
ఇక్కలు వడ | వాటి స్థావరములు నశించే విధముగా | మ్రక్కన్ | చక్కగా |
త్రొక్కుచున్ | ఒకదానిని మరొకటి తొక్కుతూ | మెండుచెడి | తీవ్రత తగ్గి |
జొండుపడి | బలహీనపడిపోయి | నాచు | నీటిపై నుండే పాచి యొక్క |
గుల్ల | నత్తగుల్లల యొక్క | చిప్పల | కప్ప చిప్పల యొక్క |
తండంబులన్ | గుంపులను | పరస్పరతాడనంబులన్ | ఒకరినొకరు కొట్టుకునే దెబ్బలకు |
అడ్డంబుగాన్ | అడముగా | ఒడ్డుచున్ | పెట్టుకుంటూ |
ఓల మాసగొనక | వెనక్కి తగ్గడము ఇష్టము లేక | గెలుపు తలంపులు | గెలుపు సాధిస్తామనే ఆలోచనలు, ఆశలు |
బెట్టిదంబులై | దృఢమైనవై | రెట్టింపన్ | మరింతగా పెరుగగా |
ఆహోరాత్రంబులుంబోలె | రాత్రి, పగలు వలె | క్రమక్రమ | రానురాను |
విజృంభమాణంబులై | పైకిరేగినవై | బహుకాల | చాలకాలము |
కలహసన్నాహంబులై | యుద్ధసన్నాహములు గలిగినవై | నిర్గత | వదిలిపెట్టిన |
నిద్రాహారంబులు + ఐ | నిద్ర, ఆహారములు గలవై | అవక్ర | సాటిలేని |
పరాక్రమ | పరాక్రమముచే | ఘోరంబులై | భయపెట్టునవై |
పోరుచున్న సమయంబునన్ | పోట్లాడుకుంటున్న సమయమునందు |
తాత్పర్యము
ఏనుగూ, మొసలీ రెండూ కూడా మిక్కిలి అభిమానంతో ఒకదాన్ని మించి మరొకటి ఢీకొంటున్నాయి. ఆ రెండింటి తగాదా లోకాలన్నింటికీ భయం కలిగిస్తోంది. రెండూ కూడా ఒకదాన్ని ఒకటి ఓడించాలనే పట్టుదలతో పెనుగులాడుతున్నాయి. ఆ పెనుగులాటలో ఆ సరస్సును కలగాపులగం చేసేస్తున్నాయి. సింహాన్ని సింహమూ, కొండని కొండా ఏ మాత్రం వెనడుగువేయకుండా ఎదిరిస్తే ఎట్లా ఉంటుందో, అట్లాగే నీళ్ళలో ఆ రెండూ చాలా తీవ్రంగా పోట్లాడుతున్నాయి. ఏనుగు మొసలిని బయటికి లాగిపడెయ్యాలనీ, మొసలి ఏనుగుని నీళ్ళలోకి ముంచిపడెయ్యాలనీ పెరుగులాడుతూ, అటూ ఇటూ పడుతూ ఏ మాత్రం తొట్రుపడకుండా ఉన్నాయి. వాటి పోట్లాటలో ఆ నీళ్ళలోంచి “బుడ బుడ”, “బుగ, బుగ” అనే శబ్దాలు బయటికి వస్తున్నాయి. నీళ్ళలోంచి బయటకు వచ్చే నురుగు ఆకాశానికి అంటుకుంటోంది. ఏనుగు, మొసలి ఎడతెరిపిలేకుండా ముట్టెలతో ఒకదాన్ని మరొకటి కొట్టుకుంటూ, తలలు పగల గొట్టుకుంటూ, నెత్తురు కారే విధంగా హుమ్మంటూ వాడి పళ్ళతో పొడుచుకుంటూ పోరాటం సాగిస్తున్నాయి. ఒకదాన్ని మరొకటి లాగేటప్పుడు దేనికదే దానికాళ్ళు పట్టు తప్పిపోకుండా గట్టిగా నిలదొక్కుకుంటూ పోట్లాడు కుంటున్నాయి.
జీవితంలోని ప్రధాన లక్ష్యం
మానవ జన్మ లభించడం సులభం కాదు. మన పురాణాలు, ధర్మగ్రంథాలు చెబుతున్నట్లు, ఇది కేవలం పుణ్యఫలంగా లభిస్తుంది. గజేంద్ర మోక్షం కథ మనకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పుతుంది. అహంకారాన్ని విడిచిపెట్టి, భగవంతుని శరణు తీసుకుంటే మాత్రమే మోక్షానికి దారి సిద్ధమవుతుంది. ఈ కథ గురించి మరింత తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
మానవ జీవితం అనేక అవకాశాలు, పరీక్షలతో కూడినది. కానీ నిజమైన ఆనందం భగవంతుని సేవలోనే ఉంది. గజేంద్ర మోక్షం కథ మనకు ఇదే బోధిస్తుంది. ధర్మబద్ధంగా జీవించి, భగవంతుని ఆశ్రయించడం ద్వారా మోక్షాన్ని పొందవచ్చు. మరిన్ని ఆధ్యాత్మిక కథల కోసం ఈ వెబ్‌సైట్ సందర్శించండి.