Ramayanam Story in Telugu – రామాయణం 42

అకంపనుడి రాక మరియు నివేదన

Ramayanam Story in Telugu – అకంపనుడు అనే రాక్షసుడు రాముడు ఖర దూషణులను చంపడం చూశాడు. వెంటనే లంకా పట్టణానికి వెళ్ళాడు. రావణుడి పాదాల మీద పడి, రాముడు ఖర దూషణులను ఎలా సంహరించాడో వివరంగా చెప్పాడు.

రావణుడి ప్రశ్నలు

కోపంతో ఉన్న రావణుడు అడిగాడు: “అసలు ఆ రాముడు ఎవరు? దండకారణ్యంలో ఎందుకు ఉంటున్నాడు? వారితో ఉన్న ఆ స్త్రీ పేరు ఏమిటి? పద్నాలుగు వేల మంది రాక్షసులను రాముడు ఒక్కడే ఎలా చంపాడు? నాకు కారణం చెప్పు.”

అకంపనుడి సమాధానం

అకంపనుడు ఇలా చెప్పాడు: “దశరథుడి కుమారుడైన రాముడు సాధారణ వ్యక్తి కాదు. ఆయన గొప్ప తేజస్సు కలిగినవాడు. ఆయన తమ్ముడు లక్ష్మణుడు రాముడికి ప్రాణం లాంటివాడు, ఆయనకు కుడి భుజంలా ఉంటాడు. ఎల్లప్పుడూ రాముడిని కాపాడటమే తన ముఖ్యమైన పనిగా పెట్టుకున్నాడు. రాముడు తన భార్య సీతతో కలిసి పద్నాలుగు సంవత్సరాలు అరణ్యవాసం చేయడానికి దండకారణ్యానికి వచ్చాడు. బాధపడుతున్న ఋషులు రాక్షసుల గురించి రాముడికి చెప్పారు. రాముడు ‘మీ శత్రువులైన రాక్షసులు నాకూ శత్రువులే, వారిని తప్పకుండా చంపుతాను’ అని ఋషులకు మాట ఇచ్చాడు. ఆ మాట ప్రకారం రాక్షసులందరినీ చంపి, దండకారణ్యంలో ఒక్క రాక్షసుడు కూడా లేకుండా చేశాడు. రాముడు తన బాణాలతో ఈ భూమిని ముంచగలడు, మునిగిపోతున్న భూమిని నిలబెట్టగలడు. సముద్రాలను కలవరపెట్టగలడు, పర్వతాలను కదిలించగలడు” అని అకంపనుడు రాముడి యొక్క గొప్ప పరాక్రమాన్ని వివరించాడు.

రావణుడి ప్రతిస్పందన

“నేను ఇప్పుడే వెళ్ళి ఆ రామలక్ష్మణులను చంపుతాను” అని రావణాసురుడు అన్నాడు.

అకంపనుడు చెప్పాడు: “మీరు తొందరపడి వెళ్ళవద్దు. ఎందుకంటే వేగంగా ప్రవహించే నదిలోకి వెళ్లడం మంచిది కాదు. మీరు ఆయన ముందు నిలబడలేరు. రాముడిని చంపడానికి ఒకే ఒక మార్గం ఉంది. రాముడి భార్య సీత చాలా అందంగా ఉంటుంది. సీత అంత అందమైన వాళ్ళు గంధర్వులలో కానీ, యక్షులలో కానీ, కిన్నెరులలో కానీ, రాక్షసులలో కానీ, మనుష్యులలో కానీ ఎవరూ లేరు. కాబట్టి రాముడు లేని సమయం చూసి సీతను అపహరించి తీసుకొచ్చి నీ భార్యను చేసుకోండి. సీత పక్కన లేకపోతే రాముడు బతకలేడు. సీతను కోల్పోయిన రాముడు తనంతట తానుగా చనిపోతాడు. అందుచేత మీరు మోసంతో రాముడిని చంపడానికి ప్రయత్నించండి.”

రావణుడు మారీచుడి వద్దకు

రావణుడు వెంటనే బయలుదేరి మారీచుడి ఆశ్రమానికి వెళ్ళి “నాకు ఒక ముఖ్యమైన పని ఉంది, నీకు మాయలు తెలుసు. సీతను అపహరించడంలో నాకు సహాయం చెయ్యి” అని అడిగాడు.

ఈ మాటలు విన్న మారీచుడు “నీకు సీతను అపహరించమని ఎవరు చెప్పారు? బహుశా నిన్ను చంపడానికి నీ శత్రువు ఒక సలహాదారుడిలా వచ్చి ఉన్నాడు. వాడు నిన్నే కాదు, మొత్తం రాక్షస జాతిని నాశనం చేయాలని అనుకుంటున్నాడు. ఆ పని చేయడానికి వాడు నీకు రాముడితో శత్రుత్వం పెట్టాడు. రాముడితో శత్రుత్వం పెట్టుకున్నవాడు ఎవ్వడూ బతకడు. రాముడి శక్తి సామర్థ్యాలు నాకు తెలుసు. నా మాట విని సీతను అపహరించవద్దు” అని చెప్పాడు.

రావణుడి తిరుగుబాటు

“నువ్వు ఇంతగా చెప్తున్నావు కాబట్టి నేను సీతను అపహరించను” అని రావణుడు వెనక్కి వెళ్ళిపోయాడు.

శూర్పణఖ లంకకు రావడం

ఇక కథ ప్రకారం చూస్తే… అకంపనుడు వెళ్ళిపోయిన తరువాత శూర్పణఖ లంకా పట్టణంలోకి ప్రవేశించింది. ఇంద్రుడి చుట్టూ దేవతలు సభలో కూర్చున్నట్లు, ఆ రావణుడి చుట్టూ మంత్రులు కూర్చొని ఉన్నారు. రావణుడు దేవతల చేత, గంధర్వుల చేత, యక్షుల చేత, కింపురుషుల చేత చంపబడడు. సభలో నోరు తెరుచుకొని ఉన్న రావణాసురుడిని చూస్తే, నోరు తెరిచి మీదకు వస్తున్న యమధర్మరాజు గుర్తుకు వస్తాడు.

దేవతలతో అనేకసార్లు యుద్ధాలు చేయడం వలన ఆయన గుండెల మీద ఇంద్రుడి వజ్రాయుధం దెబ్బలు ఉన్నాయి. అలాగే ఐరావతం తన దంతాలతో పొడిచినప్పుడు తగిలిన గాయాలు కూడా కనబడుతున్నాయి. రావణాసురుడు ఇరవై చేతులతో, పది తలలతో, విశాలమైన వక్షస్థలంతో ఉన్న మహావీరుడు. రాజులకు ఉండవలసిన లక్షణాలతో ప్రకాశిస్తున్నాడు. బాగా కాల్చిన బంగారు కుండలాలు పెట్టుకున్నాడు. విశాలమైన భుజాలతో ఉన్నాడు. తెల్లటి పళ్ళతో, పర్వతం లాంటి నోటితో ఉన్నాడు. శ్రీ మహావిష్ణువు యొక్క చక్రం చేత కొట్టబడినప్పుడు తగిలిన దెబ్బలు ఆయన శరీరం మీద ఉన్నాయి. అలాగే మిగిలిన దేవతల ఆయుధాల దెబ్బలు కూడా ఆయన ఒంటి మీద ఉన్నాయి. అంతమంది దేవతల దెబ్బలు తిన్నా ఆయన ఎప్పుడూ బాధపడలేదు. ఆయన అప్పుడప్పుడు సముద్రాలను కలియతిప్పుతూ ఉంటాడు. పర్వతాలను విసురుతూ వ్యాయామం చేసేవాడు. కావాలని వెళ్ళి దేవతలతో యుద్ధం చేసేవాడు. ఎక్కడైనా ఎవరైనా ధర్మ మార్గంలో ఉంటే వారిని హింసిస్తాడు. ఇతరుల భార్యలను బలవంతంగా తీసుకొచ్చి అనుభవించడం ఆయనకు చాలా ఇష్టం.
ఆయనకు అనేక రకాలైన అస్త్రాలను ప్రయోగించడం, వాటిని తిరిగి తీసుకోవడం తెలుసు. ఎవరైనా యజ్ఞాలు చేస్తుంటే తనకున్న శక్తితో ఆ యజ్ఞాన్ని నాశనం చేసేవాడు. ఒకసారి పాతాళంలో ఉన్న వాసుకిని ఓడించాడు. అలాగే తక్షకుడి భార్యను తీసుకొచ్చి తన భార్యగా చేసుకున్నాడు. కైలాసంలో కుబేరుడితో యుద్ధం చేసి ఆయన దగ్గర ఉన్న పుష్పక విమానాన్ని తెచ్చుకున్నాడు (కుబేరుడు స్వయంగా రావణుడికి అన్న. కుబేరుడు మొదటి భార్య కొడుకు, రావణుడు రెండవ భార్య కొడుకు). ఉత్తర భారతంలో చైత్రరథం అనే అందమైన వనం ఉందని ఎవరో చెబితే రావణుడు అక్కడికి వెళ్ళి, ఇంత అందమైన వనం నాకు లేనప్పుడు ఎవరికీ ఉండకూడదని ఆ వనాన్ని నాశనం చేశాడు. స్వర్గలోకంలోని నందనవనాన్ని నాశనం చేశాడు. అప్పుడప్పుడు ఆకాశంలో నిలబడి సూర్యచంద్రుల గమనాన్ని ఆపుతాడు.
రావణుడు బ్రహ్మదేవుడి కోసం పదివేల సంవత్సరాలు తపస్సు చేశాడు. అన్ని సంవత్సరాలు తపస్సు చేసినా బ్రహ్మదేవుడు ప్రత్యక్షం కాకపోవడంతో తన పది తలకాయలు నరికి అగ్నిలో వేశాడు. అప్పుడు బ్రహ్మదేవుడు సంతోషించి ఏమి కావాలో అడుగగా…

“పాముల చేత, యక్షుల చేత, గంధర్వుల చేత, కిన్నెరుల చేత, కింపురుషుల చేత ఎవ్వరి చేత నాకు మరణం కలగకూడదు” అని అడిగాడు. రావణుడు మనుషుల చేత మరణించకూడదని అడగలేదు. యజ్ఞాలలో దేవతలకు సమర్పించే సోమరసాన్ని ఆయన అపహరించేవాడు. ఎక్కడైనా యజ్ఞం పూర్తవబోతుందంటే అక్కడికి వచ్చి ఆ యజ్ఞాన్ని ధ్వంసం చేయడం రావణుడికి చాలా ఇష్టం. ఎల్లప్పుడూ దుష్ట ప్రవర్తనతోనే ఉంటాడు. (ఒకసారి రావణుడు కైలాస పర్వతాన్ని ఎత్తాలని చూస్తే పరమశివుడు తన బొటన వేలితో ఆ పర్వతాన్ని కిందకు తొక్కాడు. అప్పుడు రావణుడి రెండు చేతులూ ఆ పర్వతం కిందనే ఉండటంతో రావణుడు గట్టిగా అరిచాడు. ముల్లోకాలను భయపడేలా చేసే విధంగా అరిచాడు కాబట్టి (రవం చేశాడు కాబట్టి) ఆయనను రావణ అని పిలిచారు.)

రావణాసురుడు సర్వ లోకాలకు, సర్వ ప్రాణులకు భయంకరుడు. అలాంటి రావణుడు మంత్రుల చేత చుట్టబడి ఉండగా శూర్పణఖ భయపడుతూ ఆయన దగ్గరికి వెళ్ళి “నువ్వు ఎప్పుడూ నీచమైన భోగాలను అనుభవిస్తూ ఉంటావు. కామానికి, కోపానికి లోబడిపోయావు. నీకు రాజ్యపాలన మీద ఇష్టం లేదు. సరైన గూఢచారులను నియమించుకోలేదు. నీ రాజ్యంలో ఏమి జరుగుతుందో నీకు తెలియడం లేదు. స్మశానంలో ఉన్న అగ్నిని ఎవరూ ముట్టుకోనట్లు, సింహాసనం మీద కూర్చున్న నీలాంటి వాడిని చూసి ప్రజలు దగ్గరికి రారు. నీ గూఢచారులు ఎక్కడ ఏమి జరుగుతుందో తెలుసుకోరా? తెలుసుకున్నా నీకు వచ్చి చెప్పరా? చెప్పినా నువ్వు బాధపడవా? రోజురోజుకి నీ శత్రువులు పెరిగిపోతున్నారు. నువ్వు మాత్రం కామంతో కళ్ళు మూసుకుని ఉండిపోయావు. ఒక్కసారి నువ్వు రాజ్యం నుండి తొలగించబడితే అవకాశం దొరికిందని ప్రజలు నిన్ను కొట్టి చంపుతారు. నీ కీర్తి అంతా సముద్రంలో ఉన్న పర్వతంలా ప్రకాశించడం మానేస్తుంది.
నువ్వు దండకారణ్యంలో మునులను హింసించమని పద్నాలుగు వేల మంది రాక్షసులను పెట్టావు. ఒక్క రాముడు భూమి మీద నిలబడి ఇంతమందిని చంపేశాడు. ఇవన్నీ తెలుసుకోకుండా నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు ప్రవర్తిస్తున్నావు, కొద్దికాలంలోనే నీ పతనం ప్రారంభమవుతుంది” అన్నది.

రావణుడి ప్రశ్నలు మరియు శూర్పణఖ సమాధానం

శూర్పణఖ మాటలు విన్న రావణుడు “అసలు ఆ రాముడు ఎవరు? అరణ్యానికి ఎందుకు వచ్చాడు? ఆయన దగ్గర ఉండే ఆయుధాలు ఏమిటి? రాక్షసులను ఎందుకు చంపాడు? నీ ముక్కు చెవులను ఎవరు కోశారు? నువ్వు చూసింది చూసినట్లు నాకు చెప్పు” అన్నాడు.

శూర్పణఖ ఇలా చెప్పింది: “రాముడు పొడవైన చేతులతో, విశాలమైన కళ్ళతో, మునులలాగా నార చీర, కృష్ణాజినం వేసుకొని, మన్మథుడిలా అందమైన రూపంతో ఉంటాడు. ఆయన దశరథ మహారాజు పెద్ద కుమారుడు. దేవేంద్రుడు పట్టుకున్నట్లు ధనుస్సును పట్టుకొని నారాచ బాణాలను సంధిస్తే అవి నోరు తెరుచుకొని విషం కక్కుతూ వస్తున్న మహా సర్పాలలాగా ఉంటాయి. రాముడు పద్నాలుగు వేల మంది రాక్షసులను చంపుతున్నప్పుడు నేను అక్కడే ఉన్నాను. చంపినవాడు రాముడని నాకు తెలుసు. రాముడు బాణం ఎప్పుడు తీసి, వింటి నారికి ఎప్పుడు తొడిగి, ఎప్పుడు గురి చూసి వదిలాడో నేను చూడలేదు. రాక్షసుల తలకాయలు టకటక తెగిపోవడం నేను చూశాను. రాముడు అంత వేగంగా బాణ ప్రయోగం చేస్తాడు. రాముడితో గుణాల యందు, తేజస్సు యందు సమానమైనవాడు ఆయన తమ్ముడు లక్ష్మణుడు ఉన్నాడు.

లక్ష్మణుడు రాముడికి కుడి భుజంలా బయట తిరుగుతున్న ప్రాణంలా ఎల్లప్పుడూ రాముడిని రక్షిస్తూ ఉంటాడు. రాముడి భార్య పేరు సీత. ఆమె నిండు చంద్రుడిలా ఉంటుంది. విశాలమైన కళ్ళు కలిగి ఉంటుంది. నిరంతరం రాముడిని ఎంతో ప్రేమతో సేవిస్తూ ఉంటుంది. ఆమె నల్లటి జుట్టుతో, అందమైన ముక్కుతో, అందమైన రూపంతో ఎంతో కాంతివంతంగా ఉంటుంది. ఆవిడ సాక్షాత్తు ఇంకొక శ్రీలక్ష్మిలా ఉంటుంది. కాల్చి తీసిన బంగారు రంగులో ఆవిడ శరీరం ఉంటుంది, ఎర్రటి రక్తం లోపలి నుంచి కనబడుతున్న తెల్లటి గోళ్ళతో ఉంటుంది. పద్మం లాంటి ముఖంతో, సన్నటి నడుముతో ఉంటుంది. ఆవిడ గంధర్వులకు, యక్షులకు, కిన్నెరులకు, దానవులకు చెందినది కాదు, ఒక మనిషి స్త్రీ. ఈ భూమండలంలో నేను ఇప్పటివరకు అటువంటి అందమైన స్త్రీని చూడలేదు. సీత ఎవరిని గట్టిగా కౌగలించుకుంటుందో, ఎవడు సీతకు భర్త అని అనిపించుకుంటాడో, వాడే మూడు లోకాల్లో ఉన్న సంపదను పొందినవాడు, వాడు ఇంద్రుడితో సమానమైన కీర్తిని గడించినవాడు. నాకు ఆ సీతను చూడగానే ఈమె మా అన్నయ్యకు భార్య అయితే ఎంత బాగుంటుందో అనిపించింది. అందుకని నేను సీతను తీసుకురావడానికి ప్రయత్నిస్తే లక్ష్మణుడు నా ముక్కు, చెవులు కోసేశాడు అన్నయ్యా! నువ్వు కానీ సీతను చూస్తే మన్మథ బాణాలకు వశమైపోతావు. నిజంగా నీకు సీతను భార్యగా చేసుకోవాలని ఉంటే ఇంక ఆలోచించకుండా వెంటనే బయలుదేరు. నువ్వు సీతను నీ సొంతం చేసుకో. అడ్డు వచ్చిన రాముడిని చంపు” అన్నది.

 Ramayanam Story in Telugu- ఈ కథ అంతా ధర్మం-అధర్మం మధ్య యుద్ధానికి సంకేతం. ఒకవేళ రావణుడు మారీచుని మాట వినుండి, ధర్మాన్ని గౌరవించి ఉంటే ఇతివృత్తం మారిపోయేది. కానీ రావణుడు దురహంకారంతో, కామానికి బానిసై, అధర్మపు మార్గాన్ని ఎంచుకున్నాడు.

https://youtu.be/bqDv7hjsgN8

  • Related Posts

    Ramayanam Story in Telugu – రామాయణం 76

    భరతుడి విన్నపం – రాముడి అంగీకారం Ramayanam Story in Telugu- భరతుడు శ్రీరాముడి శిరస్సుపై చేతులు జోడించి “అన్నయ్యా, మా అమ్మ కైకేయి గతంలో రెండు వరాలను కోరింది. ఇక్ష్వాకు వంశంలో పెద్దవాడిగా జన్మించి, రాజ్యం పొందడానికి అన్ని అర్హతలు…

    భక్తి వాహిని

    భక్తి వాహిని
    Ramayanam Story in Telugu – రామాయణం 75

    శివుని ఆశీర్వచనం Ramayanam Story in Telugu- దేవతలందరితో కలిసి అక్కడకు విచ్చేసిన శివుడు రాముడితో ఇలా పలికాడు: “నాయనా రామా! నీ తమ్ముడు భరతుడు అయోధ్యలో దీనమైన స్థితిలో ఉన్నాడు, అతడిని ఓదార్చు. నీ తల్లి కౌసల్యను ఊరడించు. కైకేయికి,…

    భక్తి వాహిని

    భక్తి వాహిని