Karthika Puranam Telugu
నారదుడు చెప్పినదంతా విన్న పృథువు ‘ఓ దేవర్షీ! కార్తీక మాసపు గొప్పదనమును వివరించి, నన్ను ధన్యుని చేశావు. అదే విధంగా స్నానాదివిధుల్ని, ఉద్యాపన విధినీ కూడా యథావిధిగా తెలియజేయవలసినదని కోరగా, నలువ చూలి ఇలా చెప్పసాగాడు.
ఆశ్వీన్యస్యతు మాసస్య యా శు కాదళీ భవేత్
కార్తీకస్య వ్రతారంభం తస్యాం కుర్యా దతంద్రితః
ఈ కార్తీక వ్రతాన్ని అశ్వీయుజ శుద్ధ ఏకాదశీనాడే ప్రారంభించాలి. ముఖమార్జనం చేయని వాళ్లకు మంత్రాలు పట్టివ్వవు. కాబట్టి – ముఖమునూ, జిహ్వనూ ఎప్పుడూ శుభ్రంగా వుంచుకోవాలి.
ఆయుర్బలం యశోవర్చ: ప్రజాః పశువసూనిచ
బ్రహ్మప్రజ్ఞం చ మేథాం చ త్వన్నో దేహివనస్పతే
అనే మంత్రం పఠిస్తూ దంతధావనం చేసుకోవాలి.
దంతధావనం చేయకూడని దినాలు, వస్తువులు
దంతధావనం తరువాత – భక్తి-నిర్మలబుద్ధీ కలవాడై – గంధ పుష్ప తాంబూలాలను సేకరించి శివాలయానికి గాని, విష్ణ్వాలయానికి గాని వెళ్లి – అక్కడి దేవతాలకు అర్ఘ్యపాద్యాది ఉపచారాలను ఆచరించి, స్తోత్ర నమస్కారాల్ని సమర్పించి, నృత్యగీత వాద్యాది సేవలను చేయాలి.
దేవాలయాలలోని గాయకులు, వర్తకులు, తాళమృదంగాది వాద్య విశేష విద్వాంసులు, వీళ్లందర్నీ విష్ణు స్వరూపులుగా భావించి పుష్పతాంబూలాదులతో అర్చించాలి.
కలియుగంలో భగవత్ప్రతికరమైనది: కృతయుగంలో యజ్ఞం, ద్వాపరంలో దానం భగవంతునికి ప్రీతి కరమైనవి కాగా, ఈ కలియుగంలో భక్తియుతమైన సంకీర్తన మొక్కటే ఆ భగవంతునికి సంతసాన్ని కలిగిస్తుంది.
ఓ రాజా!
ఏ ఏ దేవలలకు ఏ ఏ పూవులు శ్రేష్టమైనవఓ వాటితోనే పూజించాలి.
అలా పూజించినప్పటికీ కూడా ‘ఓ దేవా! మంత్ర క్రియాదిక లోపభూయిష్టమైనప్పటికినీ, నాచే చేయబడిన పూజ నీకు పరిపూర్ణమైనదగును గాక’ అనే మంత్రం పఠించి క్షమాపణ కోరుకోవాలి.
ఆ పిదప దైవానికి ప్రదక్షిణ నమస్కారాదులను ఆచరించి, పునః క్షమాపణలు చెప్పుకుని, నృత్యగానాది ఉపచారాలతో పూజను సమాప్తి చేయాలి.
ఫలము: ఎవరైతే కార్తీక మాసంలో ప్రతిదినం రాత్రి శివపూజను గాని, విష్ణుపూజను గాని ఆచరిస్తారో వాళ్లు సమస్త పాపాల నుండి విడివడిన వాళ్లయి – వైకుంఠాన్ని పొంది తీరుతారు.
నారదుడు చెబుతున్నాడు: రాజా! మరింత వివరంగా చెబుతాను విను. వ్రతస్థుడు మరో రెండు ఘడియలలో తెల్లవారుతుందనగా నిద్ర లేచి, శుచియై నువ్వులూ, దర్బలూ, అక్షతలు, పువ్వులు, గంధమూ తీసుకుని నది వద్దకు వెళ్లాలి.
చెరువులలోగాని, దైవనిర్మితజలాశయాలలో గాని, నదులలోగాని, సాగరసంగమాలలో గాని స్నానం చేస్తే ఒకదాని కంటే ఒకటి పది రెట్ల పుణ్యానిస్తుంది. ఏ పుణ్యతీర్థంలో స్నానం చేసినా అంతకు పదిరెట్లు ఫలం కలుగుతుంది.
ముందుగా విష్ణువుని స్మరించి, స్నాన సంకల్పం చేసి, దేవతలకు అర్ఘ్యాలనీయాలి.
ఆర్ఘ్యమంత్రం:
నమః కమలనాభాయ నమస్తే
జలశాయినే నమస్తేస్తు
హృషీకేశ గృహాణార్ఘ్యం నమోస్తుతే
ఉపరివిధంగా ఆర్ఘ్యాదులనిచ్చి, దైవధ్యాన నమస్కారాదులను చేసి – ‘ఓ దామోదరా! ఈ జలమందు స్నానము చేయుటకు ప్రయత్నించుచున్నాను. నీ అనుగ్రహం వలన నా పాపములన్నీ నశించిపోవును గాక! హే రాధారమణా! విష్ణూ! కార్తీక వ్రతస్నాతునడగుచున్న నా అర్ఘ్యాన్ని స్వీకరించుదువు గాక!’ అని కోరుకోవాలి.
ఇలా వ్రతస్థుడు గంగ, విష్ణు, శివ, సూర్యుల్ని స్మరించి – బొడ్డులోతు వరకకు నీటిలో దిగి, యధావిధిగా స్నానం చేయాలి.
స్నానం చేయకూడని తిథులు:
విదియ, సప్తమి, దశమి, త్రయోదశి, అమావాస్య – ఈ ఆరు తిధులలోనూ – నువ్వులతోనూ, ఉసిరిపండ్లతోనూ స్నానం చేయకూడదు.
ముందుగా శరీరశుద్ధికి స్నానం చేసి, ఆ తరువాతనే మంత్ర స్నానం చేయాలి. స్త్రీలు, శూద్రులు పురాణోక్త మంత్రాలతోనే స్నానం చేయాలి.
‘భక్తిగమ్యుడై ఎవడు దేవకార్యార్థం త్రిమూర్త్యాత్మకుడయ్యాడో సర్వపాపహరుడైన ఆ విష్ణువు నన్నీ స్నానముచే పవిత్రుని చేయుగాక! విష్ణ్వాజ్ఞాపరులైన ఇంద్రాది సమస్త దేవతలును నన్ను పవిత్రుని చేయుదురు గాక! రహో యజ్ఞ మంత్రబీజ సంయుతాలైన వేదాలు, వశిష్ఠ కశ్యపాది మునివరిష్ఠుల నన్ను పవిత్రునిగా చేయుదురుగాక, గంగాది సర్వనదులు, తీర్థాలు, జలధారలు, నదాలు, సప్త సాగరాలు, హ్రదాలు నన్ను పవిత్రుని చేయుగాక. ముల్లోకాలలోనూ గల అరుంధత్యాది పతివ్రతామ తల్లులు, యక్ష, సిద్ధ, గరుడాదులు – ఓషధులు, పర్వతాలు నన్ను పవిత్రుని చేయుగాక!’.
ఉపరి మంత్రయుక్తంగా స్నానం చేసి- చేతియందు పవిత్రాన్ని ధరించి దేవ-ఋషి-పితృ తర్పణాలను విధిగా చేయాలి. కార్తీకమాసంలో పితృతర్పణ పూర్వకంగా ఎన్ని నువ్వులయితే విడువబడుతున్నాయో అన్ని సంవత్సరముల పాటు పితృదేవతలు స్వర్గంలో నివసిస్తున్నారు.
ఆ తర్పణానంతరం నీటి నుండి తీరానికి చేరి, ప్రాతఃకాలానుష్ఠానం (సంధ్యావందనాది) నెరవేర్చుకొని – విష్ణు పూజను చేయాలి.
అర్ఘ్యమంత్రం:
ప్రతిపత్ కార్తీకమాసే స్నాతస్య విధినామమ
గృహాణార్ఘ్యం మయాదత్తం రాధయా సహితోహరే
అనే మంత్రంతో గంధ పుష్పఫలాలతో కూడిన అర్ఘ్యాన్ని, క్షేత్ర తీర్థ దేవతలను స్మరించి సమర్పించాలి.
అనంతరం వేదపారీణులైన బ్రాహ్మణులకు భక్తిపూర్వకంగా గంధ తాంబూలాదులిచ్చి పూజించి నమస్కరించాలి.
బ్రాహ్మణ పూజ ప్రాశస్త్యం: అలా పూజించేటప్పుడు – ‘కుడి పాదమందు సర్వతీర్థములు, ముఖమందు చతుర్వేదములు, అవయవము లందు సర్వదేవతలతో అలరారే ఈ బ్రాహ్మణ పూజ వలన పవిత్రుడనవుతున్నాను’ అని అనుకోవాలి.
అటు మీదట వ్రతస్థుడు హరి ప్రియమైన తులసికి ప్రదక్షిణ మాచరించి ‘దేవతలచే నిర్మించబడి, మునులచే పూజింపబడిన విష్ణు ప్రేయసివగు ఓ తులసీ! నీకు చేస్తున్న నమస్కారము నా పాపాలను నాశము చేయుగాక’ అనుకొని – నమస్కరించుకోవాలి.
తదుపరి స్థిరబుద్ధి కలవాడై హరికథ, పురాణ శ్రవణాదులలో పాల్గొనాలి.
ఫలము: ఇప్పుడు నేను చెప్పినది చెప్పినట్లుగా ఏ భక్తులైతే ఆచరిస్తారో వాళ్లు తప్పనిసరిగా దైవసాలోక్యాన్ని పొందుతారు.
సమస్త రోగహారకము, పాపమారకము, సద్భుద్దీదాయకమూ, పుత్రపౌత్ర ధనప్రదమూ, ముక్తికారకమూ, విష్ణుప్రీతికరమూ అయిన కార్తీక వ్రతాన్ని మించింది, కలియుగంలో మరొకటి లేదు.
పదునెనిమిదవ (బహుళ తదియ) నాటి పారాయణము సమాప్తము
Bhagavad Gita 700 Slokas in Telugu మనిషి జీవితం ఒక ప్రయాణం. ఈ ప్రయాణంలో మనం తీసుకునే ప్రతి…
Karthika Puranam Telugu జలంధరుని యుద్ధ సన్నాహాలు ఓ పృథురాజా! రాహువు చెప్పిన విషయాలన్నీ వినగానే, క్రోధోద్రిక్తుడైన జలంధరుడు శివుని…
Karthika Puranam Telugu మారుమూలల్లో తలలు దాచుకున్నా కూడా వదలకుండా ముట్టడింప వస్తూన్న జలంధరునికి భయపడినవారై దేవతలంతా విష్ణు స్తోత్రం…
Karthika Puranam Telugu తులసి మహాత్మ్యంపై పృధు చక్రవర్తి ప్రశ్న పృధు చక్రవర్తి నారదుడిని అడుగుతున్నాడు: 'దేవర్షీ! తులసిని స్థాపించి,…
Karthika Puranam Telugu నారదుడు చెబుతున్నాడు: ఓ పృథు భూపాలా! కార్తీక వ్రతం పాటించే పురుషుడు తప్పకుండా ఆచరించవలసిన నియమాలను…
Karthika Puranam Telugu కార్తీక ఏకాదశుల ప్రాధాన్యత సూతుడు చెబుతున్నాడు , పూర్వపు అధ్యాయంలో చెప్పినట్లుగా, సత్యభామ శ్రీకృష్ణునికి నమస్కరించి,…