భరతుడి విన్నపం – రాముడి అంగీకారం
Ramayanam Story in Telugu- భరతుడు శ్రీరాముడి శిరస్సుపై చేతులు జోడించి “అన్నయ్యా, మా అమ్మ కైకేయి గతంలో రెండు వరాలను కోరింది. ఇక్ష్వాకు వంశంలో పెద్దవాడిగా జన్మించి, రాజ్యం పొందడానికి అన్ని అర్హతలు కలిగి ఉన్నప్పటికీ, తండ్రి మాట నిలబెట్టడం కోసం రాజ్యాన్ని విడిచిపెట్టి అరణ్యానికి వెళ్ళిపోయావు. అప్పుడు నీ పాదుకలను నాకు అప్పగించి, రాజ్యాన్ని పాలించమని ఆజ్ఞాపించావు. ఇప్పుడు నువ్వు నాకు అప్పగించిన రాజ్యాన్ని నీ పాదాల చెంతకు తీసుకొచ్చాను. గతంలో నీకు ఉన్నది నాకు ఇచ్చి, నేను దాన్ని అనుభవిస్తుంటే చూసి నువ్వు ఆనందించావు. ఈ రోజు నేను దాన్ని నీకు తిరిగి అప్పగిస్తున్నాను” అన్నాడు. భరతుడి మాటలకు సంతోషించిన శ్రీరాముడు రాజ్యాన్ని తిరిగి స్వీకరించడానికి అంగీకరించాడు. 🔗 శ్రీరామ్ → రామాయణం కథలు
దీక్ష విరమణ నియమం
శత్రుఘ్నుడు వచ్చి “అన్నయ్యా! క్షుర కర్మ (మంగలి పని) చేసేవారిని తీసుకొచ్చాను. నీ జుట్టు జడలు కట్టి ఉంది. కనుక క్షుర కర్మ చేయించుకో” అన్నాడు. అందుకు రాముడు “నేను తండ్రి మాట నిలబెట్టడం కోసమే అరణ్యవాసానికి వచ్చాను. తండ్రి ఆజ్ఞాపించకపోయినా, నాపై ఉన్న ప్రేమతో స్వచ్ఛందంగా దీక్ష స్వీకరించి, నా పాదుకలను సింహాసనంపై ఉంచి పద్నాలుగు సంవత్సరాలు రాజ్యంపై మమకారం లేకుండా పరిపాలించిన భరతుడు ముందు దీక్ష విరమించి, స్నానం చేస్తే తప్ప నేను నా దీక్షను విరమించను” అన్నాడు.
పవిత్ర స్నానాలు, అలంకరణలు
భరతుడు, శత్రుఘ్నుడు, సుగ్రీవుడు, విభీషణుడు క్షుర కర్మ చేయించుకుని మంగళ స్నానాలు చేసిన తరువాత శ్రీరాముడు కూడా క్షుర కర్మ చేయించుకుని మంగళ స్నానం చేశాడు. తరువాత శ్రీరాముడు అందమైన పట్టు వస్త్రాలు ధరించి, సుగంధ ద్రవ్యాలు పూసుకుని, దివ్యాభరణాలతో బయటకు వచ్చాడు.
కౌసల్యదేవి ఆనందం – సీతాదేవి అలంకరణ
ఇన్ని సంవత్సరాలకు తన కొడుకు తిరిగి వచ్చాడని కౌసల్యా దేవి ఆనందంతో పొంగిపోయింది. సీతాదేవికి అభ్యంగన స్నానం చేయించి, చక్కటి పట్టు వస్త్రాలు కట్టి, అందంగా అలంకరించింది. కౌసల్య, సుమిత్ర, కైకేయి చేత అలంకరించబడిన తొమ్మిది వేల మంది వానర స్త్రీలు ఏనుగులను ఎక్కారు. దశరథుడు ఎక్కే ‘శత్రుంజయం’ అనే ఏనుగుని తీసుకొచ్చి దానిపై సుగ్రీవుడిని ఎక్కించారు. వానరులందరూ సంతోషంగా అయోధ్యకు బయలుదేరారు.
అయోధ్యకు ప్రయాణం
సూర్యమండలంతో సమానమైన కాంతితో వెలిగే రథాన్ని శ్రీరాముడు ఎక్కాడు. ఆ రథం పగ్గాలను భరతుడు పట్టుకుని నడిపించాడు. లక్ష్మణుడు వంద తీగలు కలిగిన తెల్లటి గొడుగుని పట్టాడు. ఒక వైపు శత్రుఘ్నుడు, మరొక వైపు విభీషణుడు వింజామరాలు (చేతి విసనకర్రలు) విసురుతున్నారు. రథంలో అయోధ్యకు వెళ్తూ, మార్గంలో కనిపించిన వారందరినీ శ్రీరాముడు పలకరించుకుంటూ వెళ్ళాడు.
అయోధ్యలో సంబరాలు
అయోధ్యలోని ప్రతి ఇంటిపైనా పతాకాలు ఎగురవేశారు. అన్ని ఇళ్ల ముందు రంగవల్లులు (ముగ్గులు) వేశారు. ప్రజలందరూ సంతోషంతో నాట్యం చేస్తూ వెళుతున్నారు. ఊరేగింపులో ముందుగా మంగళ వాయిద్యాలు, ఆ వెనుక వేద పండితులు నడిచారు. తరువాత పెద్దలు, వారి వెనుక కన్యలు, కొందరు స్త్రీలు పిండివంటలు పట్టుకుని నడిచారు. మార్గమధ్యంలో గంధపు నీరు చల్లుకుంటూ వెళ్ళారు. ఆ తరువాత సువాసినులు (పెళ్ళైన స్త్రీలు) చేతులలో పువ్వులు, పసుపు, కుంకుమ పట్టుకుని వెళ్ళారు. వశిష్ఠుడు, జాబాలి, కాశ్యపుడు, గౌతముడు మొదలైన ఋషులందరూ వచ్చారు. అందరూ కలిసి అయోధ్యకు చేరుకున్నారు.
పట్టాభిషేకం సన్నాహాలు
ఆ రాత్రికి అయోధ్యలో గడిపాక, మరుసటి రోజు రాముడి పట్టాభిషేకానికి నాలుగు సముద్రాల జలాలు, ఐదు వందల నదుల జలాలను వానరులు తీసుకొచ్చారు. ఇంద్రుడు నూరు బంగారు పూసలు కలిగిన మాలను శ్రీరాముడికి బహూకరించాడు.
శ్రీరామ పట్టాభిషేకం
వానరులు తెచ్చిన జలాలతో శ్రీరాముడికి పట్టాభిషేకం చేశారు. కిరీటాన్ని తీసుకొచ్చి రాముడి శిరస్సుపై అలంకరించారు. ఆ సమయంలో శ్రీరాముడు కోట్లాది బంగారు నాణాలు, లక్షలాది ఆవులు, వేలాది ఎద్దులను దానం చేశాడు.
యువరాజ పట్టాభిషేకం – భరతుడి వినయం
శ్రీరాముడు లక్ష్మణుడితో “లక్ష్మణా! యువరాజ పట్టాభిషేకం చేసుకో” అన్నాడు. లక్ష్మణుడు “అన్నయ్యా! నాకంటే పెద్దవాడు భరతుడు. నాకు రాజ్యం వద్దు, భరతుడికి ఇవ్వు” అన్నాడు. ఆ విధంగా యువరాజ పట్టాభిషేకం భరతుడికి జరిగింది.
బహుమతులు – హనుమంతుడికి సీతాదేవి హారం
సుగ్రీవుడు, విభీషణుడు, అంగదుడు మొదలైన వానర వీరులందరికీ బహుమతులు ఇచ్చారు. హనుమంతుడికి తెల్లటి వస్త్రాల జత, హారాలు ఇచ్చారు. ఆ సమయంలో, సీతాదేవి తన మెడలోని ఒక హారాన్ని తీసి చేతిలో పట్టుకుంది. రాముడు సీతవంక చూసి “ఈ హారం ఎవరికి ఇస్తావో తెలుసా! పౌరుషం, బుద్ధి, విక్రమం, తేజస్సు, వీర్యం, పట్టుదల, పాండిత్యం ఎవరిలో ఉన్నాయో అటువంటివారికి ఈ హారాన్ని కానుకగా ఇవ్వు. అన్నిటినీ మించి వాడు నీ ఐదోతనానికి (సుమంగళిత్వానికి) కారణమై ఉండాలి” అన్నాడు. సీతాదేవి ఆ హారాన్ని హనుమంతుడికి ఇచ్చింది. అప్పుడాయన ఆ హారాన్ని కన్నులకు అద్దుకొని మెడలో వేసుకున్నాడు.
రామరాజ్యం – సుఖశాంతులు
ధర్మాత్ముడైన శ్రీరాముడు సింహాసనంపై కూర్చున్నప్పుడు ఎవరి నోట విన్నా ‘రాముడు, రాముడు’ అనే తప్ప వేరే మాట వినిపించలేదు. రాముడు రాజ్యం చేస్తుండగా దొంగల భయం లేదు. శత్రువుల భయం లేదు. నెలకు మూడు వర్షాలు కురుస్తుండేవి. భూమి సస్యశ్యామలంగా పంటలను ఇచ్చింది. చెట్లన్నీ పండులు, పూలతో నిండిపోయి ఉండేవి. చాతుర్వర్ణాల (నాలుగు వర్ణాల) ప్రజలు తమ తమ ధర్మాలలో అనురక్తులై ఉన్నారు. చిన్నవాళ్ళు మరణిస్తే పెద్దవాళ్ళు అంత్యక్రియలు చేయడం రామరాజ్యంలో లేదు. ఆ రాముడి పరిపాలనలో అందరూ సంతోషంగా ఉండేవారు.
రామాయణం – ఫలశ్రుతి
ఎక్కడెక్కడ రామాయణం చెబుతున్నప్పుడు బుద్ధిమంతులై, పరమ భక్తితో రామాయణాన్ని ఎవరైతే వింటున్నారో, అటువంటివారికి శ్రీ మహావిష్ణువు కృపతో తీరని కోరికలు ఉండవు. ఉద్యోగం చేసేవారు, వ్యాపారం చేసేవారు ఆయా రంగాలలో రాణిస్తారు. సంతానం లేని రజస్వలలైన స్త్రీలు ఈ రామాయణాన్ని వింటే వారికి గొప్ప పుత్రులు పుడతారు. తమ బిడ్డలు అభివృద్ధి చెందడం చూసి తల్లులు ఆనందం పొందుతారు. వివాహం కానివారికి వివాహం జరుగుతుంది. కుటుంబం వృద్ధిలోకి వస్తుంది. వంశం నిలబడుతుంది. మంచి పనులకు డబ్బు వినియోగం అవుతుంది. దూరంగా ఉన్న బంధువులు త్వరలో వచ్చి కలుసుకుంటారు. ఇంటికి మంగళతోరణం కట్టబడుతుంది. ఎన్నాళ్లుగానో జరగని శుభకార్యాలు జరుగుతాయి. పితృదేవతలు సంతోషిస్తారు.
అందరూ రామాయణాన్ని చదివి ఆనందించండి.
జై శ్రీ రామ్ … రామాయణం సంపూర్ణం….