Karthika Puranam Telugu
విష్ణుగణాలు చెప్పిన చోళ, విష్ణుదాసుల కథానంతరం, ధర్మదత్తుడు మరలా వారిని ‘ఓ గణాధిపతులారా! జయ-విజయులు వైకుంఠమందలి విష్ణుద్వారపాలకులని వినివున్నాను. వారెటువంటి పుణ్యం చేసుకొనడం వలన విష్ణుస్వరూపులై అంతటి స్థానాన్ని పొందారో తెలియజేయండి’ అని అడగడంతో ఆ గణాధిపతులు చెప్పనారంభించాడు.
తృణబిందుడి కూతురు దేవహూతి. ఆమె యందు కర్దమ ప్రజాపతి యొక్క దృకలనం జరగడం వలన ఇద్దరు కుమారులు కలిగారు. వారిలో పెద్దవాడు జయుడు, రెండో వాడు విజయుడు.
వాళ్లిద్దరూ కూడా విష్ణుభక్తి పరాయణులే అయ్యారు. అనంతరం అష్టాక్షరీ మంత్రాన్ని జపించడం వలన వాళ్లు విష్ణు సాక్షాత్కారాన్ని కూడా పొందారు. వేదవిదులయ్యారు. యజ్ఞాలు చేయించడంలో ప్రజ్ఞ గలవారుగా ప్రసిద్ధి చెందారు. అందువలన, మరుత్తుడనే రాజు వీరిద్దరి వద్దకు వచ్చి తన చేత యజ్ఞం చేయించవలసిందిగా వాంఛించాడు.
అన్నదమ్ములిద్దరూ కలిసి వెళ్లి, ఒకరు బ్రహ్మ, మరొకరు యాజకులుగా వుండి, ఆ యజ్ఞాన్ని దిగ్విజయంగా నెరవేర్చారు. సంతుష్టుడైన మరుత్తు, వారికి అగణితమైన దక్షిణలనిచ్చాడు. ఆ సొమ్ముతో ఈ అన్నదమ్ములు ఎవరికి వారుగా విష్ణుయజ్ఞం నిర్వర్తింపదలచారు. తదర్ధంగా మరుత్తు ఇచ్చిన – మహాదక్షిణను పంచుకోవడములో ఇరువురికీ తగాదాలు వచ్చాయి.
| సోదరుడు | వాదన | పర్యవసానం |
| జయుడు | ఇద్దరికీ చెరిసగం కావాలి | విజయుడిపై కోపంతో ‘నువ్వు మొసలివై పొమ్మని’ శాపం పెట్టాడు16. |
| విజయుడు | తనకు ఎక్కువగా వాటా కావాలి | జయుడిపై ప్రతిశాపంగా ‘అహంకారంతో శపించిన నువ్వు, సాహంకారియైన సామజమై (ఏనుగు) పుడతావులే’ అని ప్రతిశాపమిచ్చాడు. |
ఇలా పరస్పర శప్తులైన ఆ సోదరులిద్దరూ విష్ణ్వర్చన చేసి ఆయనను సాక్షాత్కరింప చేసికొనినవారై తమ శాపాలనూ, తత్పూర్వాపరాలనూ విన్నవించుకుని శాపవిముక్తికై ఆ శ్రీహరినే ఆశ్రయించారు.
వారి మనవి: “హే భగవాన్! నీకింతటి చేరువ భక్తులమైన మేము మొసలిగానూ, ఏనుగుగానూ పుట్టడం చాలా ఘోరమైన విషయం. కనుక మా శాపాల నుంచి మమ్ములను మళ్లించు” అని మనవి చేశారు.
అందుకు అంబుజనాభుడు మందహాసం చేస్తూ ఇలా అన్నాడు: “జయ-విజయులారా! నా భక్తుల మాటలు పొల్లుపోనీకపోవడమే నా విధి. వాటిని అసత్యాలుగా చేసే శక్తి నాకు లేదు. పూర్వం ప్రహ్లాద వాక్యం కోసం స్తంభం నుంచి ఆవిర్భవించాను. అంబరీషుని వాక్యం ప్రకారం దశావతారాలనూ ధరించాను. అందువలన మీరు సత్యం తప్పనివారై – మీ మీ శాపాలను అనుభవించి అంత్యంలో వైకుంఠాన్ని పొందండి” అని ఆదేశించాడు.
తదా దేశాన్ని శిరసావహించి ఆ జయ-విజయులిద్దరూ గండకీనది ప్రాంతాన మకర (మొసలి), మాతంగాలుగా (ఏనుగు) జన్మించారు. వారికి పూర్వ జన్మ జ్ఞానం కలవారై – విష్ణు చింతనతోనే కాలం గడుపసాగారు. అలా వుండగా ఒకానొక కార్తీకమాసం ప్రవేశించింది.
ఆ కార్తీకమాసంలో కార్తీకస్నానం చేయాలనే కోరికతో – ఏనుగైన జయుడు గండకీ నదికి వచ్చాడు. నీటిలోనికి దిగిందే తడవుగా అందులోనే మొసలిగా వుంటున్న విజయుడు ఏనుగును గుర్తించి దాని పాదాన్ని బలంగా నోటగరిచాడు. విడిపించుకోడానికి చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో గజదేహుడైన జయుడు విష్ణువును ప్రార్థించాడు.
తలచినదే తడవుగా ప్రత్యక్షమైన తారక్ష్యవాహనుడు (విష్ణువు) తన చక్రాయుధాన్ని ప్రయోగించి ఆ కరిమకరాలు రెండింటినీ ఉద్ధరించి వారికి వైకుంఠ ప్రాప్తిని కలిగించాడు.
తదాదిగా ఆ స్థలం హరిక్షేత్రంగా విరాజిల్లాసాగింది. విష్ణు ప్రయుక్త చక్రాయుధం ఒరిపిడి వలన ఆ గండకీనదిలోని శిలలు చక్ర చిహ్నాలతో కూడుకొన్నవయ్యాయి.
ఓ ధర్మదత్తా! నీచే అడుగబడిన వారైన విష్ణు ద్వారపాలకులకు జయ విజయులు వారే. అందువలన నీవు కూడా:
జన్మ ప్రభృతిగా నీవు అనుష్ఠిస్తూన్న ఈ కార్తీక విష్ణువ్రతం కంటె – దాన, తపో, యజ్ఞ తీర్థాలు ఏవీ కూడా గొప్పవి కావని గుర్తుంచుకో.
ఓ విప్రుడా! దైవ ప్రీతికరమైన విష్ణు వ్రతాచరణం వలన నీవూ, నీ పుణ్యంలో సగభాగం అందుకొనడం వలన ఈ కలహ కూడా ధన్యులయ్యారు. ప్రస్తుతం మేము ఆమెను వైకుంఠానికి తీసుకుని వెడుతున్నాము’ అని విష్ణుగణాలు ధర్మదత్తునితో హితవాడి అతనిని పునః నియమవ్రత నిష్ఠుడిని చేసి కలహా సమేతంగా విమానాన వైకుంఠానికి బయలుదేరారు.
నారదుడు చెబుతున్నాడు! ‘పృథురాజా! అతి పురాతనమైన ఈ పుణ్యేతిహాసాన్ని ఏ మానవుడైతే వింటున్నాడో, ఇతరులకు వినిపిస్తున్నాడో , వాడు శ్రీ మహావిష్ణువు యొక్క సంపూర్ణానుగ్రహానికి పాత్రుడై – విష్ణు సాన్నిధ్యాన్ని పొందదగిన జ్ఞానాన్ని పొందుతూన్నాడు.
నారదుడు చెప్పినదంతా విని, ఆశ్చర్యమయుడైన పృథు చక్రవర్తి – ‘హే దేవర్షీ! ఇప్పుడు నువ్వు చెప్పిన హరిక్షేత్రం, గండకీ నదులు లాగానే గతంలో కృష్ణ, సరస్వతీత్యాది నదుల గురించి విన్నాను. ఆ మహా మహిమలన్నీ ఆ నదులకు చెందినవా? లేక, ఆ క్షేత్రాలకు చెందినవా? విశదపరచవే” అని కోరగా మరలా నారదుడు చెప్పసాగాడు.
‘శ్రద్ధగా విను. కృష్ణానది సాక్షాత్తూ విష్ణుస్వరూపం. సరస్వతీనది శుద్ధ శివస్వరూపం. వాటి సంగమ మహాత్మ్యం వర్ణించడం బ్రహ్మకు కూడా అసాధ్యమే అవుతుంది.
ఒకానొక చాక్షుష మన్వంతరంలో, బ్రహ్మ దేవుడు సహ్యపర్వత శిఖరాలపై సవనం (యజ్ఞం) చేసేందుకు సమాయత్తుడయ్యాడు. హరిహరులతో సహా సర్వదేవతలూ, మునులూ కూడా కలసి ఒకానొక దైవ ముహూర్తంలో బ్రహ్మకు యజ్ఞ దీక్ష నీయడానికి నిర్ణయించి – కర్త యొక్క కళత్రమయిన సరస్వతికి విష్ణుమూర్తి ద్వారా కబురు పంపారు. అయినా సరస్వతి సమయానికి అక్కడకు చేరుకోలేదు.
దీక్షా ముహూర్తం అతిక్రమించరాదనే నియమం వలన భృగుమహర్షి – ‘హే విష్ణూ! సరస్వతి ఎందుకు రాలేదో తెలియదు. ముహూర్తం దాటిపోతోంది. ఇప్పుడేమిటి గతి?’ అని ప్రశ్నించడంతో శ్రీహరి చిరునవ్వు నవ్వుతూ ‘సరస్వతి రాని పక్షంలో బ్రహ్మకు మరి యొక భార్యయైన గాయత్రిని దీక్షాపతిగా విధించండి‘ అని సలహా యిచ్చాడు. ఆ సలహాను శివుడు కూడా సమర్థించడంతో భృగువు గాయత్రిని రప్పించి, బ్రహ్మ యొక్క దక్షిణభాగంలో ముందుగా ఆమెను ప్రవేశ పెట్టి దీక్షావిధిని ఏర్పరిచాడు.
ఆ విధంగా ఋషులందరూ కలసి హరిహరుల సమక్షంలో బ్రహ్మకు దీక్షనీయడం పూర్తి చేయగానే – అక్కడకు సరస్వతి చేరుకుంది. తన స్థానంలో దీక్షితురాలయి వున్న తన సవతిని గాయత్రిని చూసి మత్సరవతియై – శపించింది.
సరస్వతీ దేవి శాపం
అపూజ్యా యత్ర పూజ్యంతే, పూజ్యానాంచ వ్యతిక్రమః
త్రీణి త్రత్ర భవిష్యంతి దుర్భిక్షం మరణం భయం
అర్థము: ఎక్కడైతే పూజార్హత లేనివారు పూజింపబడుతున్నారో, మరియు పూజనీయులు పూజింప బడడము లేదో – అక్కడ కరువు (దుర్భిక్షం), భయము, మరణము – అనే మూడు విపత్తులు కలుగుతాయి.
ఆ సరస్వతీ క్రుద్ధ వచనాలను వింటూనే, చివ్వున లేచిన గాయత్రి – దేవతలు వారించుతున్నా సరే వినకుండా – ఈ బ్రహ్మ నీకు ఏ విధంగా భర్తయో, అదే విధంగా నాకు కూడా భర్తేనని విస్మరించి అకారణంగా శపించావు గనుక నువ్వు కూడా నదీ రూపాన్ని పొందు’ అని ప్రతిశాపమిచ్చింది.
ఈ లోపల హరిహరులా వాణిని సమీపించి – ‘మేము నదులమయినట్లయితే లోకాలన్నీ అతలాకుతలమయిపోతాయి. గనుక, అవివేక భూయిష్ఠమైన నీ శాపాన్ని మళ్లించుకో’మన్నారు. కాని ఆమె వినలేదు.
‘యజ్ఞాదిలో మీరు విఘ్నేశ్వర పూజ చేయక పోవడం వలననే నా కోప రూపంగా యాగం విఘ్నపడి ఆగమయ్యింది. పలుకుల పడతినైన నా మాట తప్పదు. మీరందరూ నదీరూపాలను ధరించి, మీ అంశలు జడత్వాన్ని వహించవలసినదే. సవతులమైన నేను, గాయత్రీ కూడా నదులమై పశ్చిమాభిముఖంగా ప్రవహించబోతున్నాము’ అని చెప్పింది.
ఆమె మాటలు వింటూనే సకల దేవతాంశలూ జడాలుగానూ, రూపాలు నదులుగానూ పరిణమించాయి. ఆ సమయంలో:
ఈ యజ్ఞంలో ప్రతిష్ఠితులైన శివ, కేశవులు – మహాబలుడు, అతిబలుడు అనే దేవతా స్వరూపులయ్యారు. సర్వపాపహారిణియైన ఈ కృష్ణానదీ ప్రకర్షత్పత్తిని భక్తితో చదివినా, వినినా వినిపించినా – వారి వంశమంతా కూడా నదీ దర్శన స్నాన పుణ్యఫలవంతమై తరించిపోతుంది.
ఇరువది ఏడవ (బహుళ ద్వాదశి) రోజు పారాయణము సమాప్తము
Bhagavad Gita Chapter 10 Verse 8 ప్రతిరోజూ ఉదయం లేచి, మనం ఎన్నో కలలతో, ఆశలతో రోజును ప్రారంభిస్తాం.…
Bhagavad Gita Chapter 10 Verse 7 ఈ రోజుల్లో చాలా మంది ఉదయం లేవగానే ఒక రకమైన అలసటతో…
Bhagavad Gita Chapter 10 Verse 6 ఈ రోజుల్లో చాలామందిని వేధిస్తున్న ప్రధాన సమస్య – "అసలు నేనెవరిని?…
Bhagavad Gita Chapter 10 Verse 4 & 5 ఈ రోజుల్లో చాలా మందిని పట్టి పీడిస్తున్న ఒకే…
Bhagavad Gita Chapter 10 Verse 3 మనలో చాలామంది రాత్రి పడుకునే ముందు ఒకే ఆలోచనతో సతమతమవుతుంటారు. "ఈరోజు…
Bhagavad Gita Chapter 10 Verse 2 మనలో చాలా మంది జీవితం... బయట ప్రపంచంతో యుద్ధం చేయడం కంటే,…