Categories: రామాయణం

Ramayanam Story in Telugu – రామాయణం 43

Ramayanam Story in Telugu- అందరూ వెళ్ళిపోయాక రావణుడు నిశ్శబ్దంగా వాహనశాలకి వెళ్ళి సారథిని పిలిచి ఉత్తమమైన రథాన్ని సిద్ధం చెయ్యమన్నాడు. రావణుడు బంగారంముతో చెయ్యబడ్డ పిశాచాల వంటి ముఖములున్న గాడిదలు కట్టిన రథాన్ని ఎక్కి సముద్ర మార్గము మీదుగా పయనమయ్యి వెళుతుండగా ఆయనకి ఒక పెద్ద వటవృక్షము కనబడింది.

గరుత్మంతుని కథ

తన తల్లి అయిన వినతకి దాస్య విముక్తి చెయ్యడానికి గరుత్మంతుడు అమృతము తేవడానికి బయలుదేరేముందు తన తండ్రి అయిన కశ్యపుని నేను ప్రయాణము చేసేటప్పుడు ఆకలి వేస్తుంది కదా! అప్పుడు ఆహారం ఎక్కడ దొరుకుతుందని అడిగితే కశ్యపుడు “నువ్వు హిమాలయ పర్వతాలకి దగ్గరగా వెళుతున్నప్పుడు ఒక పెద్ద సరోవరము కనబడుతుంది. ఆ సరోవరము ఒడ్డున రెండు గజకచ్ఛపాలు కొట్టుకుంటూ ఉంటాయి (ఒక తాబేలు ఒక ఏనుగు). పూర్వకాలములో ఒక బ్రాహ్మణుడికి విభాసుడు, సుప్రతీకుడు అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆ బ్రాహ్మణుడు మరణించిన కొంత కాలానికి ఆ అన్నదమ్ముల మధ్య ఆస్తి పంపకాలలో తేడాలు వచ్చి ఒకరిని ఒకరు శపించుకున్నారు. విభాసుడు సుప్రతీకుడిని ఒక పెద్ద ఏనుగుగా, సుప్రతీకుడు విభాసుడిని ఒక పెద్ద తాబేలుగా అవ్వమని శపించుకున్నారు. ఆ తాబేలు చుట్టుకొలత పది యోజనములు, మందము మూడు యోజనములు ఉంటుంది. ఏనుగు ఆరు యోజనముల ఎత్తు, పన్నెండు యోజనముల పొడువు ఉంటుంది. ఏనుగు తాబేలుని బయటకి లాగాలని చూస్తుంటుంది. తాబేలేమో ఏనుగుని నీళ్ళల్లోకి లాగెయ్యాలని చూస్తు ఉంటుంది. అవి అలా కొన్ని వేల సంవత్సరముల నుండి కొట్టుకుంటూ ఉన్నాయి. అవి అలా కొట్టుకుంటూ ఉండడము వలన ఆ చుట్టుపక్కల ఎవరూ ఉండడము లేదు. ఆకలి వేస్తే ఆ రెండిటినీ తినేసెయ్యి” అన్నాడు. గరుత్మంతుడు సరే అని బయలుదేరాడు. వెళుతూ వెళుతూ ఏనుగుని, తాబేలుని చూశాడు. ఆ రెండింటినీ తన కాలి గోళ్ళతో పైకి ఎత్తి న్యగ్రోధం అనే మహావృక్షము యొక్క కొమ్మ మీద ఆ రెండిటినీ పెట్టాడు. ఆ గజకచ్ఛపాల బరువుకి ఆ కొమ్మ విరిగిపోతుండగా, గరుత్మంతుడు తన ముక్కుతో ఆ కొమ్మని పైకి ఎత్తి ఒక భద్రమైన స్థానానికి చేర్చాడు. ఆ గజకచ్ఛపాలని ఒక పర్వతము మీద పెట్టుకొని తినేశాడు. ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి అమృతాన్ని తెచ్చి వినతని దాస్యం నుండి విముక్తురాలిని చేశాడు. ఆనాడు గరుత్మంతుడు ఆ గజకచ్ఛపాలని పెట్టినది ఈ వృక్షం మీదనే.

మారీచుని ఆశ్రమం

రావణుడు న్యగ్రోధం అనే వృక్షమును చూసి కిందకి దిగి చూసేసరికి ఆయనకి ఒక తాపస ఆశ్రమము కనబడింది. ఆ ఆశ్రమంలోకి వెళ్ళి చూడగా అందులో నారచీర కట్టుకొని, జటలు వేసుకొని, నియమముతో ఆహారాన్ని తింటూ ఒకప్పుడు రాక్షసుడైనటువంటి మారీచుడు కనబడ్డాడు.

రావణుడి విన్నపం

రావణాసురుడు “ఓ మారీచా! నేను ఇప్పుడు చాలా కష్టములో ఉన్నాను. నీవంటి మహాత్ముడు కాకపోతే నాకు ఎవరు ఉపకారం చేస్తారు? నువ్వు నాకు తప్పకుండా ఉపకారం చెయ్యాలి. నీకు తెలుసు కదా! జనస్థానములో పదునాలుగువేల రాక్షసులను నియమించి మునులయొక్క ధర్మాల్ని, యజ్ఞములని నాశనము చెయ్యమని చెప్పాను. నేను చెప్పిన పనులని వాళ్ళు ఎంతో శ్రద్ధా భక్తులతో ఆచరిస్తుండగా ఎక్కడినుంచో రాముడు వచ్చి ఖరుడిని, దూషణుడిని, త్రిశిరస్కుడిని, మహాకపాలుడిని మరియు పధ్నాలుగు వేలమంది రాక్షసులను ఒక్కడే చంపేశాడు. నా మనస్సుకి ఎంత బాధగా ఉన్నదో తెలుసా! రాముడు కర్కశుడు, తీక్ష్ణ స్వభావము ఉన్నవాడు. మూర్ఖుడు, లుబ్ధుడు, ఇంద్రియాలని జయించనివాడు. ధర్మాన్ని విడిచిపెట్టినవాడు. అన్ని ప్రాణులను భయపెట్టేవాడు. దశరథుడికి అసహ్యము వేసి రాముడిని అరణ్యాలకి వెళ్ళగొట్టాడు. నేను రాముడిని బాధపెట్టాలని అనుకుంటున్నాను. ఏ పాపం ఎరుగని నా చెల్లి శూర్పణఖ ముక్కు చెవులు కోసేశాడు. నన్ను ఇంత బాధపెట్టిన రాముడిని బాధపెట్టడానికి ఆయన భార్య అయిన సీతని అపహరించి తీసుకొద్దామని అనుకుంటున్నాను. రాముడితో యుద్ధం చేసి సీతని తీసుకురావడమనేది చాలా కష్టముతో కూడుకున్న పని. అందుకని ఏ యుద్ధము చెయ్యకుండా పని జరిగిపోయే ఉపాయం ఒకటి నేను ఆలోచించాను. ఇప్పుడది నీకు చెబుతాను విను. నీకు సమస్త మాయలు తెలుసు. నువ్వు బంగారు లేడిగా మారిపో. నీ ఒంటిమీద వెండి చుక్కలు ఉండాలి. ఇంతకుముందు ఎవ్వరూ చూడని కొమ్ములు ఉండాలి. నువ్వు సీత కంటపడేటట్టుగా ఆశ్రమములో పరిగెత్తుతూ అటూ ఇటూ ఆడు. సీత నిన్ను చూసి ఆ మృగము కావాలని అడుగుతుంది. సీత కోరిక తీర్చడము కోసము రాముడు నీ వెనకాల వస్తాడు. నువ్వు అదృశ్యమవుతూ, కనబడుతూ రాముడిని చాలా దూరము తీసుకువెళ్ళు. కొంత దూరం వెళ్ళాక హా! సీతా! హా! లక్ష్మణా! అని రాముడి కంఠముతో అరిస్తే రాముడికి కష్టం వచ్చిందనుకొని సీత లక్ష్మణుడిని పంపిస్తుంది. అప్పుడు నేను వెళ్ళి సీతని, రాహువు చంద్రుడిని ఎత్తుకొచ్చినట్టు ఎత్తుకొస్తాను. అందుకని నువ్వు బంగారు జింకగా మారు” అన్నాడు.

మారీచుని ప్రతిస్పందన

సంఘటనవివరణ
రావణుడి న్యాయవాదంరావణుడు తన కష్టాల్ని మారీచుడితో పంచుకోవాలని కోరాడు.
మారీచుడు గూర్చి భావనమారీచుడు రావణుడు చెప్పిన అబద్ధాలను ఖండిస్తూ, రాముడిని ధర్మాధారుడిగా మన్నించాల్సిన అవసరం ఉందని చెప్పాడు.

ఈ మాటలు విన్న మహాత్ముడైన మారీచుడు, దేవతలు కనురెప్ప వెయ్యకుండా ఎలా నిలుచుంటారో అలా నిలుచుండిపోయాడు. శవం నిలబడితే ఎలా ఉంటుందో అలా నిలబడ్డాడు. తరువాత ఆయన అన్నాడు.

“రావణా! మన మనస్సుకి ఇష్టమయ్యేటట్టు మాట్లాడేవాళ్ళు చాలామంది దొరుకుతారు, కాని వాళ్ళు మనన్ని అభ్యున్నతి వైపుకి నడిపించేటట్టుగా మాట్లాడేవారు కాదు. కొంతమంది మాట్లాడితే అప్రియంగా మాట్లాడినట్టు ఉంటుంది, కాని ఆ మాటలలో అవతలివారి అభ్యున్నతిని గూర్చిన మాటలు ఉంటాయి. అలా మనకి మంచి చెప్పేవాడు దొరకడు. ఒకవేళ అలాంటివాడు దొరికినా వినేవాడు దొరకడు. నీకు ఎవరో గూఢచారులు చెబితే రాముడి గురించి విన్నావు. ఆ గూఢచారి పరమ దుర్మార్గుడు. నీ మీద కక్షకట్టి నీ ప్రాణములు తియ్యాలని చూస్తున్నాడు. అందుకని నీకు అన్నీ అసత్యములు చెప్పాడు. నువ్వు ఇప్పటిదాకా రాముడి గురించి చెప్పినవన్నీ అబద్ధాలు. రాముడు మహా ధర్మాత్ముడు. మహేంద్రుడికి, వరుణుడికి ఎటువంటి పరాక్రమము ఉంటుందో రాముడికి అలాంటి పరాక్రమము ఉన్నది. అందరూ వచ్చి రాజ్యం తీసుకో అని అడిగినా తన తండ్రిని సత్యమునందు నిలబెట్టడము కోసమని రాముడు అరణ్యాలకి వచ్చాడు. నీ మాటలు వింటుంటే నాకు ఒక అనుమానము వస్తుంది. సీతమ్మ మానవ స్త్రీ కాదు. నిన్ను చంపడానికి రాక్షస కులాన్ని నాశనము చెయ్యడానికి భూమిమీదకి వచ్చిన దేవతా స్త్రీ. నీకు పుట్టిన ఈ నీచమైన కోరిక వలన నువ్వు నశించిపోతావు, నీతోపాటుగా లంకా పట్టణము నశించిపోతుంది, రాక్షసులందరూ భూమిమీద పడి నశించిపోతారు. నీకు ఎవరో అబద్ధాలు చెప్పారు. ఆ మాటలు విని అన్నీ నీకు తెలుసనుకొని ఆ మాటలు ఇంకొకరికి చెబుతున్నావు. నువ్వు రాజువి ఇంత చపలబుద్ధితో ఉండకూడదు.

ప్రపంచంలో ఉన్న ధర్మాన్ని తీసుకొచ్చి ఒకచోట పోసి, దానికి ప్రాణం పోస్తే ఆయనే రాముడు. సత్యమే పరాక్రమముగా కలిగినవాడు. ఈ లోకములన్నిటికి రాజు. రాముడి జోలికి వెళితే నువ్వు నాశనమయిపోతావు. నీకు తెలియక సీతమ్మని తీసుకొస్తాను అంటున్నావు, ఆమె బూది కప్పిన నిప్పు. తన తేజస్సుతో తనని రక్షించుకోగలదు. ఆమె కారణజన్మురాలు. రాముడి యొక్క కోదండం నీడలో రక్షింపబడుతున్న సీతమ్మని అపహరించి తేవడం నీ తరం కాదు రావణా! ఆవిడని అపహరించడానికి నీ శక్తి సరిపోదు.

నీకు రాజ్యం ఉన్నది. నిన్ను కామించన భార్యలు కొన్ని వేల మంది ఉన్నారు. వాళ్ళతో నువ్వు హాయిగా జీవితాన్ని గడపాలి అనుకుంటే రాముడి పట్ల అప్రియాన్ని మాత్రము చెయ్యకు. నీకు ఒక విషయము చెబుతాను గుర్తుపెట్టుకో. నేను కూడా ఒకప్పుడు నీలాగే విర్రవీగాను. ఆ రోజుల్లో నేను నల్లటి శరీరంతో ఉండి బంగారు కుండలాలు పెట్టుకొని వర గర్వముతో మదించి ఉండేవాడిని. ఆ సమయంలో విశ్వామిత్రుడంతటివాడు యాగం చేస్తుంటే నేను ఆ యాగాన్ని ధ్వంసము చేశాను. విశ్వామిత్రుడు అయోధ్య నుంచి రాముడిని, లక్ష్మణుడిని తీసుకొచ్చాడు. వాళ్ళిద్దరూ యాగం చుట్టూ తిరుగుతూ ఆ యాగాన్ని రక్షిస్తున్నారు. యాగం చివరికి వచ్చాక ఆ యాగాన్ని ధ్వంసం చెయ్యాలనుకొని నేను ఆకాశమార్గములో వచ్చి చూశాను. ఇప్పుడు నీకెంత పొగరు ఉన్నదో అప్పుడు నాకంత పొగరు ఉండేది.

నేను కిందకి చూసేసరికి, మెడలో ఒక బంగారు గొలుసు వేసుకుని, మీసాలు కూడా సరిగ్గా రాక పద్మములవంటి కన్నులు, ఒక్క వస్త్రము కట్టుకుని, చేతిలో కోదండము పట్టుకొని పిలక పెట్టుకొని ఉన్నవాడిని చూశాను. విశ్వామిత్రుడు వెళ్ళి ఈ పిల్లవాడినా తీసుకొచ్చింది. వీడా నన్ను చంపేవాడు! అని నువ్వు ఎలా అనుకున్నావో నేను కూడా అలానే అనుకున్నాను. బాలచంద్రుడివంటి ముఖముతో ఉన్న ఆ రాముడు నన్ను ఏమి చేస్తాడులే అని నేను ఆ యాగ గుండములో రక్తాన్ని వర్షించాను. రాముడు నన్ను ఒక బాణము పెట్టి కొడితే నేను నూరు యోజనముల అవతల సముద్రములో పడిపోయాను. కొంతకాలానికి నాకు తెలివి వచ్చింది. అప్పటినుంచి నాకు రాముడన్నా, రామబాణం అన్నా హడల్.

పాములున్న సరోవరములోకి చేరిన చేపలు ఎలా నశించిపోతాయో తాను ధర్మంగా బతుకుతున్నా అధర్మాత్ముడితో స్నేహంపెట్టుకున్నవాడు కూడా అలానే నశించిపోతాడు. అందుకని నీతో స్నేహం పెట్టుకోవడానికి నాకు భయంగా ఉన్నది. అసలు నీకు పరుల భార్యలని తెచ్చుకోవాలనే కోరిక ఏమిటి? నీకు ఉన్నటువంటి వేల భార్యలతో సుఖముగా ఉండలేవా? ఇప్పటిదాకా బాగానే ఉన్న నీకు ఇటువంటి పాడు బుద్ధి ఎందుకు కలిగింది? రాముడి జోలికి వెళ్ళమాకు నాశనమయిపోతావు.

ఆనాడు రాముడి బాణపు దెబ్బ తిన్నాక కొంతకాలానికి నాకు మళ్ళీ అహంకారం పుట్టుకొచ్చింది. రాముడు మళ్ళీ కనబడడులే అని ఒక పెద్ద మృగ రూపము పొంది నాకున్న పాత స్నేహితులిద్దరితో కలిసి తాపసులని చంపి వారిని భక్షిద్దామని మేము బయలుదేరాము. అలా కొన్ని ఆశ్రమాల మీద దాడి చేసి తాపసులని భుజించాము. తరువాత మేము అలా తిరుగుతుండగా నాకు నారచీర కట్టుకుని, జటలు వేసుకొని, సీతమ్మతో, లక్ష్మణుడితో కలిసి కోదండం పట్టుకుని ఉన్న రాముడు కనిపించాడు. అయితే రాముడు మారిపోయాడు. ఇప్పుడాయన ఒక తాపసి కనుక నేను తినేయ్యచ్చు అనుకొని, నా స్నేహితులిద్దరిని ప్రోత్సహించి రాముడి మీదకి పంపాను. అప్పుడు రాముడు వాళ్ళిద్దరిని రెండు బాణములతో సంహరించాడు. నేను కనపడితే రాముడు నన్ను చంపేస్తాడని ఆయనకి కనపడకుండా పారిపోయి వచ్చేసాను. అప్పటినుంచీ నాకు నిద్రలో కూడా రాముడు కోదండము పట్టుకొని కనపడుతున్నాడు. నేను ఉలిక్కిపడి లేచిపోతుంటాను. అప్పటినుంచి చంపడాలు మానేసి నారచీర కట్టుకుని, శాఖాహారము తింటూ తపస్సు చేసుకుంటున్నాను.

నేను ఏ కందమూలములు తెచ్చుకుందామని బయటకి వస్తే ప్రతి కొమ్మ మీద కాయ మీద గడ్డిపరక మీద భూమి మీద నీటి మీద ప్రతీ చోట నన్ను చంపడానికి యముడు వచ్చినట్టు రాముడు కనపడుతుంటాడు. నేను బయటకి కూడా వెళ్ళడము లేదు. నాకు ఇప్పుడు కన్ను మూసినా తెరిచినా రాముడే కనపడుతున్నాడు. నాకు అంతా రామమయమై కనపడుతుంటే నేను ఎవరినీ బాధపెట్టను. ఎవరి జోలికీ వెళ్ళను. రావణా! ఇవ్వాళ నా పరిస్థితి ఏమిటో తెలుసా? నా దగ్గరికి ఎవరన్నా వచ్చి రథము అని అందామనో లేకపోతే రత్నమని అందామనో ‘ర’ అని పలుకగానే వారు తరువాత ‘మ’ అంటారేమో అని నేను పారిపోతున్నాను. నీ తీట తీరక యుద్ధం చేస్తాను అంటే యుద్ధం చేసుకో. నా మాటలు విని నీ కోరిక తీరిపోతే ఎలా వచ్చావో అలా వెళ్ళిపో. ఈ రెండిటిలో ఏదో ఒకటి చెయ్యి. ఇందులోకి నన్ను మాత్రము లాగకు.

ప్రతీసారి మా చెల్లి ముక్కు చెవులు కోసేసాడు అంటున్నావు కదా! అసలు మీ చెల్లి ఏమి చేసిందని ఆవిడ ముక్కు, చెవులు కోసేసారని మీరెవరన్నా అడిగారా? అడగకుండా వెళ్ళి ఖరుడు మరణించాడు. నువ్వు కూడా అదే మార్గంలో వెళ్ళిపోతున్నావు. నామాట విని ఇటువంటి పనులు చెయ్యకు” అని మారీచుడు అన్నాడు.

రావణుడి తిరస్కారం

మారీచుడు చెప్పిన మంచి మాటలు తలకి ఎక్కకపోవటము వలన రావణుడు ఇలా అన్నాడు “చెబుతావు ఏమిటి రాముడి గురించి అన్ని గొప్పలు చెబుతావు? రాముడు కేవలం ఒక మనిషి నాదగ్గర రాముడిని పొగడవద్దు. నా నిర్ణయము మారదు. ఖరుడు వెళ్ళిన మార్గము లోనే రాముడిని కూడా పంపుతాను. నీ సహాయంతోనే సీతని ఎత్తుకొస్తాను. నేను నిన్ను సీతని అపహరించడము కోసమని జింక వేషము వెయ్యమన్నాను. అంతేకాని ఇందులో అపాయం ఉందా! లేదా! అని నేను నిన్ను అడగలేదు. ఇవన్నీ నిన్ను ఎవడు చెప్పమన్నాడు. నువ్వు పరిధిని మించి మాట్లాడుతున్నావు. ప్రభువు నీ దగ్గరికి వచ్చి మాట్లాడుతుంటే అడిగిన ప్రశ్నకి అంజలి ఘటించి జవాబు చెప్పడము నీ బాధ్యత. ఇక అంతకన్నా ఎక్కువ మాట్లాడకూడదు. రాజు అగ్ని, ఇంద్రుడు, సోముడు, వరుణుడు, యముడు అనే ఐదు రూపాలలో ఉంటాడు. నువ్వు నా మాట వింటే నేను నీ పట్ల సౌమ్యంగా ఉంటాను. కాదంటే నేను నీకు యముడిని అవుతాను. నేను చెప్పినట్టు నువ్వు వెంటనే బంగారు లేడిగా మారి బయలుదేరు. జింకగా వెళితే రాముడి చేతిలో చస్తావో లేదో అన్నది అనుమానమే కాని వెళ్ళనంటే మాత్రము నేను నిన్ను చంపేస్తాను” అన్నాడు.

మారీచుని నిస్సహాయత

మారీచుడు “రాజు తప్పు త్రోవలో నడుస్తుంటే మంత్రులైన వారు చుట్టు చేరి నిగ్రహించాలి. అలా నిగ్రహించని మంత్రులు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. రాజ్యపాలన నిర్వహిస్తున్నవాడిని పాశములతో పట్టే స్థితిలో మంత్రులు లేకపోతే ఆ మంత్రులకి మరణశిక్ష విధించాలి. రాజే ధర్మం, రాజే జయం, రాజు వల్లనే లోకానికి రక్షణ. ఆ రాజు ధర్మం తప్పిననాడు లోకములో రక్షణ ఉండదు. ఆ రాజుని ఆశ్రయించిన వారెవరూ బ్రతకరు.

రాజన్నవాడు ప్రజల వెనకాల కొడుకుల వెనక తండ్రిలా ఉండాలి. అలా ఉండనివాడు ఆవుల వెనకాల వచ్చిన నక్కలాంటి వాడు. అలాంటివాడి వలన ఆ ప్రజలకి భద్రత ఉండదు. నీలాంటి దుర్మార్గుడు రాజుగా ఉన్న ఆ రాజ్యంతో పాటు ఆ రాక్షసులూ నశించిపోతారు. నీకు పుట్టిన ఈ నీచమైన కోరిక వలన నీ సైన్యం కూడా నశించిపోతుంది. రాముడు చూస్తుండగా సీతమ్మని తీసుకురాలేవని తెలిసి రాముడు లేనప్పుడు సీతమ్మని అపహరించాలని ప్రయత్నం చేస్తున్నావు. నీకు తెలుసు నువ్వు పిరికివాడివని యుద్ధంలో నిలబడలేవని. నువ్వు నా ప్రభువువి కనుక నా కొనప్రాణం వరకూ నువ్వు చెప్పిన పనిని చెయ్యడానికి ప్రయత్నిస్తాను. సీతమ్మ కంటే ముందు నన్ను రాముడు చూస్తే నా పని అయిపోయినట్టే రాముడిని చూసి నేను ఒక్కడినే చనిపోతాను. ఆ తరువాత సీతమ్మని తెచ్చి నువ్వు సకల బంధుపరివారము తో చనిపోతావు. ఎప్పుడైతే ఈ పని చేస్తాను అన్నానో అప్పుడే నా ప్రాణాలు పోయాయి. ఇప్పుడు నీ ముందు ఉన్నది మారీచుడు అనే బొమ్మ. ఆ బొమ్మని నీకు నచ్చినట్టు వాడుకో. నీకు ఎంత చెప్పినా నువ్వు వినడము లేదు కనుక నీ కోరిక తీర్చే ప్రయత్నము చేస్తాను పద” అని అన్నాడు.

ఈ కథ రామాయణంలోని ఒక ముఖ్యమైన ఘట్టం, ఇది సీతాపహరణానికి దారి తీస్తుంది. మారీచుని హెచ్చరికలను రావణుడు పెడచెవిన పెట్టడం అతని వినాశనానికి సూచన.

లక్షణంవివరణ
సత్యంరాముడు ధర్మానికి ప్రతీక, ప్రపంచంలో ఉన్న ధర్మాన్ని సాధించే వ్యక్తి.
పరాక్రమంఆయన ఉన్నత లక్ష్యాలకు చేరుకోవడానికి సరైన మార్గం.
రాజ్యాధికారమురాముడి రాజ్యానికి సర్వ సమాజం పట్ల మానవత్వం ఉంది.
  1. శ్రీ రామాయణం
  2. రావణుడి వధ

https://youtu.be/bqDv7hjsgN8

bakthivahini

Share
Published by
bakthivahini

Recent Posts

Bhagavad Gita 700 Slokas in Telugu – Discover the Wisdom of అధ్యాయం 7: జ్ఞాన విజ్ఞాన యోగం, శ్లోకం 14

Bhagavad Gita 700 Slokas in Telugu మన జీవితంలో ఎదురయ్యే సవాళ్లు, సందేహాలు, భయాలు సహజమే. "ఎందుకు నా…

5 hours ago

Bhagavad Gita 700 Slokas in Telugu – Discover the Wisdom of అధ్యాయం 7: జ్ఞాన విజ్ఞాన యోగం, శ్లోకం 13

Bhagavad Gita 700 Slokas in Telugu మనిషి జీవితం ఒక ప్రయాణం. ఈ ప్రయాణంలో మనం తీసుకునే ప్రతి…

1 day ago

Karthika Puranam Telugu – కార్తీక పురాణం | 22వ రోజు పారాయణ

Karthika Puranam Telugu జలంధరుని యుద్ధ సన్నాహాలు ఓ పృథురాజా! రాహువు చెప్పిన విషయాలన్నీ వినగానే, క్రోధోద్రిక్తుడైన జలంధరుడు శివుని…

2 days ago

Karthika Puranam Telugu – కార్తీక పురాణం | 21వ రోజు పారాయణ

Karthika Puranam Telugu మారుమూలల్లో తలలు దాచుకున్నా కూడా వదలకుండా ముట్టడింప వస్తూన్న జలంధరునికి భయపడినవారై దేవతలంతా విష్ణు స్తోత్రం…

2 days ago

Karthika Puranam Telugu – కార్తీక పురాణం | 20వ రోజు పారాయణ

Karthika Puranam Telugu తులసి మహాత్మ్యంపై పృధు చక్రవర్తి ప్రశ్న పృధు చక్రవర్తి నారదుడిని అడుగుతున్నాడు: 'దేవర్షీ! తులసిని స్థాపించి,…

2 days ago

Karthika Puranam Telugu – కార్తీక పురాణం | 19వ రోజు పారాయణ

Karthika Puranam Telugu నారదుడు చెబుతున్నాడు: ఓ పృథు భూపాలా! కార్తీక వ్రతం పాటించే పురుషుడు తప్పకుండా ఆచరించవలసిన నియమాలను…

2 days ago