Karthika Puranam Telugu
జలంధరుని యుద్ధ సన్నాహాలు
ఓ పృథురాజా! రాహువు చెప్పిన విషయాలన్నీ వినగానే, క్రోధోద్రిక్తుడైన జలంధరుడు శివుని మీద రణభేరీ వేయించాడు. కోట్లాది సేనలతో అతడు కైలాసం వైపుకు దండు కదిలాడు. ఆ సందర్భంగా జలంధరునికి అగ్రభాగాన ఉన్న శుక్రుడు రాహువు చేత చూడబడ్డాడు. తత్ఫలితంగా జలంధరుడి కిరీటం నేల పైన పడింది. రాక్షస సేన విమానాలతో ఆకాశం నిండిపోయి, వర్షాకాలపు మేఘావృతమైన ఆకాశం వలె కనిపించసాగింది.
ఈ రణోద్యమాన్ని గురించి తెలుసుకున్న దేవతలు, ఇంద్రుణ్ని ముందుంచుకుని రహస్య మార్గాన శివుడి సన్నిధికి వెళ్లి, యుద్ధవార్తల్ని విన్నవించారు. “ఓ దేవాదిదేవా! ఇన్నినాళ్లుగా వాని వల్ల మేము పడుతున్న ఇక్కట్లన్నీ నీకు తెలియును. ఈ వేళ వాడు నీ మీదకే దండెత్తి వస్తున్నాడు. సర్వలోక కళ్యాణార్థం వానిని జయించు తండ్రీ!” అని ప్రార్థించారు.
వెనువెంటనే విరూపాక్షుడు (శివుడు) విష్ణువును స్మరించాడు, విష్ణువు వచ్చాడు. అప్పుడు శివుడు ఆయనను చూచి, “కేశవా! గత జగడంలోనే ఆ జలంధరుడిని జమునిపాలు చేయకపోయావా? పైపెచ్చు వైకుంఠాన్ని కూడా వదిలి వాడింట కాపురముండటమేమిటి?” అని ప్రశ్నించాడు. అందుకు జవాబుగా విష్ణువు, “పరమేశ్వరా! ఆ జలంధరుడు నీ అంశ వలన పుట్టడం చేత, లక్ష్మికి సోదరుడు కావడం చేతా – యుద్ధంలో నా చేత వధింపబడలేదు. కాబట్టి, నువ్వే వానిని జయించు” అని చెప్పాడు.
అందు మీదట శివుడు దేవతలతో, “ఓ దేవతలారా! వాడు మహాపరాక్రమవంతుడు. ఈ శస్త్ర అస్త్రాల వల్లగాని, నా చేతగాని మరణించేవాడు గాదు. కాబట్టి, మీరందరూ కూడా ఈ అస్త్రశస్త్రాలలో మీ మీ తేజస్సులను సయితం ప్రకాశింప చేయాలి” అని ఆజ్ఞాపించాడు. విష్ణ్వాది దేవతలందరూ తమ తమ తేజస్సులను బయల్పరిచారు. గుట్టగా ఏర్పడిన ఆ తేజస్సులో శివుడు తన తేజాన్ని కలిపి – మహోత్తమమూ, భీషణజ్వాలాస్యము, వేగసంపన్నమూ, అత్యంత భయంకరమూ అయిన ‘సుదర్శన’మనే చక్రాన్ని నిర్మించాడు.
భయంకర సమరం – శుక్రుని అపహరణ
అప్పటికే ఒక కోటి ఏనుగులు, ఒక కోటి గుర్రాలు, ఒక కోటి కాల్బలగముతో కైలాసభూములకు చేరిన జలంధరుని దేవతలూ, ప్రమధగణాలూ ఒక్కుమ్మడిగా ఎదుర్కొన్నాయి. నందీశ్వర, విఘ్నేశ్వర, సుబ్రహ్మణ్యేశ్వరాదులు కూడా తమ తమ గణాలతో సహా జలంధరునిని మార్కొన్నారు. రెండు తెగల మధ్యనా భయంకరమైన సంకుల సమరం కొనసాగింది. ఇరుపక్షాల నుంచీ వచ్చే వీర రస ప్రేరకాలైన భేరీ, మృదంగ, శంఖాది ధ్వనులతోనూ, రథనేమి ధ్వనులతోనూ, గజ ఘీంకారాలతోనూ భూమి విపరీతమైన ధ్వనులతో ప్రకంపించసాగింది. పరస్పరం విసిరిన శూల, పట్టిస, తోమర, బాణ, శక్తి, గదాద్యాయుధాలతో నిండిన ఆకాశం, పగలే చుక్కలు పొడిచినట్లుగా ఉంది. యుద్ధభూమిలో నేలకూలిన రథగజాదుల కళేబరాలు రెక్కలు తెగిన పర్వతాలు గుట్టలు పడినట్లుగా ఉన్నాయి.
ఆ మహాహవంలో, ప్రమధబాణోపహతులైన దైత్యుల్ని శుక్రుడు మృత సంజీవనీ విద్యతో పునర్జీవింప చేయసాగాడు. ఈ సంగతి ఈశ్వరుని చెవిన పడింది. తక్షణమే ఆయన ముఖం నుంచి కృత్య అనే మహాశక్తి ఆవిర్భవించింది. అది, అత్యంత భయంకరమైన తాలు, జంఘోదర, వక్త్ర, స్తనాలతో, మహావృక్షాలను సైతం కూలగొడుతూ రణస్థలిని చేరింది. రావడం రావడమే పేరు మోసిన రాక్షసులెందరినో తినేసింది. ఆ వూపు ఊపు శుక్రుణ్ని సమీపించి, అతనిని తన యోనిలో చేర్చుకుని అంతర్ధానమై పోయింది.
శివగణాల తొలి పలాయనం
మరణించిన వాళ్లను మళ్లా బ్రతికించే శుక్రుడు లేకపోవడం వలన, ప్రమథగణాల విజృంభణకు రాక్షససేన మొత్తం తుఫాను గాలికి చెదిరిపోయే మబ్బు తునకల వలె చెల్లా చెదరయి పోసాగింది. అందుకు కినిసిన శుంభ, నిశుంభ, కాలనేమ్యాది సేనానాయకులు అగణ శరపరంపరతో శివగణాలను నిరోధించసాగేరు. చక్కటి పంట మీద మిడుతల దండులాగా తమ మీద పడే రాక్షస బాణాలకు రక్తసిక్త దేహులై, అప్పుడే పూసిన మోదుగ చెట్ల వలె తయారయిన శివసేనలన్నీ తిరుగుముఖం పట్టి పారిపోసాగాయి. అది గమనించిన నందీశ్వర, విఘ్నేశ్వర, సుబ్రహ్మణ్యేశ్వరులు ఆగ్రహావేశులై రాక్షస సేనల మీదకు విజృంభించారు.
గణనాథుల ద్వంద్వ యుద్ధాలు
నందీశ్వరుడు కాలనేమితోనూ, విఘ్నేశ్వరుడు శుంభుడితోనూ, కుమారస్వామి నిశుంభుడితోనూ ద్వంద్వ యుద్ధాలకి తలపడ్డారు. నిశుంభుడి బాణఘాతానికి సుబ్రహ్మణ్య (కుమార) స్వామి వాహనమైన నెమలి మూర్ఛపోయింది. నందీశ్వరుడు తన బాణ పరంపరతో కాలనేమి యొక్క గుర్రాలనూ, జెండానూ, ధనుస్సునూ, సారథినీ నాశనం చేసేశాడు.
అందుకు కోపించిన శుంభుడు విఘ్నేశ్వరుడి వాహనమైన ఎలుకని బాణంతో బాధించాడు. అది కదలలేని పరిస్థితి ఏర్పడటంతో, వినాయకుడు గండ్రగొడ్డలిని ధరించి కాలినడకను శుంభుని చేరి వాని వక్షస్థలాన్ని గాఢంగా కొట్టాడు. వాడు భూమిపై పడిపోయాడు. అది గమనించిన కాలనేమి, నిశుంభులు ఇద్దరూ ఒకేసారిగా గణపతితో కలియబడ్డారు. దీనిని గుర్తించి వారి మధ్యకు రంగప్రవేశం చేశాడు వీరభద్రుడు.
వినాయకునికి సహాయార్థమై వీరభద్రుడు కదలగానే కూశ్మాండ, భైర, బేతాళ, పిశాచ, యోగినీ గణాలన్నియు ఆయనను అనుసరించాయి. గణసహితుడైన వీరభద్రుని విజృంభణతో రాక్షసగణాలు హాహాకారాలు చేశాయి. అంతలోనే మూర్ఛదేరిన నందీశ్వర, కుమారస్వాములిద్దరూ తిరిగి యుద్ధంలో ప్రవేశించారు.
జలంధరుని ప్రవేశం – వీరభద్రుని మూర్ఛ
వాళ్లందరి విజృంభణతోనూ వీగిపోతూన్న తన బలాన్ని చూసిన జలంధరుడు ‘అతి’ అనే పతాకం గల రథంపై వచ్చి ఈ సమస్త గణాలనూ ఎదుర్కొన్నాడు. జలంధరుడి బాణాలతో భూమ్యాకాశాల మధ్య ప్రాంతమంతా నిండిపోయింది.
- అయిదు బాణాలతో విఘ్నేశ్వరుడినీ,
- తొమ్మిది బాణాలతో నందీశ్వరుడినీ,
- ఇరవై బాణాలతో వీరభద్రుడిని కొట్టి మూర్ఛ పోగొట్టి భీషణమైన సింహగర్జన చేశాడు.
వాడి గర్జనతో ముందుగా స్పృహలోనికి వచ్చిన వీరభద్రుడు , ఏడు బాణాలతో జలంధరుడి గుర్రాలనీ, పతాకాన్నీ, గొడుగునూ నరికేసాడు. మరో మూడు బాణాలు అతని గుండెలలో గుచ్చుకునేలా నాటాడు. దానితో మండిపడిన జలంధరుడు ‘పరిఘ’ అనే ఆయుధంతో వీరభద్రుని ఎదుర్కొన్నాడు. అద్భుతమైన యుద్ధం చేశారు వాళ్లు. అనంతరం జలంధరుడు వీరభద్రుడి తలపై పరిఘను ప్రయోగించడంతో, వీరభద్రుడు స్పృహ తప్పి పడిపోయెను.
శివుని యుద్ధారంభం – బృంద పాతివ్రత్యం
చివరికి దేవతల ప్రార్థనల మీద శివుడు జలంధరుడితో యుద్ధానికి ఉపక్రమించాడు. అతడిని యుద్ధంలో జయించడం శివుని శక్యం కాలేదు. జలంధరుడు హతుడు కాకపోవడానికి అతని భార్య బృంద పాతివ్రత్యం కారణమని విష్ణుమూర్తి గ్రహించాడు. ఆమె ముందు విష్ణు మాయను ప్రయోగించడానికి బయలుదేరాడు. అక్కడ బృంద ఒక మునీశ్వరుని వద్దకు వెళ్ళి తన భర్త యోగక్షేమాల గురించి అడిగింది.
ఇరువది రెండవ (బహుళ సప్తమి) రోజు పారాయణము సమాప్తము.