కల వచ్చింది అనుకుంటే…
Ramayanam Story in Telugu- ఒకరోజు సీతమ్మకి కలలో ఒక కోతి కనపడిందట. కలలో వానరము కనపడితే కీడు జరుగుతుందని అంటారు కదా!). దాంతో సీతమ్మ భయపడి “లక్ష్మణుడితో ఉన్న మా రాముడికి అంతా మంచే జరగాలి. నా తండ్రి జనక మహారాజు కూడా క్షేమంగా ఉండాలి” అని దేవుణ్ణి మొక్కుకుంది.
ఆ తర్వాత సీతమ్మ తనలో తాను అనుకుంది, “అసలు నాకు నిద్ర పట్టాలి కదా కల రావడానికి? నేను సరిగ్గా నిద్రే పోలేదు. రోజంతా రాముణ్ణి తలుచుకుంటూ ఉండడం వల్ల, ఎవరో రామాయణం కథ చెప్తుంటే విన్నట్టు అనిపించింది అంతే!” అనుకుని మళ్ళీ పైకి చూసింది. చూసేసరికి అక్కడ హనుమంతుడు నిలబడి ఉన్నాడు.
దేవతలకి దండాలు
సీతమ్మ హనుమంతుడిని చూసి “ఇంద్రుడితో ఉన్న బృహస్పతికి దండాలు. అగ్నిదేవుడికి దండాలు. బ్రహ్మగారికి కూడా దండాలు. ఈ కోతి చెప్పిన మాటలు నిజం కావాలి” అని దేవతలందరినీ ప్రార్థించింది. బక్తివాహిని.com రామాయణం
అప్పుడు హనుమంతుడు మెల్లగా కొన్ని కొమ్మల కిందకి దిగి వచ్చి “అమ్మా! నేను అబద్ధం చెప్పడం లేదు. నిజం చెప్తున్నా. నేను రాముడి దూతని. సుగ్రీవుడి దగ్గర పనిచేస్తాను. నన్ను నమ్మండి” అన్నాడు.
సీతమ్మ అంది “ఎవడైతే నూరేళ్లు బతుకుతాడో, ఉత్సాహంగా ఉంటాడో, వాడు ఏదో ఒక రోజు మంచి వార్త వింటాడు. బహుశా నేను చావకుండా బతికున్నందుకే ఈ మంచి కబురు వింటున్నాను” అని.
నువ్వెవరు తల్లీ?
హనుమంతుడు అడిగాడు “అమ్మా! నువ్వు దేవతల్లో ఉన్నదానివా? యక్షులకి చెందినదానివా? గంధర్వుల దానివా? కిన్నెరసానివా? వశిష్ఠుడి మీద కోపం తెచ్చుకుని వచ్చిన అరుంధతివా? అగస్త్యుడి మీద అలిగి వచ్చిన లోపాముద్రవా? నీ కాళ్లు నేల మీద ఆనుతున్నాయి.
నువ్వు దేవతా స్త్రీవి అయితే కావు. నీలో రాజ లక్షణాలు కనిపిస్తున్నాయి కాబట్టి నువ్వు కచ్చితంగా క్షత్రియ వంశానికి చెందిన రాజు పెళ్లానివై ఉంటావని నేను అనుకుంటున్నాను. ఒకవేళ నువ్వు జనస్థానంలో రావణుడి చేత ఎత్తుకుపోబడ్డ సీతమ్మ కాదా?” అని.
నేను సీతని
సీతమ్మ చెప్పింది “ఈ భూమండలాన్ని పాలించిన రాజుల్లో చాలా గొప్పవాడైన, శత్రువుల సైన్యాన్ని చీల్చి చెండాడగల దశరథ మహారాజు పెద్ద కోడల్ని నేను. విదేహ వంశంలో పుట్టిన జనక మహారాజుకి కూతుర్ని నన్ను సీత అంటారు. బుద్ధిమంతుడైన రాముడికి భార్యని.
నేను అయోధ్యలో పన్నెండు ఏళ్లు హాయిగా బతికాను. కానీ పదమూడో ఏట దశరథుడి ఆజ్ఞ ప్రకారం దండకారణ్యానికి వచ్చాము. రాముడు లేనప్పుడు రావణుడు నన్ను ఎత్తుకుని ఇక్కడికి తీసుకొచ్చాడు” అని.
నమ్మకం కుదిరింది
‘సీతమ్మకి నా మీద నమ్మకం కలిగింది’ అని హనుమంతుడు అనుకుని ఆమె దగ్గరికి తొందరగా వెళ్ళాడు. అలా వస్తున్న హనుమంతుడిని చూసి సీతమ్మ మళ్ళీ మూర్ఛపోయింది. కాసేపటికి తేరుకుని “నువ్వు దుర్మార్గుడవైన రావణుడివి వేషం మార్చుకుని వచ్చావు” అంది.
మంచి మనసు
సీతమ్మ మనసులో అనుకుంది ‘ఈ కోతిని చూస్తే అలా అనిపించడం లేదు. మనసులో ఏదో మంచి ఫీలింగ్ కలుగుతోంది. ఈయన అటువంటి వాడు కాదనిపిస్తోంది. ఈయనని చూస్తే కొడుకు మీద ఉండే ప్రేమలా ఉంది’ అనుకుని, “నాయనా! నువ్వు ఎవరో నిజంగా నాకు చెప్పు” అంది.
రాముడి కబుర్లు
హనుమంతుడు చెప్పాడు “అమ్మా! నిన్ను ఎత్తుకుపోయాక రాముడు జటాయువుతో మాట్లాడాడు. తర్వాత జటాయువు చనిపోయాడు. తర్వాత కబంధుడు కనిపించాడు. ఆ తర్వాత సుగ్రీవుడి దగ్గరికి వెళ్లారు. సుగ్రీవుడితో స్నేహం చేసిన రాముడు వాలిని చంపిన తర్వాత సుగ్రీవుడికి పట్టాభిషేకం చేశాడు. నిన్ను వెతకడానికి సుగ్రీవుడు వర్షాకాలం అయిపోయాక కోతులందరినీ పంపించాడు.
దక్షిణానికి అంగదుడి నాయకత్వంలో వచ్చిన కోతులు సముద్రాన్ని దాటి వెళ్లలేక అక్కడే ఉండిపోయాయి. నన్ను హనుమ అంటారు. కేసరి నా తండ్రి, మా అమ్మ అంజనాదేవి పుణ్యమా అని వాయుదేవుడికి పుట్టాను. నేను నీ కొడుకు లాంటి వాడిని, రాముడి దూతని. రాముడు నీ గురించి చాలా బాధపడుతున్నాడు. నీ జాడ తెలియగానే రాముడు వచ్చి నిన్ను కాపాడతాడు. నన్ను నమ్ము తల్లీ” అన్నాడు.
స్నేహం ఎలా కుదిరింది?
సీతమ్మ అడిగింది “నువ్వు కోతివి, రాముడు మనిషి. మనిషికీ కోతికీ స్నేహం ఎలా కుదిరింది? నా బాధ పోవాలంటే నేను రాముడి మంచి గుణాలు వినాలి. నువ్వు అంత రాముడి భక్తుడివి అయితే రాముడు ఎలా ఉంటాడో చెప్పు?” అని.
రాముడి గొప్పతనం
లక్షణం | వివరణ |
---|---|
ధర్మం | మూర్తీభవించిన ధర్మం, తన ధర్మాన్ని, ఇతరుల ధర్మాన్ని కాపాడతాడు. |
కళ్ళు | పద్మాల్లా ఉంటాయి, చూసిన వాళ్లందరికీ ఆనందం కలుగుతుంది. |
రూపం, మంచితనం | పుట్టుకతోనే వచ్చాయి. |
తేజస్సు | సూర్యుడితో సమానం. |
ఓర్పు | భూమితో సమానం. |
బుద్ధి | బృహస్పతితో సమానం. |
కీర్తి | ఇంద్రుడితో సమానం. |
చదువు | యజుర్వేదం, ధనుర్వేదం, వేదవేదాంగాలు అన్నీ తెలుసు. |
ఎత్తు | 96 అంగుళాలు (8 అడుగులు) ఉంటాడు. |
నడవడి | మర్యాదగా ఉంటాడు, ఎవరిని ఎప్పుడు ఎలా కాపాడాలో తెలుసు. ముఖ్యమైనవాడు, ఈ లోకమంతా నిండి ఉన్నాడు. |
హనుమంతుడు రాముడి కాలిగోళ్ల నుంచి తల వెంట్రుకల వరకు అన్నీ వివరంగా చెప్పాడు.
ఉంగరం గుర్తుగా
హనుమంతుడు అన్నాడు “అమ్మా! నేను రాముడి దూతని. ఇదిగో రాముడి పేరు ఉన్న ఉంగరం నీకు గుర్తుగా తీసుకొచ్చాను. ఇదిగో తీసుకో, ఇక నీ కష్టాలన్నీ అయిపోయాయి, నువ్వు సంతోషంగా ఉంటావు” అన్నాడు.
హనుమంతుడు ఇచ్చిన ఉంగరాన్ని ముట్టుకోగానే సీతమ్మ సిగ్గుపడింది. రాముణ్ణి చూసినంత సంతోషపడి ఆ ఉంగరాన్ని కళ్ళకి అద్దుకుని చాలా ఆనందపడింది.
అందరూ క్షేమమేనా?
హనుమంతుడు ఇచ్చిన ఉంగరాన్ని తీసుకున్న సీతమ్మ “నాయనా హనుమా! లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, కౌసల్య, సుమిత్ర, కైకేయి, కోసల దేశంలో ఉన్న వాళ్లందరూ, సుగ్రీవుడు, మిగతా కోతులందరూ క్షేమంగా ఉన్నారా?” అని చాలా ప్రశ్నలు అడిగింది.
తర్వాత అంది “రాముడికి నాకన్నా ఎక్కువ ఎవరూ లేరు కదా! నేను పక్కన లేకపోవడం వల్ల రాముడు ఏమి చేయాలో తెలియక ఇబ్బంది పడటం లేదు కదా? రాముడు కేవలం తన బలం మీదనే నమ్మకం పెట్టుకుని దేవుణ్ణి పట్టించుకోకుండా తిరుగుతున్నాడా? లేకపోతే తన బలాన్ని పూర్తిగా వదిలేసి దేవుణ్ణి మాత్రమే నమ్ముకుని ఉన్నాడా? రాముడికి నేను గుర్తు ఉన్నానా? నన్ను తలుచుకుంటున్నాడా? రావణుడిని, రాక్షసులని చంపడానికి రాముడు అక్కడినుంచే బాణాలు వేయలేడా? రాముడు బాణాలు వేయకుండా నా విషయంలో ఎందుకు పట్టించుకోవట్లేదు? రావణుడు నాకు పన్నెండు నెలల గడువు ఇచ్చాడు. అందులో పది నెలలు అయిపోయాయి.
ఇంక రెండు నెలలే నన్ను బతకనిస్తాడు. నేను ఇంకో నెల మాత్రమే బతుకుతాను. నెల లోపల రాముడు వచ్చి నన్ను విడిపిస్తే సరే, లేకపోతే నేను చచ్చిపోతాను. నేను ఇంక ఒక నెల మాత్రమే బతికి ఉంటానని రాముడికి చెప్పు” అంది.
బాధపడకు తల్లీ
సీతమ్మ అలా బాధగా చెప్పిన మాటలు విన్న హనుమంతుడు తల మీద చేతులు పెట్టుకుని “ఎందుకమ్మా అలా బాధపడతావు? మలయ పర్వతం, వింధ్య పర్వతం, మేరు పర్వతం లాంటి పెద్ద పర్వతాల మీద మా కోతులు తినే దుంపల మీద ఒట్టు వేసి చెప్తున్నా, రాముడికి నీ మీద చాలా ప్రేమ ఉంది, ఆయన నీ కోసం చాలా బాధపడుతున్నాడు.
ఎక్కడైనా అందమైన తామర పువ్వు కనిపిస్తే ‘హా సీతా! హా సీతా!’ అంటున్నాడు. మునుల్లాగా రాముడు కూడా సూర్యాస్తమయం అయ్యాక మంచి ఆహారం తింటున్నాడు. నిన్ను తలుచుకుంటూ ప్రతి క్షణం ఏడుస్తూనే ఉన్నాడు. రాముడు ప్రస్రవణ పర్వతం గుహలో పడుకుని ఉంటే ఆయన ఒంటి మీద తేళ్లు, జెర్రులు, పాములు పాకినా కూడా ఆయనకి తెలియనంత బాధలో ఉన్నాడు.
నూరు యజ్ఞాలు చేసి ఐరావతం మీద కూర్చున్న ఇంద్రుడి దగ్గర శచీదేవి ఉన్నట్టు, ప్రస్రవణ పర్వతం గుహలో కూర్చున్న రాముడి దగ్గరికి నిన్ను తీసుకెళ్లి దింపుతాను. యజ్ఞంలో వేసిన ఆహారాన్ని అగ్ని దేవుడు ఎంత పవిత్రంగా తీసుకెళ్తాడో అలా నిన్ను తీసుకెళ్లి రాముడి కాళ్ళ దగ్గర పెడతాను. అమ్మా! నువ్వు వచ్చి నా వీపు మీద కూర్చో” అన్నాడు.
నవ్విన సీతమ్మ
హనుమంతుడు అప్పటిదాకా చాలా చిన్నగా ఉండడం వల్ల సీతమ్మ హనుమంతుడిని చూసి గట్టిగా నవ్వి “ఎంత మాట అన్నావు హనుమ! నువ్వే ఇంత చిన్నగా ఉన్నావు, నీ వీపు మీద నేను కూర్చోనా! నన్ను ఈ సముద్రాన్ని దాటించి తీసుకెళ్తావా! నీ కోతి బుద్ధి బయటపెట్టావు కదా!” అంది.
పెద్ద రూపం
సీతమ్మ మాటకి హనుమంతుడికి కోపం వచ్చింది. తన నిజమైన రూపాన్ని సీతమ్మకి చూపించాలి అనుకుని, మేరు పర్వత శిఖరాలు ఆకాశాన్ని తాకుతున్నట్టు ఎంత పెద్దగా ఉంటాయో అంత పెద్ద రూపాన్ని పొందాడు. హనుమంతుడు పెద్ద కాళ్ళతో, లావైన తొడలతో, సన్నటి నడుముతో, విశాలమైన ఛాతితో, శంఖం లాంటి మెడతో, కాల్చిన పెనం లాంటి ముఖంతో, పచ్చటి కళ్ళతో, పెద్ద జుట్టుతో, ఇనుప గుదియల్లాంటి భుజాలతో నిలబడ్డాడు.
నువ్వెవరో తెలుసు
హనుమంతుడిని అలా చూసిన సీతమ్మ ఆశ్చర్యపోయి “నాయనా! నువ్వు ఎవరో నాకు తెలుసు. నూరు యోజనాల సముద్రాన్ని దాటి వచ్చినప్పుడే నువ్వు ఎవరో గుర్తుపట్టాను. ఇంత పెద్దగా రాగలిగే శక్తి గరుత్మంతుడికి, నీ తండ్రి వాయుదేవుడికి, నీకు మాత్రమే ఉంది. నువ్వు ఇంత బలవంతుడివి కాకపోతే రాముడు నిన్ను నా దగ్గరికి పంపడు.
నేను నీ వీపు మీద కూర్చుని అవతలి ఒడ్డుకి వచ్చేటప్పుడు సముద్రంలో పడిపోవచ్చు లేదా రాక్షసులు నీ దారికి అడ్డు వస్తే నీకు వాళ్ళకి యుద్ధం జరగవచ్చు. ఆ సమయంలో నువ్వు వాళ్ళతో యుద్ధం చేస్తావా? లేక నన్ను కాపాడుకుంటావా? ఒకవేళ ఏదైనా కారణం వల్ల నేను రాక్షసులకి దొరికితే రావణుడు నన్ను ఎవరికీ తెలియని చోట దాచివేయవచ్చు.
నేను నీ వీపు మీద కూర్చుని అవతలి ఒడ్డుకి రావడం కుదరదు. అమ్మా! నేను యుద్ధం చేయగలను, నిన్ను క్షేమంగా రాముడి దగ్గరికి తీసుకెళ్తాను అని అంటావేమో, నేను స్పృహలో ఉండగా తెలిసి తెలిసి రాముడిని తప్ప వేరే మగాడిని నా చేత్తో తాకను. రాముడే వచ్చి రావణుడిని చంపి నా చేయి పట్టుకుని ఈ సముద్రాన్ని దాటించాలి” అంది.
హనుమంతుడు అన్నాడు “తల్లీ! ఒక ఆడదానివై ఇన్ని కష్టాలు పడుతూ కూడా ‘నేను రాను’ అనడం నీకే చెల్లింది. నువ్వు నా వీపు మీద కూర్చుని రానంటున్నావు కదా! పోనీ రాముడి దగ్గరికి నేను వెళ్ళి చెప్పడానికి ఏదైనా ఒక గుర్తుని ఇవ్వు” అన్నాడు.
కాకి కథ
సీతమ్మ తన చీర కొంగుకి కట్టి ఉన్న మూటని విప్పి అందులో ఉన్న చూడామణిని ఇచ్చింది. (చూడామణి సముద్రం నుంచి పైకి వచ్చింది. దానిని దేవేంద్రుడు జనకుడికి ఒక యాగంలో బహుమతిగా ఇచ్చాడు). “ఈ చూడామణిని పెళ్లి టైములో మా అమ్మ నా తల మీద పెట్టింది. నువ్వు ఇది ఇస్తే రాముడికి ఒకేసారి ముగ్గురు గుర్తుకు వస్తారు, మా అమ్మ, దశరథుడు, నేను గుర్తు వస్తాము” అంది.
హనుమంతుడు ఆ చూడామణిని కళ్ళకి అద్దుకుని, రాముడు ఇచ్చిన ఉంగరాన్ని ఎలా దాచుకున్నాడో అలానే చూడామణిని కూడా జాగ్రత్తగా దాచుకున్నాడు. సీతమ్మ ఆభరణం చేతిలో పడగానే ఆయనకి చాలా శక్తి, ధైర్యం వచ్చాయి.
సీతమ్మ మళ్ళీ అంది “ఒకసారి నేను రాముడితో కలిసి తిరుగుతుంటే నా నుదుటి మీద పెట్టుకున్న బొట్టు చెరిగిపోతే రాముడు అక్కడున్న ఒక కుంకుమ రాయిని అరగదీసి నా బుగ్గ మీద చుక్క పెట్టాడు. ఈ విషయం కూడా రాముడికి గుర్తు చెయ్యి” అంది.
వెళ్ళొస్తా
హనుమంతుడు “నేను వెళ్తాను” అంటే సీతమ్మ అంది “నాయనా! పది నెలల నుంచి ఇక్కడ ఉంటున్నాను కానీ ఒక్కరోజు కూడా రామ నామం వినలేదు. ఇన్నాళ్ళకి నువ్వు వచ్చి రామాయణం కథ చెప్పావు. నా మనసు నిండిపోయింది. అంత తొందరగా నువ్వు వెళ్ళిపోతాను అంటే నాకు చాలా బాధగా ఉంది. ఎక్కడైనా ఒక రహస్యమైన చోట ఈరోజు ఉండి రేపు నాకు కనిపించి మళ్ళీ ఒక్కసారి రామ కథ నాకు చెప్పు. ఈరోజు ఉండు హనుమా” అని, ఇంటి నుంచి దూరంగా వెళ్తున్న కొడుకుని తల్లి అడిగినట్టు సీతమ్మ హనుమంతుడిని అడిగింది.
హనుమంతుడు “అమ్మా! నువ్వు బాధపడకు. రాముడు కూడా నీ గురించి బాధపడుతూ ఏడుస్తున్నాడు” అన్నాడు.
రావణ సంహారం ఎలా?
సీతమ్మ అంది “నువ్వు చెప్పిన మాట నాకు మళ్ళీ బాధ కలిగిస్తోంది. రాముడు నా కోసం ఏడుస్తున్నాడన్న మాట చాలా కష్టంగా ఉంది. హనుమ! నూరు యోజనాల సముద్రాన్ని దాటి నువ్వు, గరుత్మంతుడు, వాయుదేవుడు వస్తారు. ఇంకెవరూ ఇక్కడికి రాలేరు. మరి రావణుడిని ఎలా చంపుతారు?” అని.
మా వాళ్లెందరో ఉన్నారు
హనుమంతుడు అన్నాడు “సుగ్రీవుడి దగ్గర నాతో సమానమైన బలం ఉన్న వాళ్ళు ఉన్నారు. నాకన్నా ఎక్కువ బలం ఉన్న వాళ్ళు ఉన్నారు. నాకన్నా తక్కువ బలం ఉన్న వాడు సుగ్రీవుడి దగ్గర లేదమ్మా! (ఈ మాట హనుమంతుడి వినయానికి గుర్తు). నేను వెళ్లి రాముడికి చెప్పి తొందరలోనే కోతుల సైన్యంతో లంకా పట్టణానికి వచ్చి రావణుడిని చంపుతాము” అన్నాడు.