Karthika Puranam Telugu – కార్తీక పురాణం | 30వ రోజు పారాయణ

Karthika Puranam Telugu

రావిచెట్టు మరియు దరిద్రదేవత కథ

సూత ప్రోక్తమైన విషయాలను వినిన ఋషులు ఈ విధంగా ప్రశ్నించారు: “ఓ మునిరాజా! రావిచెట్టు ఎందువలన అంటరానిదయ్యింది? అయినప్పటికీ శనివారం నాడు మాత్రం ఎందుకు పూజనీయతను పొందింది?” అని ప్రశ్నించగా, సూతర్షి వారికి సమాధానం చెప్పడం మొదలుపెట్టాడు.

క్షీరసాగర మథనం మరియు శ్రీదేవి కోరిక: పూర్వం క్షీరసాగర మధనంలో లభించిన అనేక వస్తువులలో లక్ష్మీ, కౌస్తుభాన్నీ శ్రీహరికి సమర్పించి , తక్కిన సంపదనంతా దేవతలు తీసుకున్నారు. శ్రీహరి శ్రీదేవిని పెండ్లి చేసుకోదలచాడు. కాని శ్రీదేవి (రమ) – ‘ఓ నారాయణా! నాకన్నా పెద్దది నా అక్కయ్య ఉన్నది. ఆ జ్యేష్ఠకు పెండ్లి కాకుండా కనిష్ఠనయిన నేను కళ్యాణమాడటం పాడిగాదు గనుక – ముందామె మనువుకై సంకల్పించ’మని కోరింది.

జ్యేష్ఠాదేవి (దరిద్ర దేవత) వివాహం: ధర్మబద్ధమైన ‘రమ’ మాటలను అంగీకరించి, విష్ణువు – ఉద్దాలకుడనే మునికి జ్యేష్ఠాదేవిని సమర్పించాడు. స్థూలవదన, అశుభ్రరదన, అరుణనేత్రి, కఠినగాత్రి, బిరుసు శిరోజాలు గలిగిన జ్యేష్ఠాదేవిని, ఉద్దాలకుడు తన ఆశ్రమానికి తెచ్చుకున్నాడు.

దరిద్ర దేవతకు ఇష్టమైన స్థలములు: నిరంతర హోమధూమ సుగంధాలతోనూ, వేదనాదాలతోనూ నిండిన ఆశ్రమాన్ని చూసి, పెద్దమ్మ దుఃఖిస్తూ – “ఓ ఉద్దాలకా! నాకీ చోటు సరిపడదు. వేదాలు ధ్వనించేదీ, అతిథి పూజా సత్కారాలు జరిగేవీ, యజ్ఞయాగాదులు నిర్వహించబడేవీ అయిన స్థలాలలో నేను నివసించను. అన్యోన్యానురాగం గల భార్యభర్తలు వున్న చోటగాని, పితృదేవతలు పూజింపబడే చోట గాని, ఉద్యోగస్తుడు – నీతివేత్త – ధర్మిష్ఠుడు – ప్రేమగా మాటలాడే వాడు – గురుపూజా దురంధరుడూ వుండే స్థలాలలోగాని, నేను ఉండను.

ఆమె నివసించదలిచిన స్థలాలు

దరిద్రదేవత నివసించడానికి ఇష్టపడే స్థలాలుదరిద్రదేవత నివసించడానికి ఇష్టపడని స్థలాలు
రాత్రింబవళ్లు ఆలుమగలు దెబ్బలాడుకునే ఇల్లు నిరంతర హోమధూమ సుగంధాలతో నిండిన ఆశ్రమం
అతిథులు నిరాశతో ఉసూరుమనే ఇల్లు వేదనాదాలు ధ్వనించే చోటు
వృద్ధులకు, మిత్రులకు, సజ్జనులకు అవమానాలు జరిగే చోటు అతిథి పూజా సత్కారాలు జరిగే చోటు
దురాచారాలూ, పరద్రవ్య, పరభార్యాపహరణ శీలురైన వారుండే చోటు యజ్ఞయాగాదులు నిర్వహించబడే చోటు
కల్లు తాగేవాళ్లు, గోహత్యలు చేసే వాళ్లు, బ్రహ్మహత్యాది పాతక పురుషులు ఉండే చోటు అన్యోన్యానురాగం గల భార్యభర్తలు వున్న చోటు
పితృదేవతలు పూజింపబడే చోటు
ఉద్యోగస్తుడు, నీతివేత్త, ధర్మిష్ఠుడు, ప్రేమగా మాటలాడే వాడు, గురుపూజా దురంధరుడూ వుండే స్థలం

రావి మొదట్లో జ్యేష్ఠాదేవి నివాసం

ఆమె మాటలకు వేదవిదుడైన ఆ ఉద్దాలకుడు కించిత్తు నొచ్చుకున్నవాడై ‘ఓ జ్యేష్ఠా! నీవు కోరినట్లుగా నీకు తగిన నివాస స్థానాన్ని అన్వేషించి వస్తాను. అంతవరకూ నువ్వీ రావిచెట్టు మొదట్లోనే కదలకుండా కూర్చో’మని చెప్పి బయలుదేరి వెళ్లాడు. భర్తాజ్ఞ ప్రకారం జ్యేష్ఠాదేవి రావిచెట్టు మొదలులోనే అలాగే వుండిపోయింది.

ఎన్నాళ్లకీ ఉద్దాలకుడు రాకపోవడంతో పతి విరహాన్ని భరించలేని పెద్దమ్మ – పెద్ద పెట్టున దుఃఖించసాగింది. ఆమె రోదనలు వైకుంఠంలో వున్న లక్ష్మీనారాయణుల చెవులలో పడ్డాయి. వెంటనే లక్ష్మి – తన అక్కగారిని ఊరడించవలసిందిగా విష్ణువును కోరింది.

శ్రీహరి అనుగ్రహం:

విష్ణువు కమలా సమేతుడై జ్యేష్ఠాదేవి ఎదుట ప్రత్యక్షమయి, ఆమెని ఊరడించుతూ – ‘ఓ జ్యేష్ఠాదేవి! ఈ రావిచెట్టు నా అంశతో కూడి వుంటుంది. కనుక, నువ్వు దీని మూలంలోనే స్థిరనివాసం ఏర్పరచుకుని వుండిపో. ప్రతి ఏటా నిన్ను పూజించే గృహస్థులయందు లక్ష్మి నివసిస్తూ వుంటుంది’ అని చెప్పాడు.

ఆ నియమాలలోనే ప్రతి శనివారం రావిచెట్టు పూజనీయగానూ, అక్కడ జ్యేష్ఠాదేవిని షోడశోపచార విధిని అర్పించే స్త్రీల పట్ల శ్రీదేవి అమిత కరుణాకలితయై అనుగ్రహించేటట్లున్నూ ఏర్పరచాడు శ్రీహరి.

ఫలశ్రుతి:

‘ఓ ఋషులారా! సత్యభామకు శ్రీకృష్ణుడు చెప్పినట్లుగా – నారదుని చేత పృథు చక్రవర్తికి చెప్పబడిన విధానంగా, నేను మీకీ పద్మపురాణాంతర్గత కార్తీక పురాణాన్ని వినిపించాను. ఎవరయితే ఈ కార్తీక మహాత్మ్యాన్ని చదువుతున్నారో, వింటున్నారో, వినిపిస్తున్నారో వారు సమస్త పాపాల నుండీ విడివడి విష్ణు సాయుజ్యాన్ని పొందుతున్నారు’ అని సూతుడు చెప్పగా విని సంతసించిన ఋషులు – అక్కడి నుంచీ బదరీవన దర్శనాకాంక్షులై పయనమయ్యారు.

పోలి స్వర్గమునకు (వైకుంఠమునకు) పోవుట

ఆంధ్రదేశమున పవిత్ర కృష్ణానదీ తీరమున బాదర అను గ్రామముండెను. ఆ గ్రామములో నివసించుచున్న అన్ని వర్ణముల వారును అన్నిటను సంపన్నులై యుండిరి. పాడిపంటలు, భోగభాగ్యములు, సుఖశాంతులు మున్నగువానితో ఆ గ్రామము సంతోషపూర్ణమై యుండెను.

పోతడు, మాలి మరియు పోలి: ఆ గ్రామములో ‘పోతడు’ అను పేరుగల చాకలివాడొకడు కలడు. అతని భార్య ‘మాలి’ క్రూర స్వభావురాలు. దయాదాక్షిణ్యములు లేనిదై గయ్యాళియని పేరు పడెను. వారికి నలుగురు కుమారులు కలరు. ఆ దంపతులు తమ కుమారులు నలుగురికిని తగిన సమయములందు వివాహము చేసిరి.

  • మొదటి ముగ్గురు కోడళ్లు: తమ అత్తగారి వలెనే పొగరుబోతు స్వభావము కలిగి చెడ్డ పేరును తెచ్చుకొనిరి. అత్తగారితో సమానముగా గయ్యాళితనమును, చెడు స్వభావమును కలిగియుండిరి.
  • నాల్గవ కోడలు ‘పోలి’: మృదు స్వభావురాలు, భర్తయందు ఆసక్తి కలిగియుండెను.

ఊరి వారి బట్టల మాలిన్యమును పోగొట్టి స్వచ్ఛతను కలిగించు ‘పోతడు’ మాత్రము తన కుటుంబ సభ్యుల దుష్టస్వభావముచే ఏర్పడిన తన కుటుంబంలోని మాలిన్యమును పోగొట్టలేని స్థితిలో వుండెను. దీనికి తోడు వాని నిర్దనత్వము కూడా వానిని బాధించుచుండెను. చిన్నకోడలైన పోలిని తన భార్యయగు మాలి మిగిలిన కోడళ్లను దూషించుట, బాధించుట గమనించియు నిస్సహాయుడై వూరకుండెను.

అత్తయగు ‘మాలి’, మిగిలిన తోడికోడళ్లను ఇంటి పనులన్నిటినీ పోలిపై వదలిరి. ఇంటి పనులన్నింటిని మారు మాట్లాడక తలవంచి చేయుచున్న ఆమెపై జాలియైన లేక – ఆమెపై చాడీలు చెప్పి ఆమె భర్తచే ‘పోలి’ని కొట్టించి, తిట్టించి సంతోషపడుచుండిరి. ఈ విధముగ తనను, అత్త, తోడికోడళ్లు, అనేక విధములగ బాధించుచున్నను, భర్తకు చాడీలు చెప్పి కొట్టించుచున్నను, తిట్టించుచున్నను, ‘పోలి’ తన శాంతస్వభావమును, దైవభక్తిని, ధర్మకార్యాసక్తిని విడువక కాలమును గడుపుచుండెను.

కార్తీక మాస వ్రతం – మాలి మొదలైనవారి తీరు

ఇట్లుండగా కార్తీక మాసము వచ్చెను. గ్రామములోని వారందరును కార్తీకమాస స్నానములను చేయుటకై కృష్ణానదికి పోవుచుండిరి. నదిలో స్నానము చేసి తీరమున దీపములపు వెలిగించుచు పూజలను చేయుచుండిరి.

నదీస్నానమునకు వెళ్లిన వారిలో కొందరు భక్తులు, కొందరు పుణ్యము సంపాదించాలని చేసేవారు, మరికొందరు మిగిలిన వారివలె చేయనిచో బాగుండదని ఆచరించేవారు, ఇంకొందరు ఇతరులను చూచి వినోదించుటకై తయారయ్యేవారు.

మాలి, కోడళ్ల కార్తీక వ్రతం: పోలి అత్త మాలి యను, ఆమె కోడళ్లు ముగ్గురును ‘పోలి’ని ఇంటి వద్ద నుంచి నదీస్నానమునకకు వెళ్లిరి. ఇంటిపనిని, బాధ్యతను ‘పోలి’కి అప్పగించిరి.

నదీ స్నానమునకు పోయి స్నానము, దీపారాధన మున్నగు వానిని చేయునప్పుడు ‘మాలి’ మున్నగు వారి దృష్టి దైవముపై, దైవ కార్యముపై లేదు. మనస్సును చేయుపనిపై నిలుపలేదు. భక్తి వారిలో మొదటి నుండియు లేదు. స్నానము మొదలగు వానిని చేయుచున్నను వారు, ‘పోలి’ ఇంటి వద్ద పాలను త్రాగుచున్నదేమో, పెరుగు, వెన్న మొదలగు వానిని తినుచున్నదేమో? లేక వానిని అమ్ముకొని సొమ్ము చేసుకొని దాచుకొనుచున్నదేమో’ అని అనేక విధములుగా తలచుకొనుచు, తమ తలపులను మాటలలో పక్కవారికి తెలుపుకొనుచు, తమ బుద్ధిని, మనసును ‘పోలి’ని ఆడిపోసి కొనుట యందు నిలిపిరి. వారి శరీరములు, అవయములు నదీస్నానమును, దీపారాధనమును, దైవ దర్శనమును చేయుచున్నవి. వారు కేవలము ‘పోలి’ని నిందించుటలో మాటలను నిలిపిరి.

ఈ విధముగా కార్తీక మాసమును కృష్ణాతీరమున వారు గడిపిరి. వ్రతోద్యాపనకై మార్గశిర శుద్ధ పాడ్యమి నాడు కృష్ణాతీరమునకు చేరిరి.

నిస్సహాయురాలైన పోలి భక్తి

ఇక ఇంటనున్న ‘పోలి’ నిస్సహాయురాలు. అత్తగారికి, తోడికోడళ్ళకును సమాధానమును కూడా చెప్పలేని స్థితిలో వున్నది. భర్తయు తన తల్లిమాటలను, వదినల పలుకులను వినును, నమ్మును. తనను (పోలి) పట్టించుకొనడు. నదీస్నానము, దీపారాధాన మున్నగు వానిని చేయువలయునని వున్నను, ఇంటి బాధ్యతకు బంధితురాలైన ఆమె తన భక్తిని, నదీ స్నానాదుల యందలి కోరికను, దైవ, ధర్మ కార్యాసక్తిని తనలోనే దాచుకొనెను. అత్తకు, తోడికోడళ్లకు సమాధానము చెప్పలేదు. తననొక సాటి జీవిగనైన తలచని వారి మానవత్వమునకేమి చేయును?

పోలి ప్రార్థన: అప్పుడామె నిస్సహాయ రీతిలో ఇంటి బాధ్యతలను, ఇంటి పనులను చేయుచు ఇంటిలోనే వున్నదై తన మనసులో ఇట్లనుకొనెను – ‘దీనరక్షణ! గోవిందా ! జనార్ధనా! స్వామీ! దీనబంధూ! నేనేమి చేయగలను. అశక్తురాలను, నిస్సహాయురాలను. నా అత్త, తోడికోడళ్లు, నన్ను విడిచి నదీతీరమున కేగి, స్నాన, దీపారాధన మున్నగు వానిని చేయుచున్నారు. వారివలె నాకును – ‘పుణ్యమును సంపాదించవలెను. భగవంతుని పూజింపవలయును’ అని యుండునని భావింపక పోయిరి. నేమియు చేయలేకున్నాను. పవిత్ర నదీ స్నానము లేదు. స్ఫూర్తినిచ్చు దీపారాధన లేదు. మనసునకు ప్రశాంతతనిచ్చు దైవ దర్శనము పూజ, పురాణ శ్రవణము ఏవియును లేవు. ఏమి చేయుదును. నాకెట్టి గతి కలుగునో కదా! నేనెంత దురదృష్టవంతురాలను’ అని ఆమె బహు విధములుగ విచారించెను.

నిరాడంబర దీపారాధన: మనసులో భగవంతుని ధ్యానించుచు పోలి, తన పరిస్థితికి లోబడి, ఇంటిలో కుండలో వున్న నీటితో స్నానమాచరించెను. చినిగిన వస్త్రమును ధరించిన ఆమె తాను ధరించిన జీర్ణ వస్త్రము యొక్క అంచును చించి వత్తిగ చేసెను. దానినొక పాత్రలో వుంచి కవ్వమునకు అంటిన కొద్దిపాటి వెన్నను తీసి, ఆ పాత్రయందుంచి, దీపమును వెలిగించి, ‘స్వామీ! పుండరీకాక్షా ! గోవిందా ! జనార్ధనా! అనాథరక్షకా! దీనబంధూ! దయ జూపుము. నేను అశక్తురాలను. నా పై అనుగ్రహము వుంచుమని పోలి ప్రార్థించెను.

పోలికి వైకుంఠ ప్రాప్తి

ఇట్లు దీనావస్థలో వున్న పోలిని వైకుంఠమున వున్న దయాసముద్రుడగు శ్రీ మహావిష్ణువు గమనించెను. ఆమెపై అనుగ్రహము కలిగెను. ద్వారపాలకుడైన సుశీలుడను వానిని జూచి, ‘ఓయీ! నీవీమెను వెంటనే సగౌరవముగా బంగారు విమానము నెక్కించి తీసికొని రమ్మని ఆజ్ఞాపించెను.

సుశీలుడను వెంటనే ‘పోలి’ వున్న చోటునకు బంగారపు విమానముతో వచ్చి ‘ఓ సాథ్వీ! మంచి నడవడిక గల ఉత్తమురాలా! నిన్ను ఈ శరీరముతోనే వైకుంఠమునకు తీసికొని రమ్మని శ్రీ మహా విష్ణువు పంపెను. కావున వెంటనే వచ్చి ఈ విమానమును ఎక్కుము రమ్మ’ని తొందర పెట్టెను. ఆమెను విమానముపై ఎక్కించుకొనుచుండెను.

మాలి మొదలైన వారి ప్రయత్నం: అప్పుడే వ్రతోద్యాపనము చేసికొని పోలి అత్త ‘మాలి’, మిగిలిన తోడికోడళ్లు ముగ్గురును ఇంటికి వచ్చిరి. ‘మాలి’ జరిగిన దానిని తెలిసికొని తానును వైకుంఠమును చేరవలయునని తలచి విమానముతో ఎగురబోవు ‘పోలి’ పాదములను పట్టుకొనెను. పెద్ద కోడలు తన అత్త ‘మాలి’ పాదములను పట్టుకొనెను. అట్లే ఆమె పాదములను రెండవ కోడలు, రెండవ కోడలి పాదములను మూడవ కోడలు పట్టుకొనిరి. ఈ విధముగ వైకుంఠమునకు విమానములో పోవుచున్న ‘పోలి’ పాదములను పట్టుకొని అత్త ‘మాలి’ , ఆమె పాదములను పట్టుకొని పెద్దకోడలు , ఆమె పాదములను పట్టుకొని రెండవ కోడలు , ఆమె పాదములను పట్టి వ్రేలాడు మూడవ కోడలు , చూచువారికి విచిత్ర దృశ్యమును కల్పించిరి.

సుశీలుని తీర్పు: వైకుంఠ విమానమును నడిపించు సుశీలుడు వీరిని జూచెను. వారు ‘పోలి’ని పెట్టిన బాధలను గుర్తుకు తెచ్చుకొనెను. శ్రీ మహావిష్ణువు మాటలను ‘పోలి’పై ఆయనకు కలిగిన దయను గమనించెను.

అప్పుడు సుశీలుడు వారితో: “మీరు మంచివారు కారు. ‘పోలి’ని చూచి అసూయపడి ఆమెను బహువిధములగ బాధించిరి. మీరు దుష్టులు. మీరు నదీ స్నానము, దీపారాధనము, దైవదర్శనము, పూజ, పురాణశ్రవణము మున్నగువానిలో పాల్గొన్నను , మనసులో ‘పోలి’ని దూషించుచు, పాలు, పెరుగు, నెయ్యి మొదలగు యింటి విషయములను తలచిరి. ‘పోలి’పై అసూయపడిరి. కావున మీరు దుష్టులు. మీరు వైకుంఠమునకు రాదగిన వారు కారు. కుంభీపాకము మొదలగు నరకములే మీకు దగినవి. అటకుపొండని సుశీలుడు పలుకుచు చేతిలో వున్న కత్తితో ‘మాలి’ చేతులను నరికెను. అప్పుడు మాలి, ఆమె కోడళ్లు ముగ్గురును కిందపడిరి.

సుశీలుడు మిక్కిలి ప్రేమాదరణలతోను, మహా వైభవముగా ‘పోలి’ని వైకుంఠమునకు తీసికొని పోయెను. ఈ విధముగా పోలి శ్రీ మహా విష్ణువు దయకు పాత్రురాలైనది.

గమనింపదగిన విషయాలు

‘పోలి’ వృత్తాంతము వలన ఈ కింది విషయములు గమనింపదగి వున్నవి:

  • భగవంతుని యందు నిర్మలమైన భక్తి వుండవలెను. ఆ భక్తిలో తన్మయత్వము వుండవలెను.
  • పూజలోని ఆడంబరములుగాని, పూజ చేయు వారి ఆడంబరముగాని భగవంతుని మొగమాట పెట్టవు.
  • ఇతరులను చూచి అసూయపడుట, వారిని బాధించుట భక్తులైన వారికి వుండరాదు. అట్టివారు ‘మాలి’ మొదలగువారు.
  • పరిశుద్ధమైన భక్తి మాత్రమే, నిరాడంబరమైనను భగవంతునకు ప్రీతి కలిగించును.
  • దిక్కు లేని వారికి దేవుడే దిక్కు. కావున మనలో ప్రతి ఒక్కరును, అసూయాద్వేషములను విడిచి నిర్మలమైన భక్తితో ఉన్నంతలో యధాశక్తిగ భగవంతుని చేరుటకు ‘పోలి’వలె యత్నింపవలెను.
  • మాలి మున్నగువారు సంసారములోని మాయకు గుర్తులు కాగా, ‘పోలి’ నిర్మల, నిశ్చల భక్తికి ప్రతీక. అట్టి భక్తికి కులము, సంపన్నత మున్నగునవి లేవు.
  • మనమును అట్లగుటకు యత్నించుట మంచిది.

ముప్పదివ రోజు పారాయణం సమాప్తం.
ఓం నమః శివాయ. జై శ్రీమన్నారాయణ.

bakthivahini

Recent Posts

Chandanotsavam 2026 Date, Timings, Darshan Details & Significance – Complete Guide

Chandanotsavam 2026 ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో ఒకటైన సింహాచలం ఆలయంలో జరిగే 'చందనోత్సవం' వేడుక, భక్తులకు అత్యంత…

2 weeks ago

Akshaya Tritiya 2026 Date, Time, Pooja Vidhanam & Benefits | Complete Guide

Akshaya Tritiya 2026 Date, Time మన భారతీయ సంస్కృతిలో కొన్ని రోజులు సాధారణంగా కాకుండా, ఆధ్యాత్మికంగా చాలా గొప్ప…

2 weeks ago

Bhagavath Geetha Telugu | భగవద్గీత 11వ అధ్యాయం 39 శ్లోకం

Bhagavath Geetha Telugu సాధారణంగా మనకు ఒక అలవాటు ఉంటుంది; మన దగ్గర ఉన్న వంద మంచి విషయాలను వదిలేసి,…

3 weeks ago

Bhagavath Geetha Telugu | భగవద్గీత 11వ అధ్యాయం 38 శ్లోకం

Bhagavath Geetha Telugu చాలామంది నిత్యం ఏదో ఒక పని చేస్తూ బిజీగా ఉంటారు, కానీ రోజు చివరలో "నేను…

3 weeks ago

Bhagavath Geetha Telugu | భగవద్గీత 11వ అధ్యాయం 37 శ్లోకం

Bhagavath Geetha Telugu జీవితంలో మనం తరచుగా మనల్ని మనం తక్కువగా అంచనా వేసుకుంటాం. ఇతరుల విజయాలతో మనల్ని పోల్చుకుంటూ,…

3 weeks ago

Bhagavath Geetha Telugu | భగవద్గీత 11వ అధ్యాయం 36 శ్లోకం

Bhagavath Geetha Telugu కొంతమంది వ్యక్తులు ఒక గదిలోకి రాగానే అక్కడ ఉన్న వాతావరణం మొత్తం ఒక్కసారిగా మారిపోతుంది. అందరి…

3 weeks ago