Karthika Puranam
యమదూతల ప్రశ్నలకు చిరునగవుమోము కలవారైన విష్ణుదూతలు ఇలా భాషించసాగారు: “ఓ యమదూతలారా! మేము విష్ణుదూతలము. మీ ప్రభువు మీకు విధించిన ధర్మాలేమిటి? పాపాత్ములెవరు? పుణ్యాత్ములెవరు? యమదండనకు అర్హులైన వారెవరు? అవన్నీ విపులీకరించి చెప్పండి?”
విష్ణుదూతల ప్రశ్నలకు యమదూతలు ఇలా సమాధానమీయసాగారు: “సూర్య, చంద్రాగ్ని, వాయురాకాశ, గోసంధ్యలూ, దశదిశా కాలాలూ, వీనిని మానవుల యొక్క పాప పుణ్యాలకు సాక్ష్యాలుగా విచారించి వారిని మేము శిక్షిస్తాము.
ఓ విష్ణుదేవతలారా! శ్రద్ధగా వినండి –
ఇక ఈ అజామిళుడంటారా? వీడు చేయని పాపమంటూ లేదు. బ్రాహ్మణ జన్మమెత్తి, దాసీ సంగమ లోలుడై చేయరాని పాపాలు చేసిన వీడు మీ విష్ణులోకానికెలా అర్హుడు!”
యమదూతల సమాధానాన్ని విని- విష్ణుపార్షదులు ఇలా చెప్పసాగారు: “ఓ యమదూతలారా! ఉత్తమ లోకార్హతకు కావలసిన పుణ్యాల గురించి మేము చెప్పేది కూడా వినండి.
తెలిసిగాని – తెలియకగాని హరినామ సంకీర్తనమును చేసే వాళ్లు – పాపవిముక్తులవుతారు. ఓ యమదూతలారా! ఇన్ని మాటలెందుకు? ఎవడైతే అవసాన కాలంలో ఒక్కసారైనా హరినామస్మరణ చేస్తున్నాడో వాడు విష్ణులోకానికే వస్తాడు.”
ఈ విధముగా సాగుతున్న యమ, విష్ణుదూతల సంవాదాన్నంతటినీ వినిన అజామిళుడిలోని జీవుడు – తన శారీరక కృతదాసీ సాంగత్యాది పాపాలను తలంచుకుని దుఃఖిస్తూన్న జీవుడు – స్పృహామయుడై అచ్చెరువందాడు.
అతడు, “ఇదేమి ఆశ్చర్యం? ఆ నల్లని కత్తులను ధరించిన యమదూతలు ఏమై పోయారు? నేనీ వైకుంఠములో ఎలా ఉండగలిగాను? పూర్వజన్మ పుణ్యము కాకపోతే నా జిహ్వపై హరినామమెలా వచ్చింది? నాకీ వైకుంఠము ఎలా ప్రాప్తించింది?” అని తనలో తనే అనుకుంటూ హరిస్మరణమును చేయసాగాడు.
వశిష్ఠుడు చెప్పసాగాడు: “కాబట్టి రాజా! కేవల హరినామస్మరణమే అంతటి ముక్తిప్రదమైనది. కాగా, హరి ప్రియంకరమైన కార్తీక వ్రతమును ఆచరిస్తే ఎంత పుణ్యం కలుగుతుందో ఊహించు” అంటూ ఆపాడు.
జనక ఉవాచ: “వశిష్ఠా! ఈ అజామిళుడు పూర్వజన్మలో ఎవరు? ఏ పాపం వలన ఇలా పుట్టాడు? విష్ణుదూతల మాటలకు యమదూతలు ఎందుకు ఊరుకున్నారు? వాళ్లు యమునికి ఏమని విన్నవించారు? అన్నీ సవిస్తరంగా చెప్పు.”
వశిష్ట ఉవాచ: “నీవడిగిన ప్రశ్నలన్నింటికీ ఒక క్రమములో సమాధానాలు చెబుతాను విను. విష్ణుపారిషదుల చేత తిరస్కృతులైన యమదూతలు తమ ప్రభువైన యముని చేరి ఇలా చెప్పసాగారు.
యమదూతల ఆరోపణము – యముని ఉపదేశము
యమదూతలు: “అయ్యా పాపాత్ముడునూ, దురాచారుడునూ, నిందిత కర్మాచరణపరుడూ అయిన అజామిళుని యందలి జీవుని తెచ్చే సమయంలో – విష్ణుదూతలు మమ్మల్ని అడ్డగించి, అతనిని మా నుంచి విడిపించి, తమతో వైకుంఠానికి తీసికొని వెళ్లారు. వాళ్లను ఎదిరించ లేక మేమిలా రిక్తహస్తులమై వచ్చాము” అని కింకరులు చెప్పినది విని, రవంత క్రోధోద్రిక్తుడైన సమవర్తి (యముడు) జ్ఞానదృష్టితో సమస్తాన్నీ అవలోకించినవాడై –
యముడు కింకరులతో: “కించిదపి పుణ్యవిహీనోపి – ఆ ఆజామిళుడనే పాపి, అంత్యకాలాన హరి నామస్మరణమును చేయడము వలన సమస్త పాపాలనూ నశింప జేసుకుని విష్ణుప్రియుడై, విష్ణుదూతల చేత తీసుకొని పోబడ్డాడు. తెలిసి తాకినా – తెలియక తాకినా దహించవలెనను కోరిక లేకపోయినప్పటికీ సమస్త జాతులనూ అగ్ని దహించునో అదే విధముగా – దుష్టాత్ములై, మహిమను తెలుసుకోలేక పోయినా ఆ శ్రీహరి యొక్క నామస్మరణమును చేసినంత మాత్రము చేతనే వారి సమస్త పాపాలు దహించబడి పోతాయి. ఇక, భక్తి భావముతో స్మరించిన వారు కేవలము కైవల్య పథగాములే అవుతారు” అంటూ సేవకులను ఎంతవరకూ చెప్పాలో అంతవరకూ మాత్రమే చెప్పి – యముడు మరింత పూర్వాలోచనా పరుడయ్యాడు.
అజామిళుని పూర్వజన్మ
అజామిళుడు అతని పూర్వజన్మలో సౌరాష్ట్రదేశములో శివార్చకుడుగా వుండేవాడు. ఆ జన్మలో కూడా:
ఆ కాలానికి అదే గ్రామంలో ఒక దరిద్ర బ్రాహ్మణుడుండేవాడు. అతడు దరిద్ర పీడితుడై, అన్నము కొరకై పట్టణములు, పల్లెలు తిరుగుతూ – యాయవార వృత్తిని అవలంబించి వున్నాడు.
ఒకానొకసారి అతగాడు తనకు లభించిన యాయవార వస్తుజాలన్నంతటినీ మోసుకుని వచ్చి భార్యను పిలిచి – “చాలా ఆకలిగా వుంది. సత్వరమే వంట చేయి. ముందు కాసిని మంచినీళ్లియ్యి. అవి త్రాగి రవంత ఉపశాంతిని పొందుతాను” అన్నాడు. కాని, యౌవనమదాశ్రితయై వున్న ఆ ఇల్లాలు భర్త ఎన్నిసార్లు పిలిచినా పట్టించుకోకుండా తన జారుని గురించే తలపోస్తూ వుండిపోయింది.
అందుకు కోపించిన భర్త, చేతికందిన కర్రతో ఆమెను కొట్టాడు. తన కామపుటాలోచనలకు అంతరాయమును కలిగించాడనే కోపంతో ఆమె కూడా తన ముష్టితో ఘాతించింది. అడలీ-బడలీ వున్న ఆ బాపడు అందుకై పశ్చాత్తాపంతో ఆమెనూ, గృహాన్నీ వదిలిపెట్టి గ్రామాంతరము వెళ్లి, భిక్షాటనతో బతకసాగాడు.
మగడు ఇల్లు వదలి వెళ్లిపోవడంతో మరింత తెగించిన ఆ జారిణి – మగడు తెచ్చినవన్నీ సుష్ఠుగా మేసి, మగడిచ్చినవన్నీ అలంకరించుకుని, మగడు తెచ్చిన మంచి చీరను కట్టుకుని, తాంబూల చర్వణము చేస్తూ – ఒకానొక రజకుని ఇంటికి వెళ్లి – ఆ రాత్రి తనతో సంభోగించవలసిందిగా కోరినది. కాని, నీతిమంతుడైన ఆ రజకుడు, ఆమె కోరిన తప్పుడు పనికి అంగీకరించకపోవడంతో – వారిద్దరికి వాగ్వివాదం జరిగింది. అంతటితో వాంచితార్థం నెరవేరని ఆ బ్రాహ్మణ జారిణి వీధినపడి రసికులను వెతుక్కుంటూ పోతూ ఇతః పూర్వం చెప్పబడిన ఈశ్వరాలయార్చకుని (అజామిళుని పూర్వజన్మ) చూసి – సురత క్రీడలకు ఆహ్వానించింది. బ్రాహ్మణుడైన వీడు – ఆమె పర స్త్రీ అని కూడా ఆలోచించకుండా – అంగీకరించి ఆ రాత్రంతా ఆమెతో సుఖించాడు.
అయినప్పటికీ ఆ జారిణి సద్వంశ సంజాత అయిన కారణంగా కామము చల్లారగానే తన దోషాన్ని తెలుసుకున్నదై, భర్తను వెతుక్కుంటూ వెళ్లి బ్రతిమాలి తెచ్చుకుని అది మొదలుగా అతని మాటలకు తుచ తప్పకుండా బ్రతుకసాగింది.
ఇటువంటి పాపాలవలన మరణానంతరం ఆ శివార్చకుడు రౌరవాది మహానరకాలు అనుభవించి, అనుభవించి – సత్యనిష్ఠుడి కొడుకైన అజామిళుడుగా జన్మించి – కార్తీక పౌర్ణమినాటి శివసందర్శనం – అంత్యకాల హరిస్మరణల పుణ్యం వలన మోక్షాన్ని పొందాడు.
ఆనాటి శివార్చకుని జన్మలో – ఇతనితో జారత్వం నెరపిన బ్రాహ్మణ జారిణి కూడా కొంతకాలానికి మరణించింది. నరకానుభవమును పొంది – కన్యాకుబ్జములోని ఛండాల గృహములో బాలికగా జన్మించింది. కాని ఆ – పిల్ల – తండ్రి గండాన పుట్టడం వలన వాళ్లా పిల్లను అడవిలో వదలివేశారు. ఆ వనాంతర్గామియైన ఒక బ్రాహ్మణుడు బాలిక అరణ్యరోదన విని, జాలిపడి తనతో తీసికొని వెళ్లి, తన ఇంటి దాసీకి పెంపకానికి ఇచ్చాడు. ఆ దాసీదాని దగ్గర పెరిగిన ఈ పిల్లనే అనంతర కాలంలో అజామిళుడు దగ్గరకు తీసుకున్నాడు. మహారాజా! నువ్వడిగిన అజామిళుడి పూర్వగాథ ఇది.
“సమస్తమైన పాపములకూ హరినామ స్మరణ కన్నా మించిన ప్రాయశ్చిత్తము మరొకటి లేదు. అది సాధ్యము కానప్పుడే ఇతరేతర ధర్మశాస్త్రాది ప్రోక్త ప్రాయశ్చిత్త కర్మలను ఆచరించాల్సి వుంటుంది.
జనక నరపాలా!
మోక్షాసక్తులను మురహరి స్మరణ ఏ విధంగా సూక్ష్మమార్గమో – అదే విధముగా కార్తీక ధర్మాచరణమనే సూక్ష్మమార్గము కూడా మహోత్కృష్ట పుణ్యప్రదాయినియై పాతకాలను పారదోలుతుంది. పాపాలను నశింపచేసే శక్తి ఈ కార్తీక వ్రతాచరణకకు మాత్రమే వుండడము వలన, ఎవరైతే ఈ దివ్యవ్రతాన్ని ఆచరించరో, వాళ్లు నరక ప్రాప్తులవుతారని తెలుసుకో.”
పాపనాశనియైన ఈ కార్తీక మహాత్మ్యాన్ని శ్రద్ధాభక్తులతో వినినప్పటికీ కూడా – వారు మోక్షార్హుహే అవుతున్నారు. ఆసక్తులైన వారికి -పావన హృదయంతో ఈ మహాత్మ్యాన్ని వినిపించేవాడు వైకుంఠగతుడై విష్ణువుతో కలిసి సుఖించుతాడు.
ఏవం శ్రీస్కాంద పురాణాంతర్గత కార్తీక మహాత్మ్యే నవమ, దశమ అధ్యాయౌ సమాప్తా (తొమ్మిది, పది అధ్యాయములు)
ఐదవరోజు పారాయణము సమాప్తము
Bhagavad Gita 700 Slokas in Telugu మనిషి జీవితం ఒక ప్రయాణం. ఈ ప్రయాణంలో మనం తీసుకునే ప్రతి…
Karthika Puranam Telugu జలంధరుని యుద్ధ సన్నాహాలు ఓ పృథురాజా! రాహువు చెప్పిన విషయాలన్నీ వినగానే, క్రోధోద్రిక్తుడైన జలంధరుడు శివుని…
Karthika Puranam Telugu మారుమూలల్లో తలలు దాచుకున్నా కూడా వదలకుండా ముట్టడింప వస్తూన్న జలంధరునికి భయపడినవారై దేవతలంతా విష్ణు స్తోత్రం…
Karthika Puranam Telugu తులసి మహాత్మ్యంపై పృధు చక్రవర్తి ప్రశ్న పృధు చక్రవర్తి నారదుడిని అడుగుతున్నాడు: 'దేవర్షీ! తులసిని స్థాపించి,…
Karthika Puranam Telugu నారదుడు చెబుతున్నాడు: ఓ పృథు భూపాలా! కార్తీక వ్రతం పాటించే పురుషుడు తప్పకుండా ఆచరించవలసిన నియమాలను…
Karthika Puranam Telugu నారదుడు చెప్పినదంతా విన్న పృథువు 'ఓ దేవర్షీ! కార్తీక మాసపు గొప్పదనమును వివరించి, నన్ను ధన్యుని…