Venkateswara Swamy Katha-వేంకటాచలము నందు వకుళాదేవి ఆశ్రమములో వున్న శ్రీనివాసుడు వకుళాదేవికి, మునిపుత్రులకు పురాణ రహస్యాలు వివరిస్తూ, వారి సేవలను స్వీకరిస్తూ కాలం గడుపుతున్నాడు.
| అంశం | వివరణ |
|---|---|
| అరణ్యంలోని భీభత్సం | మదపుటేనుగు అరణ్యాన్ని భయాందోళనకు గురిచేస్తోంది. |
| శ్రీనివాసుని ధైర్యం | వకుళాదేవి వారించినా, శ్రీనివాసుడు ధనుర్ధారణ చేసి ఎదుర్కోవడానికి సిద్ధమవుతాడు. |
| బ్రహ్మ సాయం | బ్రహ్మ దేవుడు గుర్రాన్ని సృష్టించి శ్రీనివాసుని సహాయానికి పంపాడు. |
| పద్మావతి ఉద్యానవనం | శ్రీనివాసుడు పద్మావతి మరియు ఆమె సఖులతో పరిచయం అవుతాడు. |
| వివాహ ప్రతిపాదన | శ్రీనివాసుడు పద్మావతిని వివాహం చేసుకోవాలనుకుంటాడు. |
| చెలికత్తెల దాడి | పద్మావతి సఖులు శ్రీనివాసునిపై రాళ్లతో దాడి చేస్తారు. |
| శ్రీనివాసుని వంశం | శ్రీకృష్ణుని వంశానికి చెందిన శ్రీనివాసుడు తన వంశగాథను వివరిస్తాడు. |
| పద్మావతి వంశం | చంద్ర వంశానికి చెందిన పద్మావతి తన తల్లిదండ్రుల గురించి చెబుతుంది. |
ఒకరోజు ఒక మదపుటేనుగు ఆ అరణ్యప్రాంతమంతా భీభత్సం చేస్తూ, కనిపించిన జంతువులను తరుముతూ, ఘీంకారశబ్దము చేస్తూ, భూమి అదిరేలాగా అటూ ఇటూ పరుగెత్తుచూ వకుళాశ్రమ సమీపానికి వచ్చింది. పర్వతంలా గంభీరంగా ఉన్న ఆ ఏనుగును చూచి ఆశ్రమవాసులు తలుపులు వేసుకుని, భయంతో వణికిపోతూ, “నారాయణ, నారాయణ” అని ధ్యానించుకుంటున్నారు.
ఆ మదగజాన్ని చూచి శ్రీనివాసుడు ధనుర్భాణాలు ధరించి దానిని చంపుటకు బయటకు వస్తుంటే, “వద్దు నాయనా వద్దు, అంత సాహసము చేయవద్దు. ఆ యేనుగు మహాభయంకరంగా ఉన్నది. ఈ పర్వతాన్నే పిండిచేసేదిగా ఘీంకరిస్తోంది” అని వకుళ బ్రతిమలాడింది. “శ్రీనివాసా! బతికుంటే బలుసాకు తిని బ్రతకవచ్చు. దీని జోలికి పోవద్దు” అని మునిపుత్రులు చేతులు పట్టుకుని బ్రతిమలాడారు.
“అమ్మా! నాకేమీ భయములేదమ్మా! దీనిని సంహరించకపోతే ప్రజలకు ఎంతో నష్టము కలుగుతుంది. జాగ్రత్తపడాలి గదా” అని ఆశ్రమంలోంచి శ్రీనివాసుడు విల్లును ఎక్కుపెట్టి ఏనుగు ఎదురుగా ధీరునివలె నిలబడ్డాడు. శ్రీనివాసుని చూడగానే ఏనుగు వెనక్కి తిరిగి వెళ్ళిపోతోంది. శ్రీనివాసుడు దానిని తరుముతున్నాడు.
సత్యలోకమున బ్రహ్మ ఇది గమనించి ఒక గుర్రాన్ని సృష్టించి శ్రీనివాసుని వద్దకు పంపాడు. శ్రీనివాసుడు ఆ అశ్వాన్ని అధిరోహించి, ఏనుగును తరుముతూ ఉన్నాడు. అలా చాలా దూరం వెళ్ళాడు. ఏనుగు కనుమరుగైంది. అప్పటికే శ్రీనివాసుడు అలసిపోయాడు. పెద్ద వటవృక్షం క్రింద విశ్రమించాడు.
కొంతదూరంలో కిలకిలారావాలు, కేకలు వినిపించాయి. ఆ ప్రాంతంలో మనుజ సంచారం ఉన్నందున శ్రీనివాసుడు సంతోషించి, దప్పిక తీర్చుకోవడానికి కాలి నడకన ఒక ఉద్యానవనంలో ప్రవేశించాడు. ఆ ఉద్యానవనంలో పద్మావతి తన చెలికత్తెలతో వసంతాలు ఆడుకుంటూ పాటలు పాడుతూ, గెంతుతూ ఆనందంగా నాట్యం చేస్తూవుంది. చేరువందుగల కోనేరులో శ్రీనివాసుడు దప్పిక తీర్చుకుని పద్మావతిని సమీపించసాగాడు.
ఆ ఉద్యానవనంలోకి పురుషులెవరూ ప్రవేశించకూడదు అని ఆకాశరాజు ఆజ్ఞ. అందుచే శ్రీనివాసుని చూచి కోపగించి, చెలికత్తెలు ‘ఓయీ! ఎవరు నీవు? ఇక్కడకెందుకొచ్చావు? ఇది పురుషులకు నిషిద్ధ స్థలమని తెలియదా?’ అని గద్దించారు. శ్రీనివాసుడు పద్మావతిని చూచినది మొదలు పరధ్యానంలో పడిపోయాడు. పద్మావతికి ఇంకా దగ్గరగా వస్తున్నాడు. పద్మావతి కూడా శ్రీనివాసుని చూచి నిశ్చేష్టురాలై సిగ్గుతో తల వంచుకుని చెట్టుచాటున నిలబడింది. చెలికత్తెలు పద్మావతికి కనిపించకుండా అడ్డుగా నిలబడి – గొడ్డుకొకదెబ్బ? మనిషికోమాట అన్నట్లు మామాట వినిపించుకోకుండా ఇంకా దగ్గరగా వస్తున్నావా? – అని చేతులెత్తారు.
పద్మావతి కోరికపై అతని గోత్రనామాలు అడుగగా – చెలులారా! నాకెవ్వరూ లేరు. నేను ఒంటరివాడను. జగమంతా నాకు బంధువులు, నాకు ఇల్లులేదు. ఎవరు ఆదరిస్తే వారివద్దనే ఉంటాను. ఇదీ నా చరిత్ర, మరి మీ నామధేయము? అని అడిగాడు. ‘ఆమె పేరు పద్మావతి. తండ్రి ఆకాశరాజు, తల్లి ధరణీదేవి, ఇది మా సంగతి’ అని చెలికత్తెలు బదులు చెప్పారు.
అప్పుడు శ్రీనివాసుడు, పద్మా నన్ను వివాహం చేసుకో! నేను నీకు తగిన వరుడను అని అనగా, వేటగానిలా ఉన్న అతని మాటలకు పద్మావతికి ఒళ్ళుమండి, చాలు! అధిక ప్రసంగము. వెంటనే ఇక్కడి నుండి వెళ్ళు’ అని హుంకరించింది.
పద్మావతి రుసరుసలకు శ్రీనివాసుడు నవ్వుతూ “బాలా! నన్ను తృణీకరించకు, ప్రేమకు అంతరాలులేవు. ప్రేమ హృదయాలకు సంబంధించినది. అది మమత, అనురాగము, అభిమానములతో ముడివేసుకొని ఉంటుంది. నీ సౌందర్యము చూచినది లగాయితు నిన్ను వివాహం చేసుకోవాలనే కోరిక నాలో జనించింది, నిన్ను వివాహం చేసుకోలేకపోతే నేను జీవించి ఉండలేను. నన్ను కాదనకు” అని మరికొంత దగ్గరకు వచ్చాడు.
ఇక సహించకూడదని పద్మావతి చెలులను పిలిచి “ఈ వేటగాడిని రాళ్ళతో కొట్టి తరిమండి” అని ఆజ్ఞ ఇచ్చింది. పద్మావతి ఆజ్ఞ వారికి బలమిచ్చింది. “ఓయీ! నీవు జంతువులను వేటాడెదవా? లేక మగువలను వేటాడ వచ్చావా? పొసొమ్ము” అని రాళ్ళతో కొట్టారు. అందరూ ఒక్కసారిగా కొట్టడంవలన శ్రీనివాసునకు శరీరమంతా దెబ్బలు తగిలినవి. అయినా శ్రీనివాసుడు దగ్గరగా వచ్చాడు. పద్మావతికి జాలి కలిగింది.
అతని కులగోత్రాలు తెలుసుకోవాలని మరల అడిగింది. “నా కులగోత్రాలు చెబుతాను. నన్ను నిరాశతో వెనక్కి పంపవద్దు. శీతాంశు కులము, వశిష్ట గోత్రము. నా తండ్రి వసుదేవుడు తల్లి దేవకి. బలరాముడు నా అన్న, నా చెల్లి సుభద్ర. పాండవులు నా ప్రియబంధువులు. పాండవ మధ్యముడగు అర్జునుడు నా బావమరిది. ఇదీ నా చరిత్ర. మరి మీ కులగోత్రాలు తెలుసుకోవచ్చునా?” అని అడిగాడు శ్రీనివాసుడు.
శ్రీనివాసుని మాటలలో మాట కలపాలని పద్మావతి “మాది చంద్రవంశము, అత్రిగోత్రము, నా తండ్రిపేరు ఆకాశరాజు, తల్లి ధరణీదేవి. నా తమ్ముని పేరు వసుధాముడు.” అనిచెప్పి. ‘చెలులారా! త్వరగా ఇటనుండి వెళ్ళమనండి’ అంది.
శ్రీనివాసుడు జాలిగా “నేను వెళ్ళలేక వెళ్ళలేక వెడుతున్నాను. నన్ను వివాహముచేసుకో. నీకేలోటూ రానివ్వను” అని అన్నాడు. అతని మాటలకు పద్మావతి లోలోపల మురిసిపోయి, నారదుడన్న మాటలు జ్ఞప్తికి రాగా చెలులతో రాజమందిరానికి వెళ్ళిపోయింది.
Bhagavad Gita 700 Slokas in Telugu మన జీవితంలో ఎదురయ్యే సవాళ్లు, సందేహాలు, భయాలు సహజమే. "ఎందుకు నా…
Bhagavad Gita 700 Slokas in Telugu మనిషి జీవితం ఒక ప్రయాణం. ఈ ప్రయాణంలో మనం తీసుకునే ప్రతి…
Karthika Puranam Telugu జలంధరుని యుద్ధ సన్నాహాలు ఓ పృథురాజా! రాహువు చెప్పిన విషయాలన్నీ వినగానే, క్రోధోద్రిక్తుడైన జలంధరుడు శివుని…
Karthika Puranam Telugu మారుమూలల్లో తలలు దాచుకున్నా కూడా వదలకుండా ముట్టడింప వస్తూన్న జలంధరునికి భయపడినవారై దేవతలంతా విష్ణు స్తోత్రం…
Karthika Puranam Telugu తులసి మహాత్మ్యంపై పృధు చక్రవర్తి ప్రశ్న పృధు చక్రవర్తి నారదుడిని అడుగుతున్నాడు: 'దేవర్షీ! తులసిని స్థాపించి,…
Karthika Puranam Telugu నారదుడు చెబుతున్నాడు: ఓ పృథు భూపాలా! కార్తీక వ్రతం పాటించే పురుషుడు తప్పకుండా ఆచరించవలసిన నియమాలను…