Venkateswara Swamy Katha-శ్రీనివాసుడు పద్మావతితో కలిసి ఆగస్త్యాశ్రమంలో నివసించేవారు. ఒకరోజు, నారదముని కొల్హాపురంలో తపస్సు చేస్తున్న లక్ష్మిని సందర్శించడానికి వెళ్లారు. ఈ సందర్భంలో, నారదముని లక్ష్మిని చూసి, ఆమె హృదయాన్ని ద్రవింపజేసిన అనేక సంఘటనలు చోటుచేసుకున్నాయి.
ఒకరోజు నారదముని కొల్హాపురంలో తపస్సు చేస్తున్న లక్ష్మీదేవిని దర్శించడానికి వెళ్ళాడు. నారదుడిని చూసిన లక్ష్మీదేవి మర్యాదపూర్వకంగా ఆసనం ఇచ్చి, శ్రీనివాసుడు మరియు పద్మావతి క్షేమ సమాచారాలను అడిగింది. నారదుడు పెదవి విరిచి, “అమ్మా, ఏమి చెప్పను! శ్రీనివాసుడు పద్మావతితోనే ఉంటూ నిన్ను పూర్తిగా మరచిపోయాడు. నీవు వెంటనే నారాయణుని వద్దకు వెళ్ళడం మంచిది” అని సలహా ఇచ్చాడు.
శ్రీనివాసుని వివాహానికి వెళ్ళినప్పటికీ, భర్త తనను విడిచి మరొకరిని వివాహం చేసుకోవడం లక్ష్మీదేవిని బాధించింది. నారదుని మాటలు ఆమె హృదయానికి ముల్లులా గుచ్చుకున్నాయి. కోపంతో నారదుని వెంటబెట్టుకుని శ్రీనివాసుని ఆశ్రమానికి వచ్చింది.
ఆ సమయంలో శ్రీనివాసుడు పద్మావతితో వనవిహారంలో శృంగార లీలల్లో ఉన్నాడు. ఆ దృశ్యాన్ని చూసిన లక్ష్మీదేవి కన్నీళ్లు పెట్టుకుని, “నాథా! తాళి కట్టిన భార్యను కదా! పద్మావతిని ఎంత ప్రేమించినా, నన్ను మరచిపోవడం తగునా!” అని కోపంగా అడిగింది.
పద్మావతి కూడా కోపంతో, “నీవెవరు? దంపతులు ఏకాంతంలో ఉండగా రావచ్చునా? ఆడజన్మ ఎత్తలేదా?” అని అడిగింది. లక్ష్మీదేవి, “ముందు వచ్చిన చెవులకంటే వెనుక వచ్చిన కొమ్ములు వాడిగా ఉంటాయి. నా భర్తను నీవు సొంతం చేసుకుంటున్నావా?” అని ప్రశ్నించింది. పద్మావతి, “అగ్నిసాక్షిగా పెళ్ళి చేసుకున్న నేను భార్యను కాక, కాషాయ వస్త్రాలు ధరించి తపస్సు చేసే నీవా భార్యవు? వెళ్ళిపో” అని గద్దించింది.
ఇలా వాదోపవాదాలు పెరిగిపోతుండగా, శ్రీనివాసుడు ఇద్దరినీ వారించినా శాంతించలేదు. విసిగిపోయిన శ్రీనివాసుడు ఏడడుగులు నడిచి పెద్ద శబ్దంతో శిలారూపంగా మారిపోయాడు. లక్ష్మీ, పద్మావతులు ఆ శబ్దానికి వెనుతిరిగి చూసి ఆశ్చర్యపోయారు. “స్వామీ! నా స్వామీ!” అని తలలు బాదుకుంటూ ఏడ్చారు.
అప్పుడు శ్రీనివాసుడు, “ప్రియ పత్నులారా! దుఃఖించవద్దు. ఇప్పటి నుండి నేను వేంకటేశ్వరునిగా పిలువబడతాను. ఈ కలియుగం అంతం వరకు ఈ రూపంతోనే ఉంటాను. నా భక్తుల కోరికలు తీరుస్తాను. లక్ష్మీ! ఈ పద్మావతి ఎవరు అనుకున్నావు? త్రేతాయుగంలో నేను రామావతారంలో ఉండగా సీతను రావణుడు తీసుకుపోతుండగా అగ్నిహోత్రుడు వేదవతిని మాయాసీతగా చేసి రావణునితో పంపించాడు. రావణ వధానంతరం అగ్ని ప్రవేశం చేయమని సీతను కోరగా, అగ్నిపరీక్షకు నిలబడిన వేదవతి తనను కూడా వివాహం చేసుకోమని కోరగా, అప్పుడు నీ ఎదుటనే ఆమెను కలియుగంలో వివాహం చేసుకుంటానని మాట ఇచ్చాను కదా! ఆ వేదవతియే ఈ పద్మావతి. ఈమె నీ అంశలోనే జన్మించింది” అని చెప్పాడు.
లక్ష్మీదేవి పద్మావతిని కౌగలించుకుని, “చెల్లీ! తెలియక జరిగిన పొరపాటును క్షమించు” అని కోరింది. కలహం తగ్గినందుకు శ్రీనివాసుడు సంతోషించాడు.
“లక్ష్మీ! నా వివాహానికి కుబేరుని వద్ద అప్పు చేశాను. ఆ అప్పు ఈ కలియుగాంతంలో తీర్చాలి. అంతవరకు వడ్డీ కడుతూ ఉండాలి. కాబట్టి, నీవు నా వక్షస్థలంపై ఆసీనురాలవు కమ్ము. పద్మావతి కూడా నా దక్షిణ వక్షస్థలంలో ఉంటుంది. కానీ, నీ అంశతో లక్ష్మిని సృష్టించి, పద్మ సరోవరంలో ఉండేలా చేయుము” అని వేంకటేశ్వర స్వామి పలికాడు. లక్ష్మీదేవి సంతోషించింది.
శుకాశ్రమం సమీపంలో అలివేలుమంగ అనే పేరుతో ఒక అగ్రహారం, దేవాలయం నిర్మించి అందులో పద్మావతిని, పద్మ సరోవరం నిర్మించి ఆ సరోవరంలో పద్మ పుష్పంలో లక్ష్మిని ఉంచమని, భక్తుల కోరికలు తీరుస్తూ వారికి ధన సహాయం చేస్తూ ఉండమని శ్రీమన్నారాయణుడు ఆజ్ఞాపించాడు. రాత్రులలో శ్రీనివాసుడు మంగాపురం వచ్చి సుప్రభాత సమయంలో తిరుమలకు వెళ్తుంటాడు.
Bhagavad Gita Chapter 10 Verse 8 ప్రతిరోజూ ఉదయం లేచి, మనం ఎన్నో కలలతో, ఆశలతో రోజును ప్రారంభిస్తాం.…
Bhagavad Gita Chapter 10 Verse 7 ఈ రోజుల్లో చాలా మంది ఉదయం లేవగానే ఒక రకమైన అలసటతో…
Bhagavad Gita Chapter 10 Verse 6 ఈ రోజుల్లో చాలామందిని వేధిస్తున్న ప్రధాన సమస్య – "అసలు నేనెవరిని?…
Bhagavad Gita Chapter 10 Verse 4 & 5 ఈ రోజుల్లో చాలా మందిని పట్టి పీడిస్తున్న ఒకే…
Bhagavad Gita Chapter 10 Verse 3 మనలో చాలామంది రాత్రి పడుకునే ముందు ఒకే ఆలోచనతో సతమతమవుతుంటారు. "ఈరోజు…
Bhagavad Gita Chapter 10 Verse 2 మనలో చాలా మంది జీవితం... బయట ప్రపంచంతో యుద్ధం చేయడం కంటే,…