Karthika Puranam Telugu – కార్తీక పురాణం | 16వ రోజు పారాయణ

Karthika Puranam Telugu

సూతమునీ! మీరు చెప్పిన స్కాంద పురాణాంతర్గత కార్తీక మహాత్మ్యాన్ని విని శౌనకాది కులపతులు ఎంతో సంతోషించారు. అప్పుడు వారు, “సూతమునీ! లోకంలో ఉత్తమ పుణ్యాన్నిచ్చే ఈ కార్తీక పురాణం స్కాంద పురాణంలోనే కాక, పద్మ పురాణంలో కూడా ఉంది కదా. దానిని కూడా మాకు వివరంగా తెలియజేయండి” అని ప్రార్థించారు.

దానికి మందస్మిత వదనుడైన సూతుడు ఇలా అన్నాడు: “మునులారా! వైకుంఠుని లీలా వినోదాలూ, మహిమలూ వినే వారికీ, వినిపించే వారికీ విశేషమైన పుణ్యాన్నే ఇస్తాయి కానీ, విసుగును కలిగించవు. మీరు భక్తి ప్రపత్తులతో అడగాలే గాని, గురువు నాకు ప్రసాదించిన శక్తి మేరకు వివరంగా చెప్తాను, వినండి. స్కాంద పురాణంలో ఈ మహాత్మ్యాన్ని జనక మహారాజుకు వశిష్ఠుల వారు ఎలా బోధించారో, అదే విధంగా పద్మ పురాణంలో శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ పరమాత్మ, సత్యభామకు ఈ కార్తీక మాస విశేషాలన్నీ వివరించారు”.

పారిజాతాపహరణం

ఒకానొకప్పుడు నారదమహర్షి స్వర్గం నుండి ఒక పారిజాత సుమాన్ని (పువ్వును) తెచ్చి, కృష్ణుడికి ఇచ్చి, “ఓ హరీ! నీకున్న పదహారువేల ఎనమండుగురు భార్యలలోనూ, నీకు అత్యంత ప్రియమైన ఆమెకే ఈ పువ్వును ఇవ్వవయ్యా” అని కోరాడు. ఆ సమయంలోనే రుక్మిణి అక్కడ ఉంది.

నందనందనుడు ఆ నందనవన కుసుమాన్ని రుక్మిణికి కానుకగా ఇచ్చాడు. ఈ విషయం తెలిసిన సత్యభామ అలిగింది. “ప్రియమైన భార్యకి ఇవ్వమంటే, తనకీయాలి గాని, ఆ రుక్మిణికి ఇవ్వడమేమిటని” కోపగించుకుంది. కృష్ణుడు ఎంత నచ్చచెప్పినా ఆమె వినిపించుకోలేదు. పారిజాత వృక్షాన్ని తెచ్చి, తన పెరటిలో పాదుకొలిపేదాకా ఊరుకునేది లేదని బెదిరించింది.

అత్యంత ప్రియురాలయిన ఆమె అలుక తీర్చడమే ముఖ్యంగా భావించిన అనంతపద్మనాభుడు, వెంటనే సత్యభామా సమేతంగా గరుత్ముంతుడిని అధిరోహించి, ఇంద్రుని అమరావతీ నగరానికి వెళ్లాడు. శ్రీకృష్ణుడు పారిజాత వృక్షాన్ని కోరగా, దేవేంద్రుడు స్వర్గ సంపదను భూలోకానికి పంపేందుకు అంగీకరించలేదు. ఫలితంగా, ఇంద్రునికీ (ఇంద్రుడికీ), ఉపేంద్రునికీ (కృష్ణుడికీ) మధ్య ఘోరమైన యుద్ధం జరిగింది.

చివరకు, ఆ తగాదాలో దేవేంద్రుడు తగ్గి, సవినయంగా పారిజాత ద్రుమాన్ని (వృక్షాన్ని) యాదవేంద్రునికి (కృష్ణునికి) సమర్పించుకున్నాడు. దానవాంతకుడు (కృష్ణుడు) దానిని తెచ్చి, ముద్దుల భార్యామణి అయిన సత్రాజితి (సత్యభామ) నివాసంలో ప్రతిష్ఠించాడు.

సత్యభామ అడిగిన వరాలు

దీని వలన అమితానందాన్ని పొందిన ఆ అన్నుల మిన్న, తన పెనిమిటి అయిన పీతాంబరునితో (కృష్ణుడితో) చాలా ప్రేమగా మాట్లాడింది.

“ప్రాణప్రియా! నేను ఎంతైనా ధన్యురాలిని. నీ పదహారు వేల ఎనమండుగురు స్త్రీలలోనూ నేనే నీకు మిక్కిలి ప్రియతమను కావడం వలన, నా అందచందాలు ధన్యత్వం పొందాయి. అసలు ఈ జన్మలో నీ అంతటివాడికి భార్యను కావడానికి, నీతో పాటు గరుడారూఢనై (గరుడుడిపై ఎక్కి) శరీరంతో స్వర్గ సందర్శనం చేయడానికి, కథలుగా చెప్పుకోవడమే తప్ప ఎవ్వరూ ఎప్పుడూ కళ్లారా చూసి ఎరుగని కల్పవృక్షం (పారిజాత) నా పెరటి మొక్కగా ఉండటానికి కారణం ఏమిటి?” అని అడిగింది.

“నేను నిన్ను తులాభార రూపంగా నారదుడికి ధారపోసినా, అలిగిన ఆవేశంలో నిన్ను వామపాదాన తాడించినా (ఎడమ కాలితో తన్నినా), నువ్వు మాత్రం నా మీద నువ్వు గింజంత కూడా కోపం చూపకుండా ఇలా ప్రేమిస్తున్నావంటే – ఈ నీ ఆదరాభిమానానురాగాలు పొందడానికి నేను గత జన్మలలో చేసిన పుణ్యం ఏమిటి?. అదీగాక, జన్మజన్మకీ నీ జంటను ఎడబాయకుండా వుండాలంటే నేనిప్పుడు ఇంకా ఏమేం చెయ్యాలి?” అని అడిగింది.

అందుకు ముకుందుడు (కృష్ణుడు) మందహాసం చేస్తూ – “ఓ నారీ లలామా, సత్యభామా! నీవు నన్ను కోరరానిది కోరినా, చెప్పకుండా అడిగినా, ఈయరానిదానిని ఆశించినా కూడా నీ సమస్త వాంఛలనూ నెరవేర్చి సంతృప్తురాలను చేయడమే నా విధి. అందుకు కారణం నీ పూర్వజన్మమే” అంటూ ఇలా చెప్పసాగాడు.

సత్యభామ పూర్వజన్మము

కృతయుగాంత కాలంలో, ‘మాయా’ అనే నగరంలో దేవశర్మ అనే వేద పండితుడు ఉండేవాడు. అతనికి లేక లేక కలిగిన ఒకే ఒక ఆడబిడ్డ గుణవతి. అల్లారుముద్దుగా పెంచుకున్న ఆ పిల్లని, తన శిష్య పరంపరలోని వాడే అయిన ‘చంద్రుడికి’ ఇచ్చి దేవశర్మ పెండ్లి జరిపించాడు.

ఒకనాడు ఈ మామా, అల్లుళ్ళిద్దరూ కలిసి సమిధలనూ, దర్భలనూ తెచ్చుకునేందుకు అడవికి వెళ్లి, అక్కడ ఒక రాక్షసుని చేత హతమార్చబడ్డారు. బ్రాహ్మణులూ, ధర్మాత్ములూ, నిత్య సూర్యోపాస్తిపరులూ అయిన వారి జీవిత విన్నాణానికి మెచ్చిన విష్ణుమూర్తి – “శైవులుగాని, గాణాపత్యులుగాని, సౌర (సూర్య) వ్రతులు గాని, శాక్తేయులుగాని వీరందరూ కూడా వానచినుకులు వాగులై, వంకలై, నదులై తుదకు సముద్రాన్నే చెందినట్టుగా – నన్నే పొందుతున్నారు. పుత్రభాత్రాది నామాలతో దేవదత్తుని లాగా నేనే వివిధ నామ రూప క్రియాదులతో అయిదుగా విభజింపబడి ఉన్నాను. అందువలన, మరణించిన మామా-అల్లుళ్లను మన వైకుంఠానికే తీసుకుని రమ్మని” తన పార్షదులకు ఆజ్ఞాపించాడు.

పార్షదులు ప్రభువు ఆజ్ఞను పాటించారు. సూర్యతేజస్సమకాంతులతో ఆ ఇరువురి జీవాలూ వైకుంఠం చేరి, విష్ణు సారూప్యాన్ని పొంది – విష్ణు సాన్నిధ్యంలోనే మసలసాగాయి.

గుణవతి కథ

పితృభర్తృ మరణవార్తను విన్న గుణవతి ఎంతగానో క్రుంగిపోయింది. కానీ, పోయిన వారితో తను కూడా పోలేదు కనుక, మరణం ఆసన్నమయ్యేదాకా మనుగడ తప్పదు కనుక – వేరొక దిక్కులేని ఆ యువతి ఇంట్లో ఉన్న వస్తు సంచయాన్నంతటినీ విక్రయించి తండ్రికీ – భర్తకూ ఉత్తమ గతులకై ఆచరించవలసిన కర్మలను ఆచరించింది.

శేష జీవితాన్ని శేషశాయి (విష్ణువు) స్మరణలోనే గడుపుతూ, దేహ పోషణార్థం కూలిపని చేసుకుంటూ, ఆధ్యాత్మిక చింతనతో, హరిభక్తినీ – సత్యాన్నీ, శాంతాన్నీ, జితేంద్రియత్వాన్నీ పాటిస్తూ ఉండేది. పరమ సదాచారపరులైన వారింట పుట్టి పెరిగింది కావడం వలన బాల్యం నుండి అలవడిన కార్తీక వ్రతాన్నీ – ఏకాదశీ వ్రతాన్ని మాత్రం ప్రతి ఏటా విడువకుండా ఆచరించేది.

కృష్ణుడు చెబుతున్నాడు: “సత్యా! పుణ్యగణ్యాలూ, భుక్తి ముక్తిదాయకాలూ, పుత్రపౌత్ర సంపత్ సౌభాగ్య సంధాయకాలూ అయిన ఆ రెండు వ్రతాలూ నాకు అత్యంత ప్రీతిపాత్రమైన వన్న సంగతి నీకు తెలుసుకదా!. కార్తీకమాసంలో సూర్యుడు తులారాశిలో వుండగా నిత్యమూ ప్రాతఃస్నానం ఆచరించే వారి సమస్త పాపాలనూ నేనూ నశింపచేస్తాను. ఈ కార్తీకంలో స్నానాలూ, దీపారాధనలూ, జాగరణ, తులసిపూజ చేసే వాళ్లు అంత్యంలో వైకుంఠవాసుడైన శ్రీ మహావిష్ణు స్వరూపులై భావిస్తారు.

విష్ణ్వాలయంలో మార్జనం (శుభ్రం చేయడం) చేసి, సర్వతోభద్రం – శంఖం – పద్మం మొదలయిన ముగ్గులను పెట్టి, పూజా పునస్కారాలను చేసే వారు జీవన్ముక్తులౌతారు. పైన చెప్పబడిన విధంగా కార్తీక మాసంలో నెలరోజులలోనూ, కనీసం మూడు రోజులయినా ఆచరించిన వారు – దేవతలను కూడా నమస్కరించదగిన వాళ్లవుతున్నారు. ఇక పుట్టింది మొదలుకొని జీవితాంతమూ చేసే వారి పుణ్యవైభవాన్ని చెప్పడం ఎవరి వల్లా కాదు”.

గుణవతికి వైకుంఠ ప్రాప్తి

అదే విధంగా – ఆనాటి గుణవతి, విష్ణుప్రియంకరాలైన ఏకాదశీ, కార్తీక వ్రతాలను మాత్రం వదలకుండా కడునిష్ఠతో ఆచరిస్తూ కాలం వెళ్లదీసి – కొన్నాళ్ల తరువాత వయోభారం వల్ల శుష్కించి, జ్వరపడింది. అయినప్పటికీ కూడా – కార్తీక స్నానం మానకూడదనే పట్టుదలతో నదికి వెళ్లి ఆ చలిలో కూడా నడుములోతు నీళ్లకు చేరి స్నానమాడే ప్రయత్నం చేస్తూ ఉంది.

అంతలోనే ఆకాశం నుంచి శంఖ, చక్ర, గదా, పద్మాద్యాయుధాలు ధరించి విష్ణువుతో సమానమైన (విష్ణ్వాభులైన) విష్ణుదూతలు , గరుడతాకాయుతమైన విమానంలో వచ్చి గుణవతిని అందులో చేర్చి, దివ్యస్త్రీల చేత సేవలు చేయిస్తూ తమతోబాటుగా వైకుంఠానికి చేర్చారు. కార్తీక వ్రత పుణ్యఫలంగా పొగలేని అగ్నిశిఖలా ప్రకాశిస్తూ ఆమె హరి సాన్నిధ్యాన్ని పొందింది.

“అనంతరం శ్రీ మహావిష్ణువునైన నేను దేవతల ప్రార్థన మీద దేవకి గర్భాన ఇలా కృష్ణుడిలా అవతరించాను. నాతో బాటే అనేకమంది వైకుంఠవాసులు కూడా యాదవులుగా జన్మించారు. పూర్వజన్మలలోని ‘చంద్రుడు’ ఈ జన్మలో అక్రూరుడయ్యాడు. అలనాటి దేవశర్మ సత్రాజిత్తుగా ప్రభవించాడు. బాల్యం నుంచే కార్తీకవ్రతం మీదా, నా మీదా మాత్రమే మనసు లగ్నం చేసిన గుణవతే – నువ్వుగా – అంటే సత్రాజిత్ కుమార్తవైన సత్యభామగా ఇలా జన్మించావు”.

“ఈ జన్మ వైభోగానికంతటికీ కారణం పూర్వజన్మలోని కార్తీక వ్రతాచరణా పుణ్యఫలమే తప్ప ఇతరమైనది ఏది కాదు. ఆ జన్మలో నా ముంగిట తులసి మొక్కను పాతిన పుణ్యానికి ఈ జన్మలో కల్పవృక్షం నీ వాకిట వెలసింది. ఆనాడు కార్తీక దీపారాధన చేసిన ఫలితంగా, ఈనాడు నీ ఇంటా-వంటా కూడా లక్ష్మీకళ స్థిరపడింది. అలనాడు నీ సమస్త వ్రతాచరణా పుణ్యాలనూ కూడా ‘నారాయణాయేతి సమర్పయామి’ అంటూ జగత్పతినైన నాకే ధారబోసిన దానికి ప్రతిఫలంగా ఇప్పుడు నా భార్యవయ్యావు. పూర్వజన్మలో జీవితాంతం వరకూ కార్తీక వ్రతాన్ని విడువని భక్తికి ప్రతిగా సృష్టి ఉన్నంత వరకూ నీకు నా ఎడబాటు లేని ప్రేమను అనుభవిస్తున్నావు. సత్రాజితీ! నువ్వే కాదు. నీ మాదిరిగా ఎవరయితే కార్తీక వ్రతానుష్ఠాననిష్ఠులూ, నా భక్తగరిష్ఠులూ అయి ఉంటారో వారందరూ కూడా నాకు ఇష్టులై, సర్వకాల సర్వావస్థలలోనూ కూడా ఆ కార్యాల రీత్యా, నా వారుగా, నా సాన్నిధ్యంలోనే వుంటూనే ఉంటారు”.

గొప్ప రహస్యం

“రాగవతీ! ఒక్క రహస్యం చెబుతాను విను – తపోదాన యజ్ఞాదికాలను ఎప్పుడూ నిర్వర్తించిన వారైనా సరే కార్తీక వ్రతాచరణ చేసేవారికి లభించే పుణ్యంలో పదహారోవంతు పుణ్యం కూడా పొందలేరని గుర్తుంచుకో”.

పైన చెప్పబడిన విధంగా – శ్రీకృష్ణుడు చెప్పిన తన పూర్వజన్మ గాథనూ, కార్తీక వ్రత పుణ్యఫలాలనూ విని పులకితాంగియైన ఆ పూబోడి (సత్యభామ) తన ప్రియపతియైన విశ్వంభరుడికి (కృష్ణుడికి) వినయ విధేయతలతో ప్రణమిల్లింది.

పదునారవ (బహుళ పాడ్యమి) నాటి పారాయణము సమాప్తము.

Bakthivahini

YouTube Channel

bakthivahini

Recent Posts

Bhagavad Gita 700 Slokas in Telugu – Discover the Wisdom of అధ్యాయం 7: జ్ఞాన విజ్ఞాన యోగం, శ్లోకం 13

Bhagavad Gita 700 Slokas in Telugu మనిషి జీవితం ఒక ప్రయాణం. ఈ ప్రయాణంలో మనం తీసుకునే ప్రతి…

7 hours ago

Karthika Puranam Telugu – కార్తీక పురాణం | 22వ రోజు పారాయణ

Karthika Puranam Telugu జలంధరుని యుద్ధ సన్నాహాలు ఓ పృథురాజా! రాహువు చెప్పిన విషయాలన్నీ వినగానే, క్రోధోద్రిక్తుడైన జలంధరుడు శివుని…

1 day ago

Karthika Puranam Telugu – కార్తీక పురాణం | 21వ రోజు పారాయణ

Karthika Puranam Telugu మారుమూలల్లో తలలు దాచుకున్నా కూడా వదలకుండా ముట్టడింప వస్తూన్న జలంధరునికి భయపడినవారై దేవతలంతా విష్ణు స్తోత్రం…

1 day ago

Karthika Puranam Telugu – కార్తీక పురాణం | 20వ రోజు పారాయణ

Karthika Puranam Telugu తులసి మహాత్మ్యంపై పృధు చక్రవర్తి ప్రశ్న పృధు చక్రవర్తి నారదుడిని అడుగుతున్నాడు: 'దేవర్షీ! తులసిని స్థాపించి,…

1 day ago

Karthika Puranam Telugu – కార్తీక పురాణం | 19వ రోజు పారాయణ

Karthika Puranam Telugu నారదుడు చెబుతున్నాడు: ఓ పృథు భూపాలా! కార్తీక వ్రతం పాటించే పురుషుడు తప్పకుండా ఆచరించవలసిన నియమాలను…

1 day ago

Karthika Puranam Telugu – కార్తీక పురాణం | 18వ రోజు పారాయణ

Karthika Puranam Telugu నారదుడు చెప్పినదంతా విన్న పృథువు 'ఓ దేవర్షీ! కార్తీక మాసపు గొప్పదనమును వివరించి, నన్ను ధన్యుని…

1 day ago