Ramayanam Story in Telugu – రామాయణం 35

Ramayanam Story in Telugu- అయోధ్య నుండి రాముడిని కలుసుకోవడానికి అందరూ బయలుదేరారు. అందరికంటే ముందు కైక బయలుదేరింది. తాను ఎవరి కోసం అయితే ఈ పని చేసిందో ఆ భరతుడే తనను నిరాకరించడంతో ఆమెలోని మోహం తొలగిపోయి తన తప్పును తెలుసుకుంది. కొన్ని లక్షల సైన్యంతో వారు గంగానదిని చేరుకున్నారు. నిషాదరాజు అయిన గుహుడు వారిని చూసి, గుర్తుగా కోవిదార వృక్షం ఉన్న పెద్ద సైన్యం వస్తున్నట్లు గ్రహించాడు.

గుహుని అనుమానాలు మరియు ప్రణాళిక

గుహుడు తన బంధువులను, సైన్యాన్ని, యువకులను పిలిచి ఇలా అన్నాడు: “భరతుడు ఇంత పెద్ద సైన్యంతో వచ్చాడంటే, ఖచ్చితంగా మనందరినీ చంపడానికి లేదా పద్నాలుగు సంవత్సరాల తర్వాత రాముడు తిరిగి వస్తే ఆయన పరాక్రమం ముందు నిలబడలేనని ఇప్పుడే అడవిలో ఉన్న రాముడిని, లక్ష్మణుడిని సంహరించడానికి వచ్చి ఉండాలి. రాముడు నాకు పరమ మిత్రుడు, మనం ఆయనను రక్షించుకోవాలి. ఇంత పెద్ద సైన్యాన్ని మనం ఎదిరించలేము, కానీ మన సహాయం లేకుండా వారు గంగను దాటలేరు. అందుకని ఐదు వందల పడవలను ఈ సైన్యం అంతా వెళ్లడానికి సిద్ధం చేయండి. మీరందరూ ఒక్కొక్క పడవలో వందమంది చొప్పున కవచాలు ధరించి, ఆయుధాలు పట్టుకుని నిలబడండి. నేను ఏమీ ఎరుగని వాడిలా భరతుడి దగ్గరికి వెళ్లి ‘నువ్వు రాముడిని కలుసుకోవడానికి వెళుతున్నావా? లేక రాముడిని సంహరించడానికి వెళుతున్నావా?’ అని అడుగుతాను. ఒకవేళ రాముడిని సంహరించడానికే భరతుడు వచ్చి ఉంటే, పడవలలో గంగను దాటిస్తామని చెప్పి, పడవ ఎక్కించి నది మధ్యలో ముంచేద్దాము. ఒకవేళ రాముడిని కలుసుకోవడానికే భరతుడు వచ్చి ఉంటే, రాముడు ఎక్కడున్నాడో చెప్పి వారితో నేను కూడా వెళతాను.”

భరతునితో గుహుని సంభాషణ

కొంత మాంసం, పుష్పాలు, ధాన్యాలు, కందమూలాలు, తేనె పట్టుకొని గుహుడు భరతుడు విడిది చేసిన ఇంటికి వెళ్లాడు. గుహుడు రావడాన్ని చూసిన సుమంత్రుడు లోపలికి వెళ్లి భరతుడితో, “భరతా! నువ్వు రాముడు ఎక్కడున్నాడని వెతుకుతున్నావు కదా! రాముడు ఎక్కడున్నాడో గుహుడికి తెలుస్తుంది. రాముడికి గుహుడి మీద అపారమైన ప్రేమ, అలాగే గుహుడికి రాముడి మీద అపారమైన భక్తి” అని చెప్పాడు. వెంటనే భరతుడు గుహుడిని లోపలికి రమ్మన్నాడు.

లోపలికి వెళ్లిన గుహుడు తాను తెచ్చిన వాటిని అక్కడ పెట్టి, “నువ్వు ఈ రాజ్యాన్ని దశరథ మహారాజు గారి వల్ల పొందవు. ఇంకా నీ తృప్తి తీరక రాముడిని చంపుదామని వచ్చావా? లేకపోతే రాముడిని కలుసుకుందామని వచ్చావా? నాకు మనస్సులో అనుమానంగా ఉంది. నిజం చెప్పు భరతా! ఎందుకు వచ్చావు ఇక్కడికి?” అని అడిగాడు.

భరతుడు, “నువ్వు అన్న మాట వల్ల నాకు బాధ కలిగినా, నీ అమాయకత్వం నాకు తెలుస్తోంది. నేను ఈ గంగ దాటి భరద్వాజ ఆశ్రమానికి వెళ్లి, ఆ ఆశ్రమం దగ్గరలో ఉన్న రాముడిని కలుసుకోవాలని అనుకుంటున్నాను” అన్నాడు. “సరే, నువ్వు రాముడిని కలుసుకోవాలని వస్తే, నీ వెనకాల ఇంత సైన్యం ఎందుకు వచ్చింది?” అని గుహుడు భరతుడిని ప్రశ్నించాడు. భరతుడు ఆకాశమంత నిర్మలమైన మనస్సుతో, “ఒక తమ్ముడు ఒక అన్నగారిని రాజ్యం కోసం చంపేటటువంటి దురాలోచన ఎన్నడూ రాకుండుగాక! ఒక తమ్ముడు అన్నగారి గురించి ఎప్పుడైనా ఆలోచిస్తే, అన్నగారి కాళ్లు పట్టుకొని నమస్కరించడానికి మాత్రమే ఆలోచించేటటువంటి సౌజన్యం నిలబడుగాక!” అన్నాడు. ఈ మాటలు విన్న గుహుడు, “ఈ మాట చెప్పడం ఇక్ష్వాకు వంశంలో పుట్టిన నీకే చెల్లింది. నాకు చాలా సంతోషంగా ఉన్నది. మీ ఇద్దరూ కలిస్తే చూసి మురిసిపోవాలని ఉంది. దగ్గరుండి గంగను దాటించి నేను మీతో వస్తాను. రాముడు ఇక్కడే పడుకొని వెళ్లాడు. నన్ను తన తల మీద మర్రి పాలు పోయమన్నాడు. జటలు ధరించి, నార చీరలు కట్టుకొని వెళ్లాడు” అని అన్నాడు. ఆ రాత్రి భరతుడు రాముడి గురించి ఆలోచిస్తూ, తన వల్ల రాముడు ఇన్ని కష్టాలు పడుతున్నాడని బాధపడుతూ ఉండడం వల్ల నిద్ర పట్టక గుహుడిని పిలిచి తనకు రాముడి గురించి ఏదైనా చెప్పమని అడిగాడు.

గుహుడు, “రాముడు ఇక్కడికి వచ్చి ఇంగుది వృక్షం కింద కూర్చున్నాడు. అప్పుడు నేను ఆయనకు అన్నం, కందమూలాలు, తేనె మొదలైనవి తీసుకువెళ్లాను. రాముడు ‘నేను క్షత్రియుడిని, ఒకరికి మేము ఇవ్వాలి, ఇతరుల దగ్గర మేము తీసుకోకూడదు. మా తండ్రి గారికి ఇష్టమైన ఆ గుర్రాలకి కొంచెం దాణా పెట్టు. ఆ గంగ నుంచి కొన్ని నీళ్లు తీసుకురా! అవి త్రాగి పడుకుంటాను’ అన్నాడు. నేను గంగ నుంచి కొన్ని నీళ్లు తీసుకువచ్చి వారికి ఇచ్చాను. సీతారాములు త్రాగగా మిగిలిన నీళ్లను లక్ష్మణుడు కళ్ళకు అద్దుకొని తాగాడు. అప్పుడు నేను రాముడిని లోపల హంసతూలికా తల్పము మీద పడుకోమనగా, ‘నేను ఇప్పుడు ఒక తాపసిలాగా బతకాలి’ అని చెప్పి, లక్ష్మణుడు తీసుకొచ్చిన దర్భ గడ్డి మీద పడుకున్నాడు. రాముడు పడుకోబోయే ముందు లక్ష్మణుడు సీతారాముల పాదములు కడిగి తడిగుడ్డతో తుడిచాడు. సీతమ్మ రాముడి భుజాన్ని తలగడగా చేసుకొని పడుకుంది. ‘నేను కాపలా కాస్తాను నువ్వు పడుకో లక్ష్మణా!’ అంటే ఆయన ‘నన్ను ఎలా పడుకోమంటావు గుహా! ఇంత దారుణమైన దృశ్యం చూశాక’ అని నీ తమ్ముడు లక్ష్మణుడు ఏడ్చాడు. ఇదుగో ఈ గడ్డి మీదే సీతారాములు పడుకున్నార’ని గుహుడు సీతారాములు పడుకున్న గడ్డిని చూపించాడు.”

భరతుడు సీతారాములు పడుకున్న ఆ గడ్డి దగ్గరికి వెళ్లి చూడగా, ఒకవైపు గట్టిగా ఒత్తుకొని, గడ్డి భూమిలోకి నొక్కుకొని ఉంది. ఇది రాముడు పడుకున్న చోటని భరతుడు గ్రహించాడు.

అంశంవివరణ
రాముడు పడుకున్న చోటుగడ్డి భూమిలోకి నొక్కుకొని ఉంది
సీతమ్మ పడుకున్న చోటుబంగారు రవ్వలు పడి ఉన్నాయి, పట్టుచీర కొంగు దారాలు గడ్డికి చుట్టుకొని ఉన్నాయి

భరతుడు, “ఎక్కడో రాజభవనాల్లో పడుకోవలసిన సీతారాములు ఇంతమంది ఆటవికులు చూస్తుండగా గడ్డి మీద పడుకోవలసి వచ్చిందని, దీనికంతటికీ తానే కారణమని” నేలమీద పడి మూర్ఛపోయాడు. భరతుడు, “ఈ క్షణం నుంచి పద్నాలుగు సంవత్సరముల పాటు నేను కూడా పట్టుబట్ట కట్టను. నారచీరలే కట్టుకుంటాను, జటలు ధరిస్తాను. నేను కూడా కందమూలములు, తేనె తింటాను” అని ప్రతిజ్ఞ చేశాడు. వెంటనే నారచీరలు ధరించి భరతుడు ఆ రాత్రికి రాముడు పడుకున్న చోటనే పక్కన భూమిమీద పడుకున్నాడు. మరునాడు ఉదయం అందరూ గంగను దాటి ముందుకు బయలుదేరారు.

భరద్వాజ ఆశ్రమంలో ఆతిథ్యం

కొంత దూరం ప్రయాణించాక వారు భరద్వాజ ఆశ్రమాన్ని చేరుకున్నారు. సైన్యాన్ని కొంత దూరంలో ఉంచి, భరత శత్రుఘ్నులు వశిష్ఠుడితో కలిసి ఆశ్రమంలోనికి ప్రవేశించారు. (ఒకసారి భరద్వాజుడు బ్రహ్మగారి గురించి తపస్సు చేశాడు. అప్పుడు బ్రహ్మ ప్రత్యక్షమై ఏమి నీ కోరిక అని అడిగాడు. నాకు వేదం చదువుకోవడానికి నూరు సంవత్సరముల ఆయుర్దాయము కావాలని భరద్వాజుడు అడిగాడు. బ్రహ్మగారు సరే అన్నారు. అలా ఆయన బ్రహ్మగారి దగ్గర మూడుసార్లు ఆయుర్దాయము పుచ్చుకున్నాడు. నాలుగవసారి కూడా తపస్సు చేయగా బ్రహ్మగారు ప్రత్యక్షమై, వేదాలు ఎంత ఉంటాయో తెలుసా? చూడు అని చూపిస్తే అవి పర్వతాలంత ఎత్తు ఉన్నాయి. నువ్వు మూడు వందల సంవత్సరాలలో చదివింది మూడు గుప్పిళ్ళు. వేదం అనంతము. అది ఎంతకాలం చదివినా తెలిసేది కాదు, పూర్తిగా చదవగలిగేది కాదు. నువ్వు చదివిన దానితో తృప్తిపడు అన్నారు. (బ్రహ్మగారి వలన ఆయుర్దాయాన్ని పొందిన మహానుభావుడు భరద్వాజుడు).

ఎదురుగా వస్తున్న వశిష్ఠుడిని చూసి భరద్వాజుడు గబగబా వచ్చి అర్ఘ్య పాద్యములు ఇచ్చారు. తరువాత ఒకరిని ఒకరు కుశల ప్రశ్నలు అడిగారు. భరద్వాజుడు, “నువ్వు ఈ అరణ్యానికి ఎందుకు వచ్చావు?” అని అడుగగా, “నేను రామదర్శనానికి వచ్చాను” అని భరతుడు చెప్పాడు. (భరద్వాజుడు త్రికాలవేది. దశరథుడు మరణించాడని ఆయనకు తెలుసు).

భరద్వాజుడు, “మీ తండ్రిగారు పద్నాలుగు సంవత్సరములు రాముడిని అరణ్యములకు పంపించి నీకు రాజ్యం ఇచ్చారు. ఆ రాజ్యాన్ని పరిపాలించుకునే స్థితిలో నువ్వు ఉన్నావు, అయినా కానీ ఇంత సైన్యాన్ని తీసుకొని అరణ్యమునకు వచ్చావు. మహాపాపకార్యమైన రామ హత్య కోసమని నువ్వు వచ్చావని నాకు మనసులో అనుమానంగా ఉన్నది” అని అన్నాడు.

ఈ మాటలు విన్న భరతుడు కన్నీరు కారుస్తూ, “మహానుభావా! నా దౌర్భాగ్యము. నేను ఎక్కడికి వెళ్ళినా నన్ను చూసి ‘రాముడిని చంపడానికి వచ్చావా?’ అంటారు. నేను రాముడిని చంపడానికి రాలేదు. నువ్వు అడిగిన ప్రశ్న చేత నేను చచ్చిపోయాను. ఈ మాట గుహుడు అడిగాడంటే అర్థం చేసుకోవచ్చు. ఇంత గొప్ప మహర్షులు మీరు కూడా ఈ మాట అన్నారంటే నేను బ్రతకడం ఎందుకు? నేను ఎన్నడూ రాజ్యం కావాలని రాముడు అరణ్యవాసము చేయాలని కోరలేదు. నా మీద ఉన్న విపరీతమైన ప్రేమ చేత మా అమ్మ నేను లేనప్పుడు రెండు వరములు అడిగింది. రాముడికి పట్టాభిషేకము చేయించాలని అరణ్యానికి వచ్చాను. నేను రాముడిని చంపేంత దుర్మార్గుడిని కాదని” ఆయన పాదముల మీద పడి ఏడ్చాడు.

భరద్వాజుడు, “నువ్వు ఎటువంటి వాడివో నాకు తెలుసు భరతా! నువ్వు ఇటువంటి దురాలోచనలు చేయవని తెలుసు. అయినా నేను నిన్ను ఎందుకు అడిగానో తెలుసా! నీ శీలం ఎటువంటిదో లోకానికి చెప్పడం కోసమని నేను ఈ మాట అడిగాను. నువ్వు నీ మాటయందు నిలబడెదవు గాక!” అని ఆశీర్వదించిన పిమ్మట, “నాయనా! ఈ రాత్రికి నా ఆతిథ్యాన్ని స్వీకరించు” అన్నాడు. భరతుడు, “మీరు నాకు అర్ఘ్యం, పాద్యం ఇచ్చారు. నాకు ఇంతకన్నా ఏమి కావాలి? నాకు ఏమీ వద్దు” అన్నాడు. “నీ సైన్యమును ఎక్కడ పెట్టావు?” అని భరద్వాజుడు అడుగగా, “సైన్యాన్ని ఇక్కడికి తీసుకువస్తే ఆశ్రమం పాడవుతుందని వారిని దూరంగా పెట్టాను” అని భరతుడు అన్నాడు.

భరద్వాజుడు, “అంత దూరంగా ఎందుకు పెట్టావు? ఇవాళ నేను ఆతిథ్యం ఇవ్వాలని అనుకుంటున్నాను. నువ్వు నా ఆతిథ్యాన్ని తీసుకొని వెళ్లాల్సిందే. నీ గుర్రాలకి, ఏనుగులకి, ఒంటెలకి, సైన్యానికి, పురోహితులకి, మంత్రులకి, నీ తల్లులకి ఎటువంటి ఆతిథ్యం ఇవ్వాలో అటువంటి ఆతిథ్యం ఇస్తాను” అన్నాడు.

భరద్వాజ మహర్షి విశ్వకర్మను, త్వష్టను ప్రార్థించి, “ఇక్కడికి రాజకుమారులైన భరత శత్రుఘ్నులు వచ్చారు, వారి వెనకాల సేనాబలం వచ్చింది. పురోహితులు, మహర్షులు వచ్చారు. వీళ్ళల్లో ఎవరెవరు ఎటువంటి భవనములలో నివసిస్తారో అటువంటి భవనములను ఓ విశ్వకర్మ! నువ్వు నిర్మించెదవుగాక!” (రాజులు నివసించే వాటిని హర్మ్యములు, బాగా డబ్బున్న వాళ్ళు ఉండే వాటిని ప్రాసాదములని అంటారు).

విశ్వకర్మ ఉత్తరక్షణంలో ఎవరికి కావలసిన భవనాన్ని వారికి నిర్మించాడు.

ఆయన కుబేరుడిని, బ్రహ్మగారిని ప్రార్థించి, “కుబేరా! నీ దగ్గర ఉన్న వేలమంది అప్సరసలను పంపించు. ఓ బ్రహ్మదేవా! నీ దగ్గర ఉన్న అప్సరసలను కూడా పంపించు. వారితో పాటుగా నారదుడు, తుంబురుడు, హుహు అనే దేవగాయకులు రావాలి. అలాగే ఇక్కడ పాయసం ఏరులై ప్రవహించాలి. పులియబెట్టిన పళ్ళనుంచి, పిండి నుంచి, బెల్లం నుంచి పుట్టిన కల్లు (సుర) ఇక్కడ నదులుగా ప్రవహించాలి. ఏనుగులు, గుర్రాలు, ఒంటెలు తినడానికి కావలసిన ఆహారం గుట్టలు గుట్టలుగా పడిపోవాలి. పర్వతాలలా అన్నపురాసులు ఏర్పడాలి. వాటితో పాటు కూరలు, పచ్చళ్ళు, పులుసులు కావాలి. ఇవన్నీ తిన్నాక జీర్ణం అవ్వడానికి సొంఠి, లవంగం, ఇంగువ కలిగిన యవ్వనపు పెరుగు కావాలి. ఆకలి పుట్టించడానికి కొంచెం పుల్లగా ఉన్న పెరుగు కావాలి. అన్నంలో కలుపుకోవడానికి కమ్మగా ఉన్న పెరుగు పుట్టాలి. వీటితో పాటు అందరూ మొహం కడుక్కోవడానికి చూర్ణాలు (powder & paste) కావాలి. వంటికి, జుట్టుకి రాసుకునే ఆమలకం (ఉసిరికాయలతో చేసిన ముద్ద), సున్నిపిండి, నూనె మొదలైనవి మంచి మంచి బంగారు పాత్రలలో కావాలి. కొన్ని వేలమంది అప్సరసలు వచ్చి, ఒక్కొక్క సైనికుడిని పీఠం మీద కూర్చోబెట్టి ఒళ్ళంతా నూనె రాసి, నలుగు పెట్టి స్నానం చేయించాలి. ఇక్కడున్న వాళ్ళలో బాగా గెడ్డాలు పెంచుకున్న ఋషులు, బ్రాహ్మణులు ఉన్నారు. వాళ్ళు గెడ్డం దువ్వుకోవడానికి మంచి దువ్వెనలు రావాలి. వీళ్ళు ఇవన్నీ తిన్నాక ఇంకా తినాలనిపిస్తే, తొందరగా జీర్ణం అవ్వడానికి ఔషధాలు కావాలి. అందుకని ఓ సోముడా!, చంద్రుడా! మీరు ఇవి సిద్ధం చేయండి. అప్సరసలు నాట్యం చేయాలి. ఇప్పటికిప్పుడు ఇక్కడ పెద్ద పళ్ళతో వెలగ చెట్లు, పనస చెట్లు పుట్టాలి. ఎక్కడెక్కడి నుంచో చిలుకలు రావాలి. కుబేరుడి రథమైన చైత్రరథం రావాలి. మామిడి చెట్లు, కుంకుడు చెట్లు పుట్టాలి. వీటితో పాటు ఎవరికి ఎంత వేడి కావాలో అంత వేడితో నీళ్ళు పుట్టాలి. అందరికీ కట్టుకోవడానికి బట్టలు, తొడుక్కోవడానికి చెప్పులు కావాలి. భరతుడి కోసం ఒక బ్రహ్మాండమైన హర్మ్యము ఏర్పడాలి” అని ప్రార్థించాడు.

అప్పుడు ఆ గుర్రాలు, ఏనుగులు తమ జీవితంలో తిననటువంటి భోజనం చేశాయి. ఒక్కొక్కరికి నలుగురు అప్సరసలు నలుగు పెట్టి స్నానం చేయించారు. భరతుడు తన మంత్రులతో కలిసి ఆ హర్మ్యములోనికి ప్రవేశించాడు. అందులో ఒక పెద్ద వేదిక, దాని మీద కనకపు సింహాసనం, దాని మీద ఒక పెద్ద గొడుగు ఉన్నాయి. లోపలికి వెళ్లిన భరతుడు ఆ సింహాసనం మీద రాముడు కూర్చున్నట్టు భావించి కిందన ఉన్న పాదపీఠానికి తల తగిలేటట్టు నమస్కారం చేసి చామరాన్ని ఒకసారి విసిరి ఇవన్నీ రాముడికి చెందవలసినవని మంత్రి కూర్చునే చోట కూర్చున్నాడు.

అప్పుడు ఆ సభలోకి రంభ మొదలైన వారు వచ్చి నాట్యం చేశారు. నారదుడు, తుంబురుడు మొదలైన వారు వచ్చి పాటలు పాడారు. ఏదన్నా తాగడానికి ఉంటే బాగుండని భరతుడు అనుకున్నాడు. వెంటనే అక్కడ ఒక పాయసపు నది ప్రవహించింది. అందరూ ఆ నది నుంచి ఎంత కావాలో అంత పాయసాన్ని బంగారు పాత్రలలో ముంచుకొని తాగారు.

అందరూ అన్నిటినీ బాగా అనుభవించారు. సైనికులందరూ బాగా తినేసి, త్రాగేసి పడుకుంటే అప్సరసలు వచ్చి వారి కాళ్ళు పట్టారు. అప్పుడు ఆ సైనికులు ‘మనం వెనక్కి అయోధ్యకు వెళ్లవద్దు, ముందు చిత్రకూట పర్వతాలకి వద్దు. ఇక్కడే భరద్వాజ ఆశ్రమంలో ఉండిపోదాం’ అని సంతోషముతో కేకలు వేస్తున్నారు. ఏనుగులు, గుర్రములు కూడా ఆనందపడ్డాయి.

మరునాడు తెల్లవారేసరికి అన్నీ అదృశ్యమయిపోయాయి.

భరతుడు, కౌసల్య, సుమిత్ర, కైక వచ్చి భరద్వాజ మహర్షి పాదములకు నమస్కారం చేశారు. అప్పుడు భరద్వాజుడు భరతుడిని దగ్గరికి పిలిచి ‘వీళ్ళు ముగ్గురూ మీ అమ్మలు కదా! వీళ్ళల్లో ఎవరు ఎవరో నాకు చెప్తావా!’ అన్నాడు.

భరతుడు, “సుమిత్ర చెయ్యి పట్టుకొని ఉన్న ఈ అమ్మ సింహములా నడవగలిగినవాడు, అదితి ధాతని (వామనుని) కన్నట్టు రామచంద్రుడిని కన్నతల్లి కౌసల్య. వీరులు, పరాక్రమవంతులైన లక్ష్మణ, శత్రుఘ్నులను కన్నతల్లి ఈ సుమిత్ర. రాముడు అరణ్యవాసానికి వెళ్లడానికి కారణమైనది, కట్టుకున్న భర్త మరణించడానికి కారణమైన దుష్ట చరిత్ర కలిగినటువంటిది, ఎప్పుడూ కోరికలు కోరుతూ క్రోధంగా ఉండేటటువంటి ఈ కైక నా తల్లి” అని అన్నాడు.

భరద్వాజుడు, “భరతా! కైకేయిని నీవు దోష దృష్టితో చూడకూడదు. రాముని అరణ్యవాసము సుఖవంతమైన ఫలితాలను ఇస్తుంది. దేవతలకి, దానవులకి, గొప్ప ఆత్మలు కలిగిన ఋషులకి రాముని అరణ్యవాసము వలన మేలు జరుగుతుంది. రాముడు అరణ్యవాసానికి వెళ్ళేటట్టు దేవతలు కైక చేత పలికించారు. అందుచేత నువ్వు ఇంక ఎన్నడూ కైక యందు దోషము పట్టకు” అన్నాడు.

భరద్వాజుడి మాటలు విన్న భరతుడు, “సరే! మీరు చెప్పినట్టే ప్రవర్తిస్తాను. రాముడు ఎక్కడున్నాడో మీరు మాకు సెలవియ్యండి” అన్నాడు.

“అయితే నువ్వు ఇలా దక్షిణాభి ముఖంగా వెళ్లి నైఋతికి తిరిగితే ఒక ఇరుకైన దారి వస్తుంది. అందులో నుంచి జాగ్రత్తగా ఏనుగుల్ని, గుర్రములని నడిపించుకుంటూ వెళితే, అక్కడ చిత్రకూట పర్వతము మీద మందాకినీ నది పక్కన రాముడు ఆశ్రమాన్ని నిర్మించుకొని ఉన్నాడు” అని భరద్వాజ మహర్షి చెప్పారు.

చిత్రకూటంలో సీతారాముల ఆనందం

అందరూ భరద్వాజ మహర్షి చెప్పిన విధంగా రాముడిని చేరుకోవడానికి బయలుదేరారు. ఈలోగా ఆ చిత్రకూట పర్వతము దగ్గర రాముడు మందాకిని నది యొక్క ప్రవాహాన్ని సీతమ్మకి చూపిస్తూ, “సీతా! నువ్వు, లక్ష్మణుడు నా పక్కన ఉండగా ఈ నదిలో స్నానం చేస్తూ, ఈ వనాలని, ఈ వనములోని మృగముల అందాలని, ఇక్కడి పర్వతాల్ని చూస్తుంటే ఎంతో ఆనందముగా ఉన్నది. నాకు అయోధ్య జ్ఞాపకము రావడము లేదు. పద్నాలుగు సంవత్సరాలు చిటికెలో గడిచిపోతాయి అనిపిస్తున్నది” అన్నాడు.

లక్ష్మణుడు తాను వేటాడి తీసుకువచ్చిన జంతువు మాంసాన్ని కాల్చి రాముడికి తినమని ఇచ్చాడు. రాముడు దాన్ని తిని, “ఇది చాలా బాగున్నది. సీతా! నువ్వు కూడా తిను” అన్నాడు. అలా తాను తెచ్చిన మాంసాన్ని సీతారాములు భుజిస్తుండగా చూస్తున్న లక్ష్మణుడు పొంగిపోయాడు. అన్నావదినలను సంతోషపెట్టానని, వారు పొందుతున్న ఆనందాన్ని చూసి తాను ఆనందపడ్డాడు.

భరతుని ఆత్రుత మరియు రాముని ఆశ్రమానికి చేరుకోవడం

రాముడి దర్శనం చేసుకోవాలని భరతుడు వేగంగా ముందుకు వెళుతున్నాడు. అప్పుడు ఆయనకు కొంత దూరంలో పొగ కనిపించింది. చెట్లకి గుడ్డలు కట్టి ఉన్నాయి. లక్ష్మణుడు రాత్రిపూట మందాకిని నుంచి నీరు తెచ్చేటప్పుడు దారి మరిచిపోకుండా ఉండడానికి ఇలా చెట్లకి గుడ్డలు కట్టాడని భరతుడు గ్రహించాడు. ఇంక రాముడు ఎంతో దూరంలో లేడని భరతుడు ఆ ఆశ్రమం వైపు వేగంగా పరుగులు తీశాడు.  

ఈ కథలోని ముఖ్యమైన అంశాలు భరతుని యొక్క రాముడిపై ఉన్న భక్తిని, గుహుని యొక్క స్నేహాన్ని, భరద్వాజుని యొక్క జ్ఞానాన్ని మరియు ఆతిథ్యాన్ని తెలియజేస్తాయి. రాముడు అరణ్యవాసంలో ఉన్నప్పటికీ, ప్రకృతి యొక్క అందాలను ఆస్వాదిస్తూ తన సోదరుడు మరియు భార్యతో ఆనందంగా ఉన్నాడు. భరతుడు తన అన్నను కలుసుకోవడానికి ఆత్రుతగా ఎదురుచూస్తున్నాడు.

https://youtu.be/bqDv7hjsgN8

  • Related Posts

    Ramayanam Story in Telugu – రామాయణం 76

    భరతుడి విన్నపం – రాముడి అంగీకారం Ramayanam Story in Telugu- భరతుడు శ్రీరాముడి శిరస్సుపై చేతులు జోడించి “అన్నయ్యా, మా అమ్మ కైకేయి గతంలో రెండు వరాలను కోరింది. ఇక్ష్వాకు వంశంలో పెద్దవాడిగా జన్మించి, రాజ్యం పొందడానికి అన్ని అర్హతలు…

    భక్తి వాహిని

    భక్తి వాహిని
    Ramayanam Story in Telugu – రామాయణం 75

    శివుని ఆశీర్వచనం Ramayanam Story in Telugu- దేవతలందరితో కలిసి అక్కడకు విచ్చేసిన శివుడు రాముడితో ఇలా పలికాడు: “నాయనా రామా! నీ తమ్ముడు భరతుడు అయోధ్యలో దీనమైన స్థితిలో ఉన్నాడు, అతడిని ఓదార్చు. నీ తల్లి కౌసల్యను ఊరడించు. కైకేయికి,…

    భక్తి వాహిని

    భక్తి వాహిని