Karthika Puranam Telugu
అంబరీషుడు దూర్వాసునికి నమస్కరించి ఇలా అన్నాడు : “మహామునీ! నేను బహు పాపాత్ముడను. ఆకలితో ఉండి అన్నానికైనా ఇంటికి వచ్చిన నిన్ను అలసటపాలు చేసిన మందభాగ్యుడను. అయినా నాయందు దయతో మరల నా ఇంటికి అతిథిగా వచ్చితివి.”
అనంతరం, “దయచేసి నా ఇంట విందారగించి, నా సర్వదోషాలనూ ఉపశమింప చెయ్యి” అని ప్రార్థించాడు.
దూర్వాసుడు అంబరీషుడిని తన బాహువులతో లేవనెత్తి , “రాజా! ప్రాణదాతను తండ్రి అంటారు. ఇప్పుడు నువ్వు నా ప్రాణాలను కాపాడటం వలన నాకు పితృస్థానీయుడవయ్యావు. నిజానికి నేనే నీకు నమస్కరించాలి. కానీ, బ్రాహ్మణుడనూ, తాపసినీ, నీ కన్నా వయోవృద్ధుడినీ అయిన కారణంగా నా నమస్కారం నీకు కీడు కలిగిస్తుందేగాని మేలు చేయదు. అందువల్ల నీకు నమస్కరించబడం లేదని ఏమీ అనుకోవద్దు. నేను నిన్ను కష్టపెట్టాను. అయినా నువ్వు నాకు ప్రాణభిక్షను పెట్టావు. నీ వంటి ధర్మాత్మునితో కలిసి భోజనమును చేయడం మహాభాగ్యం” అని చెప్పాడు.
అలా చెప్పి, అతని ఆతిథ్యాన్ని స్వీకరించి, విష్ణుభక్తుల మహాత్మ్య ప్రకటనార్థం, పరీక్షకునిగా వచ్చిన దూర్వాసుడు ఆ సత్కార్యం పూర్తి కావడంతో తన ఆశ్రమానికి తిరిగి వెళ్ళిపోయాడు.
కాబట్టి, కార్తీక శుద్ధ ఏకాదశినాడు ఉపవాస జాగరణలు చేసి , ద్వాదశినాడు దానాదులను (క్షీరాబ్ది ద్వాదశీ వ్రతం) నిర్వర్తించి , బ్రాహ్మణ సమేతుడై, ద్వాదశి ఘడియలు దాటకుండా పారణం చేయడం వల్ల అన్ని పాపాలూ అంతరించి పోతాయి. ఈ పుణ్యగాథను చదివినా, చదివించినా, రాసినా, వినినా కూడా ఇహంలో సర్వసౌఖ్యాలనూ పొంది, పరంలో ఉత్తమ పదాన్ని పొందుతారు.
పూర్వోక్త విధంగా సూతుడు వినిపించిన కార్తీక మహాత్మ్యాన్ని విని, శౌనకాది ఋషులు ఇలా అడిగారు : “కలియుగ కల్మషగతులు, రాగాది పాశయుక్త సంసారగ్రస్తులూ అయిన సామాన్యులకి సునాయాసంగా లభించే పుణ్యమేది? అన్ని ధర్మాల్లోనూ అధికమైనదేది? దేవతలందరిలోకీ దేవాదిదేవుడెవరు? దేని వల్ల మోక్షం కలుగుతుంది? మోహము దేనివలన నశిస్తుంది? జరామృత్యు పీడితులు, జడమతులు, మందులూ , అయిన ఈ కలికాలపు ప్రజలు తేలిగ్గా తెములుకు పోయే తెరువేమిటీ?”
అందుమీదట సూతుడిలా చెప్పసాగాడు : “మంచి ప్రశ్నలను వేశారు. ఇలాంటి మంచి విషయాల గురించి ప్రసంగించుకోవడం వలన వివిధ తీర్థ క్షేత్రాటనా స్నానాల వల్లా – వివిధ యజ్ఞ యాగాది నిర్వహణల వల్లా కలిగేటంతటి పుణ్యం లభిస్తుంది. ఇంతవరకూ నేను మీకు చెప్పిన కార్తీక ఫలమే వేదోక్తమైనది. విష్ణు ఆనందకారకమైన కార్తీక వ్రతమే ఉత్తమధర్మము.”
“సర్వశాస్త్రాలనీ వివరించి చెప్పేందుకు నేను సమర్థుడినీ గాను, సమయమూ చాలదు. గనుక, అన్ని శాస్త్రాలలోనూ ఉన్న సారాంశాన్ని చెబుతాను వినండి. విష్ణుభక్తి కన్నా తరుణోపాయం లేదు.”
దీపదానం, కంచుపాత్రదానం, దీపారాధానం, ధన-ఫల-ధాన్య-గృహాది దానాలూ అమిత పుణ్యఫలదాలు.
కార్తీకం ముప్పయి రోజులూ కార్తీక మహాత్మ్యాన్ని వినినా, పారాయణ చేసినా కూడా – సకలపాపాలూ నశించిపోతాయి , సంపత్తులు సంభవిస్తాయి , పుణ్యాత్ములౌతారు. ఇన్ని మాటలెందుకు? విష్ణుప్రియమైన కార్తీక వ్రతాచరణం వలన ఇహపర సుఖాలు రెండూ గూడా కలుగుతాయి.
పదునాలుగవ (చతుర్దశ దిన) రోజు పారాయణము సమాప్తము.
Lakshmi Ashtottara Shatanamavali శ్రీలక్ష్మీ అష్టోత్తర శతనామావళిఃఓం ప్రకృత్యై నమఃఓం వికృత్యై నమఃఓం విద్యాయై నమఃఓం సర్వభూతహితప్రదాయై నమఃఓం శ్రద్ధాయై…
Simhachalam Giri Pradakshina 2026 ఉత్తరాంధ్ర ఆధ్యాత్మిక నిలయం, విశాఖపట్నం తీరంలో వెలసిన అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం శ్రీ వరాహ…
చాతుర్మాస్య దీక్ష మన జీవితాల్లో ఆధ్యాత్మిక వెలుగులను నింపి, మానసిక ప్రశాంతతను, శారీరక ఆరోగ్యాన్ని ప్రసాదించే అత్యంత పవిత్రమైన కాలం…
Tholi Ekadasi 2026 మన సనాతన ధర్మంలో పండుగలకు, వ్రతాలకు విశేషమైన ప్రాధాన్యం ఉంది. అందులోనూ ఆషాఢ శుద్ధ ఏకాదశి…
Varahi Navaratri 2026 జీవితంలో ఎంత కష్టపడినా ఫలితం కనిపించనప్పుడు, ఇంట్లో ప్రశాంతత కరువై ఆర్థిక ఇబ్బందులు వేధిస్తున్నప్పుడు మనసు…
సంకష్టహర చతుర్థి 2026 జీవితంలో అడుగడుగునా ఎదురయ్యే ఆటంకాలను తొలగించి, ధైర్యాన్ని, తెలివితేటలను ప్రసాదించే దేవుడు గణపతి. ప్రతి నెలా…