Karthika Puranam Telugu – కార్తీక పురాణం | 20వ రోజు పారాయణ

Karthika Puranam Telugu

తులసి మహాత్మ్యంపై పృధు చక్రవర్తి ప్రశ్న పృధు చక్రవర్తి నారదుడిని అడుగుతున్నాడు: ‘దేవర్షీ! తులసిని స్థాపించి, ఆ మండపంలోనే ముందుగా విష్ణుపూజ చేయాలని సెలవిచ్చావు. అంతేకాక, తులసిని ‘హరిప్రియా – విష్ణువల్లభా’ వంటి పేరులతో సంబోధించావు. శ్రీవారికి అంతటి ప్రియకరమైన ఆ తులసీ మహాత్మ్యాన్ని దయచేసి వినిపించు.’

నారదుడి వివరణ: శివుడు – ఇంద్రుడి కథ నారదుడు ఇలా చెబుతున్నాడు: ‘శ్రద్ధగా విను. పూర్వమొకానొకసారి, ఇంద్రుడు సమస్త దేవతాప్సరసమేతుడై శివదర్శనార్థం కైలాసానికి వెళ్లాడు. ఆ సమయానికి శివుడు బేతాళ రూపియై ఉన్నాడు. భీత మహాదంష్ట్రా నేత్రాలతో మృత్యు భయంకరంగా ఉన్న ఆ స్వరూపాన్ని శివునిగా గుర్తించలేక, ‘ఈశ్వరుడు ఎక్కడున్నాడు? ఏం చేస్తున్నాడు?’ అంటూ ఇంద్రుడు ఆయననే ప్రశ్నించసాగాడు.

కానీ, ఆ పురుషోత్తముడు జవాబీయని కారణంగా, ఇంద్రుడు ‘నిన్ను శిక్షిస్తున్నాను. ఎవడు రక్షిస్తాడో చూస్తాను’ అంటూ తన వజ్రాయుధంతో అతని కంఠసీమపై కొట్టినాడు. ఆ దెబ్బకు ఆ భీకరాకారుడి కంఠం కమిలి నల్లనయ్యిందిగాని, ఇంద్రుడి వజ్రాయుధం మాత్రం బూడిదై పోయింది.

అంతటితో ఆ భీషణమూర్తి నుండి వచ్చే తేజస్సు దేవేంద్రుణ్ణి కూడా దగ్ధం చేసేలా తోచడంతో , దేవగురువైన బృహస్పతి ఆ బేతాళ స్వరూపం శివుడేనని గ్రహించి , ఇంద్రుడి చేత అతనికి మ్రొక్కింది. తానీ విధంగా శాంతి స్తోత్రం చేశాడు.

బృహస్పతి కృత బేతాళ శాంతి స్తోత్రం

నమో దేవాది దేవాయ త్ర్యంబకాయ కపర్దినే
త్రిపురఘ్నాయ శర్వాయ నమోంధ కనిషూఇనే
విరూపా యాదిరూపాయ బ్రహ్మరూపాయ శంభవే
యజ్ఞ విధ్వంసకర్తే వై యజ్ఞానాం ఫలదాయినే
కాలాంత కాలకాలాయ కాలభోగి ధరాయచ
నమో బ్రహ్మ శిరోహంతే, బ్రహ్మణ్యాయ నమో నమః

బృహస్పతి ఈ విధంగా ప్రార్థించడంతో శాంతించిన శివుడు , త్రిలోక నాశకమైన తన త్రినేత్రాగ్నిని ఉపసంహరించేందుకు నిశ్చయించి – ‘బృహస్పతీ! నా కోపం నుంచి ఇంద్రుణ్ని బ్రతికించినందుకుగాను ఇక నుంచి నువ్వు ‘జీవ’ అనే పేరుతో ప్రఖ్యాతి పొందుతావు. నీ స్తోత్రం నన్ను ముగ్ధుణ్ని చేసింది. ఏదైనా వరం కోరుకో” అన్నాడు.

ఆ మాట మీద బృహస్పతి – ‘హే శివా! నీకు నిజంగా సంతోషము కలిగితే మళ్లీ అడుగుతున్నాను – త్రిదివేశునీ (ఇంద్రుడిని), త్రిలోకాలనూ కూడా నీ మూడో కంటి మంట నుంచి రక్షించు. నీ ఫాలాగ్ని జ్వాలలను శాంతింపజెయ్యి. ఇదే నా కోరిక’ అన్నాడు.

జలంధరుడి జననం సంతసించిన సాంబశివుడు – ‘వాచస్పతీ! నా మూడో కంటి నుండి వెలువరించిన అగ్ని వెనక్కి తీసుకోదగినది కాదని తెలుసుకో. అయినా నీ ప్రార్థనను మన్నించి, అగ్ని లోకదహనం చేయకుండా ఉండేందుకుగాను సముద్రంలోనికి చిమ్మేస్తున్నాను’ అని చెప్పాడు. చెప్పినట్లే చేశాడు శివుడు.

ఆ అగ్ని గంగా సాగర సంగమానబడి – బాలక రూపాన్ని ధరించింది. పుడుతూనే ఏడ్చింది. ఆ ఏడుపు ధ్వనికి స్వర్గాది సత్యలోక పర్యంతం చెవుడు పొందింది. ఆ రోదన వినిన బ్రహ్మ పరుగు పరుగున సముద్రుడి వద్దకు వచ్చి – ‘ఈ అద్భుత శిశువు ఎవరి పుత్రుడు’ అని అడిగాడు.

అందుకు సముద్రుడాయనకు నమస్కరించి – ‘గంగా సంగమంలో జన్మించాడు గనక ఇతను నా కుమారుడే. దయ చేసి వీనికి జాత కర్మాది సంస్కారాలను చేయు’మని కోరాడు.

జలంధరుడికి బ్రహ్మ దీవెన ఈ మాటలు జరిగే లోపలే ఆ కుర్రాడు బ్రహ్మ గడ్డాన్ని పట్టుకొని ఊగులాడసాగాడు. వాడి పట్టు నుంచి తన గెడ్డం వదిలించుకొనేందుకు బ్రహ్మకు కళ్లనీళ్ల పర్యంతమైంది. అందువల్ల విధాత ‘ఓ సముద్రుడా! నా కళ్ల నుంచి రాలి చిందిన నీటిని ధరించిన కారణంగా వీడు జలంధరుడనే పేర విఖ్యాతుడవుతాడు. సకల విద్యావేత్త, వీరుడూ అయి శివునిచే తప్ప ఇతరులకు వధించరాని వాడవుతాడు’ అని దీవించి పట్టాభిషిక్తుణ్ణి చేశాడు.

ఆ జలంధరుడికి, కాలనేమి కూతురైన బృందనిచ్చి పెళ్లి చేశారు. రూప, వయో, బలవిలాసుడైన జలంధరుడు బృందను భార్యగా గ్రహించి , దానవాచార్యుడయిన శుక్రుని సహాయంతో సముద్రము నుండి భూమిని ఆక్రమించి స్వర్గంలా పాలించసాగాడు.

దానవ బలంతో జలంధరుడు నారదుడు చెబుతున్నాడు: పూర్వం దైవోపహతమై (దైవశక్తిచే ఓడింపబడి) పాతాళాది లోకాలలో దాగిన దానవ బలమంతా ఇప్పుడు జలంధరుణ్ణి ఆశ్రయించి, నిర్భయంగా సంచరించసాగింది.

రాహువు కథ – జలంధరుడి ఆవేశం ఆ జలంధరుడు ఒకనాడు శిరోవిహీనుడైన రాహువుని చూసి – ‘వీడికి తల లేదేమిటి?’ అని ప్రశ్నించిన మీదట శుక్రుడు, గతంలో జరిగిన క్షీరసాగర మధనం, అమృతపు పంపకం , ఆ సందర్భంగా విష్ణువతని తల తెగ వేయడం – ఇత్యాదిగా గల ఇతిహాసమంతా చెప్పాడు. అంతా విన్న సముద్ర తనయుడైన జలంధరుడు మండిపడ్డాడు. తన తండ్రియైన సముద్రుని మధించడం పట్ల చాలా మధనపడ్డాడు.

ఇంద్రుడి వద్దకు ఘస్మరుడు అతను ఘస్మరుడనే వాణ్ణి – దేవతల దగ్గరకి రాయబారిగా పంపాడు. వాడు – ఇంద్రుడి వద్దకు వెళ్ళి ‘నేను రాక్షస ప్రభువైన జలంధరుడి దూతను. ఆయన పంపిన శ్రీముఖాన్ని విను – ఇంద్రా! నా తండ్రియైన సముద్రుని పర్వతంతో మధించి అపహరించిన రత్నాలను అన్నింటినీ వెంటనే నాకు అప్పగించు’ అని సందేశం చెప్పాడు.

ఇంద్రుడి సమాధానం

అది విన్న అమరేంద్రుడు – ‘ఓ రాక్షసదూతా! గతంలో నాకు భయపడిన లోక కంటకాలయిన పర్వతాలనీ, నా శత్రువులయిన రాక్షసుల్నీ ఆ సముద్రుడు తన గర్భంలో దాచుకున్నాడు. అందువల్లనే సముద్రమధనం చేయాల్సి వచ్చింది. ఇప్పటి మీ రాజులాగానే గతంలో శంఖుడనే సముద్రనందనుడు కూడా అహంకరించి ప్రవర్తించి నా తమ్ముడైన ఉపేంద్రుని చేత వధించబడ్డాడు. కాబట్టి సముద్ర మధన కారణాన్నీ, దైవతగణ తిరస్కృతికి లభించబోయే ఫలితాన్నీ కూడా మీ నాయకుడికి విన్నవించుకో… అని చెప్పాడు.

ఘస్మరుడు జలంధరుడి దగ్గరకు వెళ్ళి మఘవుడు (ఇంద్రుడు) చెప్పిన మాటలను వినిపించాడు. మండిపడ్డ జలంధరుడు – మరుక్షణమే స్వర్గంపై సమరం ప్రకటించాడు. శుంభ-నిశుంభాది సైన్యాధిపతులతో సహా దేవతలపై దండెత్తాడు.

ఉభయ సైన్యాలవారూ ముసల, పరిఘ, బాణ, గదాద్యాయుధాలతో పరస్పరం ప్రహరించుకున్నారు. రధ, గజ, తురగాదిక శవాలతోనూ, రక్తప్రవాహాలతోనూ రణరంగం నిండిపోయింది.

ద్రోణగిరి రాక్షసగురువైన శుక్రుడు మరణించిన రాక్షసులందర్నీ ‘మృత సంజీవనీ విద్య’తో బ్రతికిస్తూండగా – దేవ గురువైన బృహస్పతి అచేతనాలైన దేవ గణాలను, ద్రోణగిరి మీది దివ్యౌషధాలతో చైతన్యవంతం చేయసాగాడు. ఇది గ్రహించిన శుక్రుడు జలంధరుడికి చెప్పి ఆ ద్రోణగిరిని సముద్రములో పార వేయించాడు.

దేవతల పలాయనం ఎప్పుడయితే ద్రోణపర్వతం అదృశ్యమయిందో – అప్పుడు బృహస్పతి, దేవతలను చూచి, ‘ఓ దేవతలారా! ఈ జలంధరుడు ఈశ్వరాంశ సంభూతుడు గాబట్టి, మనకు జయింప శక్యం కాకుండా వున్నాడు. అందువల్ల ప్రస్తుతానికి ఎవరిదారిన వాళ్లు పారిపోండి’ అని హెచ్చరించాడు. అది వినగానే భయార్తులైన దేవతలందరూ కూడా యుద్ధరంగం నుంచి పారిపోయి మేరుపర్వత గుహంతరాళాలను ఆశ్రయించారు.

జలంధరుడు ఇంద్రపదవిలో అంతటితో విజయాన్ని పొందిన జలంధరుడు – ఇంద్రపదవిలో తాను పట్టాభిషిక్తుడై , శుంభ నిశుంభాదులను తన ప్రతినిధులుగా నిర్ణయించి , పారిపోయిన దేవతలను బందీలను చేయడం కోసం – కొంత సైన్యంతో ఆ మేరు పర్వతాన్ని సమీపించాడు.

ఇరువదియవ (బహుళ పంచమి) రోజు పారాయణము సమాప్తము

bakthivahini

Recent Posts

Bhagavad Gita Chapter 10 Verse 8 | భగవద్గీత 10వ అధ్యాయం 8వ శ్లోకం

Bhagavad Gita Chapter 10 Verse 8 ప్రతిరోజూ ఉదయం లేచి, మనం ఎన్నో కలలతో, ఆశలతో రోజును ప్రారంభిస్తాం.…

17 hours ago

Bhagavad Gita Chapter 10 Verse 7 | భగవద్గీత 10వ అధ్యాయం 7వ శ్లోకం

Bhagavad Gita Chapter 10 Verse 7 ఈ రోజుల్లో చాలా మంది ఉదయం లేవగానే ఒక రకమైన అలసటతో…

2 days ago

Bhagavad Gita Chapter 10 Verse 6 | భగవద్గీత 10వ అధ్యాయం 6వ శ్లోకం

Bhagavad Gita Chapter 10 Verse 6 ఈ రోజుల్లో చాలామందిని వేధిస్తున్న ప్రధాన సమస్య – "అసలు నేనెవరిని?…

3 days ago

Bhagavad Gita Chapter 10 Verse 4 & 5 | భగవద్గీత 10వ అధ్యాయం 4 & 5వ శ్లోకం

Bhagavad Gita Chapter 10 Verse 4 & 5 ఈ రోజుల్లో చాలా మందిని పట్టి పీడిస్తున్న ఒకే…

2 weeks ago

Bhagavad Gita Chapter 10 Verse 3 | భగవద్గీత 10వ అధ్యాయం 3వ శ్లోకం

Bhagavad Gita Chapter 10 Verse 3 మనలో చాలామంది రాత్రి పడుకునే ముందు ఒకే ఆలోచనతో సతమతమవుతుంటారు. "ఈరోజు…

2 weeks ago

Bhagavad Gita Chapter 10 Verse 2 | భగవద్గీత 10వ అధ్యాయం 2వ శ్లోకం

Bhagavad Gita Chapter 10 Verse 2 మనలో చాలా మంది జీవితం... బయట ప్రపంచంతో యుద్ధం చేయడం కంటే,…

2 weeks ago