Karthika Puranam Telugu – కార్తీక పురాణం | 26వ రోజు పారాయణ

Karthika Puranam Telugu

విష్ణుగణాలు చెప్పినదంతా విని విస్మృత చేష్ఠుడూ, విస్మయరూపుడూ అయిన ధర్మ దత్తుడు పునః వారికి దండవత్గా ప్రణామాచరించి – ‘ఓ విష్ణుస్వరూపులారా! ఈ జనానీకమంతా అనేకానేక క్రతువ్రత దానాల చేత ఆ కమలనాభుడిని సేవించుకుంటూ వున్నారు. వాటి అన్నింటిలోనూ ఏ ఒక్కదానిని ఆచరించడం వలన విష్ణువునకు అత్యంత మైన ప్రీతి కలుగుతుందో – దేనివలన విష్ణు సాక్షాత్కారం లభిస్తుందో దానిని సెలవీయండి’ అని వేడుకున్న మీదట, విష్ణుగణాలు అతనిని ఇలా సమాధానపరచ సాగాయి.

చోళ రాజు చరిత్ర

పాపరహితుడైన బ్రాహ్మణుడా! నీవడిగిన ప్రశ్నకు – ఇతిహాసపూర్వకమైన సమాధానాన్ని చెబుతాను, విను. పూర్వం కాంచీపురాన్ని ‘చోళుడు’ అనే రాజు పరిపాలించేవాడు. అతని పేరు మీదనే ఆ ప్రాంతాలన్నీ చోళదేశాలుగా ప్రఖ్యాతి వహించాయి. ధర్మపాలనకు పెట్టింది పేరైన ఆ రాజు విష్ణుప్రీతికై అనేకానేక యజ్ఞాలను నిర్వర్తించాడు. అతని యజ్ఞాలకై నిర్మించబడిన బంగారపు యూపస్తంభాలతో – తామ్రపర్జీనది యొక్క రెండు తీరాలు కూడా కుబేరోద్యానవనాలైన ‘చైత్రరథా’ల వలే ప్రకాశించేవి.

విష్ణుదాసునితో వివాదం

అటు వంటి రాజు ఒకానొకనాడు ‘అనంతశయన’ మనే పేర యోగనిద్రా ముద్రితుడై వుండే విష్ణ్వాలయానికి వెళ్లి, మణిమౌక్తిక సువర్ణపుష్పాదులతో ఆ శ్రీహరిని అర్చించి, సాష్టాంగ దండ ప్రణామాలు ఆచరించి స్థిమితంగా అక్కడ శ్రీహరి సన్నిధిలోనే కూర్చున్నాడు. అంతలోనే ‘విష్ణుదాసు’డనే బ్రాహ్మణుడొకడు విష్ణ్వార్చనార్థమై ఆ ఆలయానికి వచ్చాడు. విష్ణుసూక్తాన్ని పఠిస్తూ అతడా విష్ణు సంజ్ఞను అభిషేకించి తులసిదళాలతోనూ, గుత్తులతోనూ విష్ణుపూజను నిర్వహించాడు.

అది చూసి రాజుకు కోపం వచ్చింది. ఆ కోపంలో తాను ధర్మవేత్తయై కూడా అవతలి వ్యక్తి యొక్క బ్రాహ్మణాభిజాత్యాన్ని విస్మరించి, ‘ఓరి విష్ణుదాసుడా! నేను మాణిక్యాలతోనూ, బంగారు పువ్వులతోనూ చేసిన నా పూజ వలన ప్రకాశమానుడైన ఆ ప్రభువును నీ తులసి ఆకుల పూజతో ఎందుకు కప్పివేశావురా? నేనెంతో భక్తితో ఆచరించిన పూజనిలా పాడు చేశావంటే అసలు నీకు విష్ణుభక్తి అంటే ఏమిటో తెలుసా?’ అని చీదరించుకున్నాడు.

ఆ మాటలకు ఈ బాపడికి కూడా కోపం వచ్చింది. అవతలి వ్యక్తి ‘రాజు’ అనే గౌరవాన్ని కూడా అతిక్రమించి ‘ఓ రాజా! నీకు దైవభక్తి లేదు సరికదా! రాజ్యైశ్వర్యమత్తుడవై వున్నావు. విష్ణు ప్రీత్యర్థం నీచేత ఆచరించబడిన యజ్ఞం ఏదైనా ఒక్కటి వుంటే చెప్పు’ అని ఎదిరించాడు.

అతని మాటలకు అవహేళనగా నవ్వుతూ ‘నీ మాటల వలన నీవే విష్ణుభక్తి శూన్యుడవని తెలుస్తూ వుంది. ధనహీనుడవూ, దరిద్రుడవూ అయిన నీకు భక్తి ఎలా కలుగుతుంది? అసలు నీవెప్పుడయినా విష్ణుప్రీతిగా ఒక యజ్ఞాన్ని చేశావా? కనీసం ఒక దేవాలయాన్ని కట్టించావా? ఏమీ చేయలేని వాడవైన నీకు భక్తుడవనే అహంకారం మాత్రం అధికంగా వుంది’ అని పలికాడు.

చోళుడు, విష్ణుదాసుని వ్రత నిష్ఠ

‘ఓ సదస్యులారా! సద్రాహ్మణులారా! శ్రద్ధాళువులై వినండి. నేను విష్ణు సాక్షాత్కారాన్ని పొందుతానో, ఈ బ్రాహ్మణుడే పొందుతాడో నిదానించి చూడండి. అంతటితో మా ఇద్దరిలో భక్తి ఎటువంటిదో మీకే తెలుస్తుంది’ అని ప్రతిజ్ఞా పూర్వకంగా పలికి – చోళుడు స్వగృహానికి వెళ్లి ‘ముద్గలుడు’ అనే మునిని ఆచార్యునిగా వరించి విష్ణుసత్ర యాగానికి పూనుకున్నాడు. బహుకాల పూర్వం గయాక్షేత్రంలో ఋషి సముదాయముల చేత చేయబడినదీ, అన్నదానాలూ, అనేకానేక దక్షిణలతో, సామాన్యులకు ఆచరించ సాధ్యం కానిదీ, సర్వసమృద్ధిమంతమైనదీ అయిన ఆ యజ్ఞాన్ని చేయసాగాడు రాజు.

పేదవాడైన విష్ణుదాసుడు ఆ గుడిలోనే విష్ణుదీక్షితుడై, హరిప్రీతికై ఆచరించవలసిన:

  • మాఘ, కార్తీక వ్రతాచరణలూ
  • తులసీవన సంరక్షణలూ
  • ఏకాదశినాడు ద్వాదశాక్షరీ యుత విష్ణుజపం
  • షోడశోపచార విధిని నిత్యపూజలనూ
  • నృత్యగీత వాద్యాది మంగళ ధ్వనులతోనూ, ఈ విధంగా తన శక్తిమేరకు భక్తియుక్తులతో ఆచరించసాగాడు.

నిత్యమూ సర్వవేళలలోనూ, భోజనాది సమయాలలోనూ, సంచారమందూ, తుదకు నిద్రలో కూడా హరినామ స్మరణను చేస్తూ ప్రత్యేకించి మాఘ, కార్తీక మాసాలలో విశేష నియమపాలనని ఆచరిస్తూ వున్నాడు. ఆ విధంగా భక్తులైన చోళ, విష్ణుదాసులిద్దరూ కూడా తమ సర్వేంద్రియ వ్యాపారాలనూ వ్రత నిష్ఠలోనే నిలిపి విష్ణు సాక్షాత్కార ప్రాప్తికోసం చాలా కాలం తమ వ్రతాలను ఆచరిస్తూనే వుండిపోయారు.

అన్నం దొంగిలించిన ఛండాలుడు

కాలం గడుస్తూ వుండగా, ఒకనాటి సాయంకాలం విష్ణుదాసుడు వండుకున్న భోజనాన్ని ఎవరో కాజేసుకుని వెళ్లిపోయారు. ఆ దొంగిలించిన వాళ్లెవరా అనే విషయమై విష్ణుదాసు పెద్దగా విచారణ చేయలేదు. కాని పునః వంట ప్రయత్నాలు చేద్దామంటే సాయంకాల పూజకు సమయం మించి పోతూండడం వలన ఆ రోజున భోజనం లేకుండానే విష్ణుపూజలో గడిపేశాడు. మరునాడు కూడా వంట చేసుకుని శ్రీహరికి నివేదించే లోపలే ఎవరో ఆ వంటకాలను అపహరించుకుపోయారు. విష్ణు పూజకు వేళపోనీయకూడదనే ఆలోచనతో ఆ రోజు కూడా ఆ బ్రాహ్మణుడు అభోజనంగానే హరి సేవను కొనసాగించాడు. ఇలా వారం రోజు గడిచాయి. ప్రతి రోజూ అతని భోజనాన్ని ఎవరో అతి చాకచక్యంగా దొంగిలిస్తూనే వున్నారు. అతను పస్తులుంటూ, కూడా హరిసేవ చేస్తూనే వున్నాడు.

వారం రోజుల పాటు అభోజనంగా వుండటంతో విష్ణుదాసునికి ఆ దొంగను పట్టుకోవాలనిపించింది. అందువల్ల ఒకనాడు చాలా పెందలాడే ముగించుకుని, వంటకాలను పూర్వస్థానమందే వుంచి తానో చాటున దాగి కూర్చుని, దొంగ కోసం ఎదురు చూడసాగాడు. కాసేపటికి ఒకనొక ఛండాలుడు ఆ అన్నాన్ని దొంగిలించేందుకు వచ్చాడు. వాడి ముఖం అత్యంత దీనంగా వుంది. రక్తమాంసాలే మాత్రమూ లేకుండా – కేవలం ఎముకల మీద చర్మం కప్పినట్లుగా వున్నవాడూ, అన్నార్తుడూ అయిన ఆ ఛండాలుడు వంటకాలను దొంగిలించుకు పోసాగాడు.

విష్ణుదాసుని కరుణ

అతని దైన్యహైన్యస్థితిని చూసి, అప్పటికే కరుణాభరితమైన హృదయంతో వున్న బ్రాహ్మణుడు ‘ఓ మహాత్మా! కాస్సేపు ఆగవయ్యా! ఆ అన్నాన్ని అలా వట్టిగా తినడం కష్టం. ఈ నేతిని కూడా పట్టుకుని వెళ్లు’ అంటూ నేతి ఝారీతోసహా అతని వెంటపడ్డాడు.

ఈ విప్రుడు తనను బంధించి రాజభటులకకు అప్పగించుతాడనే భయంతో ఆ ఛండాలుడు పరుగు తీయనారంభించాడు. ఈ పారుడు కూడా ఆ చోరుని వెనకాలనే పరుగెడుతూ – ‘అయ్యా! నెయ్యి తీసుకుని వెళ్లి కలుపుకుని తినవయ్యా స్వామీ’ అని అరుస్తూనే వున్నాడు. అసలే అలసటగా వున్న ఛండాలుడు భయం వలన నేలనపడి మూర్ఛపోయాడు. అతనిని వెన్నంటి వచ్చిన విష్ణుదాసుడు ‘అయ్యో! మూర్ఛపోయావా మహాత్మా!’ అంటూ తనపై వస్త్రపు చెంగులతో ఆ ఛండాలునికి విసరసాగాడు. ఆ సేవ వల్ల అతి శీఘ్రంగా కోలుకున్న ఛండాలుడు – చిరునవ్వు నవ్వుతూ లేచాడు.

విష్ణు సాక్షాత్కారం

ఇప్పుడితను విష్ణుదాసుని కళ్లకు – శంఖచక్ర గదాబ్జధారీ, పీతాంబరుడూ, చతుర్భుజుడూ, శ్రీవత్సలాంఛితుడూ, కౌస్తుభాలంకృతుడూ అయిన శ్రీమన్నారాయణుని వలే గోచరించడంతో అతగాడు స్వాత్త్వికభావా వృతుడై పోయి – అవాక్కుగా వుండిపోయాడు. ఈ భక్త భగవానుల సంగమ దర్శనార్ధం ఇంద్రాదులెందరో విమానారూఢులై ఆ ప్రాంతాలకకు వచ్చారు. విష్ణువు మీదా, విష్ణుదాసుడి మీదా కూడా విరివాన కురిపించారు. అప్సరసలు ఆడారు. గంధర్వులు పాడారు. దేవగణాల వందలాది విమానాలతో ఆకాశం నిండిపోయినట్లనిపించింది.

అనంతరమా ఆదినారాయణుడు విష్ణుదాసుని గ్రుచ్చి కౌగిలించుకున్నాడు. తన సారూప్యాన్ని ప్రసాదించి తనతో బాటే తన విమాన మెక్కించుకుని వైకుంఠానికి బయల్దేరాడు.

చోళుని పశ్చాత్తాపం

యజ్ఞవాటికలో వున్న చోళుడు – గగనగాములైన బ్రాహ్మణ బ్రహ్మ జనకులిద్దరినీ చూసి ఆశ్చర్యపోయాడు. తక్షణమే తన ఆచార్యుని పిలిచి – ‘ఓ ముద్గరమునీ! నాతో వివాదమాడిన ఆ నిరుపేద విప్రుడు విష్ణురూపాన్ని పొంది వైకుంఠానికి వెళ్లిపోతున్నాడు. అమితైశ్వర్యవంతుడవైన నేను అసాధ్యాలయిన యజ్ఞదానాలను చేస్తూ కూడా విష్ణు సాక్షాత్కారాన్ని పొందలేకపోయానంటే ఇక వైకుంఠం అసంగతమే గదా! నేను ఎన్ని యజ్ఞాలు చేసినా బ్రాహ్మణులు కోరినంత దక్షిణలను సమర్పించినా కూడా ఆ శ్రీహరికి నా మీద లేశమైనా కృప కలిగినట్లు లేదు. దీనిని బట్టి కేవల భక్తియే తప్ప విష్ణ్వనుగ్రహానికి మరో మార్గం లేదు. ఈ యజ్ఞ యాగాది కర్మకాండలన్నీ అనవసరంగా భావిస్తున్నాను,’ అని చెప్పాడు.

బాల్యం నుంచీ యజ్ఞదీక్షలోనే వుండటం వలన నిస్సంతుడయిన ఆ రాజు తన సింహాసనం మీద తన మేనల్లునికి స్వయంగా పట్టాభిషేకం చేశాడు.

తస్మాదద్యాపి తద్దేశే సదారాజ్యాంశ భాగినః
స్వ స్రీయా ఏవ జాయంతే తత్కృతావిధి వర్తినః

తాత్పర్యము: ఆ కారణం చేతనే – ఇప్పటికీ కూడ ఆ చోళ దేశాలలో రాజ్యాధికారాన్ని పొందడంలో రాజుల మేనళ్లులే కర్తలవుతూ వున్నారు.

అనంతరం చోళుడు యజ్ఞ హోమగుండం దగ్గరకు చేరి – ‘ఓ శ్రీహరీ! త్రికరణ శుద్ధిగా నీ యందలి భక్తిని నా యందు సుస్థిరం చేయి తండ్రీ!’ అని ప్రార్థించి సమస్త సదస్యులూ చూస్తూండగానే అగ్నిప్రవేశ మాచరించాడు.

ముద్గలుని శిఖ త్యాగం, చోళునికి వైకుంఠ ప్రాప్తి

ముద్గలస్తు అతః క్రోథా చ్చిఖ ముత్పాటయిన్ స్వకాం
అత స్త్వ ద్యాపి తద్దోత్రే ముద్దలా విశిఖాభవన్

తాత్పర్యము: అది చూసి క్రుద్ధుడైన ముద్గలుడు తన శిఖను పెరికివేసుకున్నాడు. అది మొదలు ఆ గోత్రమీనాటికి విశిఖ’గానే వర్థిల్లుతోంది.

హోమగుండంలో ప్రవేశించిన రాజును – అందులోని అగ్ని నుంచి ఆవిర్భవించిన శ్రీహరి ఆదుకున్నాడు. చోళుని అలింగనం చేసుకుని అతనికి సారూప్యాన్ననుగ్రహించి అక్కడి వారందరూ ఆశ్చర్యంగా చూస్తుండగానే తనతో వైకుంఠానికి తీసుకుని వెళ్లిపోయాడు.

విష్ణుగణుల ఉపసంహారం

ఓ ధర్మదత్తా! అలనాడే ఈ విధంగా ఆ శ్రీహరి అటు విష్ణుదాసుని, ఇటు చోళునీ కూడా అనుగ్రహించి, సాక్షాత్కారమిచ్చి – తన వైకుంఠ ద్వారపాలకులుగా చేసుకొన్నాడు కాబట్టి – ఓ విప్రుడా! విష్ణ్వనుగ్రహానికి, విష్ణు సాక్షాత్కారానికి రెండు విధాలుగా వున్న ఒకే ఒక్క మార్గం – భక్తి మాత్రమే. ఆ మార్గాలు రెండూ:

  1. ఆత్మజ్ఞానం
  2. ఆత్మార్పణం

అని ధర్మదత్తునికి బోధించి విష్ణు పార్షదులు మౌనం వహించారు.

ఇరువది ఆరవ (బహుళ ఏకాదశి) రోజు పారాయణము సమాప్తము.

bakthivahini

Recent Posts

Bhagavad Gita Chapter 10 Verse 8 | భగవద్గీత 10వ అధ్యాయం 8వ శ్లోకం

Bhagavad Gita Chapter 10 Verse 8 ప్రతిరోజూ ఉదయం లేచి, మనం ఎన్నో కలలతో, ఆశలతో రోజును ప్రారంభిస్తాం.…

2 hours ago

Bhagavad Gita Chapter 10 Verse 7 | భగవద్గీత 10వ అధ్యాయం 7వ శ్లోకం

Bhagavad Gita Chapter 10 Verse 7 ఈ రోజుల్లో చాలా మంది ఉదయం లేవగానే ఒక రకమైన అలసటతో…

1 day ago

Bhagavad Gita Chapter 10 Verse 6 | భగవద్గీత 10వ అధ్యాయం 6వ శ్లోకం

Bhagavad Gita Chapter 10 Verse 6 ఈ రోజుల్లో చాలామందిని వేధిస్తున్న ప్రధాన సమస్య – "అసలు నేనెవరిని?…

2 days ago

Bhagavad Gita Chapter 10 Verse 4 & 5 | భగవద్గీత 10వ అధ్యాయం 4 & 5వ శ్లోకం

Bhagavad Gita Chapter 10 Verse 4 & 5 ఈ రోజుల్లో చాలా మందిని పట్టి పీడిస్తున్న ఒకే…

2 weeks ago

Bhagavad Gita Chapter 10 Verse 3 | భగవద్గీత 10వ అధ్యాయం 3వ శ్లోకం

Bhagavad Gita Chapter 10 Verse 3 మనలో చాలామంది రాత్రి పడుకునే ముందు ఒకే ఆలోచనతో సతమతమవుతుంటారు. "ఈరోజు…

2 weeks ago

Bhagavad Gita Chapter 10 Verse 2 | భగవద్గీత 10వ అధ్యాయం 2వ శ్లోకం

Bhagavad Gita Chapter 10 Verse 2 మనలో చాలా మంది జీవితం... బయట ప్రపంచంతో యుద్ధం చేయడం కంటే,…

2 weeks ago