Categories: రామాయణం

Ramayanam Story in Telugu – రామాయణం 75

శివుని ఆశీర్వచనం

Ramayanam Story in Telugu- దేవతలందరితో కలిసి అక్కడకు విచ్చేసిన శివుడు రాముడితో ఇలా పలికాడు: “నాయనా రామా! నీ తమ్ముడు భరతుడు అయోధ్యలో దీనమైన స్థితిలో ఉన్నాడు, అతడిని ఓదార్చు. నీ తల్లి కౌసల్యను ఊరడించు. కైకేయికి, సుమిత్రకు నమస్కరించు. లక్ష్మణుడిని ఊరడించు. ఇక్ష్వాకు వంశీయులు తరతరాలుగా పరిపాలిస్తున్న రాజ్యాన్ని నువ్వు పరిపాలించి నీ ప్రజలను సంతోషపెట్టు. నీవు జన్మించిన వంశాన్ని వృద్ధి చేయి. యాగాలు నిర్వహించు. బ్రాహ్మణులకు భూరి దానములు చేసి అపారమైన సంతృప్తిని పొందు. ఆ తర్వాత స్వర్గానికి చేరుకుంటావు. ఆ విమానంలో మీ తండ్రి దశరథ మహారాజు ఉన్నారు, వెళ్లి చూడు.” శ్రీరామ కథ – రామాయణం

అంశంవివరాలు
కుటుంబ బాధ్యతలుతల్లి తండ్రులకూ, సోదరులకూ ధైర్యం ఇవ్వడం
రాజధర్మంవంశాన్ని పరిపాలించడం
ధర్మకర్మయాగాలు, దానాలు చేయడం

దశరథుని ఆనందం, జ్ఞాపకాలు

తండ్రిని చూడగానే లక్ష్మణుడితో కలిసి రాముడు నమస్కరించాడు. దశరథుడు రాముడిని ఆనందంతో గట్టిగా కౌగిలించుకొని తన తొడ మీద కూర్చోబెట్టుకున్నాడు. “రామా! నేను స్వర్గలోకంలో విహరించాను. ఇంద్రలోకంలో తిరిగాను. కానీ నువ్వు లేకపోతే అది కూడా నాకు సుఖంగా అనిపించలేదు. ఆనాడు నీకు పట్టాభిషేకం చేయాలని సంకల్పించడం, నేను ఎంతో ఆనందించడం, రాత్రి కైకేయి దగ్గరికి వెళ్లడం, కైకేయి వరాలు కోరడం, నీ పట్టాభిషేకం భగ్నమవడం, ఆనాడు నేను ఏడ్చి ఏడ్చి నా శరీరాన్ని వదిలిపెట్టడం నాకు ఇంకా జ్ఞాపకం ఉన్నాయి. ఆ పట్టాభిషేకం భగ్నమవడానికి కారణం దేవతలే అని నేను తెలుసుకున్నాను. రావణ సంహారం జరగాలి కనుక దేవతలు ఆనాడు నీ పట్టాభిషేకాన్ని భగ్నం చేశారు” అన్నాడు.

కైకేయి శాపం ఉపసంహరణ

రాముడు “ఆనాడు మీరు బాధతో ‘ఇప్పుడే నేను నిన్ను విడిచిపెట్టేస్తున్నాను. నువ్వు నా భార్యవి కావు. నీ కుమారుడు భరతుడు నాకు కొడుకు కాదు’ అని కైకేయమ్మను నిందించారు కదా. ఆ మాటను మీరు ఉపసంహరించుకోండి. నేను సంతోషిస్తాను” అన్నాడు. దశరథుడు “నువ్వు కోరుకున్నట్టు తప్పకుండా జరుగుతుంది” అని బదులిచ్చాడు.

లక్ష్మణుడికి దశరథుని ఆశీర్వాదం

ఆయన లక్ష్మణుడితో “నాయనా లక్ష్మణా! నువ్వు ప్రాజ్ఞుడవి. చక్కగా అన్నయ్య సేవ చేశావు. ఇలాగే అన్ని కాలములయందు అన్నయ్యను, వదినను సేవిస్తూ నీ జన్మను సార్థకం చేసుకో” అన్నాడు.

సీతమ్మకు దశరథుని బోధ

దశరథుడు రామలక్ష్మణుల వెనక నమస్కారం చేస్తూ నిలబడ్డ సీతమ్మను దగ్గరికి పిలిచి “అమ్మా సీతమ్మా! నీ మనస్సుకు కష్టం కలిగిందా? ‘సీత! నీతో నాకు ప్రయోజనం లేదు. నిన్ను విడిచిపెట్టేస్తున్నాను. నీ ఇష్టం వచ్చిన చోటికి వెళ్ళు’ అని మావాడు అన్నాడు కదా! అలా అన్నాడని నువ్వు బాధపడ్డావా! ఇవ్వాళ నేను ఊర్ధ్వలోకవాసిని. తప్పు మాట చెబితే కింద పడిపోతాను. నీకొక నిజం చెప్పనా! రాముడికి నీమీద ఎప్పుడూ అటువంటి అభిప్రాయం లేదు. ఆ మాట ఎందుకన్నాడో తెలుసా? నిన్ను వేరొకరు ఎప్పుడూ వేలెత్తి చూపించకూడదని మావాడి తాపత్రయం.

కూతురా! నువ్వు ఇవ్వాళ చేసిన పతి సేవ వల్ల కలిగిన గొప్పతనం ఏమిటో తెలుసా? ఇంతకుముందు పతివ్రతలై భర్తను సేవించిన వాళ్ళందరి చరిత్రలను పక్కన పెట్టి పతివ్రత అంటే సీతమ్మ అని నిన్ను చూపిస్తున్నారు. నీలాంటి కోడలు నా వంశానికి రావడం నా అదృష్టం. నీకు నేను ఇంక చెప్పడానికి ఏమీ లేదు. నీకు అన్నీ తెలుసు. మామగారిగా ఒక్క మాట చెబుతాను. అమ్మా! భర్త మాత్రమే దైవం అని తెలుసుకో” అన్నాడు. అనంతరం దశరథుడు విమానంలో ఊర్థ్వ లోకాలకు వెళ్లిపోయాడు.

ఇంద్రుడి వరం – వానరుల పునరుజ్జీవం

దేవేంద్రుడు “రామా! మేము వచ్చి దర్శనం ఇస్తే, ఆ దర్శనం వృథా కాకూడదు. అందుకని ఏదైనా ఒక వరం కోరుకో” అన్నాడు. రాముడు “నాకోసమని తమ కొడుకులను, భార్యలను విడిచిపెట్టి ఎన్నో కోట్ల వానరాలు, భల్లూకాలు, కొండముచ్చులు యుద్ధానికి వచ్చాయి. అలా వచ్చిన వాటిలో కొన్ని మిగిలాయి. మిగిలిన వాటిలో కొన్నిటి చేతులు తెగిపోయాయి. కొన్నిటి కాళ్ళు తెగిపోయాయి. కొన్ని ఇంకా యుద్ధభూమిలో రక్తం ఓడుతూ పడి ఉన్నాయి. కొన్ని యమ సదనమునకు వెళ్ళిపోయాయి. మీరు నిజంగా నాయందు ప్రీతి చెందినవారైతే యమ సదనమునకు వెళ్ళిన వానరములన్నీ బ్రతకాలి. యుద్ధభూమిలో కాళ్ళు తెగిపోయి, చేతులు తెగిపోయి పడిపోయిన కోతులు, కొండముచ్చులు, భల్లూకాలు మళ్ళీ జవసత్వములతో పైకి లేవాలి. అవన్నీ యుద్ధానికి వచ్చేటప్పుడు ఎంత బలంతో ఉన్నాయో ఇప్పుడు మళ్ళీ అంతే బలంతో ఉండాలి. వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళినా అక్కడ చెట్లకి ఫలాలు ఫలించాలి. పువ్వులు పూయాలి. అక్కడ సమృద్ధిగా తేనె ఉండాలి. వాళ్ళు త్రాగడానికి ఎప్పుడూ మంచి నీరు ప్రవహిస్తూ ఉండాలి” అని కోరాడు.

ఇంద్రుడు “తప్పకుండా నీకు ఈ వరమును కటాక్షిస్తున్నాను” అన్నాడు. వెంటనే యుద్ధ భూమిలో పడి ఉన్నవారు లేచి వచ్చారు. యమసదనానికి వెళ్ళినవారు తిరిగి వచ్చేశారు. వానరులందరూ అపారమైన సంతోషాన్ని పొందారు.

పుష్పక విమాన ప్రయాణం

ఆ రోజు రాత్రి వారంతా అక్కడ విశ్రమించారు. మరునాడు ఉదయం రాముడు విభీషణుడిని పిలిచి “నేను తొందరగా అయోధ్య చేరుకోవాలని అనుకుంటున్నాను. ఇక్కడినుంచి కాలినడకన వెళితే చాలా సమయం పడుతుంది. తొందరగా వెళ్ళడానికి ఏదైనా ప్రయాణ సాధనం ఏర్పాటు అవుతుందా” అన్నాడు.

విభీషణుడు “మన దగ్గర పుష్పక విమానం ఉంది. ఉత్తర క్షణంలో మీరు అయోధ్యకి చేరతారు. ఇన్ని కష్టాలు పడ్డారు కదా! సీతమ్మ లభించింది కదా! సీతమ్మ అభ్యంగన స్నానం ఆచరించి, పట్టుపుట్టం కట్టుకుని, నగలు అలంకరించుకుంది కదా! మీరు కూడా తలస్నానం చేసి, పట్టుపుట్టాలు కట్టుకుని, ఆభరణములను ధరించి, నా దగ్గర బహుమతులు అందుకొని మీరు బయలుదేరితే నేను సంతోషిస్తాను” అన్నాడు.

రాముడు “నా తమ్ముడైన భరతుడు అక్కడ జటలు పెంచుకొని, మట్టి పట్టిన వస్త్రం కట్టుకొని, నా పాదుకలని సింహాసనం మీద పెట్టి, నన్ను చూడాలని శోకిస్తూ రాజ్యం చేస్తున్నాడు. ఆ భరతుడు స్నానం చేయకముందు నేను స్నానం చేయను. భరతుడు పట్టుపుట్టం కట్టుకోకముందు నేను కట్టుకోను. భరతుడు ఆభరణాలు పెట్టుకోకముందు నేను పెట్టుకోను. నాకు తొందరగా భరతుడిని చూడాలని ఉన్నది” అన్నాడు.

వానరులు, భల్లూకాల అయోధ్య ప్రయాణం

విభీషణుడు వెంటనే పుష్పక విమానాన్ని ఏర్పాటు చేశాడు. రాముడు ఆ విమానాన్ని అధిరోహించాక “మీరందరూ నాకోసం చాలా కష్టపడ్డారు. ఇక మీరు విశ్రాంతి తీసుకోండి. నేను బయలుదేరతాను…….” అని చెబుతుండగా, అక్కడున్న వాళ్ళందరూ “మిమ్మల్ని విడిచిపెట్టి మేము ఉండలేము. మేము మీతో అయోధ్యకి వచ్చేస్తాము. మేము అక్కడ ఎక్కువ రోజులుండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టము. మిమ్మల్ని కన్న కౌసల్యను ఒకసారి చూడాలని ఉంది. మీరు పట్టాభిషిక్తులై సింహాసనం మీద కూర్చుంటే చూడాలని ఉంది” అన్నారు. విశాల హృదయుడైన రాముడు సరే అనగానే అక్కడున్న వాళ్ళందరూ ఆ పుష్పక విమానం లోకి గబగబా ఎక్కారు. ఆ విమానం ఆకాశం లోకి ఎగిరిపోయింది.

పుష్పక విమానం నుండి విశేషాల వివరణ

అప్పుడు రాముడు సీతమ్మకు ఆ పుష్పక విమానం నుండి కిందకు చూపిస్తూ “సీత! ఇదే నేను రావణుడిని పడగొట్టిన ప్రదేశం. అదిగో అది కుంభకర్ణుడు పడిపోయిన ప్రదేశం. అది నరాంతకుడు పడిపోయిన ప్రదేశం. ఇది హనుమ విరూపాక్షుడిని పడగొట్టిన ప్రదేశం. ఆ సముద్రంలో ఉన్న సేతువును మేము వానరములతో కలిసి నిర్మించాము. ఇక్కడే మేమందరము కూర్చుని ఈ సముద్రాన్ని ఎలా దాటాలని అనుకున్నాము. ఇదే కిష్కింధ, ఇక్కడి నుంచే వానరులు అన్ని దిక్కులకి నీ జాడ కనిపెట్టడానికి బయలుదేరారు” అని చెప్తుండగా సుగ్రీవుడు గబగబా వచ్చి “రామా! మనం కిష్కింధ మీద నుంచే వెళుతున్నాము కదా! నా భార్యలు తార, రుమ చూస్తుంటారు. వాళ్ళని కూడా ఎక్కించుకుందాము” అన్నాడు.

వానర కాంతలు పుష్పక విమానంలోకి

పుష్పకాన్ని కిందకు దింపారు. సుగ్రీవుడు వెంటనే వెళ్లి తార, రుమలకు విషయాన్ని చెప్పి రమ్మన్నాడు. అప్పుడు తార మిగిలిన ఆడవారి దగ్గరికి వెళ్లి “రండి, రండి, సుగ్రీవుడు విజయాన్ని సాధించి రామ పట్టాభిషేకానికి వెళుతున్నారు. మంచి మంచి బట్టలు, ఆభరణాలు వేసుకుని అందరూ వచ్చెయ్యండి” అన్నది. వాళ్ళు మానవ కాంతలవలే కామరూపాలను పొంది పట్టుపుట్టాలు, ఆభరణములు వేసుకుని, పుష్పక విమానమునకు ప్రదక్షిణం చేసి, లోపలికి ఎక్కి “సీతమ్మ ఎక్కడ? సీతమ్మ ఎక్కడ?” అని అడిగారు. “ఆవిడే సీతమ్మ” అని చూపించగానే అందరూ వెళ్లి ఆమెకు నమస్కరించారు. సీతమ్మ వాళ్ళందరినీ సంతోషంగా కౌగలించుకొని, పలకరించింది.

దండకారణ్యం, పంచవటి దర్శనం

రాముడన్నాడు “సీత! అదే ఋష్యమూక పర్వతం, అక్కడే నేను సుగ్రీవుడు కలుసుకున్నాము. అది శబరి యొక్క ఆశ్రమం. అక్కడున్న చిక్కటి వనంలోనే కబంధుడిని చంపాను. చూసావా అది మనం ఉన్న పంచవటి ఆశ్రమం. ఇక్కడే రావణుడు నిన్ను అపహరించాడు” అని రాముడు చెబుతుండగా సీతమ్మ గబుక్కున రాముడి చేయి పట్టుకున్నది.

ఆగస్త్య, సుతీక్ష్ణ, చిత్రకూట దర్శనం

కొంత ముందుకు వెళ్ళాక “అదే అగస్త్య మహర్షి ఆశ్రమం. ఇక్కడే అగస్త్యుడు నాకు రావణ సంహారం కోసం అస్త్రాన్ని ఇచ్చాడు. అక్కడ కనబడుతున్నది సుతీక్ష్ణుడి ఆశ్రమం. అక్కడ కనబడుతున్నది చిత్రకూట పర్వతం, ఇక్కడే మనం తిరుగుతూ ఉండేవాళ్ళము” అన్నాడు.

భరద్వాజ ఆశ్రమంలో విశ్రాంతి

ఆ పుష్పకం కొంత ముందుకు వెళ్ళాక వారికి భరద్వాజ మహర్షి యొక్క ఆశ్రమం కనిపించింది. అప్పుడు ఆ పుష్పకాన్ని అక్కడ దింపి, భరద్వాజుడికి నమస్కరించారు. భరద్వాజుడు “రామా! నేను నా తపశ్శక్తితో అన్ని కాలములయందు నీ గురించి తెలుసుకుంటున్నాను. నువ్వు రావణ సంహారం చేయడం కూడా నాకు తెలుసు. ఇవ్వాళ ఒక్క రాత్రి నా దగ్గర ఉండి విశ్రాంతి తీసుకొని నా ఆతిథ్యం తీసుకొని బయలుదేరు” అన్నాడు.

హనుమంతుని అయోధ్య ప్రయాణం

రాముడు హనుమంతుడిని పిలిచి “హనుమా! నువ్వు ఇక్కడినుంచి బయలుదేరి వెళ్లి గంగానది ఒడ్డున శృంగిభేరపురంలో నాకు మిక్కిలి స్నేహితుడైన గుహుడు ఉంటాడు. ఆయనకు నా క్షేమ సమాచారం చెప్పి పట్టాభిషేకానికి రమ్మని చెప్పు. అక్కడినుంచి బయలుదేరి అయోధ్యలో అందరూ కుశలంగా ఉన్నారా అని కనుక్కొని నందిగ్రామానికి వెళ్లి నేను తిరిగి వస్తున్నాను అని భరతుడికి చెప్పి ఆయన ముఖకవళికలు గమనించు. భరతుడి ముఖంలో ఏదైనా కొంచెం బెంగ నీకు కనిపడితే వెంటనే వెనక్కి వచ్చేయ్. ఇంక నేను అయోధ్యకి రాను. భరతుడు అయోధ్యని పాలిస్తాడు. ఈ విషయాన్ని నువ్వు జాగ్రత్తగా కనిపెట్టి తిరిగిరా” అన్నాడు.

హనుమంతుడు అక్కడినుంచి బయలుదేరి గుహుడిని కలుసుకొని ఆయనను పలకరించి రాముడు చెప్పిన విషయాన్ని చెప్పాడు. తరువాత అక్కడినుంచి బయలుదేరి వెళ్లి భరతుడిని కలుసుకొని రాముడు పడిన కష్టాలు, సీతాపహరణం, రావణ వధ మొదలైన విషయాలను వర్ణించి చెప్పాడు. హనుమంతుడి మాటలు విన్న భరతుడు చాలా సంతోషించాడు.

భరద్వాజుడి వరం – మార్గంలో ఫలసంపద

మరునాడు ఉదయం రాముడు బయలుదేరబోయేముందు భరద్వాజుడు “నీ ధర్మానుష్టానికి నాకు ప్రీతి కలిగింది. నీకొక వరం ఇస్తాను. ఏదైనా కోరుకో” అన్నాడు. రాముడు “వానరములు ఎక్కడ ఉంటాయో అక్కడ ఫలసంవృద్ధి ఉండాలని నేను కోరాను. ఇప్పుడు ఇక్కడినుంచి మూడు యోజనముల దూరం వరకూ అయోధ్యకి ప్రయాణిస్తాము. ఆ మార్గంలో కూడా చెట్లన్నీ ఫల పుష్పభరితములై, తేనెపట్లతో తేనెలు కారుతూ ఉండాలి” అని అడిగాడు. భరద్వాజుడి దగ్గర సెలవు తీసుకొని పెద్ద కోలాహలముతో నందిగ్రామానికి రాముడు చేరుకున్నాడు.

అయోధ్య ప్రజల స్వాగతం

భరతుడు తన సైనికులతో “రాముడు వచ్చేస్తున్నాడు. అయోధ్యలో ఉన్న తల్లులని తీసుకురండి. రథాలని తీసుకురండి. పెద్దవాళ్ళని తీసుకురండి. అందరినీ అయోధ్యకి రమ్మనండి. అంతటా పసుపు నీరు, గంధపు నీరు చల్లించండి. దివ్యమైన ధూపములు వేయండి. అందరము కలిసి రాముడిని నందిగ్రామం నుంచి అయోధ్యకి పట్టాభిషేకానికి తీసుకువెళదాము” అని భరతుడు ఆజ్ఞాపించాడు. రాముడు వచ్చేస్తున్నాడన్న విషయం తెలుసుకున్న అయోధ్య వాసులు పరుగు పరుగున నందిగ్రామానికి వచ్చారు.

భరతుని ఆత్మీయత

రాముడు పుష్పక విమానం నుంచి కిందకి దిగగానే భరతుడు పరిగెత్తుకుంటూ వెళ్లి అన్నగారి పాదాలకి పాదుకలు తొడిగాడు. ఇది చూసి సుగ్రీవ, విభీషణులు కన్నుల నీళ్ళు కారాయి. వెంటనే భరతుడు సుగ్రీవుడిని కౌగలించుకొని “ఇంతకముందు మేము నలుగురము. ఇవ్వాళ్టి నుంచి మనం ఐదుగురము అన్నదమ్ములము” అన్నాడు. అక్కడున్న గంధమాదుడిని, మైందుడిని మొదలైనవారిని భరతుడికి పరిచయం చేశారు. భరతుడు ఆ వానరములను “మీరు మా అన్నయ్యకి సహాయం చేశారు. మీరు ఎంత మంచివారు” అని అందరినీ కౌగలించుకున్నాడు.

వానర కాంతలకు ఆతిథ్యం

పుష్పకం నుంచి కిందకి దిగిన వానరకాంతలు వారి ప్రేమలను, వారి అలంకారములను చూసి ఆశ్చర్యపోయారు. అక్కడికి వచ్చిన కౌసల్య, కైకేయి, సుమిత్రలు “ఈ వానర కాంతలందరికీ మేమే తలస్నానాలు చేయిస్తాము” అని వారందరికీ తలస్నానం చేయించారు.

పుష్పక విమానానికి వీడ్కోలు

రాముడు ఆ పుష్పక విమానాన్ని “కుబేరుడి దగ్గరికి వెళ్లిపో” అని ఆజ్ఞాపించాడు. ఆ పుష్పకం కుబేరుడి దగ్గరికి వెళ్లిపోయింది.

🔗 శ్రీరాముడి స్వర్గారోహణం – Valmiki Ramayanam

bakthivahini

Share
Published by
bakthivahini

Recent Posts

Bhagavad Gita 700 Slokas in Telugu – Discover the Wisdom of అధ్యాయం 7: జ్ఞాన విజ్ఞాన యోగం, శ్లోకం 13

Bhagavad Gita 700 Slokas in Telugu మనిషి జీవితం ఒక ప్రయాణం. ఈ ప్రయాణంలో మనం తీసుకునే ప్రతి…

5 hours ago

Karthika Puranam Telugu – కార్తీక పురాణం | 22వ రోజు పారాయణ

Karthika Puranam Telugu జలంధరుని యుద్ధ సన్నాహాలు ఓ పృథురాజా! రాహువు చెప్పిన విషయాలన్నీ వినగానే, క్రోధోద్రిక్తుడైన జలంధరుడు శివుని…

1 day ago

Karthika Puranam Telugu – కార్తీక పురాణం | 21వ రోజు పారాయణ

Karthika Puranam Telugu మారుమూలల్లో తలలు దాచుకున్నా కూడా వదలకుండా ముట్టడింప వస్తూన్న జలంధరునికి భయపడినవారై దేవతలంతా విష్ణు స్తోత్రం…

1 day ago

Karthika Puranam Telugu – కార్తీక పురాణం | 20వ రోజు పారాయణ

Karthika Puranam Telugu తులసి మహాత్మ్యంపై పృధు చక్రవర్తి ప్రశ్న పృధు చక్రవర్తి నారదుడిని అడుగుతున్నాడు: 'దేవర్షీ! తులసిని స్థాపించి,…

1 day ago

Karthika Puranam Telugu – కార్తీక పురాణం | 19వ రోజు పారాయణ

Karthika Puranam Telugu నారదుడు చెబుతున్నాడు: ఓ పృథు భూపాలా! కార్తీక వ్రతం పాటించే పురుషుడు తప్పకుండా ఆచరించవలసిన నియమాలను…

1 day ago

Karthika Puranam Telugu – కార్తీక పురాణం | 18వ రోజు పారాయణ

Karthika Puranam Telugu నారదుడు చెప్పినదంతా విన్న పృథువు 'ఓ దేవర్షీ! కార్తీక మాసపు గొప్పదనమును వివరించి, నన్ను ధన్యుని…

1 day ago