Vinayaka Vratha Kalpam Katha
వినాయక చవితి రోజున ఉదయాన్నే ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ముఖ్యంగా గడపలకు మామిడి ఆకుల తోరణాలు కట్టుకోవాలి. ఇంటిని అందంగా అలంకరించుకున్నాక, కుటుంబసభ్యులందరూ తలస్నానం చేయాలి.
పూజా స్థలం
పూజ చేయడానికి ముందు ఇంట్లో దేవుడి గదిలో లేదా ఇంట్లో శుభ్రమైన ప్రదేశంలో ఒక పీట వేసి దానిపై వినాయకుడి విగ్రహాన్ని ఉంచాలి. పూజకు అవసరమైన సామగ్రిని అంతా దగ్గరగా పెట్టుకోవాలి.
ఉండ్రాళ్ళు
వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఉండ్రాళ్ళను తప్పనిసరిగా తయారుచేయాలి. ఇతర ప్రసాదాలు ఉన్నా లేకపోయినా ఉండ్రాళ్ళు మాత్రం కచ్చితంగా ఉండాలి.
కలశం, గణపతి ప్రతిమ
వినాయకుడి విగ్రహం ముందు పీటపై కొంచెం బియ్యం పోసి దానిపై రాగి లేదా వెండి లేదా మట్టి పాత్రను ఉంచి, పసుపు, కుంకుమ బొట్లు పెట్టాలి. ఆ పాత్రలో కొన్ని అక్షతలు, పూలు వేసి, దానిపై మామిడి ఆకులు ఉంచి, చివరగా కొబ్బరికాయను ఉంచి కలశం ఏర్పాటు చేసుకోవాలి. అలాగే, పసుపు ముద్దతో ఒక చిన్న గణపతి ప్రతిమను కూడా తయారుచేసుకోవాలి.
పూజ సమయంలో జాగ్రత్తలు
పూజ చేయడానికి ఒక చిన్న గ్లాసులో చెంచా లేదా ఉద్ధరణి ఉంచుకోవాలి. దాని పక్కన మరో చిన్న కంచం పెట్టుకోవాలి. పూజ చేసే సమయంలో పసుపు, కుంకుమ చేతికి అంటుకోకుండా చేతి కింద ఒక శుభ్రమైన గుడ్డను ఉంచుకుంటే మంచిది.
పూజ ప్రారంభం
ముందుగా నుదుటిపై కుంకుమ పెట్టుకుని, నమస్కరించి ఈ విధంగా ప్రార్థించాలి.
ప్రార్థన
ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్
ప్రసన్నవదనం ధ్యాయేత్సర్వ విఘ్నోపశాంతయే
అయం ముహూర్తస్సుముహూర్తోస్తు
తదేవలగ్నం, సుదినం తదేవ, తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ, లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి
లాభస్తేషాం, జయస్తేషాం కుతస్తేషాం పరాభవః
యేషా మిందీవరశ్యామో హృదయస్థో జనార్దనః
ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం
లోకాభిరామం శ్రీరామం భూయోభూయో నమామ్యహమ్
సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః
లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః
ధూమకేతుర్గణాధ్యక్షః ఫాలచంద్రో గజాననః
వక్రతుండ శ్శూర్పకర్ణో, హేరంబః స్కందపూర్వజః
అష్టావష్టా చ నామాని యః పఠేచ్ఛృణుయాదపి
విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా
సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే
అభీప్సితార్థ సిద్ధ్యర్థం, పూజితో యస్సురైరపి
సర్వవిఘ్నచ్ఛిదే తస్మై గణాధిపతయే నమః
ఆచమనం
నమస్కరించుకుని ఆచమనం చేయాలి. ఎడమచేతిలో ఉద్ధరిణిని పట్టుకుని, నీటి పాత్ర నుంచి మూడుసార్లు నీటిని కుడిచేతిలో వేసుకుంటూ ఈ మంత్రాలు పలకాలి:
- ఓం కేశవాయ స్వాహా
- ఓం నారాయణాయ స్వాహా
- ఓం మాధవాయ స్వాహా
ఈ మంత్రాలు చెబుతూ నీటిని శబ్దం చేయకుండా కింది పెదవితో స్వీకరించాలి. తరువాత, హస్తం ప్రక్షాళ్య అంటూ ఉద్ధరిణితో నీరు తీసుకుని చేతిని కడుక్కోవాలి.
ఆ తర్వాత, ఓం గోవిందాయ నమః అంటూ ఉద్ధరిణితో నీరు కుడి చేతిలోకి తీసుకుని, వేరొక పాత్రలోకి వదలాలి. ఆచమనం చేసిన నీటిని పూజలో దేనికీ ఉపయోగించకూడదు. తర్వాత చేతులు జోడించి, నమస్కరించి
ఈ క్రింది విష్ణు నామాలను స్మరించాలి
- ఓం కేశవాయ నమః
- ఓం నారాయణాయ నమః
- ఓం మాధవాయ నమః
- ఓం గోవిందాయ నమః
- ఓం విష్ణవే నమః
- ఓం మధుసూదనాయ నమః
- ఓం త్రివిక్రమాయ నమః
- ఓం వామనాయ నమః
- ఓం శ్రీధరాయ నమః
- ఓం హృషీకేశాయ నమః
- ఓం పద్మనాభాయ నమః
- ఓం దామోదరాయ నమః
- ఓం సంకర్షణాయ నమః
- ఓం వాసుదేవాయ నమః
- ఓం ప్రద్యుమ్నాయ నమః
- ఓం అనిరుద్ధాయ నమః
- ఓం పురుషోత్తమాయ నమః
- ఓం అధోక్షజాయ నమః
- ఓం నారసింహాయ నమః
- ఓం అచ్యుతాయ నమః
- ఓం జనార్ధనాయ నమః
- ఓం ఉపేంద్రాయ నమః
- ఓం హరయే నమః
- ఓం శ్రీకృష్ణాయ నమః
భూతోచ్చాటన
ఉత్తిష్టంతు భూతపిశాచాః యే తే భూమిభారకాః
ఏతేషామవిరోధేన బ్రహ్మకర్మ సమారభే.
ఈ శ్లోకం పఠించిన తర్వాత ఉద్ధరణితో కుడిచేతిలోకి నీళ్లు తీసుకుని, ఆ నీటిని నాలుగు దిక్కులా చిలకరించాలి.
ప్రాణాయామం
ఓం భూర్భువస్సువః దైవీ గాయత్రీ ఛందః, ప్రాణాయామే వినియోగః.
(ప్రాణాయామం చేయాలి. కుడిచేతి బొటనవేలితో కుడి ముక్కు రంధ్రాన్ని మూసి, ఎడమ ముక్కు రంధ్రం నుంచి గాలి పీలుస్తూ ఈ క్రింది మంత్రాన్ని మనసులో జపించాలి.)
ఓం భూః, ఓం భువః, ఓం సువః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓగ్ం సత్యం, ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి, ధియో యోనః ప్రచోదయాత్.
ఓం ఆపోజ్యోతీ రసోమృతం, బ్రహ్మ భూర్భువస్వరోమ్.
ఇలా మూడుసార్లు ప్రాణాయామం చేయాలి.
సంకల్పం
(ప్రాణాయామం పూర్తైన తర్వాత, దీపారాధన చేసి, ఈ క్రింది విధంగా సంకల్పం చెప్పుకోవాలి.)
ఓం మమోపాత్త సమస్త దురితక్షయద్వారా శ్రీపరమేశ్వర ఉద్దేశ్య శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శుభేశోభనే ముహూర్తే అద్య బ్రహ్మణః ద్వితీయపరార్థే శ్వేత వరాహకల్పే వైవస్వత మన్వంతరే, అష్టావింశతి తమే, కలియుగే, ప్రథమపాదే, జంబూద్వీపే, భరతవర్షే, భరతఖండే, మేరోః దక్షిణ దిగ్భాగే, శ్రీశైలస్య… ప్రదేశే (పూజ చేసేవారు శ్రీశైలానికి ఏ దిక్కులో ఉంటే ఆ దిక్కు పేరు చెప్పుకోవాలి), అస్మిన్ వర్తమానే వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాది షష్టి సంవత్సరాల మధ్య శ్రీ విశ్వావసు నామసంవత్సరే, దక్షిణాయనే, వర్ష ఋతౌ, భాద్రపద మాసే, శుక్ల పక్షే, చతుర్ధ్యాం తిథౌ, సౌమ్యవాసరే యుక్తాయాం, శుభ నక్షత్రే, శుభ యోగే, శుభ కరణే, ఏవంగుణ విశేషణ విశిష్టాయాం, అస్యాం శుభతిథౌ, శ్రీమాన్…. గోత్రః…. నామధేయః, శ్రీమతః…. గోత్రస్య….. నామ ధేయస్య (పూజ చేసేవారు గోత్రం, పేరు చెప్పుకోవాలి. పూజకు కూర్చున్న చిన్నారుల పేర్లు కూడా చెప్పాలి) ధర్మపత్నీసమేతస్య అస్మాకం సహకుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం, చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం, ఇష్ట కామ్యార్థ సిద్ధ్యర్థం, మనోవాంఛా ఫలసిద్ధ్యర్థం, సమస్త దురితోప శాంత్యర్థం, సమస్త మంగళావాప్త్యర్థం, వర్షే వర్షే ప్రయుక్త శ్రీవరసిద్ధి వినాయక చతుర్థీ ఉద్దేశ్య, శ్రీవరసిద్ధి వినాయక స్వామి దేవతా ప్రీత్యర్థం, కల్పోక్త ప్రకారేణ, యావచ్ఛక్తి ధ్యానావాహనాది షోడశోపచార పూజా విధానైన శ్రీవరసిద్ధి వినాయక వ్రత పూజాం కరిష్యే (అంటూ కుడిచేతి మధ్య వేలితో నీళ్లు ముట్టుకోవాలి) ఆదౌ నిర్విఘ్నేన పరిసమాప్త్యర్థం శ్రీగణాధిపతి పూజాం కరిష్యే, తదంగ కలశపూజాం కరిష్యే
కలశపూజ
కలశం గంధ పుష్పాక్షతై రభ్యర్చ్య, తస్యోపరి హస్తంనిధాయ
(కలశం ఉంచేచోట పసుపు కుంకుమలు పెట్టి, దానిపై నీటి కలశాన్ని ఉంచి, ఆ కలశానికి గంధాక్షతలు పెట్టి, అందులో తులసీ పత్ర పుష్పాల్ని వేసి కుడిచేతిని కలశంపై ఉంచాలి)
కలశస్య ముఖే విష్ణుః కంఠే రుద్రః సమాశ్రితః
మూలే తత్ర స్థితో బ్రహ్మా మధ్యే మాతృగణాః స్మృతాః
కుక్షౌ తు సాగరాః సర్వే సప్త ద్వీపా వసుంధరా
ఋగ్వేదోథ యజుర్వేదః సామవేదో హ్యధర్వణః
అంగైశ్చ సహితాః సర్వే కలశాంబు సమాశ్రితాః
ఆయాంతు దేవ పూజార్థం దురిత క్షయకారకాః
(ఈ శ్లోకం చదువుతూ ఆకును నీటిలో సవ్య పద్ధతిలో తిప్పాలి)
ఓం గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతీ
నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు
కలశోదకేన పూజా ద్రవ్యాణి దేవం ఆత్మానం చ సంప్రోక్ష్య
(తమలపాకుతో కలశంలోని నీటిని పూజా ద్రవ్యాల మీదా, దైవం మీద చల్లి, తమ మీద కూడా కొద్దిగా చిలకరించుకోవాలి. అనంతరం పసుపు గణపతిని పూజించాలి.)
మహాగణపతి పూజ
గణానాంత్వా గణపతిగ్ం హవామహే
కవిం కవీనాముపమశ్రవస్తమం
జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత్య
ఆ నః శృణ్వన్నూతిభిస్సీద సాధనం
శ్రీ మహాగణాధిపతయే నమః
ధ్యానావాహనాది షోడశోపచార పూజాం కరిష్యే
(మధ్య వేలితో నీటిని తాకాలి)
ధ్యానం
ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే
(అనే శ్లోకం చదువుతూ పూలూ అక్షతలూ కలిపి పసుపు గణపతి పాదాల చెంత ఉంచాలి. పూజను దేవుని పాదాల వద్ద మాత్రమే చేయాలి. శిరసుపైన పూలు కానీ అక్షతలు కానీ చల్లరాదు.)
ఓం శ్రీ మహాగణపతిం ధ్యాయామి ధ్యానం సమర్పయామి
ఓం శ్రీ మహాగణపతిం ఆవాహయామి
ఓం శ్రీ మహాగణపతయే నమః ఆసనం సమర్పయామి (పూలు, అక్షతలు వేసి నమస్కరించాలి) (తర్వాత)
(ఉద్ధరణితో నీరు చూపించి అర్ఘ్య పాత్రలోకి వేస్తూ)
పాదయోః పాద్యం సమర్పయామి,
హస్తయోః అర్ఘ్యం సమర్పయామి,
ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి
అని చెబుతూ ఉద్ధరణితో నీటిని పసుపు గణపతికి చూపించి ఆ నీటిని చిన్న పళ్లెంలో వేయాలి.
(పసుపు గణపతిని గంధం, అక్షతలు, పసుపు, కుంకుమ, పూలతో పూజించాలి. అగరువత్తులు వెలిగించి, బెల్లం లేదా పండ్లు నైవేద్యం పెట్టి షోడశోపచార పూజ చేయాలి.)
యథాభాగం గుడం నివేదయామి
శ్రీ మహాగణాధిపతిః సుప్రసన్నో సుప్రీతో వరదో భవతు
శ్రీ మహాగణాధిపతి ప్రసాదం శిరసా గృహ్లామి
అంటూ పూజ చేసిన అక్షతలు రెండు తీసుకుని తలపై ఉంచుకోవాలి.
శ్రీ మహాగణాధిపతయే నమః యథాస్థానం ప్రవేశయామి, శోభనార్థే క్షేమాయ పునరాగమనాయ చ
అంటూ పసుపు గణపతిని కొద్దిగా తూర్పువైపుకు కదిలించి.. అక్షతలు వేసి నమస్కారం చేయాలి. మరలా ఆచమనం చేసి పైన సూచించిన విధంగా మరల సంకల్పం చెప్పుకోవాలి.
అథ శ్రీ వరసిద్ధి వినాయక పూజాం కరిష్యే
తదంగ ప్రాణప్రతిష్ఠాపనం కరిష్యే-
(అంటూ కుడిచేతి మధ్యవేలితో నీటిని తాకాలి)
శ్రీ వరసిద్ధి వినాయక ప్రాణప్రతిష్ఠ
(విగ్రహంపై పువ్వుతో కొంచెం పంచామృతాలను చిలకరించి)
ఓం ఆం హ్రీం క్రోం యం రం లం వం శం షం సం హం-
ఇత్యాద్యేన ప్రాణప్రతిష్ఠాపనం కృత్వా, నమస్కృత్వా (నమస్కారం చేస్తూ)
ఓం శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః
ఓం స్వామిన్! సర్వ జగన్నాథ! యావత్ పూజావసానకమ్
తావత్త్వం ప్రీతి భావేన బింబేస్మిన్ సన్నిధిం కురు
ఆవాహితో భవ, స్థాపితో భవ, సుప్రసన్నో భవ, వరదో భవ, అవకుంఠితో భవ, వరదో భవ, స్థిరాసనం కురు ప్రసీద ప్రసీద ప్రసీద
(అంటూ వినాయకుడి విగ్రహం పాదాలవద్ద అక్షతలు, పూలు వేసి నమస్కరించాలి)
షోడశోపచార పూజ
భవసంచిత పాపౌఘ విధ్వంసన విచక్షణమ్
విఘ్నాంధకార భాస్వంతం విఘ్నరాజ మహం భజే
ఓం ఏకదంతం శూర్పకర్ణం గజవక్త్రం చతుర్భుజమ్
పాశాంకుశధరం దేవం ధ్యాయేత్సిద్ధి వినాయకమ్
ఉత్తమం గణనాథస్య వ్రతం సంపత్కరం శుభం
భక్తాభీష్టప్రదం తస్మాత్ ధ్యాయేత్తం విఘ్ననాయకం
ధ్యాయేద్గజాననం దేవం తప్తకాంచన సన్నిభం
చతుర్భుజం మహాకాయం సర్వాభరణభూషితం
శ్రీ వరసిద్ధి వినాయకస్వామినే నమః ధ్యాయామి
(వినాయకుడి విగ్రహం పాదాల వద్ద పూలు, అక్షతలు వేసి నమస్కరించాలి)
ఆవాహనం
ఓం అత్రాగచ్ఛ జగద్వన్ద్య సురరాజార్చితేశ్వర
అనాథనాథ సర్వజ్ఞ గౌరీగర్భ సముద్భవ
ఓం శ్రీవరసిద్ధి వినాయకస్వామినే నమః ఆవాహయామి
(మరల అక్షతలు వేయాలి)
ఆసనం
మౌక్తికైః పుష్యరాగైశ్చ నానారత్నైర్విరాజితమ్
రత్నసింహసనం చారు ప్రీత్యర్థం ప్రతిగృహ్యతామ్
ఆసనం సమర్పయామి
(అక్షతలు లేదా పూలు వేయాలి)
అర్ఘ్యం
గౌరీపుత్ర నమస్తేస్తు శంకరప్రియనందన
గృహాణార్ఘ్యం మయాదత్తం గంధపుష్పాక్షతైర్యుతమ్
అర్ఘ్యం సమర్పయామి
(ఉద్ధరణితో నీరును స్వామికి చూపించి పక్కన ఉంచుకున్న పాత్రలో వేయాలి)
పాద్యం
గజవక్త్ర నమస్తేస్తు సర్వాభీష్టప్రదాయక
భక్త్యా పాద్యం మయాదత్తం గృహాణ ద్విరజానన
పాద్యం సమర్పయామి
(మరలా కొంచెం నీటిని స్వామికి చూపించి స్వామి పాదాల ముందుంచాలి)
ఆచమనీయం
అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణ గణపూజిత
గృహాణాచమనం దేవ తుభ్యం దత్తం మయా ప్రభో
ఆచమనీయం సమర్పయామి
(కొంచెం నీటిని స్వామికి చూపించి పాత్రలో వేయాలి)
మధుపర్కం
దధిక్షీర సమాయుక్తం మధ్వాజ్యేన సమన్వితమ్
మధుపర్కం గృహాణేదం గజవక్త్ర నమోస్తుతే
మధుపర్కం సమర్పయామి
(స్వామికి మధుపర్కాన్ని సమర్పించాలి)
పంచామృత స్నానం
ఓం స్నానం పంచామృతైర్దేవ గృహాణ గణనాయక
అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణగణపూజిత
పంచామృతస్నానం సమర్పయామి
(ఆవుపాలు, పెరుగు, నెయ్యి, పంచదార, తేనెలు కలిపిన మిశ్రమాన్ని ఒక పువ్వుతో అద్ది స్వామి విగ్రహంపై చల్లాలి)
శుద్ధోదక స్నానం
ఓం గంగాది సర్వతీర్థేభ్యః ఆహృతై రమలైర్జలైః
స్నానం కురుష్వ భగవన్నుమాపుత్ర నమోస్తుతే
శుద్ధోదకస్నానం సమర్పయామి
(కలశంలో ఉన్న నీటితో స్నానం చేయించాలి)
వస్త్రం
ఓం రక్తవస్త్రద్వయం చారు దేవయోగ్యం చ మంగళమ్
శుభప్రదం గృహాణ త్వం లంబోదర హరాత్మజ
వస్త్రయుగ్మం సమర్పయామి
(స్వామికి వస్త్రాలు లేదా ఇంట్లో పూజ చేసుకునేట్లయితే పత్తికి పసుపు, కుంకుమ రాసి దాన్ని వస్త్రంగా సమర్పించవచ్చు)
యజ్ఞోపవీతమ్
రాజితం బ్రహ్మసూత్రం చ కాంచనం చోత్తరీయకమ్
గృహాణ దేవ! సర్వజ్ఞ భక్తానామిష్టదాయక
ఉపవీతం సమర్పయామి
(యజ్ఞోపవీతాన్ని సమర్పించాలి)
గంధం
ఓం చందనాగరు కర్పూర కస్తూరీ కుంకుమాన్వితమ్
విలేపనం సురశ్రేష్ఠ! ప్రీత్యర్థం ప్రతిగృహ్యతామ్
దివ్యపరిమళ గంధం సమర్పయామి
(కొంచెం గంధాన్ని స్వామికి అలకరించాలి)
అక్షతలు
ఓం అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ శాలీయాన్ తండులాన్ శుభాన్
గృహాణ పరమానంద! శంభుపుత్ర! నమోస్తుతే
అక్షతాన్ సమర్పయామి
(స్వామికి అక్షతలు సమర్పించాలి)
పత్రపుష్పాలు
ఓం సుగంధీని చ సుపుష్పాణి జాజీకుందముఖాని చ
ఏకవింశతి పత్రాణి సంగృహాణ నమోస్తుతే
పత్రపుష్పాణి పూజయామి
(స్వామిని పూలతో, పత్రాలతో పూజించాలి)
అథాంగ పూజ
(కింద ఉన్న నామాలను ఒకరు చదువుతూ ఉంటే మిగిలినవారు అక్షతలతో పూజించాలి)
ఓం గణేశాయ నమః, పాదౌ పూజయామి. (స్వామి పాదాలపై అక్షతలు వేయాలి.)
ఓం ఏకదంతాయ నమః, గుల్ఫౌ పూజయామి. (మడిమలు)
ఓం శూర్పకర్ణాయ నమః, జానునీ పూజయామి. (మోకాళ్లు)
ఓం విఘ్నరాజాయ నమః, జంఘే పూజయామి. (పిక్కలు)
ఓం ఆఖువాహనాయ నమః, ఊరూ పూజయామి. (తొడలు)
ఓం హేరంబాయ నమః, కటిం పూజయామి. (నడుము)
ఓం లంబోదరాయ నమః, ఉదరం పూజయామి. (బొజ్జ)
ఓం గణనాథాయ నమః, నాభిం పూజయామి. (బొడ్డు)
ఓం గణేశాయ నమః, హృదయం పూజయామి. (రొమ్ము)
ఓం స్థూలకంఠాయ నమః, కంఠం పూజయామి. (గొంతు)
ఓం స్కందాగ్రజాయ నమః, స్కంధౌ పూజయామి. (భుజాలు)
ఓం పాశహస్తాయ నమః, హస్తౌ పూజయామి. (చేతులు)
ఓం గజవక్త్రాయ నమః, వక్త్రం పూజయామి. (ముఖం)
ఓం విఘ్నహంత్రే నమః, నేత్రే పూజయామి. (కళ్ళు)
ఓం శూర్పకర్ణాయ నమః, కర్ణౌ పూజయామి. (చెవులు)
ఓం ఫాలచంద్రాయ నమః, లలాటం పూజయామి. (నుదురు)
ఓం సర్వేశ్వరాయ నమః, శిరః పూజయామి. (తల)
ఓం విఘ్నరాజాయ నమః, సర్వాణ్యంగాని పూజయామి. (శరీరమంతా)
(అని చెప్పి, దోసిలితో పూలు తీసుకుని, వినాయకుని శిరస్సు నుండి పాదాల వరకు పడేలా వేయాలి.)
ఏకవింశతి పత్రపూజ
(ఒక్కొక్క నామం చదువుతూ బ్రాకెట్లో పేర్కొన్న పత్రాలు తీసుకుని స్వామిని పూజించాలి.)
ఓం సుముఖాయ నమః – మాచీపత్రం పూజయామి (మాచిపత్రి)
ఓం గణాధిపాయ నమః – బృహతీపత్రం పూజయామి (వాకుడాకు)
ఓం ఉమాపుత్రాయ నమః – బిల్వపత్రం పూజయామి (మారేడాకు)
ఓం గజాననాయ నమః – దూర్వాయుగ్మం పూజయామి (రెండు గరికలు)
ఓం హేరంబాయ నమః – చూతపత్రం పూజయామి (మామిడి)
ఓం లంబోదరాయ నమః – కరవీరపత్రం పూజయామి (గన్నేరు)
ఓం ఏకదంతాయ నమః – విష్ణుక్రాంతపత్రం పూజయామి (విష్ణుక్రాంత)
ఓం శూర్పకర్ణాయ నమః – దాడిమీపత్రం పూజయామి (దానిమ్మ)
ఓం సుముఖాయ నమః – దేవదారుపత్రం పూజయామి (దేవదారు)
ఓం గజాననాయ నమః – మరువకపత్రం పూజయామి (మరువం)
ఓం వక్రతుండాయ నమః – సింధువారపత్రం పూజయామి (వావిలాకు)
ఓం విఘ్నరాజాయ నమః – జాజీపత్రం పూజయామి (జాజి)
ఓం విఘ్నహంత్రే నమః – గండకీపత్రం పూజయామి (గడ్డి తెల్లిగరిక)
ఓం ఇభవక్త్రాయ నమః – శమీపత్రం పూజయామి (జమ్మి)
ఓం కపిలాయ నమః – అశ్వత్థపత్రం పూజయామి (రావి)
ఓం కపిలాయ నమః – ఉత్తరేణి పత్రం పూజయామి (ఉత్తరేణి)
ఓం వినాయకాయ నమః – అర్జునపత్రం పూజయామి (మద్ది)
ఓం సర్వేశ్వరాయ నమః – గరికపత్రం పూజయామి (గరిక)
ఓం సురసేవితాయ నమః – అర్కపత్రం పూజయామి (తెల్లజిల్లేడు)
ఓం విఘ్నరాజాయ నమః – అపామార్గపత్రం పూజయామి (ఉత్తరేణి)
ఓం శ్రీగణేశ్వరాయ నమః – ఏకవింశతిపత్రాణి పూజయామి.
శ్రీ వినాయక అష్టోత్తర శతనామావళి
(ఈ నామాలు చదువుతూ స్వామిని పూలతో గానీ, అక్షతలతో గానీ పూజించాలి. ఒకరు నామాలు చదువుతుండగా మిగిలినవారు ఓం అనుకుంటూ పూజ చేయాలి.)
ఓం గజాననాయ నమః
ఓం గణాధ్యక్షాయ నమః
ఓం విఘ్నరాజాయ నమః
ఓం వినాయకాయ నమః
ఓం ద్వైమాతురాయ నమః
ఓం ద్విముఖాయ నమః
ఓం ప్రముఖాయ నమః
ఓం సుముఖాయ నమః
ఓం కృతినే నమః
ఓం సుప్రదీపాయ నమః
ఓం సుఖనిధయే నమః
ఓం సురాధ్యక్షాయ నమః
ఓం సురారిఘ్నాయ నమః
ఓం మహాగణపతయే నమః
ఓం మాన్యాయ నమః
ఓం మహాకాలాయ నమః
ఓం మహాబలాయ నమః
ఓం హేరంబాయ నమః
ఓం లంబజఠరాయ నమః
ఓం హ్రస్వగ్రీవాయ నమః
ఓం మహోదరాయ నమః
ఓం మదోత్కటాయ నమః
ఓం మహావీరాయ నమః
ఓం మంత్రిణే నమః
ఓం మంగళస్వరాయ నమః
ఓం ప్రమథాయ నమః
ఓం ప్రథమాయ నమః
ఓం ప్రాజ్ఞాయ నమః
ఓం విఘ్నకర్త్రే నమః
ఓం విఘ్నహంత్రే నమః
ఓం విశ్వనేత్రే నమః
ఓం విరాట్పతయే నమః
ఓం శ్రీపతయే నమః
ఓం వాక్పతయే నమః
ఓం శృంగారిణే నమః
ఓం ఆశ్రితవత్సలాయ నమః
ఓం శివప్రియాయ నమః
ఓం ప్రముఖాయ నమః
ఓం శీఘ్రకారిణే నమః
ఓం బలాయ నమః
ఓం బలోత్థాయ నమః
ఓం పురాణపురుషాయ నమః
ఓం పూష్ణే నమః
ఓం పుష్కరోక్షిప్తవారిణే నమః
ఓం అగ్రగణ్యాయ నమః
ఓం అగ్రపూజ్యాయ నమః
ఓం అగ్రగామినే నమః
ఓం మంత్రకృతే నమః
ఓం చామీకరప్రభాయ నమః
ఓం సర్వస్మై నమః
ఓం సర్వోపాస్యాయ నమః
ఓం సర్వకర్త్రే నమః
ఓం సర్వనేత్రే నమః
ఓం భక్తజీవితాయ నమః
ఓం మహేశాయ నమః
ఓం సర్వసిద్ధిప్రసాదాయ నమః
ఓం జితమన్మథాయ నమః
ఓం దివ్యాంగాయ నమః
ఓం సర్వసిద్ధయే నమః
ఓం ఐశ్వర్యకారణాయ నమః
ఓం మణికింకిణీ మేఖలాయ నమః
ఓం పంచహస్తాయ నమః
ఓం జ్యాయసే నమః
ఓం సమస్తదేవతామూర్తయే నమః
ఓం పార్వతీనందనాయ నమః
ఓం యక్షకిన్నర సేవితాయ నమః
ఓం సహిష్ణవే నమః
ఓం ప్రభవే నమః
ఓం గంగాసుతాయ నమః
ఓం సతతోత్థతాయ నమః
ఓం కుమారగురవే నమః
ఓం గణాధీశాయ నమః
ఓం విఘాతకారిణే నమః
ఓం అక్షోభ్యాయ నమః
ఓం గంభీరనినదాయ నమః
ఓం విశ్వదృశే నమః
ఓం కుంజరాసురభంజనాయ నమః
ఓం వటవే నమః
ఓం విశ్వరక్షాకృతే నమః
ఓం ప్రమోదాత్తాననాయ నమః
ఓం అభీష్టవరదాయ నమః
ఓం కళ్యాణగురవే నమః
ఓం మోదకప్రియాయ నమః
ఓం జ్యోతిషే నమః
ఓం ఉన్మత్తవేషాయ నమః
ఓం కాంతిమతే నమః
ఓం ధృతిమతే నమః
ఓం భక్తనిధయే నమః
ఓం అపరాజితే నమః
ఓం కామినే నమః
ఓం భావగమ్యాయ నమః
ఓం సమస్త జగదాధారాయ నమః
ఓం కపిత్థపనసప్రియాయ నమః
ఓం మంగళప్రదాయ నమః
ఓం సర్వైశ్వర్యప్రదాయ నమః
ఓం బ్రహ్మచారిణే నమః
ఓం బ్రహ్మరూపిణే నమః
ఓం బ్రహ్మవిద్యాదిదానభువే నమః
ఓం సత్యధర్మిణే నమః
ఓం జిష్ణవే నమః
ఓం సఖయే నమః
ఓం విష్ణుప్రియాయ నమః
ఓం సరసాంబునిధయే నమః
ఓం అవ్యక్తాయ నమః
ఓం అప్రాకృత పరాక్రమాయ నమః
ఓం శ్రీవరసిద్ధివినాయకస్వామినే నమః
ఓం ఆక్రాంతచిదచిత్ప్రభవే నమః
ఓం విఘ్నేశ్వరాయ నమః
శ్రీ వరసిద్ధివినాయక స్వామినే నమః
అష్టోత్తరశతనామ పుష్పపూజాం సమర్పయామి.
(అక్షతలు, పూలు స్వామి పాదాల వద్ద ఉంచాలి)
ధూపం
ధూపం దశాంగం గుగ్గులోపేతం సుగంధం సుమనోహరమ్
ఉమాసుత నమస్తుభ్యం గృహాణ వరదో భవ
దివ్యపరమళ ధూపమాఘ్రాపయామి
(అగరబత్తిని వెలిగించి, ఆ ధూపాన్ని స్వామికి చూపించి, పక్కన ఉన్న స్టాండులో లేదా అరటిపండుకు గుచ్చాలి.)
దీపం
సాజ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా ద్యోతితం మయా
గృహాణ మంగళం దీపం ఈశపుత్ర నమోస్తుతే
దీపం దర్శయామి
(దీపాన్ని స్వామికి చూపించాలి.)
నైవేద్యం
సుగంధాన్ సుకృతాంశ్చైవ మోదకాన్ ఘృతపాచితాన్
నైవేద్యం గృహ్యతాం దేవ చణముద్దైః ప్రకల్పితాన్
భక్ష్యం, భోజ్యం చ లేహ్యం చ చోష్యం పానీయమేవ చ
ఇదం గృహాణ నైవేద్యం మయాదత్తం వినాయక
మహానైవేద్యం సమర్పయామి
(కొబ్బరికాయలు ఇంకా ఉంటే తలా ఒకటి కొట్టి నైవేద్యంగా పెట్టాలి. అంతకు ముందు స్నానం సమయంలో కొట్టిన కొబ్బరికాయ, పిండి వంటలు, పానకం, వడపప్పు, కుడుములు, ఉండ్రాళ్లు, పులిహోర, అరటిపండ్లు మొదలైనవాటిని స్వామి ముందు ఉంచాలి. మంత్రం చదువుతూ ఆ పదార్థాలన్నింటిపైనా ఆకుతో కొద్దిగా నీళ్లు చల్లాలి. ఆ తర్వాత స్వామికి నైవేద్యం పెట్టాలి.)
తాంబూలం
పూగీఫల సమాయుక్తం నాగవల్లీ దళైర్యుతమ్
కర్పూర చూర్ణసంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతామ్
తాంబూలం సమర్పయామి
(మూడు తమలపాకులు, మూడు వక్కలు, పండ్లు, దక్షిణతో కూడిన తాంబూలాన్ని వినాయకుడి విగ్రహం ముందు ఉంచి నమస్కరించాలి.)
పుష్పం
పుష్కలాని ధనానించ, భూమ్యాం స్థితాని స్వీకురుష్వ వినాయక
సువర్ణమంత్రపుష్పం సమర్పయామి
(చేతిలో పువ్వులు పట్టుకొని ఈ శ్లోకం చదువుతూ దేవుడికి సమర్పించాలి.)
నీరాజనం
ఘృతవర్తి సహస్రైశ్చ కర్పూర శకలైస్తథా
నీరాజనం మయాదత్తం గృహాణ వరదో భవ
నీరాజనం సమర్పయామి
(కర్పూరం వెలిగించి స్వామికి హారతి ఇచ్చి, ఆ తర్వాత హారతి పళ్ళెంపై నీటిని ఉంచి చల్లి కళ్లకు అద్దుకోవాలి.)
మంత్రపుష్పం
సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః
లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః
ధూమకేతుః గణాధ్యక్షో ఫాలచంద్రో గజాననః
వక్రతుండ మహాకాయ కోటిసూర్య సమప్రభ
అవిఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా
(పుష్పం, అక్షతలు తీసుకుని నిలబడి ఈ శ్లోకాన్ని పఠించాలి.)
ప్రదక్షిణ
యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ
తాన్యే తాని ప్రణశ్యన్తి ప్రదక్షిణ పదేపదే
పాపోహం పాపకర్మోహం పాపాత్మా పాపసమ్భవః
త్రాహిమాం కృపయా దేవ శరణాగతవత్సల
అన్యథాశరణం నాస్తి త్వమేవ శరణం మమ
తస్మాత్కారుణ్యభావేన రక్ష రక్ష గణాధిప
ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి
(ప్రదక్షిణ చేసి నమస్కరించాలి. సాష్టాంగప్రణామం చేయడం సంప్రదాయం) ఆ తరువాత మరలా కూర్చొని, కొన్ని అక్షతలు చేతి లోకి తీసుకోవాలి. కొంచె నీటిని అక్షతలపై వేసుకొని ఈ శ్లోకం చెప్పు కోవాలి.
క్షమాప్రార్థన
యస్య స్మృత్యాచ నామోక్త్యా తపఃపూజా క్రియాదిషు
మ్యానం సంపూర్ణతాం యాతి సద్యో వందే తం గణాధిపం
మంత్రహీనం క్రియాహీనం శక్తిహీనం మహప్రభో
యత్పూజితం మయా దేవ! పరిపూర్ణం తదస్తుతే
అనయా ధ్యానావహనాది షోడషోపచారపూజ యాచ,
అష్టోత్తర నామార్చనయాచ, అవసర, మహానివేదనయాచ
-గవాన్ సర్వాత్మకః సర్వం శ్రీ మహాగణాధిపతి దేవతార్పణమస్తు.
మహాగణాధిపతి దేవతా సుప్రీతః సుప్రసన్నో వరదో భవతు
అంటూ అక్షతలు, నీటిని పళ్ళెంలో వదలాలి.
(ఈ క్రింది కథను నిదానంగా, గట్టిగా, అందరికీ అర్థమయ్యేటుగా చదవాలి.)
శ్రీ వినాయక వ్రత కథ
(కథ చెప్పే ముందు: అక్కడ ఉన్న భక్తులందరికీ కొద్దిగా పువ్వులు, అక్షతలు ఇచ్చి, వాటిని నలపకుండా జాగ్రత్తగా ఉంచుకోమని చెప్పండి. కథ పూర్తయ్యాక వాటిని వినాయకుని పాదాల దగ్గర ఉంచి, నమస్కరించమని చెప్పండి.)
ఓం గురుర్ బ్రహ్మా, గురుర్ విష్ణుః గురుర్ దేవో మహేశ్వరః
గురు స్సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీగురవే నమః
(గురువు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల స్వరూపం. ఆ పరబ్రహ్మ స్వరూపుడైన గురువుకి నమస్కారం.)
ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే
(తెల్లని వస్త్రాలు ధరించి, ప్రశాంతమైన ముఖంతో, నాలుగు చేతులతో ఉండే, చంద్రుడి రంగులో ఉన్న ఆ విష్ణుమూర్తిని అన్ని అడ్డంకులూ తొలగిపోవడానికి ధ్యానిస్తున్నాను.)
ఓం సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి
విద్యారంభం కరిష్యామి సిద్ధి ర్భవతు మే సదా
(కోరిన కోరికలు తీర్చే సరస్వతి దేవికి నమస్కారం. నేను విద్యను ప్రారంభించబోతున్నాను, నాకు ఎల్లప్పుడూ విజయం లభించుగాక!)
పూర్వం, చంద్ర వంశంలో ఎంతో పేరున్న ధర్మరాజు అనే మహారాజు ఉండేవాడు. దైవం అనుకూలించక పోవడంతో, దాయాదుల వల్ల ఆయన రాజ్యాన్ని కోల్పోయాడు. తన తమ్ములను, భార్యను వెంటబెట్టుకుని అడవులకు వెళ్ళాడు.
ఆ అడవిలో జ్ఞానవంతులైన మహర్షులు తపస్సు చేసుకుంటూ ఉన్నారు. ఆ మహాత్ములను చూసి నమస్కరించి, ధర్మరాజు అక్కడే ఉన్న సూత మహాముని ఆశ్రమానికి వెళ్ళాడు. ఆ మునికి కూడా నమస్కరించాడు.
ముని అనుమతితో కూర్చుని ధర్మరాజు ఇలా అడిగాడు: “మహాత్మా! మా దాయాదులైన కౌరవులు మాతో మోసపూరితమైన జూదమాడి, మా రాజ్యాన్ని లాగేసుకున్నారు. మమ్మల్ని, ద్రౌపదిని చాలా బాధ పెట్టారు. మాకు ఎంతో దుఃఖం కలిగించారు. అయితే, మా అదృష్టం బాగుండి మిమ్మల్ని దర్శించే భాగ్యం కలిగింది. మా దుఃఖం తీరిందని నమ్ముతున్నాం. దయచేసి మమ్మల్ని కరుణించి, మాకు తిరిగి మా రాజ్యం వచ్చేందుకు ఒక గొప్ప వ్రతాన్ని అనుగ్రహించండి.”
అప్పుడు సూత మహాముని, “పాండవులారా! వినండి, చెప్తాను. అన్ని వ్రతాలలోనూ ఉత్తమమైన వ్రతం ఒకటి ఉంది. అది మనుషులకు అన్ని సంపదలు, భోగభాగ్యాలు, సుఖాలు ఇస్తుంది. అన్ని పాపాలను తొలగిస్తుంది. వంశాన్ని వృద్ధి చేస్తుంది. ఒకప్పుడు ఈ వ్రతాన్ని పరమశివుడు తన కుమారుడైన కుమారస్వామికి చెప్పారు. ఆ వివరాలన్నీ మీకు చెప్తాను.
ఒకనాడు కైలాసంలో పరమేశ్వరుడి దగ్గరికి కుమారస్వామి వచ్చి నమస్కరించి, ఇలా అడిగాడు: “స్వామీ! మానవులు ఏ వ్రతం చేస్తే సంపదలు, మంచి సంతానం, వంశాభివృద్ధి, ధనధాన్యాలు పొంది సుఖించగలరో దయచేసి చెప్పండి.” శివుడు సంతోషించి, “కుమారా! నీవు అడిగినవన్నీ ఇచ్చే ఒక గొప్ప వ్రతం ఉంది. అది వినాయక వ్రతం. ఆ వ్రతాన్ని భాద్రపద శుద్ధ చవితి రోజు భక్తిశ్రద్ధలతో ఆచరించాలి. ఈ గొప్ప వ్రతాన్ని పూర్వం దేవతలు, మునులు, గంధర్వులు, కిన్నరులు మొదలైన వారందరూ భక్తితో ఆచరించారు.
కాబట్టి ఓ ధర్మరాజా! నీవు కూడా ఈ వినాయక వ్రతాన్ని నియమంగా ఆచరించు. నీకు విజయం, రాజ్యం, సంపదలు అన్నీ లభిస్తాయి. ఈ వ్రతాన్ని ఆచరించి, దమయంతి నలుడిని భర్తగా పొందింది. శ్రీకృష్ణుడు ఆచరించి, జాంబవతిని, శమంతకమణిని పొందాడు. ఆ కథ చెప్తాను విను.
శమంతకమణి కథ
పూర్వం సత్రాజిత్తు అనే రాజు సూర్యుడి అనుగ్రహంతో రోజూ ఎనిమిది బారువుల బంగారాన్ని ఇచ్చే శమంతకమణి అనే దివ్యమైన రత్నాన్ని పొందాడు. సత్రాజిత్తు తమ్ముడైన ప్రసేనుడు ఆ మణిని తనకు ఇవ్వమని అడిగాడు. సత్రాజిత్తు అది ప్రసేనుడికి ఇచ్చాడు.
ఆ మణిని ధరించి తన దగ్గరకు వచ్చిన సత్రాజిత్తును చూసి శ్రీకృష్ణుడు ఆ మణిని తనకు ఇమ్మని అడిగితే, సత్రాజిత్తు ఇవ్వనని చెప్పి వెళ్ళిపోయాడు. ఒకరోజు ప్రసేనుడు ఆ మణిని ధరించి వేటకు వెళ్ళాడు. అక్కడ ఒక సింహం ఆ మణిని మాంసం ముక్కగా అనుకుని, ప్రసేనుడిని చంపి, మణిని తీసుకుని పోతుండగా, ఒక ఎలుగుబంట్ల రాజు ఆ సింహాన్ని చంపి, మణిని తీసుకుని తన గుహలోకి వెళ్ళాడు. అక్కడ తన కుమార్తె జాంబవతిని ఊయలలో పడుకోబెట్టి, ఆ మణిని ఆమెకు ఆట వస్తువుగా ఇచ్చాడు. ఆ ఎలుగుబంట్ల రాజే జాంబవంతుడు.
ప్రసేనుడు చనిపోయిన వార్త విని, సత్రాజిత్తు, “కృష్ణుడే మణిని దొంగిలించడానికి నా తమ్ముడిని చంపాడు” అని ఊరంతా ప్రచారం చేశాడు. నిజానికి చంపింది సింహం. కానీ ఆ నింద కృష్ణుడిపై పడింది.
తనపై పడిన నిందను పోగొట్టుకోవడానికి, కృష్ణుడు మణిని వెతకడం కోసం అడవికి బయలుదేరాడు. అడవిలో చనిపోయి పడి ఉన్న ప్రసేనుడిని, సింహాన్ని చూసి, అడుగుజాడలను బట్టి వెళ్తూ వెళ్తూ ఒక గుహ దగ్గరికి చేరాడు. అక్కడ మణితో బంతి ఆడుకుంటున్న జాంబవతిని చూశాడు. కృష్ణుడు ఆ మణిని తీసుకుంటుండగా, జాంబవంతుడు వచ్చి అడ్డుకున్నాడు. ఇద్దరికీ ఇరవై ఎనిమిది రోజులు పెద్ద యుద్ధం జరిగింది. చివరికి జాంబవంతుడు బలం కోల్పోయాడు.
తాను యుద్ధం చేస్తున్న వ్యక్తి శ్రీరాముడే అని గుర్తించిన జాంబవంతుడు, “స్వామీ! నేను తప్పు చేశాను, నన్ను క్షమించండి. ఒకప్పుడు మీరు వరం కోరుకోమంటే, తెలియక మీతో ద్వంద్వ యుద్ధం కావాలని అడిగాను. అప్పుడు మీరు, ‘భవిష్యత్తులో నీ కోరిక తీరుతుంది’ అన్నారు. అప్పటి నుండి మీ నామాన్నే స్మరిస్తూ ఉన్నాను. ఈ రోజు నా అదృష్టం వల్ల ఈ విధంగానైనా నా కోరిక నెరవేరింది. నా తప్పును క్షమించండి” అని చాలా వేడుకున్నాడు.
అందుకు శ్రీకృష్ణుడు సంతోషించి, “జాంబవంతా! శమంతకమణిని నేను దొంగిలించాననే నిందను తొలగించుకోవడానికి ఇక్కడికి వచ్చాను. ఆ మణిని ఇచ్చేయ్! నేను వెళ్తాను” అన్నాడు.
జాంబవంతుడు చాలా సంతోషించి, శమంతకమణితో పాటు తన కూతురు జాంబవతిని కూడా బహుమతిగా ఇచ్చాడు. కృష్ణుడు శమంతకమణితో, జాంబవతితో ద్వారకా నగరానికి వచ్చి, సత్రాజిత్తును పిలిపించి, జరిగిన విషయం అంతా సభలో వివరించాడు. అంతా విన్న సత్రాజిత్తు తాను చేసిన తప్పుకు చాలా పశ్చాత్తాపపడ్డాడు. మణితో పాటు తన కూతురు సత్యభామను కూడా కృష్ణుడికి ఇచ్చాడు. కృష్ణుడు మణి తనకు అవసరం లేదని చెప్పి, సత్యభామను మాత్రం స్వీకరించి, ఒక మంచి ముహూర్తంలో జాంబవతిని, సత్యభామను పెళ్లి చేసుకున్నాడు.
కథ కొనసాగింపు
ఈ నింద తనకు ఎందుకు వచ్చిందో కూడా కృష్ణుడు వివరించాడు. ఈ వినాయక చవితి రోజున పాలలో చంద్రుడిని చూసిన కారణంగా తనకు ఈ నింద వచ్చిందని చెప్పాడు. ఒకసారి లంబోదరుడైన వినాయకుడిని చూసి చంద్రుడు నవ్వగా, కోపించిన పార్వతి దేవి, “చంద్రా! చవితి రోజున నీ ముఖాన్ని చూసిన వారికి నిష్కారణంగా నిందలు కలుగుగాక!” అని శపించింది. చంద్రుడు బాధపడి పార్వతిని వేడుకోగా, “భాద్రపద శుద్ధ చవితి రోజున వినాయకుడిని పూజించిన వారికి నిందలు తొలగిపోతాయి” అని అనుగ్రహించింది. ఈ విషయం తెలియక, ఒకరోజు ఆవులకు పాలు పిండుతుండగా ఆ పాలలో చవితి నాటి చంద్రుడిని చూడడం వల్ల తనకు ఇలాంటి నింద కలిగిందని వివరించాడు. తాను ఈ వినాయక వ్రతం చేయడం వల్లనే నింద తొలగి, శుభాలు పొందానని చెప్పాడు. ఇది మొదలు, భాద్రపద శుద్ధ చవితి రోజున పొరపాటున చంద్రుడిని చూసినా, ఆ రోజు పగలు వినాయక వ్రతం చేసి, ఈ శమంతకమణి కథను విని, అక్షతలు శిరసుపై పెట్టుకున్న వారికి ఎలాంటి నిందలూ రావు అని అనుగ్రహించాడు.
పూర్వం, భగీరథుడు గంగను భూమికి తీసుకువచ్చేటప్పుడు, దేవతలు, రాక్షసులు పాల సముద్రాన్ని చిలికి అమృతం సాధించే సమయంలోనూ, సాంబుడు తన కుష్టురోగాన్ని పోగొట్టుకోవడానికీ ఈ వ్రతాన్ని ఆచరించి, తమ కోరికలు నెరవేర్చుకున్నారని సూత మహాముని వివరించారు.
ఇలా సూత మహాముని చెప్పిన ప్రకారం, ధర్మరాజు ఈ వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో ఆచరించి, శత్రువులను ఓడించి, రాజ్యాన్ని పొంది, సుఖించాడు. ఈ దేవుడిని పూజించడం వల్ల అన్ని కోరికలూ నెరవేరుతాయి.
కనుక ఈ స్వామిని “వరసిద్ధి వినాయకుడు” అంటారు. ఈ వినాయక స్వామిని పూజించడం వల్ల విద్యార్థులకు విద్య, విజయం కోరేవారికి విజయం, సంతానం కోరేవారికి మంచి సంతానం, భర్తను కోరే కన్యకు మంచి భర్త, ముత్తయిదువకు సౌభాగ్యం లభిస్తాయి. విధవ పూజిస్తే పై జన్మకు వైధవ్యం రానే రాదు.
అన్ని కులాల వారూ, వయస్సుతో సంబంధం లేకుండా ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల, వినాయకుడి దయతో అన్ని పనులూ సఫలమవుతాయి. కొడుకులు, కూతుళ్లు, మనుమలు, ముని మనుమలు కలిగి వంశం వృద్ధి చెందుతుంది. గొప్ప సంపదలు కలుగుతాయి. అన్ని ఆటంకాలూ తొలగి, పనులన్నీ త్వరగా విజయవంతమవుతాయి అని చెప్పారు.
కథ పూర్తయ్యాక
కథ పూర్తయ్యాక, ఒక కొబ్బరికాయ కొట్టి, వినాయకుడికి నైవేద్యం పెట్టి, కర్పూర హారతి ఇవ్వాలి.
ఉద్వాసన
యజ్ఞేన యజ్ఞ మయజంత దేవాః తాని ధర్మాణి ప్రథమాన్యాసన్
తేహనాకం మహిమానః సచంతే యత్రపూర్వే సాధ్యాస్సంతి దేవాః
శ్రీ మహాగణాధిపతయే నమః యథాస్థానం ప్రవేశయామి..
శోభనార్థం పునరాగమనాయచ.
ఈ మంత్రాన్ని చదువుతూ విఘ్నాధిపతిని ఈశాన్య దిశగా కదిలించి స్వామివారికి ఉద్వాసన చెప్పాలి. (నిత్యపూజ చేసి చవితి నుంచి 3, 5, 7, 9, 11 రోజుల్లో నిమజ్జనం చేసేవారు ఆ రోజున ఈ మంత్రం పఠించి ఉద్వాసన చెప్పాలి.)
అకాలమృత్యుహరణం సర్వవ్యాధినివారణం
సర్వపాపక్షయకరం శ్రీ మహాగణపతి పాదోదకం పావనం శుభమ్
అంటూ పంచామృతాలు, కొబ్బరి నీళ్ళను కలిపి తీర్థంగా తీసుకోవాలి. ఆ తర్వాత పూజ చేసిన అక్షతలను పిల్లల తలపై పెట్టాలి. పెద్దలు కూడా ఆ అక్షతలు తలపై ధరించాలి.
సర్వే జనాస్సుఖినో భవంతు
ఓం శాంతి శ్శాంతి శ్శాంతిః
(లోకంలోని ప్రజలందరూ సుఖంగా ఉండాలి. శాంతి, శాంతి, శాంతి)
ఫలశ్రుతి
ఈ వ్రత కథను చెప్పినవారికీ, విన్నవారికీ వినాయకుడి దయతో ఎన్నో శుభాలు కలుగుతాయి.