Karthika Puranam Telugu
మారుమూలల్లో తలలు దాచుకున్నా కూడా వదలకుండా ముట్టడింప వస్తూన్న జలంధరునికి భయపడినవారై దేవతలంతా విష్ణు స్తోత్రం చేయసాగారు.
సర్వదేవతా కృత విష్ణుస్తోత్రం
నమో మత్స్య కూర్మాది నానా స్వరూపాయ
సదాభక్త కార్యద్యతా యార్తి హంత్రే
విధాత్రాధి సర్గస్థితి ధ్వంసక
గదాశంఖ పద్మాది హస్తాయతేస్తు
విధాత్రాధి సర్గస్థితి ధ్వంసకర్తే
గదాశంఖ పద్మాది హస్తాయతేస్తు
రమావల్లభా యాసురాణాం నిహంత్రే
భుజంగారి యానాయ పీతాంబరాయ
మఖాది క్రియాపాక కర్తే విక
శరణ్యాయ తస్మై నతాస్స్మోవతాస్స్మః
నమో దైత్య సంతాపి తామర్త్యదుఃఖా
చల ధ్వంసదంభోళయే విష్ణవేతే
భుజంగేళ తలే శయా నాయార్కచంద్ర
ద్వినేత్రాయ తస్మై నతాస్స్మో నతాస్స్మః
తాత్పర్యం
- మత్స్యకూర్మాది అవతారములు ధరించిన వాడవునూ – సదా భక్తుల కార్యములు చేయుటయందు సంసిద్ధుడగువాడవును – దుఃఖములను నశింపచేయువాడవును – బ్రహ్మాదులను సృష్టించి పెంచి లయింపచేయువాడును – గద, శంఖం, పద్మం, కత్తి ఆదిగా గల ఆయుధములను ధరించిన వాడవను అగు నీకు నమస్కారమగు గాక.
- లక్ష్మీపతి, రాక్షసారతి, గరుడవాహనుడు, పట్టుబట్టలు ధరించిన వాడవును, యజ్ఞాదులకు కర్త, క్రియారహితుడు, సర్వరక్షకుడవూనగు నీకు నమస్కారమగును గాక.
- రాక్షసులచే పీడించబడిన దేవతల దుఃఖమనే కొండను నశింపజేయుటలో వజ్రాయుధము వంటి వాడవును, శేషశయనుడవును, సూర్యచంద్రులనే నేత్రములుగా గలవాడవును, అగు ఓ విష్ణూ! నీకు నమస్కారము. పునః నమస్కారము.
ఫలశ్రుతి:
సంకష్ట నాశనం స్తోత్ర మేతద్యస్తు పఠేన్నరః
సకదాచిన్న సంకష్టః పీడ్యతే కృపయా హరేః
‘ఇలా దేవతలచేత రచింపబడినదీ, సమస్త కష్టాలనూ సమయింపజేసేదీ అయిన ఈ స్తోత్రాన్ని ఏ మానవుడైతే పఠిస్తుంటాడో – వాని ఆపదలన్నీ ఆ శ్రీహరి దయ వలన తొలగిపోతాయి’ అని, పృథువుకు చెప్పి, నారదుడు మరలా పురాణ ప్రవచనానికి ఉపక్రమించాడు.
విష్ణువు – జలంధరుని యుద్ధం, వరం
ఈ దేవతల స్తోత్రపాఠాలు ఆ చక్రపాణి చెవినబడ్డాయి. దేవతల కష్టానికి చింతిస్తూనే, దానవులపై కోపం గలవాడై చయ్యన తన శయ్యవీడి, గరుడ వాహనముపై కదులుతూ – ‘లక్ష్మీ! నీ తమ్ముడైన జలంధరునికీ – దేవగణాలకీ యుద్ధం జరుగుతున్నది. దేవతలు నన్నాశ్రయించారు. నేను వెడుతున్నాను’ అని చెప్పాడు.
అందుకా ఇందిరాదేవి రవంత చలించినదై – ‘నాథా! నేను నీకు ప్రియురాలనై వుండగా నువ్వు నా తమ్ముని వధించడం ఎలా జరుగుతుంది?’ అని ప్రశ్నించింది. ఆ మాటకు మాధవుడు నవ్వి– ‘నిజమే దేవీ! నాకు నీ మీదున్న ప్రేమ చేతా, బ్రహ్మ నుండి అతను పొందిన వరాల చేతా, శివాంశ సంజాతుడు కావడం చేత కూడా జలంధరుడు నేను చంపదగినవాడు కాడు’ అని మాత్రం చెప్పి, సర్వాయుధ సమీకృతుడై, గరుడ వాహనారూఢుడై, అతి త్వరితంగా యుద్ధభూమిని చేరాడు.
మహాబలియైన గరుడుని రెక్కల విసురులకు పుట్టిన గాలివలన రాక్షస సేనలు మేఘశకలాల వలె చెల్లాచెదరై నేల రాలిపోసాగాయి. అది గుర్తించిన జలంధరుడు ఆగ్రహంతో ఆకాశానికి బాణాలతో జలంధరుని యొక్క జెండానీ, రథచక్రాలనీ, ధనుస్సునీ చూర్ణం చేసేశాడు. అనంతరం అతని గుండెలపై ఒక గొప్ప బాణాన్ని వేసాడు.
ఆ బాధామయ క్రోధంతో జలంధరుడు గదాధరుడై – ముందుగా గరుడుడి తలపై మోదడంతో, గరుత్మంతుడు భూమికి వాలాడు. తక్షణమే విష్ణువు అతని గదను తన ఖడ్గంతో రెండుగా నరికివేశాడు. అలిగిన అసురేంద్రుడు – ఉపేంద్రుడి ఉదరాన్ని పిడికిట పొడిచాడు.
అక్కడితో జలధిశాయికీ, జలంధరుడికీ బాహుయుద్ధం ఆరంభమైంది. ఆ భుజాస్ఫాలనలకూ, ముష్టిఘాతాలకూ, జానువుల తాకిళ్లకీ భూమి మొత్తం ధ్వనిమయమై పోసాగింది. భయావహమైన ఆ మనోహర కలహంలో – జలంధరుని బలపరాక్రమాలకు సంతుష్టుడైన సంకర్ణణుడు (విష్ణువు): ‘నీ పరాక్రమం నన్ను ముగ్ధుని చేసింది. ఏదైనా వరం కోరుకో’ అన్నాడు.
విష్ణువు అలా అనగానే జలంధరుడు చేతులు జోడించి ‘బావా! రమా రమణా! నీవు నా యందు నిజంగా ప్రసన్నుడవే అయితే నా అక్కగారైన లక్ష్మీదేవితోనూ – నీ సమస్త వైష్ణవ గణాలతో సహా తక్షణమే వచ్చి నా ఇంట కొలువుండిపొ’మ్మని కోరాడు.
తానిచ్చిన మాట ప్రకారం తార్క్ష్యవాహనుడూ (విష్ణువు) తక్షణమే దానవ మందిరానికి తరలి వెళ్లాడు.
జలంధరుని ఏకచ్ఛత్రాధిపత్యం
సమస్త దైవస్థానాలలోనూ రాక్షసులను ప్రతిష్ఠించాడు జలంధరుడు. దేవ, సిద్ధ, గంధర్వాదులందరి వద్దా వున్న రత్న సముదాయాన్నంతటినీ స్వాధీనపరుచుకున్నాడు. వాళ్లనందరినీ తన పట్టణంలో పడి వుండేటట్లుగా చేసుకుని, తాను త్రిలోక ఆధిపత్యాన్ని నెరపసాగేడు.
ఓ పృథు చక్రవర్తీ! ఆ విధంగా జలంధరుడు లక్ష్మీనారాయణులను తన ఇంట కొలువుంచుకుని, భూలోకమంతటినీ ఏకచ్ఛత్రాధిపత్యంగా ఏలుతుండగా, విష్ణుసేవా నిమిత్తంగానే (నారదుడు) ఒకసారి ఆ జలంధరుని ఇంటికి వెళ్లాను.
నారదుడు – జలంధరుల సంభాషణ
నారదుడు చెబుతున్నాడు: పృథురాజా! అలా తన గృహానికి వచ్చిన నన్ను జలంధరుడు ఎంతో చక్కటి భక్తి ప్రత్తులతో శాస్త్రవిధిని సత్కరించి, అనంతరం ‘మునిరాజా! ఎక్కడ నుంచి ఇలా వచ్చేశావు? ఏ ఏ లోకాలు సందర్శించావు? నువ్వు వచ్చిన పనేమిటో చెబితే దానిని తప్పక నెరవేర్చుతా’నన్నాడు.
అప్పుడు నేనిలా అన్నాను: ‘జలంధరా! యోజన పరిమాణమూ, పొడవూ గలదీ – అనేకానేక కల్పవృక్షాలూ, కామధేనువులూ గలదీ – చింతామణులచే ప్రకాశవంతమయినదీ అయిన కైలాస శిఖరంపై – పార్వతీ సమేతుడయిన పశుపతిని సందర్శించాను’.
‘ఆ వైభవాలకు దిగ్భ్రాంతులనయిన నేను – అంతటి సంపద కలవారు మరెవరయినా ఉంటారా అని ఆలోచించగా త్రిలోక చక్రవర్తివయిన నువ్వు స్ఫురించావు. నీ సిరిసంపదలను కూడా చూచి – నువ్వు గొప్పవాడవో, ఆ శివుడు గొప్పవాడో తేల్చుకోవాలని ఇలా వచ్చాను’.
‘అన్ని విషయాల్లోనూ వీరిద్దరూ దీటుగానే వున్నారు గాని – ఒక్క స్త్రీ రత్నపుటాధిక్యత వల్ల, నీ కన్నా ఆ శివుడే ఉత్కృష్టవైభవోపేతుడుగా కనిపిస్తూన్నాడు. నీ ఇంట్లో అప్సరలు, నాగకన్యలు మొదలైన దేవకాంతలెందరయినా వుందురు గాక – వాళ్లంతా ఏకమైనా సరే ఆ ఏణాంకధారికి (శివుడికి) ప్రాణాంకస్థితయైన పార్వతీదేవి ముందు ఎందుకూ కొరగారు’.
‘కళ్యాణాతూర్పర్వం వీతరాగుడయిన విషమాంబకుడు సైతం ఏ విద్యుల్లతా సౌందర్యమనే అరణ్యంలో భ్రామితుడై చేపవలె కొట్టుమిట్టాడో – అటువంటి ఆ పార్వతికి యికయే చానా యీడు కాలేదు. నిత్యమూ ఏ పార్వతీదేవినే పరిశీలిస్తూ – ఆమె అందానికి సాటి తేవాలనే నిశ్చయంతో బ్రహ్మదేవుడు అప్సరగణాన్ని సృష్టించాడో – ఆ అప్సరసలు అందరూ ఏకమైనా సరే ఆ అమ్మవారి అందం ముందు దిగదుడుపేనని తెలుసుకో’.
‘నీకెన్ని సంపదలున్నప్పటికీ కూడా అటువంటి సాధ్వీమణి లేకపోవడం వలన ఐశ్వర్యవంతులలో నువ్వు శివునికి తర్వాత వానివేగాని, ప్రథముడివి మాత్రం కావు’.
ఉపర్యుక్త విధంగా, జలంధరునితో ఉటంకించి, నా దారిన నేను వచ్చేశాను.
అనంతరం, పార్వతీ సౌందర్య ప్రలోభుడై, జలంధరుడు మన్మధ జ్వరగ్రస్తుడయ్యాడు. కాముకులకి యుక్తాయుక్త విచక్షణలుండవు కదా!. అందువల్ల విష్ణుమాయా మోహితుడయిన ఆ జలంధరుడు సింహికానందనుడయిన ‘రాహువనే వాణ్ణి చంద్రశేఖరుని దగ్గరగా దూతగా పంపించాడు’.
శుక్లపక్షపు చంద్రునిలా తెల్లగా మెరిసిపోతూండే కైలాస పర్వతాలన్నీ, తన యొక్క కారు నలుపు దేహకాంతులు సోకి నల్లబడుతూండగా – రాహువు కైలాసాన్ని చేరి, తన రాకను నందీశ్వరుని ద్వారా నటరాజుకు కబురు పెట్టాడు.
‘ఏం పనిమీద వచ్చావు?’ అన్నట్లు కనుబొమ్మల కదలికతోనే ప్రశ్నించాడు శివుడు. రాహువు చెప్పసాగాడు – ‘ఓ కైలాసావాసా! ఆకాశంలోని దేవతల చేతా, పాతాళంలోని ఫణుల చేత కూడ సేవింపబడుతున్నవాడూ – ముల్లోకాలకూ ఏకైక నాయకుడూ ఐన మా రాజు జలంధరుడిలా ఆజ్ఞాపించాడు.
‘హే వృషధ్వజా! వల్లకాటిలో నివసించేవాడినీ, ఎముకల పోగులను ధరించేవాడివీ, దిగంబరివీ అయిన నీకు – హిమవంతుడి కూతురూ, అతిలోక సౌందర్యవతీ అయిన పార్వతి భార్యగా పనికిరాదు. ప్రపంచంలోని అన్ని రకాల రత్నాలకూ నేను రాజునై వున్నాను. కాబట్టి, స్త్రీ రత్నమైన ఆ పార్వతిని కూడా నాకు సమర్పించు. ఆమెకు భర్తనయ్యేందుకు నేనే అర్హుడిని గాని, నువ్వే మాత్రమూ – తగవు’.
కీర్తిముఖోపాఖ్యానము
రాహువలా చెబుతూండగానే – ఈశ్వరుడి కనుబొమల వలన రౌద్రాకారుడైన పురుషుడు వేగవంతమైన పిడుగుతో సమానమైన ధ్వని కలవాడు ఆవిర్భవించాడు.
పుడుతూనే ఆ పౌరుషమూర్తి రాహువు మీదకు లంఘించబోగా – రాహువు భయపడి పారిపోబోయాడు. కాని, ఆ రౌద్రమూర్తి అనతిదూరంలోనే రాహువును పట్టుకుని మ్రింగివేయబోయాడు.
అయినప్పటికీ – రాహువు దూత అయిన కారణంగా వధించడం తగదని రుద్రుడు వారించడంతో, ఆ పౌరుషమూర్తి తన ప్రయత్నాన్ని విరమించుకున్న వాడై, శివాభిముఖుడై – ‘హే జగన్నాథా! నాకసలే ఆకలి – దప్పికలెక్కువ. వీనిని తినవద్దంటున్నావు గనుక నాకు తగిన ఆహారపానీయాలేమిటో ఆనతినిమ్మ’ని కోరాడు.
హరుడతనిని చూచి – ‘నీ మాంసాన్నే నువ్వు ఆరగించు’ అన్నాడు. శివాజ్ఞబద్ధుడైన ఆ పురుషుడు తన శరీరంలోని శిరస్సును తప్ప తక్కిన అన్ని భాగాల మాంసాన్నీ తినివేశాడు.
శిరస్సొకటే మిగిలిన ఆ మహాపురుషునిపట్ల కృపాళుడయిన కంఠేకాలుడు (శివుడు) – ‘నీ ఈ భయంకర కృత్యానికి సంతుష్టుడనైనాను. ఇక నుంచీ నువ్వు కీర్తిముఖ సంజ్ఞతో విరాజిల్లు’మని ఆశీర్వదించాడు.
ఓ పృథురాజా! తదాదిగా ఆ శిరోవ శేషుడు శివద్వారాన కీర్తిముఖుడై ప్రకాశిస్తున్నాడు. అంతేకాదు. ‘ఇకపై, ముందు నిన్ను పూజించకుండా నన్ను అర్చించిన వారి పూజలన్నీ వృధా అవుతాయి. గనుక నన్ను అర్చించదలచిన వారు ముందుగా కీర్తిముఖుని పూజించి తీరాలి’ అని ఈశ్వరుడు శాసించాడు కూడా.
అలా కీర్తిముఖగ్రస్తుడు కాబోయిన రాహువును శివుడు బర్భర స్థలమందు విముక్తుడిని చేయడం వలన తదాదిగా రాహువు బర్భర నామధేయంతో ప్రసిద్ధి చెందాడు.
ఆ మీదట రాహువు తనకది పునర్జన్మగా భావించి, భయవిముక్తుడై జలంధరుని దగ్గరకు వెళ్ళి జరిగిందంతా పొల్లుపోకుండా చెప్పాడు.
ఇరువది యొకటవ (బహుళ షష్ఠి) నాటి పారాయణము సమాప్తము