రావణుని అంతఃపురం
Ramayanam Story in Telugu- రావణాసురుడు నిద్రపోతున్న మందిరంలోని గోడలకు కాగడాలు అమర్చబడి ఉన్నాయి. ఆయన పడుకున్న మంచం స్వచ్ఛమైన బంగారంతో చేయబడింది. అక్కడ పడుకున్న స్త్రీలు ధరించిన ఆభరణాలు ఎర్రటి బంగారంతో చేసినవి. రావణాసురుడు పెట్టుకున్న ఆభరణాలు కూడా బంగారంతో తయారైనవే.
గోడల మీద ఉన్న కాగడాల నుండి వస్తున్న వెలుతురు, అక్కడి స్త్రీల ఆభరణాల నుండి ప్రతిఫలిస్తున్న కాంతితో కలిసి, ఏదో మంటలు రేగుతున్నాయా అన్నట్లుగా ఎర్రటి కాంతి ఆ ప్రదేశాన్ని వ్యాపించి ఉంది. వెలుగుతున్న కాగడాలు కదలకుండా నిశ్చలంగా వెలుగుతున్నాయి. వాటిని చూస్తుంటే జూదంలో ఓడిపోయి ఇంటికి వెళ్ళకుండా పక్కవాడి ఆటను దీక్షగా చూస్తున్న జూదగాళ్ళలా ఉన్నాయి.
పడుకున్న స్త్రీలు ఒకరి మీద ఒకరు చేయి వేసుకుని, ఒంటి మీద దుస్తులు సరిగా లేకుండా పడుకొని ఉన్నారు. అందరి ముఖాలు తామర పువ్వుల్లా అందంగా ఉన్నాయి. వేల సంఖ్యలో ఉన్న ఆ స్త్రీలు మదంతో నిండి, రావణాసురుడితో కామభోగాలు అనుభవించి, ఎక్కువగా మద్యం సేవించి మత్తుగా, అలసిపోయి నిద్రపోతున్నారు.
అక్కడ ఉన్న వేలమంది స్త్రీలు తక్కువ కులంలో పుట్టినవారు కాదు. ఎవ్వరూ అందం తక్కువైనవారు కాదు. ఇంతకుముందు వేరొక పురుషుడిని పొందినవారు కాదు, నడవడి తెలియనివారు కాదు, వీళ్ళందరూ రావణుడిని కోరుకునే వచ్చినవారు.
రావణుని శయ్య
రావణుడు పడుకున్న మంచం బంగారంతో చేయబడింది. దానికి వైడూర్యాలతో మెట్లు అమర్చబడి ఉన్నాయి. పడుకొని ఉన్న రావణుడికి చామరం వేస్తున్న ఉత్తమమైన స్త్రీలు ఆ చామరంలో అనేక రకాల సుగంధ ద్రవ్యాలు కలిపి జాగ్రత్తగా వీస్తున్నారు. ఆ మంచం మీద, శ్రేష్ఠమైన పరుపు మీద రావణుడు పడుకొని ఉన్నాడు. హనుమంతుడు రావణుడి మంచం దగ్గరికి వెళ్ళగానే రావణుడి శరీరంలోని వెంట్రుకల కుదుళ్ళ నుండి వస్తున్న గొప్ప తేజస్సు చేత హనుమంతుడు వెనక్కి నెట్టబడ్డాడు.
హనుమంతుడు దూరంగా వెళ్ళి ఒక వేదిక మీద నుండి రావణుడిని చూస్తే, ఆకాశంలో వెళ్ళిపోతున్న ఒక నల్లటి మేఘం భూమి మీదకు దిగిపోయి మంచం మీద పడుకుంటే ఎలా ఉంటుందో రావణుడు అలా ఉన్నాడు. ఆయన పెట్టుకున్న కుండలాలు ప్రకాశిస్తున్నాయి. ఆయన అనుభవించిన సుఖం చేత, తాగిన మద్యం చేత తిరుగుతున్న ఎర్రటి కళ్ళతో ఉన్నాడు. సగం మూసిన కళ్ళతో, పెద్ద చేతులతో, మంచి దుస్తులు కట్టుకొని నిద్రపోతున్నాడు.
దేవేంద్రుడి వాహనమైన ఐరావతం తన దంతాలతో గుచ్చితే ఏర్పడిన గాయాలు రావణుడి శరీరం మీద కనపడుతున్నాయి. అలాగే శ్రీ మహావిష్ణువు తన చక్రంతో కొట్టినప్పుడు ఏర్పడిన మచ్చలు ఉన్నాయి. దేవేంద్రుడు తన వజ్రాయుధంతో కొట్టినప్పుడు తగిలిన దెబ్బలు కనపడుతున్నాయి. ఆ రావణుడు బాగా బలమైన భుజాలతో ఉన్నాడు. ఆయన చేతి గోళ్ళు ఎర్రటి కాంతితో మెరిసిపోతున్నాయి. ఆయన ఆ మంచం మీద పడుకొని ఉన్న పాములా ఉన్నాడు. ఆయన చేతులు ఇనుప గుదియల్లా ఉన్నాయి. ఆయన చేతులకు ఉన్న వేళ్ళు రెండు అయిదు తలల పాముల్లా ఉన్నాయి.
శ్రీరామ – రామాయణం విభాగం – భక్తివాహిని
అంశం | వివరణ |
---|---|
తల్పము | బంగారంతో తయారు చేయబడింది |
మెట్లు | వైడూర్యరత్నాలతో |
చామరం | పరిమళ ద్రవ్యాలతో వీస్తున్నారు |
వస్త్రములు | అత్యుత్తమమైనవి, మృదువైనవి |
శరీర మచ్చలు | దేవేంద్రుని వజ్రాయుధం, విష్ణువు చక్రం చేత ఏర్పడినవి |
నిద్రపోతున్న స్త్రీలు
హనుమంతుడు అక్కడ పడుకొని ఉన్న స్త్రీలను వెతికాడు. అక్కడ పడుకుని ఉన్న స్త్రీలలో ఒక ఆమె మృదంగాన్ని గట్టిగా పట్టుకొని పడుకున్నది. ఒక ఆమె వేణువు ఊదుతూ నిద్రపోయింది. ఒక ఆమె వీణ వాయిస్తూ నిద్రపోయింది, ఒక ఆమె పక్కన ఉన్న స్త్రీ మీద ఉన్న చీరను తీసి తన మీద దుప్పటిలా కప్పుకున్నది.
ఆ స్త్రీలు అక్కడున్న సంగీత వాయిద్యాలను గట్టిగా కౌగలించుకొని, వాటిని రావణుడిగా భావించి ముద్దు పెట్టుకుంటున్నారు. అక్కడ ఒక్క స్త్రీ ఒంటి మీద ఆభరణం కాని, వస్త్రం కాని సరిగా లేదు. అలా పడుకొని ఉన్న స్త్రీలందరినీ హనుమంతుడు చూసుకుంటూ వెళ్ళాడు.
మండోదరిని చూసిన హనుమంతుడు
రావణుడికి కొంత దూరంలో, బంగారు మంచం మీద అపారమైన అందమైన ఒక స్త్రీ పడుకొని ఉన్నది. ఆవిడ రావణుడి భార్య అయిన మండోదరి. ఆవిడని చూడగానే ‘ఈవిడే సీతమ్మ’ అని హనుమంతుడు అనుకొని, తన భుజాలను కొట్టుకుని, తోకను ముద్దు పెట్టుకుని, వింతైన పాటలు పాడి, పిల్లిమొగ్గలు వేసి, గెంతులు వేసి, స్తంభాల పైకి ఎక్కి, కిందకి దూకి తన కోతి బుద్ధిని బయట పెట్టాడు.
కొంతసేపటికి ఆయన అనుకున్నారు “మా అమ్మ సీతమ్మ, రాముడు పక్కన లేనప్పుడు ఇటువంటి పట్టు వస్త్రం కట్టుకొని, పక్కన రావణుడు ఉండగా ఇంత హాయిగా నిద్రపోతుందా? ఛీ నా బుద్ధి ఎంత తప్పుగా ఆలోచిస్తుంది! ఈమె సీతమ్మ కాదు” అనుకొని ముందుకు సాగిపోయాడు.
మద్యపాన మందిరం
అక్కడి నుండి ముందుకు వెళ్ళగా, రకరకాల బంగారు పాత్రలు, వెండి పాత్రలు, మణిమాణిక్యాలు పొదిగిన పాత్రలు, పువ్వుల నుండి తీసిన మద్యం, పండ్ల నుండి తీసిన మద్యం, తేనె నుండి తీసిన మధువులు తియ్యని వాసనలు వెదజల్లుతూ ఉన్నాయి.
అక్కడ తాగేసిన పాత్రలు, సగం తాగి కింద పడేసిన పాత్రలు, స్త్రీ-పురుషులు ఒకరి మీద ఒకరు ఉండకూడని విధంగా మత్తులో పడి ఉన్నారు. హనుమంతుడు వాళ్ళందరినీ చూసుకుంటూ ముందుకు వెళ్ళాడు. అప్పుడాయన అందరూ ఆహారం తీసుకునే ప్రదేశానికి చేరుకున్నారు. అక్కడ నెమళ్ళ మాంసం, కోళ్ళ మాంసం, మేకల మాంసం, గొర్రెల మాంసం, అడవి పందుల మాంసం ఇలా రకరకాల పదార్థాలు ఉన్నాయి. హనుమ ఆ ప్రాంతాన్నంతటినీ వెతికారు.
మళ్ళీ పుష్పక విమానంలోకి వెళ్ళి, అందులో వెతికి కిందకు దిగుతూ అనుకున్నారు “ఈ లంకాపట్టణమంతా వెతికాను. ఇందులో వెతకని ఇల్లు లేదు. ఇక్కడ గంధర్వ, యక్ష, కిన్నెర స్త్రీలు, రాక్షసులు కనపడుతున్నారు కాని సీతమ్మ తల్లి జాడ కనిపెట్టలేకపోయాను” అని బాధ పడ్డాడు.
నిరాశ మరియు తిరిగి ప్రయత్నం
వెంటనే “ఎవడు దుఃఖానికి లొంగిపోడో, ఎవడు ఎల్లప్పుడూ ఉత్సాహంతో ఉంటాడో, వాడు మాత్రమే కార్యాన్ని సాధించగలడు. అందుకని నేను దుఃఖానికి లొంగను, మళ్ళీ సీతమ్మని వెతుకుతాను. ఈ లంకా పట్టణమంతా వెతికేస్తాను” అని ఉత్సాహాన్ని పొంది లంకా పట్టణమంతా వెతికి కూర్చున్నాడు.
అప్పుడాయన అనుకున్నాడు “ఇంత పెద్ద లంకా పట్టణాన్ని నాలుగు అంగుళాలు కూడా వదలకుండా వెతికాను. అయినా నాకు సీతమ్మ దర్శనం కాలేదు. బహుశా ఒంటి మీద వస్త్రం లేని స్త్రీలెందరినో ఈ లంకా పట్టణంలో నేను చూశాను. అందువలన నా యందు ధర్మానికి లోపం వచ్చిందేమో! నేను వెతుకుతున్నది సీతమ్మని. ఆమె ఒక స్త్రీ. అందువలన ఆమెను వెతుకుతున్నప్పుడు సీతమ్మో కాదో అని ఆ స్త్రీల వంక చూశాను. ఆ స్త్రీలను అలా చూశాను కాని నా మనసునందు ఎటువంటి చెడు ఆలోచన కలగలేదు. నాకు ఎవరూ గుర్తులేరు. నేను పవిత్రంగానే ఉన్నాను” అని హనుమంతుడు తన మనస్సులో అనుకుని “నేను సీతమ్మ దర్శనం చేయలేకపోయాను. నేను వెనక్కి వెళితే అక్కడ ఉన్న వానరులు నన్ను ‘సీతమ్మ దర్శనం చేశావా?’ అని అడుగుతారు.
‘నాకు సీతమ్మ జాడ తెలియలేదు’ అని చెప్తాను. సీతమ్మ జాడ తెలియకుండా వెనక్కి వెళితే సుగ్రీవుడు చంపేస్తాడని అందరూ నిరాహార దీక్ష చేస్తారు. నేను వెళ్ళి ఈ మాట సుగ్రీవుడికి చెబితే మిత్రుడైన రాముడికి సహాయం చేయలేకపోయానని సుగ్రీవుడు ప్రాణం వదిలేస్తాడు. ఉన్న స్నేహితుడు కూడా వెళ్ళిపోయాడని రాముడు కూడా ప్రాణం వదిలేస్తాడు.
రాముడు లేనప్పుడు లక్ష్మణుడు ఉండడు. అప్పుడు అక్కడున్న వానర స్త్రీలందరూ ప్రాణాలు వదిలేస్తారు. తర్వాత వానరులందరూ మరణిస్తారు. ఈ వార్త అయోధ్యకు చేరి కౌసల్య, కైకేయి, సుమిత్ర, భరతుడు, శత్రుఘ్నుడు మరణిస్తారు, అయోధ్యలో అందరూ మరణిస్తారు. నేను పట్టుకెళ్ళే వార్త వల్ల ఇంత మంది మరణిస్తారు. ఈ వార్తను నేను తీసుకువెళితే ఎంత? వెళ్ళకపోతే ఎంత?
బహుశా రావణుడు సీతమ్మని తీసుకువస్తున్నప్పుడు ఆయన ఒడిలో కొట్టుకుంటున్న సీతమ్మ జారి సముద్రంలో పడిపోయి ఉంటుంది. కాదు కాదు, సీతమ్మ అంత పిరికిది కాదు. తన పడక చేరడం లేదని రావణుడే సీతమ్మని ముక్కలుగా నరికి ఆహారంగా తినేసుంటాడు. కాదు కాదు, కాముకుడైనవాడు తాను ప్రేమించిన స్త్రీని చంపడు. లేకపోతే రాక్షసులు సీతమ్మని తినేసుంటారు. కాదు కాదు, రావణుడు ప్రేమించిన స్త్రీని తినగలిగే ధైర్యం రాక్షసులకు ఉండదు.
రాముడికి సీతమ్మ జాడ తెలియకూడదని రావణుడే అమ్మని ఎక్కడో దాచి ఉంటాడు. నిద్రపోతున్న రావణుడి పది తలలు గిల్లేసి వాడి శవాన్ని రాముడి పాదాల దగ్గర పడేస్తాను. లేదా ఈ లంకను పెకలించి పట్టుకుపోతాను. కాదు కాదు, సీతమ్మ జాడ చెప్పలేనప్పుడు ఇవన్నీ తీసుకువెళ్ళడం ఎందుకు? అందుకని నేను అసలు వెనక్కి వెళ్ళను. సీతమ్మ జాడ దొరికే వరకు వానప్రస్థుడిలా ఉంటాను లేదా అగ్నిలోకి ప్రవేశిస్తాను. లేదా నీటిలోకి ప్రవేశించి శరీరాన్ని వదిలేస్తాను” అనుకున్నాడు.
ఆయన వెంటనే “ఛీ! మరణించడం ఏమిటి? ఆత్మహత్య మహా పాపం. మళ్ళీ ఉత్సాహాన్ని పొంది వెతుకుతాను” అనుకొని
ప్రార్థన మరియు అశోకవనం
“లక్ష్మణుడితో కూడుకుని ఉన్న రాముడికి నమస్కారం. జనకుని కూతురైన సీతమ్మకి నమస్కారం. రుద్రుడికి, ఇంద్రుడికి, యముడికి, వాయుదేవుడికి నమస్కారం. చంద్రుడికి, సూర్యుడికి, దేవతలందరికీ నమస్కారం. నాకు సీతమ్మ తల్లి దర్శనం అయ్యేటట్టు దేవతలందరు దయ చూపగలరు” అని నమస్కారం చేశాడు.
అప్పుడు హనుమంతుడికి ఎదురుగా అశోకవనం కనపడింది. అప్పుడాయన ఒక ధనుస్సు నుండి వదలబడిన బాణంలా ముందుకు వెళ్ళి అశోకవనంలో దిగి అక్కడున్న అన్ని చెట్ల మీద నుండి అటూ ఇటూ దూకుతూ సీతమ్మని వెతికాడు. ఆ అశోకవనంలో రావణుడు తన తపఃశక్తితో నిర్మించిన కృత్రిమమైన ఒక కొండ, ఆ కొండ మీద నుండి ప్రవహిస్తున్న నది ఉన్నాయి.
సీతమ్మను కనుగొనడం
హనుమంతుడు ఆ అశోకవనాన్ని వెతుకుతుండగా ఆయనకు దూరంగా వెయ్యి స్తంభాలతో కూడుకున్న ఒక పెద్ద భవనం కనపడింది. అక్కడున్న సైనికులు విశ్రాంతి తీసుకోవడం కోసం ఏర్పాటు చేసిన మండపం. దాని మీద శింశుపా వృక్షం ఉన్నది.
ఆ శింశుపా వృక్షం మీదకు దూకి ఆ చెట్టు కొమ్మల నుంచి కిందకు చూస్తే చుట్టూ రాక్షస స్త్రీల మధ్యలో ఒక స్త్రీ పట్టు వస్త్రం కట్టుకుని ఉన్నది. ఆమె సీతమ్మే అయి ఉంటుందని, ఆ ఆకులను పక్కకు తోస్తూ హనుమంతుడు చూసేసరికి మట్టి పట్టిన బట్టతో, చుట్టూ అనేకమంది రాక్షస స్త్రీలతో, ఉపవాసాల చేత బలహీనంగా, దీనంగా ఉన్న, కన్నుల నిండా నీరు ఉన్నా వేడి నిట్టూర్పులు విడుస్తున్న, శుక్ల పక్షంలో వచ్చే మొదటి చంద్రవంకలా, ప్రయత్నపూర్వకంగా చూస్తే తప్ప తెలియని కాంతితో, పొగతో కప్పబడిన అగ్ని జ్వాలలా, చిరిగిపోయిన పసుపు పచ్చని వస్త్రం కట్టుకొని, అంగారకుడి చేత పీడింపబడిన రోహిణి నక్షత్రంలా, పెరిగిన తరువాత తగ్గిన దానిలా, శ్రద్ధ కోల్పోయిన దానిలా, ఆశ నెరవేరని దానిలా, అవమానంతో సిగ్గుపడుతూ ఉన్న సీతమ్మని హనుమంతుడు చూశాడు.
హనుమంతుని భావోద్వేగం
అలా ఉన్న సీతమ్మని చూసిన హనుమంతుడి కళ్ళ నుండి ఆనంద బాష్పాలు కారాయి. అలా నల్లటి కళ్ళతో ఉన్న సీతమ్మని చూసిన హనుమకి, ఆవిడ శరీరంలోని ప్రతి అవయవంలో రాముడు గుర్తుకు వచ్చాడు.
సీతమ్మని అలా చూసిన హనుమంతుడు అనుకున్నాడు “మా రాముడి గుండె చాలా గట్టిది. ఎవ్వరూ చేయలేని పని రాముడు చేశాడని ఇప్పుడు నేను గుర్తించాను. పది నెలల నుండి ఈ సీతమ్మ రాముడి పేరు చెప్పుకుంటూ, తపస్సు చేసుకుంటూ, రాముడి గురించి దుఃఖిస్తూ ఇక్కడ ఉంటే అటువంటి భార్యకు దూరంగా ఉండి కూడా పది నెలల నుండి ప్రాణాలు నిలబెట్టుకొని ఉన్నాడు. కనుక రాముడు ఎవ్వరూ చేయలేని పని చేశాడు.
రాముడి మనస్సు సీతమ్మ దగ్గర ఉంది, సీతమ్మ మనస్సు రాముడి దగ్గర ఉన్నది. అందుకని ఇద్దరూ ఒకరికి ఒకరు దూరంగా ఉండి కూడా ఇంత కాలం బ్రతకగలిగారు. మూడు లోకములలో ఉండే సంపదనంతటినీ ఒక పక్కన పెట్టి, మరో పక్క సీతమ్మని పెడితే, సీతమ్మ యొక్క గొప్పదనంలో పదహారవ వంతుతో కూడా ఆ సంపద, గొప్పదనం సరితూగదు. నల్లటి జుట్టుతో, ఎర్రటి పెదవులతో, సన్నటి నడుముతో, తామర పువ్వుల వంటి కళ్ళతో ఆ తల్లి శింశుపా వృక్షం కింద కూర్చుని ఉన్నది.
గురువుల చేత శిక్షణ పొందిన బుద్ధి కలిగిన లక్ష్మణుడి చేత ఆరాధింపబడే సీతమ్మ, పెద్దలచే పొగడబడే సీతమ్మ, లక్ష్మణుడి గురువైన రాముడి యొక్క భార్య అయిన సీతమ్మ, ముందు రాముడు వెనుక లక్ష్మణుడు ఉండగా మధ్యలో నడవవలసిన సీతమ్మ, దశరథుడి పెద్ద కోడలైన సీతమ్మ, జనకుడి కూతురైన సీతమ్మ ఇవ్వాళ చుట్టూ రాక్షస స్త్రీలు ఉండగా, పది నెలల నుండి ఒకే వస్త్రాన్ని కట్టుకొని పడి ఉన్నది అంటే
ఈ కాలం అన్నది ఏదైనా చేయగలదు. ఈ కాలాన్ని ఎవ్వరూ దాటలేరు. ఈ సీతమ్మ కోసమే పద్నాలుగు వేల మంది రాక్షసులు మరియు ఎంతో మంది రాక్షసులు చనిపోయారు. ఈ తల్లి కారణంగానే సుగ్రీవుడు పట్టాభిషేకం పొందాడు. వాలి చనిపోయాడు. నువ్వు ఇక్కడ కూర్చున్నావు కాని, నీ వల్ల అక్కడ ఎంత కథ నడుస్తుందో తెలుసా అమ్మా! నీకు నీ తల్లి (భూదేవి) పోలిక వచ్చింది. అందుకే నీకు ఇంత ఓర్పు ఉన్నది.
రామలక్ష్మణుల చేత రక్షింపబడవలసిన తల్లివి, ఇలా భయంకరమైన రాక్షస స్త్రీల మధ్యన చెట్టు కింద కూర్చున్నావా! శీలం, వయస్సు, నడవడి, వంశము, శరీరం అనే ఈ అయిదు లక్షణాలలో (వివాహం చేసే ముందు వధువు, వరుడు ఈ అయిదు లక్షణాలలో సరిపోతారో లేదో చూడాలి) నువ్వు రాముడికి తగినదానివి. మా సీతమ్మ ముందు పాపాత్ముడైన రావణుడు నిలుచున్నా ఆమె కళ్ళు ఎప్పుడూ నల్లగానే, శాంతంగా ఉంటాయి. రాముడి కళ్ళు కోపంతో అప్పుడప్పుడు ఎరుపెక్కుతాయి” అని అనుకున్నాడు.
వాల్మీకి రామాయణం – తెలుగు అనువాదం (external)
ఈ ఘట్టం ద్వారా హనుమంతుడి భక్తి, నిరాశ, తిరిగి మళ్ళీ సంకల్పం ఎంత అద్భుతంగా రామాయణంలో వర్ణించబడిందో మనం గ్రహించవచ్చు. రావణాసురుని విలాస జీవితం, హనుమంతుడి మానసిక స్థితి, సీతమ్మ కోసం నిరంతరంగా జరిగిన అన్వేషణ – ఇవన్నీ ఎంతో ప్రాముఖ్యమైన ఘట్టాలు.