Karthika Puranam Telugu – కార్తీక పురాణం | 11వ రోజు పారాయణ

Karthika Puranam

ఏకవింశాధ్యాయము

అత్రి ఉవాచ: అగస్త్యా – సాధారణమైన దొమ్మిగా కొట్లాటగా ప్రారంభమై, మారి, ఆ సమరమొక మహా యుద్దముగా పరిణమించినది. అస్త్రశస్త్రాలతో, పదునైన బాణాలతో, వాడి వాడి గుదియలతో ఇనుపకట్ల తాడికర్రలతో, ఖడ్గ, పట్టిన, ముసల, శూల, భల్లాతక, తోమర, కుంభ, కుఠారాద్యాయుధాలతో ఘోరముగా యుద్ధము చేశారు.

కాంభోజుని దాడి ఆ సంకుల సమరములో కాంభోజరాజు మూడు వందల బాణాలను ప్రయోగించి, పురంజయుని గొడుగునూ, జెండానూ, రథాన్నీ కూలగొట్టాడు. అనంతరం ఇంకొక అయిదు బాణాలతో గుర్రాలను కూల్చివేశాడు. మరి కొన్ని బాణాలతో పురంజయుని గాయపరిచాడు.

పురంజయుని ప్రతిదాడి అందుకు కోపించిన పురంజయుడు – బ్రహ్మాస్త్ర మంత్రముతో అభిమంత్రించిన పదునైన పది బాణాలను, కాంభోజ రాజుపై వేశాడు. ఆ బాణాలు కాంభోజుని కవచాన్ని చీల్చి, గుండెలో దిగబడ్డాయి. రక్తం ధారాపాతంగా కారుతుండగా తన వక్షంలో గ్రుచ్చుకొన్న బాణాలను పెరికి తీసి ఆ కాంభోజ మహారాజు – ‘ఓ పురంజయా! నేను పరుల సొమ్ముకు ఆశపడే వాడిని కాను. నీవు పంపిన బాణాల్ని నీకు త్రిప్పి పంపుతున్నాను తీసుకో’ అంటూ వానినే తన వింట సంధించి, పురంజయుని మీదకు ప్రయోగించాడు. ఆ బాణాలు పురంజయుని సారధిని చంపివేశాయి. ధనుస్సును ముక్కలు చేశాయి. పురంజయుని మరింత గాయపరిచాయి.

అంతటితో మండిపడిన అయోధ్యాధిపతి – ఇరవై రెక్కల బాణాలను వింట సంధించి వాటిని ఆకర్ణాంతము లాగి కాంభోజునిపై వదిలాడు. ఆ ఇరవై బాణాలూ ఏకకాలములో అతగాడి గుండెలలో నుండి వీపు గుండా దూసుకు పోవడంతో – కాంభోజరాజు మూర్చిల్లాడు. దానితో యుద్ధము మరింత భయంకరమైనది.

భీకర యుద్ధరంగం

తెగిన తుండాలతో ఏనుగులు, నరకబడిన తలలతో గుర్రాలూ, విరగిపడిన రథాలూ, స్వేచ్ఛగా దొర్లుతున్న రథచక్రాలు, తలలూ-మొండేలూ వేరుగాబడి ఎడం ఎడంగా పడి గిలగలా తన్నుకుంటున్న కాల్బంటుల కళేబరాల్తో కదనరంగమంతా కంటగింపుగా తయారైంది. మృత వీరుల రక్తమక్కడ వాగులు కట్టి ప్రవహించసాగింది. అటువంటి ఆ భీషణ భీభత్స సంగ్రామములో అధర్మి యైన పురంజయుని బలం క్రమక్రమంగా క్షీణించి పోయింది. కురుజాది వీరుల విజృంభణను తట్టుకోలేక – ఆ సాయంకాలానికి సమరభూమిని వదిలి, పట్టణంలోనికి పారిపోయాడు.

పురోహితుడు సుశీలుని సలహా అంతఃపురము చేరి – ఆనాటి శత్రువుల విజయానికి పడి పడి దుఃఖిస్తూన్న పురంజయుని చూసి ‘సుశీలుడు’ అనే పురోహితుడు – ‘మహారాజా! శత్రువైన ఆ వీరసేనుని గెలవాలనే కోరిక గనుక బలవత్తరంగా వుంటే – ఈ క్షణమే భక్తిప్రపత్తులతో విష్ణువును సేవించడమొక్కటే మార్గము రాజా!

కార్తీక వ్రత నియమాలు ఇది కార్తీకపూర్ణిమ, కృత్తికా నక్షత్రయుతుడై – చంద్రుడు షోడశ కళాశోభాయమానముగా వుండే ఈ వేళ – ఈ ఋతువులో లభించే పూలను సేకరించి, హరి ముందు మోకరించి పూజించు – విష్ణుసన్నిధిలో దీపాలను వెలిగించు. ఆయన ముందర, గోవిందా – నారాయణా – ఇత్యాది నామాలతో మేళతాళాలతో ఎలుగెత్తి పాడు ఆ పాటలతో పరవశుడవై హరి ముందు నర్తించు. అలా చేసినట్లయితే ఆ విష్ణుమూర్తి అనుగ్రహము వల్ల నీకు మహావీరుడైన కుమారుడు కలుగుతాడు.

కార్తీక మాసములో తనను ఆరాధించే భక్తుల రక్షణార్థం – వేయి అంచులతో శత్రు భయంకరమైన తన సుదర్శన చక్రాన్ని సహాయంగా పంపుతాడు. ఈ కార్తీక పుణ్యమహిమను చెప్పడం ఎవరి వల్లా అయ్యేపని కాదు. భూపతీ! ఈనాటి నీ ఓటమికి కారణం సైన్యబలం లేకపోవడం గాని, నీకు శరీర బలం లేకపోవడం గాని కానే కాదు సుమా! మితిమీరిన అధర్మవర్తనం వలన నీ ధర్మఫలం – తద్వారా దైవబలం తగ్గిపోవడమే నీ పరాజయానికి కారణం. కాబట్టి పురంజయా! శోకాన్ని వదలి భక్తితో శ్రీహరిని సేవించు. కలతమాని కార్తీక వ్రతాన్ని ఆచరించు. ఈ కార్తీక వ్రతం వలన ఆయురారోగ్యైశ్వర్య సుఖసంపత్ సౌభాగ్య సంతానాలు సంఘటిల్లి తీరుతాయి. నా మాటలను విశ్వసించు.

ధ్వావింశాధ్యాయము

రెండవనాటి యుద్ధము – పురంజయుని విజయము

పురంజయుని ఆరాధన అత్రిమహర్షి ఇంకా ఇలా చెప్పసాగాడు: అగస్త్యా! ఆ విధంగా సుశీలుడు చేసిన బోధతో – పురంజయుడు తక్షణమే విష్ణ్వాలయానికి వెళ్లి, వివిధ ఫలపుష్ప పల్లవ దళాదిగా విష్ణువును షోడశోపచారాలతోనూ పూజించి – ప్రదక్షిణ నమస్కారాలర్పించి మేళతాళాలతో ఆయనను కీర్తించి, పారవశ్యంతో నర్తించాడు. అంతే కాదు. బంగారంతో విష్ణు ప్రతిమను చేయించి దానికి కూడా పూజలు చేశాడు. దీపమాలికలు వెలిగించి అర్పించాడు. ఆ రాత్రంతా అలా విష్ణు సేవలో విలీనుడైన పురంజయుడు – మరుసటి రోజు ఉదయమే శేష సైన్య సమేతుడై పునః యుద్ధరంగాన్ని చేరాడు.

యుద్ధం ఆరంభం నగర సరిహద్దులను దాటుతూనే శత్రవులను సమరానికి ఆహ్వానిస్తూ – భీషణమైన ధనుష్ఠంకారాన్ని చేశాడు. ఈ ఠంకారం చెవినబడిన – కాంభోజ కురుజాది బలాలు పురంజయుడిని ఎదుర్కొన్నాయి. వజ్రాల వంటి కత్తులతోనూ, పిడుగుల వంటి బాణాలతోనూ, అమిత వేగవంతాలూ ఆకాశానికి సైతం ఎగరగలిగినవీ అయిన గుర్రాలతోనూ, ఐరావతాల వంటి ఏనుగులతోనూ అన్యోన్య జయకాంక్షా తత్పరులై ప్రాణాలకు తెగించి పోరాడే కాల్బాలతోనూ – క్రమక్రమంగా యుద్ధం దుర్నిరీక్ష్యమానంగా పరిణమించసాగింది.

విష్ణువు అనుగ్రహం గత రాత్రి పురంజయుడు చేసిన పూజలకు సంతుష్టుడైన గరుగగమనుడు అతనికి దైవబలాన్ని తోడు చేయడం వలన ఆనాటి యుద్ధంలో శత్రురాజుల శక్తులన్నీ ఉడిగిపోయాయి. కాంభోజుల గుర్రాలు, కురుజాదుల ఏనుగులు, వివిధరాజుల రథబలాలూ, వైరి కూటం యొక్క పదాతి బలాలు – దైవకృపాప్రాప్తుడైన పురంజయుని ముందు చిత్తు చిత్తుగా ఓడిపోయాయి. పురంజయుడి పరాక్రమానికి గుండెలవిసిపోయిన పగవారందరూ – ప్రాణభీతితో రణరంగాన్ని వదలి తమ తమ రాజ్యాలకు పరుగులు తీశారు.

ధర్మాచరణే ప్రధానం అంతటితో – విష్ణ్వనుగ్రహం వలన విజయాన్ని పొందినవాడై పురంజయుడు అయోధ్యా ప్రవేశం చేశాడు. విష్ణువు అనుకూలుడైతే శత్రువు మిత్రువడవుతాడు. విష్ణువు ప్రతికూలుడైతే మిత్రుడే శత్రువవుతాడు. దేనికైనా దైవబలమే ప్రధానం. ఆ దైవబలానికి ధర్మాచరణమే అత్యంత ముఖ్యం. అటు వంటి ధర్మాచరణలో ప్రప్రథమైన కార్తీక వ్రత ధర్మానుష్ఠానంతో ఎవరైతే శ్రీహరిని సేవిస్తారో – వారి సమస్త దుఃఖాలూ కూడా చిటికెల మీదనే చిమిడిపోతాయి.

కార్తీక వ్రతం గొప్పదనం అగస్త్యా! విష్ణుభక్తి సిద్ధించడమే కష్టతరం. అందునా కార్తీక వ్రతాచరణసక్తీ – శక్తీ కలగడం ఇంకా కష్టతరం. కలియుగంలో ఎవరైతే కార్తీక వ్రతమూ, శ్రీహరి సేవా వదలకుండా చేస్తారో వాళ్లు శూద్రులైనా సరే – వైష్ణవోత్తములుగా పరిగణింపబడతారు. వేదవిధులైన బ్రాహ్మణులైనప్పటికీ కూడా – ఈ హరి సేవా, కార్తీక వ్రతాచరణలు లేని వాళ్లు కర్మచండాలులేనని గుర్తించు. ఇక వేదవేత్తయై, హరిభక్తుడై, కార్తీక వ్రతనిష్ఠుడైన, వాని యందు సాక్షాత్తూ ఆ విష్ణువు నివసిస్తాడని చెప్పబడుతోంది.

ఏ జాతివాళ్లయినా సరే ఈ సంసార సాగరాన్నుంచి బైటపడి ఉత్తమగతుల్ని పొందాలనే కోరికతో విష్ణువుని అర్చించినట్లయితే – తక్షణమే వాళ్లు తరించుకుపోయినట్లుగా భావించు. అగస్త్యా! స్వతంత్రుడు గానీ, పరతంత్రుడు గానీ – హరి పూజాసక్తుడై వుంటేనే ముక్తి. భక్తులకా శ్రీహరీ, విష్ణువుకీ భక్తులూ అన్యోన్యానురాగబద్దులై వుంటారు. భక్తులకు ఇహపరాలు రెండింటినీ అనుగ్రహించి, రక్షించగలిగిన ఏకైక దైవం ఆ వాసుదేవుడే. విశ్వమంతటా నిండివున్న ఆ విష్ణువునందు భక్తి ప్రవత్తులున్న వారికి మాత్రమే కార్తీక వ్రతావకాశం చేజిక్కుతుంది.

కాబట్టి, వేదసమ్మతమూ, సకలశాస్త్రసారము, గోప్యమూ, సర్వవ్రతోత్తమోత్తమమూ అయినా ఈ కార్తీకవ్రతాన్ని ఆచరించినా, కనీసం కార్తీక మహాత్మ్యాన్ని మనస్ఫూర్తిగా విన్నా కూడా – వాళ్లు విగత పాపులై – అంత్యంలో వైకుంఠం చేరుకుంటారు. మహత్త్వపూర్వకమైన ఈ ఇరవై రెండవ అధ్యాయాన్ని శ్రాద్ధకాలంలో పఠించడం వలన – పితృదేవతలు కల్పాంత తృప్తిని పొందుతారు సుమా!

త్రయోవింశాధ్యాయము

పురంజయుని మోక్షము

‘హే అత్రి మునీంద్రా! విష్ణుకృప వలన విజయుడైన పురంజయుడు ఆ తరువాత ఏమి చేశాడో వివరించు’ అని అగస్త్యుడు కోరడంతో – అత్రి ఇలా చెప్పసాగాడు.

పురంజయుని జీవితంలో మార్పు భగవత్కృప వలన భండన భూమిలో విజయలక్ష్మి వరించిన పురంజయుడు, అమరావతిలో ఇంద్రునివలె, తన అయోధ్యలో అత్యంత వైభవంతో ప్రకాశించాడు. గతంలోని దుష్టభావాలను విసర్జించి సత్యశౌచపాలనం, నిత్యధర్మాచరణం, దానశీలత, యజ్ఞ యాగాది నిర్వహణలూ – ఇత్యాదులు చేస్తూ – ప్రతివర్ష ప్రయుక్త కార్తీక వ్రతాచరణం వలన విగత కల్మషుడై, విశుద్ధుడై, అరిషడ్వర్గాన్నీ – జయించి – పరమ వైష్ణవుడై మనసాగేడు.

అంతేగాదు – నిరంతరమూ కూడా – శ్రీహరి పూజాప్రియుడై – ఏ దేశాలలో, ఏఏ క్షేత్రాలలో తీర్థాలలో విష్ణువును ఏఏ విధాలుగా పూజించడం వలన తన జన్మ తరిస్తుందా – అనే తపనతో వుండేవాడు. అంతగా హరిసేనా సంవిధాన సంతృప్తుడైన కారణంగా – ఒకనాడు ఆకాశవాణి – ‘పురంజయా! కావేరీతీరంలో శ్రీరంగ క్షేత్రం వుంది. శ్రీరంగనాథుడనే పేర అక్కడ వెలసి వున్న విష్ణువును కార్తీక మాసంలో అర్చించి – జనన మరణాల నుంచి కడతేరుమని ప్రబోధించింది.

శ్రీరంగ యాత్ర, మోక్షం ఆకాశవాణి ప్రబోధించడంతో – రాజ్యపాలనను మంత్రులకు అప్పగించి – తగినంత చతురంగ బలయుక్తుడై – అనేక తీర్థక్షేత్రాలను దర్శిస్తూ అక్కడక్కడ యోగ్యవిధిగా శ్రీహరినే అర్చిస్తూ కావేరీ మధ్యంగతమైన భూలోక వైకుంఠమైన శ్రీరంగాన్ని చేరి, కార్తీక మాసమంతా కావేరీనదిలో స్నానాదులనీ, శ్రీరంగంలో రంగనాథ సేవలనూ చేస్తూ ప్రతిక్షణమూ కూడా ‘కృష్ణా! గోవిందా! వాసుదేవా! శ్రీరంగనాథా!’ అని హరినే స్మరిస్తూ జపదానాది విద్యుక్త ధర్మాలన్నింటినీ నిర్వర్తించి కార్తీకమాస వ్రతం పూర్తి చేసుకుని పునః అయోధ్యను చేరుకున్నాడు.

అనంతరం ధర్మకామం వలన సత్పుత్రపౌత్రాదుల్ని పొంది, కొన్నాళ్లు సర్వభోగ వివర్జితుడై, భార్యాసమేతంగా వానప్రస్థమును స్వీకరించి కార్తీక వ్రతాచరణ – విష్ణు సేవలలోనే లీనమై తత్పుణ్యవశాన అంత్యంలో వైకుంఠాన్ని చేరుకున్నాడు.

ఏవం శ్రీస్కాంద పురాణాంతర్గ కార్తీక మహాత్మ్యే ఏకవింశాద్వావింశాధ్యాయౌ (ఇరువది ఒకటి, ఇరువది రెండు – ఇరువది మూడు అధ్యాయములు) పదకొండవ (ఏకాదశ దిన) నాటి పారాయణము సమాప్తము

bakthivahini

Recent Posts

Bhagavad Gita 700 Slokas in Telugu – Discover the Wisdom of అధ్యాయం 7: జ్ఞాన విజ్ఞాన యోగం, శ్లోకం 13

Bhagavad Gita 700 Slokas in Telugu మనిషి జీవితం ఒక ప్రయాణం. ఈ ప్రయాణంలో మనం తీసుకునే ప్రతి…

7 hours ago

Karthika Puranam Telugu – కార్తీక పురాణం | 22వ రోజు పారాయణ

Karthika Puranam Telugu జలంధరుని యుద్ధ సన్నాహాలు ఓ పృథురాజా! రాహువు చెప్పిన విషయాలన్నీ వినగానే, క్రోధోద్రిక్తుడైన జలంధరుడు శివుని…

1 day ago

Karthika Puranam Telugu – కార్తీక పురాణం | 21వ రోజు పారాయణ

Karthika Puranam Telugu మారుమూలల్లో తలలు దాచుకున్నా కూడా వదలకుండా ముట్టడింప వస్తూన్న జలంధరునికి భయపడినవారై దేవతలంతా విష్ణు స్తోత్రం…

1 day ago

Karthika Puranam Telugu – కార్తీక పురాణం | 20వ రోజు పారాయణ

Karthika Puranam Telugu తులసి మహాత్మ్యంపై పృధు చక్రవర్తి ప్రశ్న పృధు చక్రవర్తి నారదుడిని అడుగుతున్నాడు: 'దేవర్షీ! తులసిని స్థాపించి,…

1 day ago

Karthika Puranam Telugu – కార్తీక పురాణం | 19వ రోజు పారాయణ

Karthika Puranam Telugu నారదుడు చెబుతున్నాడు: ఓ పృథు భూపాలా! కార్తీక వ్రతం పాటించే పురుషుడు తప్పకుండా ఆచరించవలసిన నియమాలను…

1 day ago

Karthika Puranam Telugu – కార్తీక పురాణం | 18వ రోజు పారాయణ

Karthika Puranam Telugu నారదుడు చెప్పినదంతా విన్న పృథువు 'ఓ దేవర్షీ! కార్తీక మాసపు గొప్పదనమును వివరించి, నన్ను ధన్యుని…

1 day ago