Karthika Puranam
ఓ శివధనుస్సంపన్నా! జనకరాజా! శ్రద్ధగా విను. మనం చేసిన పాపాలన్నింటినీ నశింపచేయగల శక్తి ఒక్క కార్తీక మాస వ్రతానికి మాత్రమే ఉంది.
కార్తీకమాసంలో విష్ణుసన్నిధిని ఎవరైతే భగవద్గీతా పారాయణమును చేస్తారో – వారి పాపాలన్నీ కూడా పాము కుబుసములాగా తొలగిపోతాయి. అందునే పదీ-పదకొండు అధ్యాయాలను పారాయణ చేసేవారు – వైకుంఠానికి క్షేత్రపాలకులవుతారు.
ఎవరైతే కార్తీకమాసంలో తులసీదళాలతోగాని, తెలుపు లేదా నలుపు గన్నేరు పూలతో గాని విష్ణుపూజను చేస్తారో – వాళ్లు వైకుంఠానికి చేరి, విష్ణు సమభోగాలననుభవిస్తారు. ఈ కార్తీకమాసంలో హరిహరులెవరి సన్నిధినైనా సరే – ఏ పురాణాన్నయినా సరే ప్రవచించేవారు సర్వ కర్మబంధ విముక్తులవుతారు.
యః కార్తీకే సితే వనభోజన మాచరేత్
సయాతి వైష్ణవం ధామ సర్వపాపైః ప్రముచ్యతే ||
కార్తీక మాస శుక్లపక్షంలో వనభోజనము చేసిన వారు – పాపవిముక్తులై విష్ణుధామాన్ని పొందుతారు. జప, హోమ, పూజా, భోజన, తర్పణ ఫలాలతో – పాపీ క్షుద్ర ఛండాలాది అశౌచవంతుల యొక్క సంభాషణలను వినిన పాపం తుడిచి పెట్టుకు పోతుంది.
కాబట్టి మహారాజా! కార్తీకమాస శుక్లపక్షంలో అన్నిరకాల వృక్షాలతో బాటుగా ఉసిరిచెట్టు కూడా వున్న తోటలోనే వనభోజనమును ఏర్పాటు చేసుకోవాలి. ఉసిరి చెట్టు క్రింద సాలగ్రామము నుంచి, గంధ పుష్పాక్షతాదులతో పూజించి, యధాశక్తి బ్రాహ్మణులను ఆహ్వానించి గౌరవించి, వారితో కలసి భోజనము చేయాలి.
ఇలా – కార్తీక మాసములో వనభోజనాన్ని ఎవరైతే నిర్వహిస్తారో, వాళ్లు ఆయా కాలాలలో చేసిన సర్వపాపాల నుంచీ తెములుకుని, విష్ణులోకాన్ని పొందుతారు.
జనకజనపతీ! ఈ కార్తీక మహాత్మ్యాన్ని భక్తిశ్రద్ధలతో విన్న బ్రాహ్మణుడొకడు దుర్యోనీ సంకటము నుంచీ రక్షింపబడ్డాడు. కథ చెబుతాను విను.
పూర్వం కావేరీ తీరములో దేవశర్మ అనే సగ్భ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికొక పరమ దుర్మార్గుడయిన కుమారుడు కలిగాడు. అతని పేరు దేవదత్తుడు.
అతగాడి దుష్ట ప్రవర్తనలను గుర్తించిన తండ్రి, అతగాడిని పాపవిముక్తుని చేయాలని సంకల్పించి ‘నాయనా! రోజూ కార్తీక ప్రాతః స్నానాన్ని ఆచరించు. సాయంకాలమున హరి సన్నిధిలో దీపారాధనమును చేస్తూ వుండు. ఈ విధంగా కార్తీక వ్రతాన్ని ఆచరించి ధన్యుడివికా’ అని చెప్పాడు. కాని దుర్వర్తనుడయిన ఆ బ్రాహ్మణ పుత్రుడు, కుడువనటువంటి కట్టుకథలను నమ్మననీ, కార్తీక వ్రతాన్ని ఆచరించననీ – తండ్రికి ఎదురు తిరిగాడు.
అందుకు కినిసిన దేవశర్మ తన కుమారుడిని ‘అడవిలోన చెట్టు తొర్రలో ఎలుకవై పడి వుండు’ అని శపించాడు. శాపానికి భయపడిన ఆ విప్ర కుమారుడు తండ్రి పాదాలబడి, తనకు తరణోపాయం చెప్పమని కోరగా – ఆ తండ్రి ‘నాయనా! నీవు ఎప్పుడైతే కార్తీక మహాత్మ్యాన్ని సంపూర్ణముగా వింటావో అప్పుడే నీ ఎలుక రూపము పోతుంది’ అని – శాపవిముక్తి అనుగ్రహించాడు.
పితృశాప కారణంగా అప్పటికప్పుడే మూషికరూపాన్ని ధరించిన బ్రాహ్మణ యువకుడు గజారణ్యములో ఫలవంతమైనదే – అనేక జంతువులకు ఆధారభూతమైనదీ అయిన ఒకానొక మహావృక్ష కోటరములో మనిసాడు.
ఇలా కొంతకాలము గడిచాక, ఒకానొకప్పుడు మహర్షియైన విశ్వామిత్రుడు శిష్య సమేతంగా కార్తీక స్నానమాచరించి వచ్చి, ఆ ఎలుక వున్న చెట్టు మొదలునందు విష్టుడై తన పరివారానికి పరమపావనమైన కార్తీక మహాత్మ్యాన్ని వినిపించసాగాడు.
ఆ సమయంలో దయాహీనుడూ, పాపాలపుట్టా, అడవి జీవాలను హింసించి పొట్టపోసుకునేవాడూ అయిన ఒక కిరాతకుడు ఆ ప్రాంతాలకు వచ్చాడు. పుణ్యపురుషుల దర్శనము వల్ల ఉపకారమేగాని, అపకారము ఏనాడూ జరుగదు. అదే విధముగా, విశ్వామిత్రాది తపోబృంద దర్శనమాత్రం చేత – రవంత పశ్చాత్తాప్తుడూ – జ్ఞానీ అయిన ఆ కిరాతకుడు వారిని సమీపించి ‘అయ్యా! మీరు చెప్పుకుంటున్న కథలేమిటి? అని వింటూంటే – నాకీ కిరాతక జీవితం పట్ల చిరాకు పుడుతోంది. దయ చేసి ఈ రహస్యమేమిటో చెప్పండి’ అనగానే, అతనిలో వివేకం విచ్చుకుంటున్న వైనమును గమనించిన విశ్వామిత్రుడు – ‘నాయనా! మేము కార్తీక వ్రతాన్ని ఆచరిస్తున్నాము. ఈ కార్తీక మాసములో ఎవరయినా సరే తెలిసిగాని, తెలియకగాని స్నాన దాన జప తపః పురాణ శ్రవణాదును చేసినట్లయితే వారు వారి సర్వ పాపాల నుంచీ విముక్తులవుతారు. ఈ వ్రతాన్ని భక్తితో ఆచరించే వాళ్లు జీవన్ముక్తులవుతారు’ అని తెలియజేశాడు.
ఈ విధముగా కిరాతకునికి చెబుతూన్న కార్తీక మహాత్మ్యాన్ని వినడమే తడవుగా తొర్రలో వున్న ఎలుక తన శాపగ్రస్తరూపాన్ని వదలివేసి, పూర్వ యువ బ్రాహ్మణ రూపాన్ని పొంది – విశ్వామిత్రాదులకు ప్రణమిల్లి తన పూర్వపుగాధను వినిపించి, ఆ ఋషుల నుండి సెలవు తీసుకొని తన ఆశ్రమానికి తరలిపోయాడు.
అనంతరము ఆ కిరాతకుడు కూడా విశ్వామిత్రాదుల వలన కార్తీక మహాత్మ్యాన్ని కడ కంటా తెలుసుకొనడం వలన ఆ జన్మకి కిరాతకుడయ్యీ కూడా – దేహాంతరాన ఉత్తమగతులను పొందాడు.
కాబట్టి ఓ జనకుడా! ఉత్తమ గతులను కోరే వారు ప్రయత్నపూర్వకముగా నయినాసరే కార్తీక వ్రతమాచరించాలి. లేదా, కనీసము కార్తీక మహాత్మ్యాన్నయినా భక్తి శ్రద్ధలతో వినాలి.
శ్రీ వశిష్ఠుడు చెబుతున్నాడు రాజర్షీ, జనకా!
ఈ కార్తీక మాసము ముప్పయి రోజులు కూడా – ఎవరైతే శ్రీమహావిష్ణువును కస్తూరీ, గంధాదులతోనూ, పంచామృతములతోనూ అభిషేకిస్తారో వారికి పదివేల అశ్వమేధాలు చేసిన ఫలితము లభిస్తుంది.
కార్తీక మాసములో సంధ్యావేళ విష్ణుసన్నిధిలో దీపారాధనమును చేసినా, దీపదానము చేసినా వారు విష్ణులోకాన్ని పొందుతారు.
ప్రత్తిని శుభ్రపరచి దానితో వత్తిని చేసి, బియ్యప్పిండి లేదా గోధుమపిండితో ప్రమిదను చేసి ఆవునేతిని పోసి, ఆ ప్రతివత్తిని తడిపి వెలిగించి ఒకానొక సద్రాహ్మణుని ఆహ్వానించి, చివరి రోజున వెండి ప్రమిదను, భమిడి వత్తినీ చేయించి, వాటిని బియ్యపు పిండి మధ్యన వుంచి, పూజా నివేదనాదులను పూర్తి చేసి బ్రాహ్మణులకు భోజనము పెట్టి అనంతరము – తాము స్వయంగా – ఈ దీపదాన మంత్రము చదవాలి:
దీపదానమంత్రము :
సర్వజ్ఞాన ప్రదం దీపం సర్వసంప చ్ఛుభావహం
దీపదానం ప్రదాస్యామి కశాంతిరస్తు సదా మమ
దీని అర్థం: ‘జ్ఞానమునూ, సంపదలనూ, శుభములనూ కలిగించే దైవ, దీపదానాన్ని చేస్తున్నాను. దీని వలన నాకు నిరంతరము శాంతి, సుఖములు ఏర్పడుగాక’ అని చెప్పుకుంటూ, పిండితో సహా ఆ దీపాన్ని బ్రాహ్మణునికి దానం చేయాలి.
అలా చేసిన వారు అక్షయమైన పుణ్యాన్ని పొందుతారు. ఈ దీపదానము వలన విద్య, జ్ఞాన, ఆయుర్వృద్ధి, అనంతరము స్వర్గభోగాలూ కలుగుతాయి. మనోవాక్కాయ కృత పాపాలన్నీ సమసిపోతాయి.
నిదర్శనార్థమై ఒక కథను వినిపిస్తాను విను.
పూర్వం ద్రావిడ దేశములో ఒక అనాథ వితంతువు ఉండేది. ఆమె రోజూ భిక్షాటనమును చేసి, వచ్చిన దానిలో – మంచి అన్నమునూ, కూరలని విక్రయించి తాను దూషితాన్నముతో తృప్తిపడుతూ డబ్బును వెనకేయసాగింది. ఇతరుల ఇండ్లలో వంట పనులు, కుట్టుపనులు మొదలైనవి చేస్తూ ప్రతిఫలముగా వారి వద్ద కొంత ద్రవ్యాన్ని తీసుకుంటూ ఉండేది. అదిగాక ద్రవ్యభిక్షాటన కూడా చేసేది.
ఇలా నిత్య ధనార్జనాలగ్నమానసయైన ఆ వితంతువు డబ్బు సంపాదించడమే తప్ప ఏనాడూ హరినామస్మరణ చేయడం గాని, హరికథనో, పురాణాన్నో వినడంగాని, పుణ్యతీర్థ సేవనమునుగాని, ‘ఏకాదశీ ఉపవాసమును గాని చేసి ఎరుగదు.
ఇటువంటి లుబ్ధరాలింటికి దైవవశాన – శ్రీరంగ యాత్రీకుడైన ఒక బ్రాహ్మణుడు వచ్చి ఆమె స్థితిని చూసి – ఆమెకు నరకము తప్పదని గుర్తించి, జాలిపడి – ఆమెను మంచి దారిలో పెట్టదలచి ‘ఓ అమాయకురాలా! నేను చెప్పేది శ్రద్ధగా విని ఆలోచించుకో.
నా మాట విని, ఇక నుంచయినా కార్తీకమాసములో ప్రాతఃస్నానాన్ని ఆచరించు. విష్ణుప్రీతికై భగవదర్పణంగా దీపదానము చెయ్యి.
తద్వారా అనేక పాపాల నుంచి రక్షించబడతావు’ అని హితవు చెప్పి, తన దారిన తాను వెళ్లిపోయాడు.
అతగాడి వచోమహిమ వలన ఆమెకు జ్ఞానోదయమైంది. తను చేసిన పాపాలకై చింతించినది. తాను కూడా కార్తీక వ్రతాన్ని చేయాలని సంకల్పించినది.
అందుచేత ఆ సంవత్సరములో వచ్చిన కార్తీకమాసాననే వ్రతాచరణమును ప్రారంభించినది. సూర్యోదయ వేళకల్లా చన్నీళ్ల స్నానమును, హరిపూజ, దీపదానము, పిదప పురాణ శ్రవణము – ఈ విధముగా కార్తీక మాసము నెల రోజులూ ఆచరించి చివరి రోజున చక్కగా బ్రాహ్మణసమారాధన కూడా చేసినది.
తక్షణమే ఆమె బంధాలు నశించిపోయినదై. విగతాసువై విమానారూఢురాలై, శాశ్వత స్వర్గభోగ సౌఖ్యాలను పొందినది.
కాబట్టి ‘రాజా! కార్తీకమాసములో అన్నిటికంటే ప్రధానమైనది దీపదానము. తెలిసిగాని, తెలియకగాని ఎవరైతే దీపదానము చేస్తున్నారో వారు తమ పాపాలను నశింప చేసుకొన్న వారే అవుతున్నారు. దీనిని వినినా, చదివినా జన్మ సంసార బంధ విముక్తులై విష్ణుభక్తి పరాయణులవుతారు.
ఏవం శ్రీస్కాంద పురాణాంతర్గత కార్తీక మహాత్మ్యే షష్ఠాధ్యాయ స్సమాప్తః
మూడవ రోజు పారాయణము సమాప్తము
Bhagavath Geetha Telugu ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక దశలో సందేహాలు, భయాలు, ఊహించని సమస్యలు ఎదురుకావడం చాలా…
Bhagavath Geetha Telugu ఈ ఉరుకుల పరుగుల జీవితంలో మీరెప్పుడైనా ఏమీ తోచని గందరగోళాన్ని అనుభవించారా? ఈ కాలంలో చాలామంది…
Bhagavath Geetha Telugu మనిషి సాధారణంగా ఈ ప్రపంచాన్ని తన పరిమితమైన కళ్లతో చూస్తాడు. అందుకే ఒక చిన్న కష్టం…
Bhagavath Geetha Telugu మనం రోజూ ఉదయం లేవగానే ఏదో తెలియని ఒక గందరగోళం. "నా కెరీర్ ఏమవుతుంది? నా…
Bhagavath Geetha Telugu మనం సాధారణంగా మన కళ్ళతో చూసేదే నిజం అని నమ్ముతాం. ఒక వ్యక్తి కోపంగా మాట్లాడితే…
Bhagavath Geetha Telugu మన జీవితంలో చాలాసార్లు మనం చిన్న చిన్న సమస్యలకే కొండంత ఆందోళన పడతాం. రేపు ఏమవుతుందో,…