మొగమునందున చిరునవ్వు మొలకలెత్త
పలుకు పలుకున అమృతంబు లొలుకుచుండ
మాటాలాడుదుగాని మాతోటి నీవు
పరుగు పరుగున రావోయి బాలకృష్ణ
తలను శిఖిపింఛ మది వింత తళుకులీన
నుదుట కస్తూరి తిలకంబు కుదురుకొనగ
మురళి వాయించుచును జగన్మోహనముగ
పరుగు పరుగున రావోయి బాలకృష్ణ
భువనముల నుద్ధరింపగ పుట్టినావు
చక్కగా నీదు పాదాల నొక్కసారి
ముద్దు పెట్టుకొందును కండ్ల కద్దుకొనుచు
పరుగు పరుగున రావోయి బాలకృష్ణ
నిన్ను చూడక నిమిషంబు నిలువలేను
కాలమంతయు ఆటల గడిపెదీవు
ఒక్కసారైన వద్ద కూర్చుండవెట్లు
పరుగు పరుగున రావోయి బాలకృష్ణ
మరులుకొన్నది నీమీద మనసు నాకు
ఏమి చేసెదొ ఏ రీతి ఏలు కొనెదొ
కాలయాపన సైపగా జాలనింక
పరుగు పరుగున రావోయి బాలకృష్ణ
వెన్నయున్నది మాయింట కన్నతండ్రి
పెరుగు మీగడతో బువ్వ పెట్టేదెను
జాలమింకేల నా మది సంతసిల్ల
పరుగు పరుగున రావోయి బాలకృష్ణ
ఎంత పిలిచిన రావేమి పంతమేల
అందుచేతనె నిను నమ్మరయ్య జనులు
నన్ను రక్షింప వేవేగ కన్నతండ్రి
పరుగు పరుగున రావోయి బాలకృష్ణ
భువన మోహన రూపంబు పొందుగోరి
అలమటించుచు నుండె నా ఆర్తి హృదయ
మన్న భక్తార్తి హరుడన్న యశము నిలువ
పరుగు పరుగున రావోయి బాలకృష్ణ
ఆర్తితోడ రావే యని అడవి మృగము
కేక నిడగానె వచ్చి రక్షించు తండ్రి
హృదయ పూర్వకముగా కేకలిడుచు నుంటి
పరుగు పరుగున రావోయి బాలకృష్ణ
నిలువ జాలను రాకున్న పరమ పురుష
నీదు కరుణారసము చిందు నేత్ర యుగము
చూచి పొంగ నా హృదయము వేచియుండె
పరుగు పరుగున రావోయి బాలకృష్ణ
వినుతి పిలుపు సీతా రాముని కృతంబు
భక్తి తోడ పఠించెడివారు జగతి
అతిశయా నందఘను కృష్ణనుభవించు
విష్ణు పరమ పదంబున వెలియగలరు