Karthika Puranam Telugu
ఇది యుద్ధరంగంలో జరిగిన అద్భుత ఘట్టం. అతిలోకమైన శివశౌర్యానికి చిన్నబుచ్చుకున్న జలంధరుడు పునః ఈశ్వరుడిని సమ్మోహింపజేయాలని తలచి మాయాగౌరిని సృష్టించాడు.
ఒక రథంపై కట్టివేయబడి, నిశుంభాది నిశాచరుల చేత వధింపబడుతున్న ఆ మాయా గౌరిని చూశాడు శివుడు. చూసీ చూడగానే ఉద్విగ్న మానసుడైన ఉగ్రుడు యుద్ధాన్నీ, తన పరాక్రమాన్నీ, కర్తవ్యాన్నీ విస్మరించి ఉదాసీనుడై వుండిపోయాడు. అదే అదనుగా జలంధరుడు ఆ పుంఖశా కాలైన మూడు బాణాలను శివుని శిరస్సుపైనా, వక్షస్థలం పైనా, ఉదరమందునా ప్రయోగించాడు. అయినా ఈ జంగమయ్యలో చలనం లేదు.
అటువంటి సమయంలో అదంతా రాక్షసమాయగా బ్రహ్మదేవునిచే బోధించబడిన వాడై, కోలుకొనిన ఆ పరమేశ్వరుడు జ్వాలామాలాతి భీషణమైన రౌద్రరూపాన్ని ధరించాడు. ఆ స్వరూపాన్ని చూసేందుకు సైతం శక్తి చాలక అనేక మంది రాక్షసులు పారిపోసాగారు.
పారిపోతున్న వారిలో వున్న అగ్రనాయకులైన శుంభ, నిశుంభులను చూచిన రుద్రుడు – ‘పారిపోతున్న వారంతా పార్వతి చేతిలో మరణించెదరు గాక‘ అని శపించాడు.
అది గమనించిన జలంధరుడు బాణవర్షంతో అంధకారాన్ని కల్పించాడు. శివుడు తన తపోబలంతో ఆ చీకట్లను చీల్చివేశాడు. ఉడికిపోయిన జలంధరుడు పరిఘాయుధంతో పరుగు పరుగున వచ్చి ఈశ్వరుని వాహనమైన ఎద్దును భయంకరంగా గొట్టాడు. ఆ దెబ్బకు నంది యుద్ధరంగం నుండి పరుగు తీయసాగింది. దానిని మళ్లించడం సాంబశివునికి కూడా సాధ్యం కాలేదు.
ఎక్కడ లేని కోపం వచ్చింది రుద్రుడికి. వెనువెంటనే సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు. భూమ్యాకాశాలను దహింప చేసి వేయగలిగినంతటి వేగవంతమైన ఆ చక్రం చూపరులను భయభ్రాంతులను చేస్తూ వెళ్లి జలంధరుడి తలనరికి నేల పై పడవేసింది. అతని మొండెంలోంచి వెలువడ్డ తేజస్సు, ఈశ్వరునిలో లీనమై పోయింది.
| సంఘటన | ఫలితం |
| శివుడి ఉదాసీనత | జలంధరుడి బాణ ప్రయోగం |
| బ్రహ్మ బోధ | శివుడు రౌద్రరూపం దాల్చడం |
| రుద్రుడి శాపం | శుంభ-నిశుంభులు పార్వతి చేతిలో మరణించడం |
| సుదర్శన చక్ర ప్రయోగం | జలంధరుడి సంహారం |
బ్రహ్మాది దేవతలందరూ సంతోషాతి రేకులూ, అవనత శిరస్కులూ అయి ఆ చంద్రశేఖరునకు ప్రణమిల్లారు. స్తుతించారు. కృతజ్ఞతలు చెప్పుకున్నారు. అనంతరం ‘బృందామోహితుడై అడవులలోబడి అల్లాడిపోతున్న విష్ణువును స్వస్థుని చేసే ఉపాయాన్ని కూడా అనుగ్రహించమని కోరగా అందుకుగాను పరాశక్తిని వేడుకోమని చెప్పి జయజయధ్వానాల నడుమ సకలగణ సమేతుడై గృహోన్ముఖుడయ్యాడు. శివాజ్ఞ ప్రకారం దేవతలు మహామాయని ప్రార్థించసాగారు.
శ్లో!! య దుద్భవాస్సత్వ రజ స్తమో గుణాః
సృష్టి స్థితి ధ్వంస నిదాన కారిణః
య దిచ్ఛయా విశ్వమిదం భవా భ
తనోతి మూల ప్రకృతి నతాస్స్మృతామ్ ||
శ్లో/ యాహి త్రయోవింశతి భేద శాబ్దితా
య ద్రూపకర్మాటి జగు స్త్ర యోపివై
జగత్యశేషే సమధిష్ఠితా పరా
వేదాస్తు మూల ప్రకృతిం నతాస్స్మృతామ్ ||
శ్లో|I యద్భక్తియుక్తాః పురుషాస్తు నిత్యం
దారిద్ర్య భీ మోహ పరాభ వాదీన్
నప్రాప్నువంత్యేవహి భక్తవత్సలాం
సదైవ మూల ప్రకృతిం నతాస్స్మృతామ్ ||
సృష్టి, స్థితి, లయలకు కారణమైన సత్త్వ, రజస్, తమో గుణాలు మూడు దేని నుంచి పుట్టినవో, దేవి యొక్క ఇచ్ఛ వలన లోకంలో జనన-మరణాలు సంభవిస్తున్నాయో అటువంటి మూల ప్రకృతి (మహామాయ)కి నమస్కరిస్తున్నాయి.
ఏదైతే ఇరవై మూడు భేదములతో చెప్పబడి సమస్త లోకములను అధిష్ఠించినదో, వేదములలో సైతము దేని యొక్క రూప కర్మములు కీర్తింపబడుతున్నాయో అట్టి మూల ప్రకృతికి నమస్కరిస్తున్నాను.
దేనియందు భక్తుడైన వాడు దారిద్ర్య భయ, మోహ, పరాభవాలను పొందడో, ఏదయితే తన భక్తుల యందు ఎడతెగని ప్రేమ కలదో ఆ మూల ప్రకృతికి నమస్కరిస్తున్నాను.
స్తవమే త సంధ్యాం యః పఠే దేకాగ్రమానసః
దారిద్ర్యమోహ దుఃఖాని న కదాచిత్ స్పృశంతి తమ్ ||
నారదుడు చెబుతున్నాడు: దేవతలచే గావించబడిన ఈ మూలప్రకృతి (మహామాయా) స్తవాన్ని ఎవరైతే ఏకాగ్రచిత్తంతో త్రిసంధ్యలూ పఠిస్తారో వాళ్లు ఏనాడూ కూడా దారిద్యాన్ని గాని, భయాన్ని గాని, మోహాన్నిగాని, దుఃఖాన్నిగాని, అవమానాన్ని గాని పొందరు.
ఆ విధంగా దేవతలు ప్రార్థన చేయగానే ఆకాశంలో జ్వాలాయుతమైన అద్భుత తేజస్సు ఒకటి పొడచూపి – ‘ఓ దేవతలారా! త్రిగుణాల రీత్యా నేను త్రిమూర్తులనూ ధరించి వున్నాను.
దేవతలు రమా, ఉమా, సరస్వతుల చెంతకు వెళ్లి తమ మనోగతాన్ని వెల్లడించారు. భక్తవత్సలలైన ఆ తల్లులు ముగ్గురూ వారికి కొన్ని బీజాలనిచ్చి – ‘విష్ణువు ఎక్కడయితే మోహావృతుడై వున్నాడో అక్కడీ బీజాల్ని చల్లండి’ అని చెప్పారు.
దేవతలా బీజాలను తెచ్చి శ్రీహరి మోహితుడై పడి వున్న బృందా చితా ప్రాంతమంతటా చిలకించారు.
పృధు మహారాజా! పూర్వోక్త విధంగా బృందా చితాస్థలిలో దేవతలచే చల్లబడిన బీజాల వల్ల – త్రిగుణ శోభితాలైన ఉసిరి, మాలతి, తులసి అనే మూడు రకాల వృక్షాలు ఆవిర్భవించాయి.
| శక్తి | గుణం | వృక్షం |
| సరస్వతి | తమోగుణం | ఉసిరిక (ధాత్రి) |
| లక్ష్మి | రజోగుణం | మాలతి |
| గౌరి (పార్వతి) | సత్త్వగుణం | తులసి |
అంతవరకూ బృందా మోహముతో మందుడై వున్న విష్ణువు తన చుట్టూ చెట్లయి మొలచిన లక్ష్మీ, సరస్వతీ, పార్వతీ మహిమల వలన, కోలుకున్నవాడై అనురాగపూరిత హృదయంతో ఆ వృక్షాలను తిలకించసాగాడు.
కాని, వాటిలో లక్ష్మీ దత్త బీజాలు ఈర్ష్యాగుణాన్వితాలయి వుండటం వలన ఆ బీజోత్సన్నమైన ‘మాలతి బర్బరీ’ నామధేయమై, విష్ణువునకు ఎడమయ్యింది. కేవల అనురాగపూరితాలైన ఉసిరి, తులసి మాత్రమే పీతాంబరునకు ప్రియాంకరాలయ్యాయి.
తద్వారా విష్ణువు మోహ విముక్తుడై, ధాత్రీ, తులసీ సమేతుడయి సర్వ దేవతా నమస్కారాలనూ అందుకుంటూ వైకుంఠానికి తరలి వెళ్లాడు. అందువల్లనే కార్తీక వ్రతంలోని విష్ణుపూజలో ముందుగా తులసిని పూజించినట్లయితే పుండరీకాక్షుడు ఎనలేని సంతోషాన్ని పొందుతాడు.
శ్రీహరి లీలలనీ, మహిమలనీ చెప్పడానికి ఏ ఒక్కరికీ కూడా ఎలాగైతే సాధ్యం కాదో, అదే ప్రకారం ఈ తులసీ, ధాత్రీ వృక్షాల మహిమల్ని చెప్పడం కూడా చతుర్ముఖుడైన బ్రహ్మకుగాని, సహస్రముఖుడయిన శేషునికి గాని సాధ్యం కాదు.
ఈ ధాత్రీ, తులసీ జననగాథ ఎవరు వింటున్నారో, వినిపిస్తున్నారో వాళ్లు తమ పాపాలను పోగొట్టుకున్నవారై తమ పూర్వులను కూడి శ్రేష్ఠమైన విమానంలో స్వర్గానని పొందుతున్నారు.
ఇరువది నాలుగవ (బహుళ నవమి) నాటి పారాయణం సమాప్తం
Bhagavath Geetha Telugu ఈ ఉరుకుల పరుగుల జీవితంలో మీరెప్పుడైనా ఏమీ తోచని గందరగోళాన్ని అనుభవించారా? ఈ కాలంలో చాలామంది…
Bhagavath Geetha Telugu మనిషి సాధారణంగా ఈ ప్రపంచాన్ని తన పరిమితమైన కళ్లతో చూస్తాడు. అందుకే ఒక చిన్న కష్టం…
Bhagavath Geetha Telugu మనం రోజూ ఉదయం లేవగానే ఏదో తెలియని ఒక గందరగోళం. "నా కెరీర్ ఏమవుతుంది? నా…
Bhagavath Geetha Telugu మనం సాధారణంగా మన కళ్ళతో చూసేదే నిజం అని నమ్ముతాం. ఒక వ్యక్తి కోపంగా మాట్లాడితే…
Bhagavath Geetha Telugu మన జీవితంలో చాలాసార్లు మనం చిన్న చిన్న సమస్యలకే కొండంత ఆందోళన పడతాం. రేపు ఏమవుతుందో,…
Bhagavath Geetha Telugu మన జీవితంలో ఎప్పుడో ఒకసారి అద్దం ముందు నిలబడి, "అసలు నాలో ప్రత్యేకమైనది ఏముంది? నా…