Karthika Puranam
అత్రి మహాముని చెబుతున్నాడు: అగస్త్యా! కార్తీకమాస శుక్ల ద్వాదశిని ‘హరిభోధిని’ అంటారు. ఆ ఒక్క పర్వతిథి వ్రతాచరణం చేస్తే—అన్నీ తీర్థాలలోనూ స్నానం చేసినా, అన్ని విధాలైన యజ్ఞాలనూ ఆచరించినా కలిగే పుణ్యం ప్రాప్తిస్తుంది.
ఇది విష్ణువు పట్లా, ఏకాదశి పట్లా భక్తిని కలిగిస్తుంది. సూర్యచంద్ర గ్రహణ పర్వాల కంటే గొప్పదీ, ఏకాదశి కంటే వందరెట్లు మహిమాన్వితమైనదీ అయిన ఈ ద్వాదశినాడు ఏ పుణ్యం చేసినా, పాపం చేసినా అది కోటిరెట్లుగా పరిణమిస్తుంది. అంటే—ఈ ద్వాదశి నాడు ఒకరికి అన్నదానం చేసినా కోటి మందికి అన్నదానం చేసిన పుణ్యమూ, ఒక్క మెతుకు దొంగిలించినా—కోటి మెతుకులు దొంగిలించిన పాపమూ కలుగుతాయి.
ఒక వేళ ఏ రోజుకైనా ద్వాదశీ ఘడియలు తక్కువగా వున్న పక్షంలో ఆ స్వల్ప సమయమైనా సరే పారణకు ఉపయోగించాలే గాని, ద్వాదశి దాటిన తరువాత పారణం పనికి రాదు. పుణ్యాన్ని కోరే వారెవరైనా సరే ఏ నియమాన్నయినా అతిక్రమించ వచ్చును గాని ద్వాదశీ పారణను మాత్రం విసర్జించకూడదు. ఏకాదశీ తిథినాడు ఉపవాసం వుండి, మరునాడు ద్వాదశీ తిథి దాటి పోకుండా పారణ చేయాలి. తద్వారా కలిగే శ్రేయస్సుని శేషశాయి చెప్పాలేగాని—శేషుడు కూడా చెప్పలేడు. ఇందుకు అంబరీషుని కథే ఉదాహరణ.
ద్వాదశీవ్రతాచరణ తత్పరుడూ, పరమ భాగవతోత్తముడూ అయిన అంబరీషుడనే మహారాజు—ఒకానొక కార్తీకశుద్ధ ఏకాదశినాడు ఉపవసించి, మరునాడు ద్వాదశి ఘడియలు స్వల్పంగా వున్న కారణంగా, తిథి దాటకుండానే పారణ చేయాలనుకున్నాడు. అదే సమయానికి దుర్వాసమహర్షి వచ్చి—ఆనాటి అతిథ్యములో తనకు కూడా భోజనమును పెట్టవలసినదిగా కోరాడు. అంబరీషుడు ఆయనను ద్వాదశీపారణకు ఆహ్వానించాడు.
తక్షణమే దుర్వాసుడు స్నానాద్యనుష్ఠానార్థం నదికి వెళ్లాడు. అలా వెళ్లిన ఋషి ఎంతసేపటికీ మళ్లీ రాకపోవడంతో అంబరీషుడు ఆత్రుత పడ్డాడు. ఆ రోజున ద్వాదశి ఘడియలు స్వల్పంగా వున్నాయి.
కాలాతిక్రమణం కూడా కాకుండా పారణ చేసి తీరాల్సి వుంది. అతిథి వచ్చేవరకూ ఆగడం గృహస్థ ధర్మం. దానిని వదలలేడు. ద్వాదశి దాటకుండా పారణ చేయడం ఈ వ్రతస్థ ధర్మం. దీనిని వదులకోలేడు. అదీగాక…
శ్లో || హరిభక్తి పరిత్యాగో ద్వాదశీత్యాగతో భవేత్
యతోనుపోషితో భూయా త్కృత్వాసమ్య గుపోషణం
పూర్వం ద్వాదశ సంఖ్యాకే పురుషో హరివాసరే
పాపముల్లంఘనేపాపాత్ నైవయుజ్యం మనీషిణా ||
‘ద్వాదశీ వ్రతాన్ని ఉల్లంఘించిన వాడు, విష్ణుభక్తిని విసర్జించినవాడవుతారు. ఏకాదశినాడు ఉపవాసం చేయకపోతే ఎంత పాపం కలుగుతుందో, ద్వాదశినాడు పారణ చేయకపోతే అంతకు రెట్టింపు పాపం కలుగుతుంది. అంతే కాదు—ఒక్క ద్వాదశీ పారణాతి క్రమణ వల్ల, ఆనాటి వ్రతఫలంతో బాటు గానే, అతః పూర్వం చేసిన పన్నెండు ద్వాదశీ పారణల మహాపుణ్యం కూడా హరించుకుపోతుంది. జన్మజన్మాంతర పుణ్యబలం క్షీణిస్తుంది. అన్నింటికన్నా ముఖ్యంగా ద్వాదశ్యతిక్రమణము వలన విష్ణు విరోధభీతి ఏర్పడుతుంది. అందువల్లే ప్రాణావసానమయినా సరే, ద్వాదశీపారణ చేయడమే కర్తవ్యం.
తద్వారా సంక్రమించే బ్రాహ్మణశాపం వల్ల కల్పాంత దుఃఖమే కలుగును గాక! దూర్వాసాగమనానంతరం కన్నా, ద్వాదశీ తిరోగమనాత్పూర్వమే పారణ చేసి హరిభక్తిని నిలుపుకున్నట్లయితే—కలగబోయే కష్టాలను ఆ కమలనాభుడే కడతేరుస్తాడు.
ఇలా తన మనస్సులో ఒక నిర్ణయానికి వచ్చీ కూడా, ధర్మవర్తనుడైన ఆ అంబరీషుడు, ద్వాదశీ పారణార్థం తనను పరివేష్టించి వున్న వేదవిదులకు తన ధర్మసందేహాన్ని తెలియజేశాడు.
అంబరీషుని సమస్యను వినిన వేదస్వరూపులైన ఆ విప్రులు, క్షణాల మీద శ్రుతి స్మృతి శాస్త్ర పురాణదులన్నిటినీ మననం చేసుకుని ఇలా అన్నారు: “మహారాజా! సర్వేశ్వరుడైన ఆ భగవంతుడు సమస్త జీవులయందునా జఠరాగ్ని రూపంలో ప్రక్షిప్తమై వుంటున్నాడు. ఆ జఠరాగ్ని, ప్రాణవాయువుచేత ప్రజ్వలింప చేయబడటం వలననే జీవులకు ఆకలి కలుగుతోంది. దానినే తాపమే క్షుత్పిపాసా బాధగా చెప్పబడుతూ వుంది. కాబట్టి, యుక్తాహారం చేత ఆ అగ్నిని పూజించి శాంతింప చేయడమే జీవలక్షణం. జీవులచే స్వీకరించబడే భక్ష్య, భోజ్య, చోష్య, లేహ్యరూప అన్నాదులను వారిలోని అగ్ని మాత్రమే భుజిస్తున్నాడు. జీవులందరిలోనూ వున్న జఠరాగ్ని జగన్నాథ స్వరూపం కనుకనే—
శ్లో || అథ శ్వపాకం శూద్రం వాస్వన్య సద్మాగతం శుభం
అతిక్రమ్య న భుం జీత గృహమే ధ్యతిథి, నిజమ్ ||
తన ఇంటికి వచ్చిన వాడు శూద్రుడైనా—ఛండాలుడైనా సరే, ఆ అతిథిని వదిలి గృహస్థ భోజనం చెయ్యగూడదు. అటు వంటి స్థితిలో బ్రాహ్మణుడే అతిథిగా వస్తే—అతనిని విసర్జించడం అధమాధమమని వేరే చెప్పనక్కరలేదు గదా! పైగా—తననే స్వయంగా పిలువబడిన బ్రాహ్మణుని కంటే ముందుగా తానే భోజనం చేయడం బ్రాహ్మణావమానమే అవుతుంది. భూవరా! భూసురావమానం వలన ఆయుష్షు, ఐశ్వర్యం, కీర్తి, ధర్మం నశించిపోతాయి. మనస్సంకల్పాలు సైతం తిరోహితాలై పోతాయి.
బ్రాహ్మణుడు సర్వదేవతా స్వరూపుడుగా చెప్పబడి వుండటం వలన, బ్రాహ్మణావమానం సర్వదేవతలనూ అవమానించడంతో సమానమవుతుంది. జాతి మాత్రం చేతనే బ్రాహ్మణుడు దేవతాతుల్యుడై వుండగా—కేవలం జన్మవలననేగాక, జ్ఞానం వలనా, తపో మహిమ వలనా, శుద్ధరుద్ర స్వరూపుడుగా కీర్తించబడే దూర్వాసుని వంటి ఋషిని భోజనానికి పిలిచి, ఆయన కంటే ముందే పారణ చేయడం ధర్మమని చెప్పడం సాధ్యం కాదు. కోపిష్ఠి అయిన ఆ ఋషి శపిస్తాడనే భయాన్ని ప్రక్కకు నెట్టి చూసినా—
వయం న నిశ్చయం క్వాపిగచ్ఛామో నరపుంగవ
తథాపి ప్రథమం విప్రా ద్భోజనం నప్రకీర్తితమ్
బ్రాహ్మాణాతిధి కంటె ముందుగా భుజించటం కీర్తికర్తమైనది మాత్రం కాదు. ధరణీపాలా! ద్వాదశీపారణా పరిత్యాగం వలన, తత్పూర్వదినమైన ఏకాదశ్యుపవాసానికి భంగం కలుగుతుంది. ఆ ఏకాదశీ వ్రతభంగానికి ప్రాయశ్చిత్తమనేదే లేదు. ఇట్లు బ్రాహ్మణాతిధిని అతిక్రమించడం వలన కలిగే విప్రపరాభవానికి కూడా విరుగుడు లేదు. రెండూ సమతూకంలోనే వున్నాయి.
అంబరీషా! పురాకర్మానుసారియై నీకిప్పుడు రెండు ప్రక్కల నుంచీ కంఠపాశరజ్జువులా ఈ ధర్మ సంకటం ప్రాప్తించింది. దుర్వాసుడు వచ్చేవరకూ ఆగాలో, లేదా—ద్వాదశీ ఘడియలు దాటకుండా పారణ చేయాలో—ఏది నిశ్చయించి చెప్పడానికి
శ్లో || స్వ బుద్ధ్యాతు సమాలోక్య కురుత్వం తవ నిశ్చయం
మేము అశక్తులమై పోతూన్నాం కాబట్టి—‘ఆత్మబుద్ధి—స్సుఖంచైవ’ అనే సూత్రం వలన భారం భగవంతుడి మీద పెట్టి నీ బుద్ధికి తోచిన దానిని నువ్వాచరించు అన్నారు బ్రాహ్మణులు.
ఆ మాటలు వినగానే అంబరీషుడు. ‘ఓ బ్రాహ్మణులారా! బ్రాహ్మణ శాపం కన్నా విష్ణుభక్తిని విడిచి పెట్టడమే ఎక్కువ కష్టంగా భావిస్తున్నాను. అని అనుకోగానే పూజాస్థానంలో వున్న యంత్రాన్ని ఆవహించి—జగదేక శరణ్యమూ, జగదేక భీకరమూ అయిన సుదర్శన చక్రము రివ్వున దూర్వాసుని వంకగా కదిలింది.
అచేతనాలైన పూజిత సంజ్ఞలలోంచి జడమైన విష్ణుచక్రం, దివ్యకాంతి ప్రభాశోభితమై తన వంకగా కదలి రావడాన్ని చూడగానే—దూర్వాసుడు త్రుళ్ళిపడ్డాడు. ఆ చక్రానికి చిక్కగూడదని భూచక్రమంతా గూడా క్షణాల మీద పరిభ్రమించాడు. అయినా ‘సుదర్శనం’ అతగాడిని తరుముతూనే వుంది. భీతావహుడైన ఆ దూర్వాసుడు—వశిష్ఠాది బ్రహ్మర్షులనీ, ఇంద్రాది అష్టదిక్పాలకులనీ, చిట్టచివరికి శివ-బ్రహ్మలనీ గూడా శరణుకోరాడు. కాని, అతని వెనకనే విహ్వల మహాగ్ని జ్వాలాయుతంగా వస్తూన్న విష్ణుచక్రాన్ని చూసి—ఎవరికి వారే తప్పుకున్నారే తప్ప విడిచి, తెగించి ఎవరూ అభయాన్నీయలేదు.
ఈ విధంగా ప్రాణభీతుడైన దూర్వాసుడు—సంభవిత లోకాలన్ని సంచరించి, చిట్టచివరగా—చక్రపాణియైన విష్ణువులోకాన్ని చేరాడు. ‘హే బ్రాహ్మణప్రియా! మాధవా! మధుసూదనా! కోటి సూర్యులతో సమానమైన కాంతిని—వేడిని కలిగిన నీ సుదర్శన చక్రం నన్ను చంపడానికై వస్తూ వుంది. బ్రాహ్మణ పాద ముద్రా సుశోభిత మనోరస్కుడవైన నువ్వే నన్నీ ఆపద నుంచి కాపాడాలి’ అని ఘోషిస్తూ సర్వేశ్వరుడైన ఆ శ్రీహరినే శరణు కోరాడు. విలాసంగా నవ్వాడు విష్ణువు.
‘దూర్వాసా! ప్రపంచానికి నేను దైవాన్నయినా—నాకు మాత్రం బ్రాహ్మణులే దైవాలు. కాని, నువ్వు సద్బ్రాహ్మణుడవూ, రుద్రాంశ సంభూతుడవూ అయి వుండి కూడా అంబరీషుణ్ణి అకారణముగా శపించావు. పారణకు వస్తానని చెప్పి, స్నానార్థమై వెళ్లిన నువ్వు—సకాలానికి చేరుకోలేదు. ఆలస్యంగా రాదలుచుకున్న వాడివి నీ కోసం ఎదురు చూడకుండా, ద్వాదశీ ఘడియలు గతించి పోకుండా పారణ చేయడానికి అనుమతినైనా ఈయలేదు.
ద్వాదశి దాటిపోవడానికి కొన్ని క్షణాలు మాత్రమే వ్యవధి వున్న సమయంలో—వ్రతభంగానికి భయపడి మంచినీళ్లను తీసుకున్నాడే గాని ఆకలితోనో—నిన్నవమానించాలనో కాదు. ‘అనాహారేపి యచ్ఛస్తం శుద్ధ్యర్థం వర్ణినాం సదా—నిషిద్ధాహారులకు కూడా, జలపానము దోషము కాదని శాస్త్రాలు చెబుతూండగా, అదేమంత తప్పని నువ్వు శపించాల్సి వచ్చింది? ఆత్రేయా! నువ్వెంత కటువుగా మాట్లాడినా కూడా అతగాడు నిన్ను వినయపూర్వకంగా శాంతించుమనీ వేడుకున్నాడేగాని, కోపగించుకోలేదు గదా! అయినా సరే, ముముక్షువైన అతగాడిని నువ్వు—పది దుర్భర జన్మలను పొందాలని శపించావు.
నా భక్తులను రక్షించు కోవడం కోసం నీ శాపాన్నీ నిమిషంలో త్రిప్పి వేయగలను. కాని, బ్రాహ్మణ వాక్యము వట్టిపోయిందనే లోకాపవాదము నీకు కలగకుండా ఉండడం కోసం ఆ భక్తుని హృదయములో చేరి, నీ శాపాన్ని సవినయంగా స్వీకరించిన వాడినీ, నీ శాపాన్ని అంగీకరిస్తూ ‘గృహామి’ అన్నవాడినీ నేనేగాని, ఆ అంబరీషుడు మాత్రం కాదు. అతనికి నీవిచ్చిన శాపం సంగతే తెలియదు.
ఋషిప్రభూ! నీ శాపం ప్రకారంగానే రీ కల్పాంతాన దుష్టుడైన శంఖాసురుణ్ణి సంహరించేందుకూ, శిష్యుడైన మనువు నుద్ధరించేందుకూ మహామత్స్యంగా అవతరిస్తాను. దేవదానవులు క్షీర సాగరాన్ని మధించే వేళ, మందరగిరిని మూపున ధరించడానికి కుదురుగా వుండేందుకుగాను కూర్మావతారుడ (తాబేలు) నవుతాను. భూమిని ఉద్ధరించేందుకూ, హరిణ్యాక్షుణ్ణి చంపేందుకూ, వరాహాన్నవుతాను. హిరణ్యకశిపుణ్ణి సంహరించడం కోసం వికృతాననం గల ‘నరసింహ’ రూపావతార ధారుడినవుతాను. సర్వదేవతా సంరక్షణ కోసం ధర్మబలుడైనా కూడా దానవుడు గనుక ‘బలి’ అనే వాడిని శిక్షించేందుకు వామనుడనవుతాను. త్రేతాయుగమున జమదగ్నికి కుమారుడిగా పుట్టి సాయుధ బ్రాహ్మణుడనై దుర్మదులైన రాజులను దుళ్లగొడతాను. రావణ సంహారార్థమై ఆత్మజ్ఞాన శూన్యుడైన అంటే నేనే భగవంతుడనే దానిని మర్చిపోయిన—మాయామానుష విగ్రహుడైన దశరథ రామునిగా అవతరిస్తాను. ద్వాపరంలో జ్ఞానినీ, బలవంతుడను అయి వుండీ కూడా—రాజ్యాధికారం లేకుండా రాజు (బలరాముడు)కు తమ్మునిగా కృష్ణునిగా జన్మిస్తాను. కలియుగారంభాన పాపమోహము కొరకు పాషండమత ప్రచారకుడనై బుద్దుడనే పేరున పుడతాను. ఆ యగాంతన శత్రుఘాతుకుడైన బ్రాహ్మణునిగా ప్రభావిస్తాను.
దుర్వాసా! నా ఈ దశావతారాలనూ—ఆయా అవతారాలలోని లీలలనూ ఎవరు వినినా, చదివినా, తెలుసుకున్నా—వారి పాపాలు పటాపంచలవుతాయి.
ధర్మానానా విధా వేదే విస్తృతా వరజన్మనాం
దేశకాల వయోవస్థా వర్ణాశ్రమ విభాగశః
దేశ, కాల, వయో అవస్థలను బట్టి వర్ణాశ్రమాలను అనుసరించీ—’ధర్మము’ అనేక విధాలుగా వేదముచే ప్రవచింపబడి వుంది. అటువంటి వివిధ విధ ధర్మాలలోనూ కూడా ‘ఏకాదశి’ నాడు ఉపవాసం. ద్వాదశి దాటకుండా పారణం అనేవి విశ్వజనీనంగా భాసిస్తున్నాయి. అటు వంటి వైదిక ధర్మాచరణమును చేసినందుకుగాను—నువ్వా అంబరీషుణ్ణి శపించింది చాలక, తిరిగి మరో ఘోరశాపమును ఇవ్వబోయావు.
బ్రాహ్మణుడవైన నీ వాక్యాన్ని సత్యము చేయడమూ—భక్తుడైన ఆ రాజును కాపాడుకోవడమూ రెండూ నా బాధ్యతలే గనక—పునః శపించబోయే నిన్ను నివారించడానికే నా చక్రాన్ని నియమించాను.
(ఇరువది నాలుగు – ఇరువది ఐదు – ఇరువది ఆరు అధ్యాయములు)
పన్నెండవ (ద్వాదశి) నాటి పారాయణము సమాప్తము
Bhagavad Gita 700 Slokas in Telugu మనిషి జీవితం ఒక ప్రయాణం. ఈ ప్రయాణంలో మనం తీసుకునే ప్రతి…
Karthika Puranam Telugu జలంధరుని యుద్ధ సన్నాహాలు ఓ పృథురాజా! రాహువు చెప్పిన విషయాలన్నీ వినగానే, క్రోధోద్రిక్తుడైన జలంధరుడు శివుని…
Karthika Puranam Telugu మారుమూలల్లో తలలు దాచుకున్నా కూడా వదలకుండా ముట్టడింప వస్తూన్న జలంధరునికి భయపడినవారై దేవతలంతా విష్ణు స్తోత్రం…
Karthika Puranam Telugu తులసి మహాత్మ్యంపై పృధు చక్రవర్తి ప్రశ్న పృధు చక్రవర్తి నారదుడిని అడుగుతున్నాడు: 'దేవర్షీ! తులసిని స్థాపించి,…
Karthika Puranam Telugu నారదుడు చెబుతున్నాడు: ఓ పృథు భూపాలా! కార్తీక వ్రతం పాటించే పురుషుడు తప్పకుండా ఆచరించవలసిన నియమాలను…
Karthika Puranam Telugu నారదుడు చెప్పినదంతా విన్న పృథువు 'ఓ దేవర్షీ! కార్తీక మాసపు గొప్పదనమును వివరించి, నన్ను ధన్యుని…