Karthika Puranam Telugu – కార్తీక పురాణం | ఏడో రోజు పారాయణ

Karthika Puranam

త్రయోదశాధ్యాయము: కన్యాదాన ఫలము

వశిష్ఠ ఉవాచ: రాజా! ఎంత చెప్పినా తరగని ఈ కార్తీక మహాత్మ్య పురాణములో కార్తీకమాసంలో చేయవలసిన ధర్మాల గురించి చెబుతాను. ఏకాగ్రచిత్తుడవై విను. తప్పనిసరిగా చేయవలసిన వాటిని చేయకపోవడం వలన పాపాలను కలిగించేవీ అయిన ఈ కార్తీక ధర్మాలన్నీ కూడా నా తండ్రియైన బ్రహ్మదేవుని ద్వారా నాకు బోధించబడ్డాయి. నీకిప్పుడు వాటిని వివరిస్తాను.

జనక రాజేంద్రా! ఈ కార్తీక మాసంలో కన్యాదాన, ప్రాతః స్నానములు, యోగ్యుడైన బ్రాహ్మణ బాలకునకు ఉపనయనము చేయించడం, విద్యాదాన, వస్త్రదాన, అన్నదానములు – ఇవి చాలా ప్రధానమైనవి.

ఉపనయనం (ఒడుగు) దానం ప్రాముఖ్యత

బ్రాహ్మణ కుమారునికి కార్తీకమాసములో ఒడుగు చేయించి దక్షిణను సమర్పించడం వలన పూర్వజన్మ పాపాలు కూడా తొలగిపోతాయి. ఆ విధముగా తమ ధనముతో ఉపనయనము చేయించబడిన వటువు చేసే గాయత్రీ జపము వల్ల దాత పంచ మహాపాతకాలూ నశించిపోతాయి.

వంద రావిచెట్లు నాటించినా, వంద తోటలను వేయించినా, వంద నూతులను దిగుడు బావులనూ నిర్మించినా, పది వేల చెరువులను తవ్వించినా వచ్చే పుణ్యమెంతయితే ఉంటుందో అది పేద బ్రాహ్మణ బాలునికి ఉపనయనము చేయించడం వలన కలిగే పుణ్యంలో పదహారోవంతుకు కూడా సమానము కాదు.

మరో విషయమును గుర్తుంచుకో:

శ్లో ॥ మాఘ్యాం వైమాధవేమాసి చోత్తమం మౌంజి బంధనం
కారయిష్యంతి తే రాజన్ దానం దత్వాతు కార్తీకే ||

కార్తీకంలో ఉపనయన దానమును చేసి తదుపరిని వచ్చే మాఘములో గాని, వైశాఖములో గాని ఉపనయనము చేయించాలి. సాధువులూ, శ్రోత్రియులూయైన బ్రాహ్మణ బాలకులకు ఉపనయనమును చేయించడం వలన అనంత పుణ్యము కలుగుతుందని ధర్మవేత్తలైన మునులందరూ కూడా చెప్పియున్నారు. అటువంటి ఉపనయనానికి కార్తీక మాసంలో సంకల్పమును చెప్పుకుని ఫలానా వారికి నేను నా ద్రవ్యముతో ఉపనయనమును చేయిస్తాను అని వాగ్దానము చేయడం వలన కలిగే సత్ఫలితాన్ని చెప్పడానికి స్వర్గలోక వాసులకు కూడా సాధ్యము కాదు అని తెలుసుకో.

జనక నరపాలా! ఇతరుల సొమ్ముతో చేసే తీర్థయాత్రలు, దేవ, బ్రాహ్మణ సమారాధనలూ వీని వలన కలిగే పుణ్యం ఆ ధనదాతలకే చెందుతుందన్న విషయము జగద్విదితమే కదా! కార్తీకములో, తమ ధనముతో ఒక బ్రాహ్మణునకు ఉపనయనముతో బాటు వివాహమును కూడా చేయించడం వలన తత్పుణ్యము మరింతగా ఇనుమడిస్తుంది.

కన్యాదానం యొక్క అద్భుత ఫలం

శ్లో || కన్యాదానం తు కార్తిక్యాం యః కుర్యాద్భక్తితో నఘ
స్వయంపాపై ర్వినిర్ముక్తః పితృణాం బ్రహణః పదమ్

కార్తీకములో కన్యాదాన మాచరించిన వాడు స్వయముగా వాడు తరించడమేగాక, వాని పితరులందరికీ కూడా బ్రహ్మలోక ప్రాప్తిని కలిగించిన వాడవుతాడు. ఇందుకు నిదర్శనముగా ఒక ఇతిహాసమును చెబుతాను విను.

సువీరోపాఖ్యానము (కన్య విక్రయ దోషము)

ద్వాపర యుగంలో వంగదేశాన దుర్మార్గుడైన సువీరుడనే రాజు వుండేవాడు. దైవ యోగము వలన సువీరుడు, దాయాదులచే ఓడింపబడినవాడై, రాజ్యభ్రష్టుడై, భార్య (సుందరాంగి) తో సహా అడవులలోకి పారిపోయి, కందమూలాదులతో కాలము గడపసాగాడు. నర్మదా తీరములో పర్ణశాలను నిర్మించుకున్నాడు. అక్కడే అతని రాణి ఒక చక్కటి కుమార్తెను ప్రసవించింది. దరిద్రము, పురాకృత కర్మలు నిందించుకుంటూ ఆ ఆడకూతురుని సువీర దంపతులు అతి కష్టం మీద పెంచుకోసాగారు.

ఎదిగిన ఆమె సౌందర్యానికి మోహితుడైన ఒక ముని కుమారుడు ఆ బాలికను తనకిచ్చి పెండ్లి చేయవలసిందిగా సువీరుని కోరాడు. దానికి రాజు, తాను ఘోర దారిద్ర్యములో ఉన్నాను గనుక, కోరినంత ధనాన్ని కన్యాశుల్కముగా సమర్పించగలిగితే నీ కోరిక తీరుస్తాను అన్నాడు. ముని బాలకుడు తపస్సు చేసి ధనమును సంపాదించి తెచ్చి సువీరునికిచ్చాడు. ఆ సొమ్మునకు సంతృప్తి చెందిన రాజు తమ ఇంటి ఆచారము ప్రకారముగా తన కూతురుని ముని యువకునికి ఇచ్చి ఆ అరణ్యములోనే కళ్యాణమును జరిపించేశాడు.

తత్కన్యా విక్రయ ద్రవ్యముతో రాజు తన భార్యతో సుఖముగా వుండసాగాడు. తత్ఫలితముగా సువీరుని భార్య మళ్లా ఒక ఆడపిల్లను కన్నది. పెద్ద పిల్లను అమ్మి ధనము రాబట్టినట్టే, ఈ పిల్ల ద్వారా కూడా మరింత ద్రవ్యమును సంపాదించవచ్చునని సంతోషించాడు.

ఈ క్రమంలో ఒకానొక యతీశ్వరుడు నర్మదా స్నానానికై వచ్చి, సువీరుని గురించి అడిగాడు. సువీరుడు తాను వంగాశాధీశుడనని, దాయాదుల వలన రాజ్యభ్రష్ఠుడనై అడవిలో జీవిస్తున్నానని చెప్పాడు. దరిద్రం కన్నా ఏడిపించేది, కొడుకు చావు (లేకపోవడం) కంటే ఏడవలసినదీ, భార్యా (రాజ్యం, భార్యా) వియోగం కన్నా బయటకు ఏడవలేని అంతశ్శల్యంలాంటి దుఃఖం ఇంకేమీ వుండదు. ఈ మూడు రకాల విచారాల వలనా అమిత దుఃఖితుడనై కందమూల భక్షణములతో బ్రతుకు చున్నానని చెప్పాడు. తొలి చూలు కూతురును ఒక ముని కుమారునికి విక్రయించి ఆ ధనముతో ప్రస్తుతానికి సుఖముగానే బతుకుతున్నానని, ఇది తన రెండవ కూతురు అని తెలిపాడు.

సువీరుడిచ్చిన సమాధానానికి ఆశ్చర్యపోయిన ఆ యతీంద్రుడు, “ఓ రాజా! ఎంత పని చేశావు? మూర్ఖుడవై అగణితమైన పాపాన్నీ పోగు చేసి పెట్టుకున్నావు” అని అన్నాడు.

శ్లో || కన్యా ద్రవ్యేణ యో జీవే దసిపత్రం సగచ్ఛతి
దేవాన్ ఋషీన్ పిత్రూన్ క్యాపి కన్యా ద్రవ్యేణ తర్పయేత్
శాపం దాస్యంతి తే సర్వే జన్మ జన్మ న్యపుత్రతామ్

ఆడపిల్లని అమ్ముకుని వచ్చిన డబ్బుతో జీవించేవారు, మరణాంతాన ‘అసిపత్రం’ అనే నరకము పాలవుతారు. ఆ సొమ్ముతో దేవ, ఋషి, పితృగణాలకు చేసిన అర్చన తర్పణాదుల వలన ఆ దేవ ఋషి పిత్రాదులందరూ కూడా నరకాన్ని చవి చూస్తారు. అంతే గాదు – కర్తకు జన్మజన్మలకూ కూడా పుత్ర సంతానముకలగకూడదని శపిస్తారు. ఆడపిల్లలను అమ్ముకొని జీవించడమే వృత్తిగా పెట్టుకొన్న వాళ్లు, ఖచ్చితముగా రౌరవ నరకములో పడతారు.

సర్వేషా మేవ పాపానాం ప్రాయశ్చిత్తం విదుర్భుధాః
కన్యావిక్రయ శీలస్య ప్రాయశ్చిత్తం న చోదితమ్

అన్ని రకాల పాపాలకూ ఏవో కొన్ని ప్రాయశ్చిత్తాలున్నాయి గాని ఈ కన్యాశుల్కము అనబడే ఆడపిల్లని అమ్ముకునే మహా పాపానికి మాత్రం ఏ శాస్త్రములోనూ కూడా ఎటు వంటి ప్రాయశ్చిత్తము లేదు.

కన్యాదానం ప్రాయశ్చిత్తం

కాబట్టి, “సువీరా! ఈ కార్తీక మాసములో శుక్లపక్షములో, నీ రెండవ కుమార్తెకు కన్యాదాన పూర్వకముగా కళ్యాణం జరిపించు. కార్తీకమాసములో విద్యాతేజశ్శీల యుక్తుడైన వరునికి కన్యాదానమును చేసినవాడు – గంగాది సమస్త తీర్థాలలోనూ స్నాన దానాదులు చేయడం వలన కలిగే పుణ్యాన్ని, యధోక్త దక్షిణాయుతముగా అశ్వమేధాది యాగములను చేసిన వాళ్లు పొందే సత్ఫలితాన్నీ పొందుతాడు” అని హితబోధ చేశాడు.

కాని, నీచబుద్ధితో కూడుకొనిన ఆ సువీరుడు, ఆ సజ్జన సద్భోధను కొట్టిపారేస్తూ – ధర్మము, దానము, ఫలము, పుణ్యలోకాలంటే ఏమిటి అని ధిక్కరిస్తూ – “పెద్ద పిల్ల విషయములో కంటే అధికముగా ధనమిచ్చేవానికే నా చిన్నపిల్లని కూడా ఇచ్చి పెండ్లి చేసి – నేను కోరుకునే సుఖభోగాలన్నీ అనుభవిస్తాను. అయినా నా విషయాలన్నీ నీకెందుకు? నీ దారిన నువ్వెళ్లు” అని కసిరికొట్టాడు. అంతటితో ఆ తాపసి తన దారిన తాను వెళ్లిపోయాడు.

శ్రుతకీర్త్యుపాఖ్యానము

ఈ సువీరుని పూర్వీకులలో శ్రుతకీర్తి అనే రాజొకడున్నాడు. సమస్త సద్ధర్మ ప్రవక్తా, శతాధిక యాగకర్తా అయిన ఆ శ్రుత కీర్తి తన పుణ్యకార్యాల వలన స్వర్గములోని ఇంద్రాదుల చేత గౌరవింపబడుతూ, సమస్త సుఖాలను అనుభవిస్తున్నాడు.

అయితే, సువీరునికి యముడు విధించిన శిక్ష కారణముగా యమదూతలు స్వర్గము చేరి – అక్కడ సుఖిస్తున్న శ్రుత కీర్తియొక్క జీవుని పాశబద్ధుని చేసి – నరకానికి తీసుకుని వచ్చారు. దీనికి ఆశ్చర్యపడిన శ్రుతకీర్తి యముని అడిగాడు. యముడు మందహాసము చేసి ఇలా చెప్పాడు : “శ్రుతకీర్తీ! నువ్వు పుణ్యాత్ముడవే, స్వర్గార్హుడవే, కాని నీ వంశీకుడైన సువీరుడనే వాడు కన్యను విక్రయించాడు. అతగాడు చేసిన మహా పాపము వలన అతని వంశీకులైన మీరంతా నరకానికి రావలసి వచ్చినది”.

అయినా వ్యక్తిగతముగా చేసిన సువీరుని రెండవ కుమార్తె నర్మదానదీ తీరాన గల పర్ణశాలలో తన తల్లితో జీవిస్తూ వుంది. ఆ బిడ్డకింకా వివాహము కాలేదు. కాబట్టి నువ్వు నా అనుగ్రహము వలన దేహివై (శరీరివై) అక్కడకు వెళ్లి, అక్కడ యోగ్యుడైన వరునికి ఇచ్చి, కన్యాదాన విధానముగా పెండ్లిని జరిపించు శ్రుతకీర్తి!

ఎవడైతే కార్తీకమాసములో సర్వాలంకార భూషితయైన కన్యను యోగ్యుడైన వరునికి దానము చేస్తాడో వాడు లోకాధిపతితో తుల్యుడవుతాడు. అలా కన్యాదానమును చేయాలనే సంకల్పము వుండీ కూడా సంతానము లేని వాడు – బ్రాహ్మణ కన్యాదానికిగాను కన్యాదానం అందుకోబోతూన్న బ్రాహ్మణునకుగాని ధన సహాయమును చేసినట్లయితే ఆ ధనదాత కన్యాదాత పొందే ఫలాన్నే పొందుతాడు. అంతే కాదు స్వలాభాసేక్షా రహితులై రెండు పాడి ఆవులను చెల్లించి, కన్యను కొని, ఆ కన్యను చక్కటి వరునకిచ్చి పెండ్లి చేసే వారు కూడా కన్యాదాన ఫలాన్ని పొందుతారు.

కాబట్టి, ఓ శ్రుతకీర్తి! నీవు తక్షణమే భూలోకానికి వెళ్లి, సువీరుని ద్వితీయ కుమార్తెను ఎవరైనా సదాహ్మణునకు కన్యామూలముగా దానము చేసినట్లయితే – తద్వారా నువ్వూ, నీ పూర్వీకులూ, ఈ సువీరాదులు కూడా నరకము నుండి విముక్తి పొందుతారు” అని చెప్పాడు.

ధర్ముని అనుగ్రహము వలన దేహధారియైన శ్రుతకీర్తి, వెనువెంటనే భూలోకములోని నర్మదా నదీ తీరాన్ని చేరి, సువీరుని భార్యకు హితవులు గరపి, వారి ద్వితీయ సంతానమైన ఆడపిల్లను సువర్ణాభరణ భూషితను చేసి, శివప్రీతిగా, ‘శివార్పణమస్తు’ అనుకుంటూ ఒకానొక బ్రాహ్మణునికి కన్యాదానముగా అర్పించాడు. ఆ పుణ్యమహిమ వలన సువీరుడు – నరకపీడా విముక్తుడై, స్వర్గమును చేరి సుఖించసాగాడు.

తదనంతరము శ్రుతకీర్తి పది మంది బ్రహ్మచారులకు కన్యామూల్యమును ధారబోయడం వలన వారి వారి పితృపితా మహాదివర్గాల వారంతా కూడా విగతపాపులై, స్వర్గాన్ని పొందారు. అనంతరము శ్రుతకీర్తి కూడా యధాపూర్వకముగా స్వర్గము చేరి తన వారిని కలిసి సుఖించసాగాడు.

కాబట్టి ఓ జనక మహారాజా! కార్తీకమాసములో కన్యాదానము చేసేవాడు, సర్వపాపాలనూ నశింప చేసుకుంటానడంలో ఏ మాత్రమూ సందేహం లేదు! కన్యామూల్యాన్ని చెల్లించ లేని వారు వివాహార్థము మాట సహాయమును చేసినప్పటికీ కూడా అమితమైన పుణ్యాన్ని పొందుతారు రాజా!

ఎవరైతే కార్తీక మాసములో యధావిధిగా కార్తీక వ్రతాన్ని ఆచరిస్తారో వాళ్లు స్వర్గాన్నీ, ఆచరించని వాళ్లు నరకాన్నీ పొందుతారనడంలో ఏ మాత్రం సందేహము లేదని గుర్తించు.

చతుర్ధశాధ్యాయము: వృషోత్సర్గము – ఇతర దానములు

వశిష్ఠుడు చెబుతున్నాడు: మిధిలాధీశా! కార్తీక మాసమంతా పూర్వోక్త సర్వధర్మ సంయుతంగా కార్తీక వ్రతాన్ని ఆచరించలేక పోయినప్పటికీ కూడా ఎవరైతే కార్తీక పూర్ణిమ నాడు వృషోత్సర్గం చేస్తారో వారి యొక్క జన్మాంతర పాపాలన్నీ కూడా నశించిపోతాయి.

వృషోత్సర్గము అంటే ఏమిటి?

జనక మహీపాలా! ఆవు యొక్క కోడెదూడను – అచ్చుబోసి ఆబోతుగా స్వేచ్ఛగా వదలడాన్నే వృషోత్సర్గము అంటారు. ఈ మానవలోకంలో ఏ ఇతర కర్మాచరణాల వలన కూడా అసాధ్యమైన పుణ్యాన్ని ప్రసాదించే ఈ కార్తీక వ్రతములో భాగముగానే, కార్తీక పూర్ణిమ నాడు పితృదేవతా ప్రీత్యర్థము ఒక కోడె (ఆవు) దూడను అచ్చుబోసి ఆబోతుగా స్వేచ్ఛగా వదలాలి. అలా చేయడం వలన గయా క్షేత్రములో, పితరులకు కోటిసార్లు శ్రాద్ధాన్ని నిర్వహించిన పుణ్యము కలుగుతుంది.

యః కోవా స్మత్కులే జాతః పౌర్ణమాస్యాంతు కార్తీకే
ఉత్పృజే ద్వృషభంనీలం తేన తృప్తా వయం త్వితి
కాంక్షంతి నృపశార్దూల – పుణ్యలోక స్థితా అపి..

‘పుణ్యలోకాలలో వున్న పితరులు సైతం తమ కులములో పుట్టిన వాడెవడైనా కార్తీక పౌర్ణమినాడు నల్లని గిత్తను అచ్చుబోసి వదిలినట్లయితే మనకు అమితానందం కలుగుతుంది గదా!’ అని చింతిస్తూ వుంటారు రాజా! ధనికుడైనా సరే జీవితంలో ఒక్కసారైనా కార్తీక పౌర్ణమినాడు వృషోత్సర్గమును చేయని వాడు ‘అంధతామిస్రము’ అనే నరకాన్ని పొందుతాడు. గయా శ్రాద్ధము వలన గాని, ప్రతివర్షాబ్దికాల వల్లగాని, తీర్థ స్థలాల్లో తర్పణం వల్లగాని ఈ వృషోత్సర్గంతో సమానమైన ఆనందాన్ని పితరులు పొందరనీ, గయాశ్రాద్ధ వృషోత్సర్గాలు రెండూ సమానమేనని పెద్దలు చెప్పినా, వృషోత్సర్గమే ఉత్తమమైనదనీ తెలుసుకో.

వివిధ దానములు

ఇక కార్తీక మాసములో పండ్లను దానము చేసేవాడు దేవర్షి పిత్రూణాలు మూడింటి నుంచి కూడా విముక్తుడై పోతాడు. దక్షిణాయుతంగా ధాత్రీ (ఉసిరిక) ఫలాన్ని దానమిచ్చేవాడు సార్వభౌముడౌతాడు.

కార్తీక పౌర్ణమినాడు లింగదానము సమస్త పాపహారకము. అత్యంత పుణ్యదాయకమే కాక ఈ దానము వలన ఈ జన్మలో అనేక భోగాలను అనుభవించి, మరుజన్మలో చక్రవర్తిత్వాన్ని పొందుతారు.

నిషిద్ధాహారాలు మరియు ఆచరణలు

అనంత ఫలదాయకమైన ఈ కార్తీక వ్రతాచరణా సదవకాశము అందరికీ అంత తేలికగా లభ్యము కాదు.

అత్యంతోత్కృష్టమైన ఈ కార్తీక మాసములో ఈ అయిదూ మానివేయాలి:

  1. ఇతరుల అన్నమును తినడం.
  2. పితృశేషమును తినడం.
  3. తినకూడనివి తినడము.
  4. శ్రాద్ధములకు భోక్తగా వెళ్లడము.
  5. నువ్వుల దానము పట్టడము.

ఈ నెలలో సంఘాన్నము, శూద్రాన్నము, దేవార్చకాన్నము, అపరిశుద్ధాన్నము, త్యక్తకర్ముని అన్నము, విధవా అన్నము – అనేవి తినకూడదు.

నిషిద్ధ దినాలలో రాత్రి భోజనము నిషిద్ధము:

  • కార్తీక పౌర్ణమి, అమావాస్యలలోనూ.
  • పితృదివసము నాడు.
  • ఆదివారమునాడు.
  • సూర్యచంద్ర గ్రహణ దినాలలోనూ.
  • వ్యతీపాతవైదృత్యాది నిషిద్ధ దినాలలోనూ.

ఈ నెలలో వచ్చే ఏకాదశినాడు రాత్రింబవళ్లు రెండు పూటలూ కూడా భోజనము చేయకూడదు. ఇటు వంటి రోజులలో ఛాయానక్తము (అనగా తమ నీడ – శరీరపు కొలతకు రెండింతలుగా పడినప్పుడు భుజించుట) ఉత్తమమని మహర్షులు చెప్పారు. పరమ పవిత్రమైన ఈ కార్తీకములో నిషిద్ధ దినాలలో భుజించే వారి పాపాలు అగణితముగా పెరిగిపోతాయి.

మానవలసిన ఏడు పనులు

కార్తీకములో ఈ ఏడింటిని జరుపకూడదు:

  1. తైలాభ్యంగనము (నూనె రాసుకోవడం).
  2. పగటి నిద్ర.
  3. కంచుపాత్రలో భోజనము.
  4. పరాన్నభోజనము.
  5. గృహ స్నానము (ఇంట్లో స్నానం).
  6. నిషిద్ధ దినాలలో రాత్రి భోజనము.
  7. వేదశాస్త్ర నింద.

సమర్ధులై వుండీ కూడా – కార్తీకములో నదీ స్నానం చేయకుండా ఇంటి దగ్గరనే వేడి నీటి స్నానమును చేసినట్లయితే అది కల్లుతో చేసిన స్నానానికి సమానమవుతుందని బ్రహ్మశాసనము. సూర్యుడు తులలో వుండగా నదీ స్నానమే అత్యంత ప్రధానము. చేరువలో నదులు లేనప్పుడు మాత్రము చెరువులలోగాని, కాలువలలోగాని, నూతి వద్ద గానీ – గంగా గోదావర్యాది మహానదులను స్మరించుకుంటూ స్నానం చేయవచ్చును.

ఎక్కడా చేసినా ప్రాతఃకాలంలోనే స్నానం చేయాలి. అలా చేయని వాళ్లు నరకాన్ని పొంది, అనంతరం చండాలపు జన్మనెత్తుతారు.

గంగానదీ స్మరణమును చేసి, స్నానమును చేసి, సూర్యమండల గతుడైన శ్రీహరిని ధ్యానించి, ఆ విష్ణుగాధా పురాణాదులను ఆలకించి – ఇంటికి వెళ్లాలి. పగలు చేయవలసిన పనులన్నీ ముగించుకుని సాయంకాలం మరలా స్నానము చేసి – ఆచరించి, పూజా స్థానములో పీఠమును వేసి, దాని మీద ఈశ్వరుని ప్రతిష్ఠించి పంచామృత, ఫలోదక, కుశోదకాలతో మహా స్నానమును చేయించి షోడశోపచారాలతోనూ పూజించాలి.

పరమేశ్వర షోడశోపచార పూజాకల్పం

ముందుగా పరమేశ్వరుడైన ఆ పార్వతీపతిని ఆవాహన చేయాలి. అటు పిదప:

  1. ఓం వృషధ్వజాయ నమః – ధ్యానం సమర్పయామి (పుష్పాక్షతలు).
  2. ఓం గౌరీ ప్రియాయ నమః – పాద్యం సమర్పయామి (నీటిచుక్క) , ఆచమనీయం సమర్పయామి (నీటిచుక్క).
  3. ఓం లోకేశ్వరాయ నమః – ఆర్ఘ్యం సమర్పయామి (నీటిచుక్క).
  4. ఓం రుద్రాయ నమః.
  5. ఓం గంగాధరాయనమః – స్నానం సమర్పయామి (నీరు విడవాలి, లేదా మంత్రముతో అభిషేకించవచ్చును: ఆపోహిష్ఠామయోభువః తాన ఊర్జేదథాతన | మహేరణాయచక్షసే | యోవశ్శితమోరసః తస్యభాజయతే హనః | ఉశతీరవమాతరః | తస్మాదరంగమామవో – యస్యక్షయాయ జిన్వధ | అపోజనయథాచనః).
  6. ఓం ఆశాంబరాయ నమః – వస్త్రం సమర్పయామి (వస్త్రయుగ్మం).
  7. ఓం జగన్నాధాయ నమః – ఉపవీతం సమర్పయామి (ఉపవీతం).
  8. ఓం కపాలధారిణే నమః నమః – గంధం సమర్పయామి (కుడిచేతి అనామికతో గంధం చిలకరించాలి).
  9. ఓం ఈశ్వరాయ నమః – అక్షతాన్ సమర్పయామి (అక్షతలు).
  10. ఓం పూర్ణ గుణాత్మనే నమః – పుష్పం సమర్పయామి (పువ్వులు).
  11. ఓం ధూమ్రాక్షాయ నమః – ధూపమాఘ్రాపయామి (అగరు లేదా సాంబ్రాణి ధూపమీయవలెను.).
  12. ఓం తేజో రూపాయ నమః – దీపం సమర్పయామి (ఒక వత్తితో ఆవునేతి దీపమును వెలిగించి చూపవలెను.).
  13. ఓం లోకరక్షాయ నమః – నైవేద్యం సమర్పయామి (నివేదన ఇవ్వవలెను. ఓం భూర్భువస్సువః తత్ సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి – ధియోయోనః ప్రచోదయాత్ అనుకుంటూ ఒక పువ్వుతో – నివేదించు పదార్థముల చుట్టూ నీటిని ప్రోక్షించి 1.ఓం ప్రాణాయస్వాహా, 2. ఓం అపానాయస్వాహా, 3. ఓం వ్యానాయస్వాహా 4. ఓం ఉదానాయస్వాహా 5. ఓం సమానాయస్వాహా, 6. ఓం శ్రీ మహాదేవాయ శివ శివ శివ శంభవే స్వాహా – అంటూ స్వాహా అనినప్పుడల్లా ప్రభువునకు నివేదనము చూపి, ‘అమృతమస్తు, అమృతోపస్తరణమసి – ఋతం నత్యేన పరిషించామి ఉత్తరాపోసనం సమర్పయామి ‘ అనుకుని పదార్ధాల కుడిప్రక్కన ఒక చుక్క నీరును వదలవలెను).
  14. ఓం లోకసాక్షిణే నమః – తాంబూలాదికం సమర్పయామి (5 తమలపాకులు, 2 పోకచెక్కలు సమర్పించాలి).
  15. ఓం భవాయ నమః – ప్రదక్షిణం సమర్పయామి (ప్రదక్షిణం).
  16. ఓం కపాలినే నమః – నమస్కారం సమర్పయామి (సాష్టాంగ నమస్కారం చేయాలి.).

జనక మహారాజా! పైన చెప్పిన విధముగా షోడశ (16) ఉపచారాలతోనూ గాని, లేదా నెల పొడుగునా ప్రతి రోజూ సహస్ర నామయుతంగా గాని శివపూజ చేసి, పూజ యొక్క చివరలో – ఈ మంత్రంతో అర్ధ్యమును ఇవ్వాలి:

పార్వతీకాంత దేవేశ పద్మజార్చ్యాంఘి పంకజ
ఆర్ఘ్యం గృహాణ దైత్యారే దత్తంచేద ముమాపతే ||

అనంతరము యధాశక్తి దీపములను సమర్పించి, శక్తివంచన లేకుండా బ్రాహ్మణులకు దానమును ఇవ్వాలి. ఈ ప్రకారంగా కార్తీకము నెల్లాళ్లూ కూడా బ్రాహ్మణ సమేతంగా నక్తవ్రతాన్ని ఆచరించేవాడు- వంద వాజపేయాలు, వెయ్యేసి సోమాశ్వమేధాలూ చేసిన ఫలాన్ని పొందుతాడు. కార్తీకమంతా ఈ మాసనక్త వ్రతాచరణ వలన పుణ్యాధిక్యత – పాపనాశనం అవలీలగా ఏర్పడతాయి అనడములో ఎటువంటి సంకోచమూ లేదు.

కార్తీక చతుర్దశినాడు పితృప్రీతిగా బ్రాహ్మణులకు భోజనము పెట్టడం వలన వాళ్లయొక్క పితాళ్లందరూ కూడా సంతృప్తులు అవుతారు. కార్తీక శుద్ధ చతుర్దశినాడు ఔరసపుత్రుడు చేసే తిలతర్పణము వలన పితృలోకము సర్వము తృప్తి చెందుతుంది. ఈ చతుర్దశినాడు ఉపవాసము వుండి, శివారాధన చేసి, తిలలను దానము చేసినవాడు కైలాసానికి క్షేత్రాధిపతి అవుతాడు.

ఈ కార్తీక వ్రతాన్ని ఆచరించిన వాళ్లు తప్పకుండా తమ పాపాలను పోగొట్టుకున్న వాళ్లయి మోక్షగాములౌతారు.

జనక మహారాజా! కార్తీక పురాణములో ముఖ్యంగా ఈ 14 అధ్యాయాన్ని శ్రద్ధాభక్తులతో చదివినా, వినినా కూడా వాళ్లు సమస్త పాపాలకు ప్రాయశ్చిత్తము చేసుకోవడం ద్వారా కలిగే ఫలితాన్ని పొందుతారు.

ఏవం శ్రీస్కాంద పురాణాంతర్గత కార్తీక మహాత్మ్యే – త్రయోదశ, చతుర్దశాధ్యాయౌ (పదమూడు-పదునాలుగు అధ్యాయములు).

సప్తమ దినము (సప్తమీ) పారాయణము సమాప్తము.

bakthivahini

Recent Posts

Bhagavad Gita 700 Slokas in Telugu – Discover the Wisdom of అధ్యాయం 7: జ్ఞాన విజ్ఞాన యోగం, శ్లోకం 13

Bhagavad Gita 700 Slokas in Telugu మనిషి జీవితం ఒక ప్రయాణం. ఈ ప్రయాణంలో మనం తీసుకునే ప్రతి…

6 hours ago

Karthika Puranam Telugu – కార్తీక పురాణం | 22వ రోజు పారాయణ

Karthika Puranam Telugu జలంధరుని యుద్ధ సన్నాహాలు ఓ పృథురాజా! రాహువు చెప్పిన విషయాలన్నీ వినగానే, క్రోధోద్రిక్తుడైన జలంధరుడు శివుని…

1 day ago

Karthika Puranam Telugu – కార్తీక పురాణం | 21వ రోజు పారాయణ

Karthika Puranam Telugu మారుమూలల్లో తలలు దాచుకున్నా కూడా వదలకుండా ముట్టడింప వస్తూన్న జలంధరునికి భయపడినవారై దేవతలంతా విష్ణు స్తోత్రం…

1 day ago

Karthika Puranam Telugu – కార్తీక పురాణం | 20వ రోజు పారాయణ

Karthika Puranam Telugu తులసి మహాత్మ్యంపై పృధు చక్రవర్తి ప్రశ్న పృధు చక్రవర్తి నారదుడిని అడుగుతున్నాడు: 'దేవర్షీ! తులసిని స్థాపించి,…

1 day ago

Karthika Puranam Telugu – కార్తీక పురాణం | 19వ రోజు పారాయణ

Karthika Puranam Telugu నారదుడు చెబుతున్నాడు: ఓ పృథు భూపాలా! కార్తీక వ్రతం పాటించే పురుషుడు తప్పకుండా ఆచరించవలసిన నియమాలను…

1 day ago

Karthika Puranam Telugu – కార్తీక పురాణం | 18వ రోజు పారాయణ

Karthika Puranam Telugu నారదుడు చెప్పినదంతా విన్న పృథువు 'ఓ దేవర్షీ! కార్తీక మాసపు గొప్పదనమును వివరించి, నన్ను ధన్యుని…

1 day ago