| దేవుడు | పరిస్థితి | భృగువు చర్య | ఫలితం |
|---|---|---|---|
| బ్రహ్మ | సృష్టి రహస్యాలపై చర్చలో నిమగ్నమై ఉన్నారు. | అనుమతి లేకుండా ప్రవేశించి, ఆసనంపై కూర్చున్నారు | బ్రహ్మ పట్టించుకోకపోవడంతో, భూలోకంలో పూజలు, దేవాలయాలు లేకుండా పోవాలని శపించారు |
| శివుడు | పార్వతితో ఏకాంతంగా ఉన్నారు | ద్వారపాలకులను దాటుకుని లోపలికి ప్రవేశించారు | శివుడు కోపించి భస్మం చేస్తానని హెచ్చరించగా, లింగాకారంలోనే పూజింపబడాలని శపించారు |
| విష్ణువు | లక్ష్మీదేవి పాదాలు ఒత్తుతూ ఉన్నారు | వక్షస్థలంపై కాలితో తన్నారు | విష్ణువు క్షమించి, పాదాలు ఒత్తుతూ మూడవ నేత్రాన్ని చిదిపివేశారు. భృగువు అహంకారం నశించింది |
Venkateswara Swamy Katha-కార్యార్థియై బయలుదేరిన భృగుమహర్షి మొదట సత్యలోకానికి వెళ్ళి బ్రహ్మ నివాసానికి చేరుకున్నారు. ఆ సమయంలో బ్రహ్మ అష్టదిక్పాలకులతో, మహాఋషి పుంగవులతో కొలువుదీరి సృష్టి రహస్యములపై చర్చ సాగిస్తున్నారు. భృగుడు లోనికి వచ్చిన ఎవరికీ అభివాదం చేయకుండానే ఒక ఆసనంపై ఆసీనుడయ్యాడు. బ్రహ్మ తన కార్యములో మునిగివున్నారు.
బ్రహ్మ తనను పలకరించి, ఉచితాసనం చూపలేదనే కోపంతో “చతుర్ముఖా! సకల చరాచర సృష్టికి నీవే కర్తవను అహంభావంతో కార్యార్థమై వచ్చిన నన్ను కన్నెత్తియైనా చూడలేదు. నీకింత గర్వమా? లోకకళ్యాణార్థము మా బోటి వారము శ్రమపడి క్రతువులు జేయుచుండగా మమ్ము ఆశీర్వదించుటకు బదులు, పలకనైనా పలకక గర్విష్టివై యున్నావు. కాన, భూలోకమున నీకు పూజలుగాని, దేవాలయాలుగాని లేకుండుగాక!” అని శపించి, తను వచ్చిన కార్యము నెరవేరలేదనే కోపముతో సత్యలోకము విడిచి కైలాసానికి వెళ్ళాడు. భృగుని ప్రవర్తనవలన సరస్వతీదేవికి ఆశ్చర్యం కలిగి “స్వామీ! ఏమిటిది?” అని ఆతురతగా అడిగింది. “దేవీ! తొందరపడకు. భృగువు చేయవలసినది చాలా ఉన్నది. చూస్తూవుండు” అని సరస్వతిని ఓదార్చాడు బ్రహ్మ.
సత్యలోకంలో బ్రహ్మ వలన తన కార్యము నెరవేరలేదని రుసరుసలాడుతూ శివుని పరీక్షించడానికి భృగుడు కైలాసానికి వెళ్ళాడు. అక్కడ తన కార్యము నెరవేరుతుందనుకున్నాడు. కాని, ఆ సమయానికి కైలాసంలో ప్రమథగణములు శివనామ స్మరణలో తన్మయులై తాండవ మాడుచున్నారు. పార్వతీ పరమేశ్వరులు కేళీ మందిరంలో ఏకాంతంగా సరసాలాడుచున్నారు. భృగుని రాకను ఎవ్వరూ గమనించలేదు. ఎవరి తాండవ నృత్యము వారిదే. భృగుడు సరాసరి కేళీ మందిరములోనికి వెళ్ళబోయాడు. ద్వారపాలకులు అడ్డుపడి లోనికి ప్రవేశించనీయలేదు. భృగుడు ఉగ్రుడై వారిని గద్దించి, అడ్డువచ్చినవారిని త్రోసి, లోనికి ప్రవేశించారు. ఆసమయంలో శివపార్వతులు శృంగార క్రీడలోవున్నారు. భృగువును చూచి పార్వతి సిగ్గుపడి ప్రక్కకు తొలగినది. దానితో శివునికి పట్టరాని కోపమువచ్చి “ఓయీ భృగువా! తపశ్శాలివై యుండి కూడా ఇలాంటి స్థలమునకు రాకూడదని తెలియదా! భక్తుడవని క్షమించి విడుచుచున్నాను. లేకున్న నిన్ను భస్మీపటలము చేసెడివాడనే!” అని గద్దించాడు.
భృగుడు శివుని కోపాన్ని గ్రహించాడు. “ఇతగాడు నా అంతర్యాన్ని గ్రహించలేక తాను సగుణముతో నన్ను దూషించినాడు. నేను వచ్చిన కార్యము శివుని వలన కూడా వ్యర్థమైనది” అని మనసులో అనుకున్నాడు. “శంకరా! నీకోసం శ్రమపడి వచ్చినందుకు నన్ను దూషణలతో త్రిప్పి పంపుచున్నావు. కానిమ్ము. ఇదిగో నా శాపము భూలోకవాసులు నిన్ను లింగాకారముగానే పూజింతురుగాక” అని శపించి చరచరా వైకుంఠానికి వెళ్ళిపోయినాడు.
వైకుంఠము లక్ష్మీనారాయణుల నివాసము. సర్వసంపదలకూ, సర్వసుఖాలకూ నిలయము. పుణ్యఫలము నొందిన జనులు అక్కడ లక్ష్మీనారాయణులను కొలుస్తూ వుంటారు. గరుడ, గంధర్వ, కిన్నెర, కింపురుషులంతా అక్కడ నివసిస్తూ వుంటారు. ఎటుచూసినా బంగారపు భవంతులు, ఉద్యానవనాలే. ముక్కోటి దేవతలకూ ఆది పుణ్యస్థలము. అటువంటి వైకుంఠానికి వచ్చి భృగుమహర్షి లక్ష్మీనారాయణుల నివాసములో ప్రవేశించాడు. ఆ సమయంలో లక్ష్మీదేవి భర్త పాదము ఒత్తుతూ, సిగ్గుతో తలవంచుకొనియున్నది. లక్ష్మీదేవి చేయు సేవలకు లోలోన సంతోషించుకున్నాడు నారాయణుడు.
భృగువు ఆ దృశ్యాన్ని చూచి, లక్ష్మీనారాయణుల దర్శనభాగ్యమునకు తన్మయుడై మనసులోనే నారాయణుని ధ్యానించి నిలుచున్నాడు. మహర్షి రాకను లక్ష్మీనారాయణులు గమనించలేదు. భృగువు పట్టరాని ఆవేశంతో నారాయణుని దరిజేరి తనకాలితో విష్ణువక్షస్థలాన్ని తన్నగా లక్ష్మీనారాయణులు ఉలిక్కిపడి లేచారు. బ్రహ్మవలన, శివునివలన పరాభవింపబడిన భృగువు ఆ ఆవేశమును ఆపుకొనలేక లక్ష్మీదేవికి నివాసమైన విష్ణు వక్షస్థలాన్ని తన్నుటచే ఆమెకు క్రోధమూ, భరించలేని అవమానము కలిగినవి. వెంటనే నారాయణుడు భృగుమహర్షికి నమస్కరించి, “స్వామీ! నన్ను తమ సుకుమారపాదములతో తన్నుట వలన మీ పాదములకు ఎంత నొప్పి కలిగినదోకదా? ఆహా! ఏమి నా భాగ్యము మీవంటి తపశ్శాలి పాదస్పర్శ కలిగినందుకు నేను ధన్యుడనైనాను.” అంటూ నెమ్మదిగా భృగువు పాదము పట్టుకొని ఒత్తుచు, అరికాలియందున్న మూడవ నేత్రాన్ని చిదిపివేసెను. దానితో అప్పటివరకు భృగుమహర్షికి ఉన్న అహంకారము వధలి జ్ఞానోదయమైనది. శ్రీమన్నారాయణుడు మహర్షికి పాదపూజచేసి ఉచితాసనముపై కూర్చుండబెట్టి “ఋషిపుంగవా! మీరు వచ్చిన కార్యమును గ్రహించినాను. మీ మనోభావము సిద్ధించునుగాక” అని వినమ్రతతో చెప్పగా “ఆహా! ఏమి శాంత స్వభావము! నాతొందరపాటుకు ఏమాత్రమూ కినుక వహించక తిరిగినాకే సపర్యలు చేయుటయా? నిజముగా సాత్త్వికగుణము కలవాడు శ్రీమన్నారాయణు డొక్కడే” అని మనసులో భావించాడు.
Bhagavad Gita Chapter 10 Verse 8 ప్రతిరోజూ ఉదయం లేచి, మనం ఎన్నో కలలతో, ఆశలతో రోజును ప్రారంభిస్తాం.…
Bhagavad Gita Chapter 10 Verse 7 ఈ రోజుల్లో చాలా మంది ఉదయం లేవగానే ఒక రకమైన అలసటతో…
Bhagavad Gita Chapter 10 Verse 6 ఈ రోజుల్లో చాలామందిని వేధిస్తున్న ప్రధాన సమస్య – "అసలు నేనెవరిని?…
Bhagavad Gita Chapter 10 Verse 4 & 5 ఈ రోజుల్లో చాలా మందిని పట్టి పీడిస్తున్న ఒకే…
Bhagavad Gita Chapter 10 Verse 3 మనలో చాలామంది రాత్రి పడుకునే ముందు ఒకే ఆలోచనతో సతమతమవుతుంటారు. "ఈరోజు…
Bhagavad Gita Chapter 10 Verse 2 మనలో చాలా మంది జీవితం... బయట ప్రపంచంతో యుద్ధం చేయడం కంటే,…