Karthika Puranam
వశిష్ఠ మహర్షి జనక నరేంద్రుడితో ఇలా అన్నారు : “ఓ జనక నరేంద్రా! కార్తీక మాసములో ఎవరైతే శ్రీహరి ముందర నాట్యమును చేస్తారో, వాళ్లు శ్రీహరి ముందర నివాసులవుతారు.”
కార్తీక శుద్ధ ద్వాదశినాడు చేసే ప్రతి సత్కర్మా అక్షయ పుణ్యాన్నీ, ప్రతి దుష్కర్మా అక్షయ పాపాన్ని కలిగించుతాయి.
సరస్వతీ నదీతీరంలో – అనాదికాలముగా పూజా పునస్కారాలు లేక శిథిలమై పోయిన విష్ణ్వాలయము ఒకటి ఉండేది. కార్తీక స్నానార్థమై వచ్చిన ఒక యతి ఆ గుడిని చూసి, అది తన తపోధ్యానాలకు అనువుగా ఉంటుందని భావించి , ఆ గుడిని తుడిచాడు, నీళ్లు చల్లాడు.
ఆ యతి చేరువ గ్రామానికి వెళ్లి – ప్రత్తి, నూనె, పన్నెండు ప్రమిదలూ తెచ్చి – దీపాలను వెలిగించి ‘నారాయణార్పణమస్తు’ అనుకుని ధ్యానము చేసుకోసాగాడు.
ఈ యతి ప్రతి రోజూ ఇలా చేస్తుండగా – కార్తీక శుద్ధ ద్వాదశి నాటి రాత్రి, ఆకలితో కడుపులో ఎలుకలు పరుగెడుతున్న ఒక ఎలుక గుడిలోనికి వచ్చింది. అది ఆహారాన్వేషణలో విష్ణు విగ్రహానికి ప్రదక్షిణముగా తిరిగి , మెల్లగా దీపాల దగ్గరకు చేరినది.
రాజా! కార్తీక శుద్ధ ద్వాదశినాడు విష్ణుసన్నిధిలో ఒక యతీంద్రుడు పెట్టిన దీపము ఆరిపోగా, అదే విధముగా ఎలుక వలన పునః ప్రజ్వలితమైంది. తన పూర్వపుణ్యవశాన, ఆ మూషికము ఆ రాత్రి ఆ గుడిలోనే విగతదేహియై దివ్యమైన పురుష శరీరాన్ని పొందడం జరిగింది.
ధ్యానములో నుండి లేచిన యతి ఆ అపూర్వ పురుషుణ్ణి చూసి ‘ఎవరు నువ్వు? ఇక్కడికి ఎందుకొచ్చావు?’ అని అడిగాడు.
దానికి ఆ అద్భుత పురుషుడు – ‘ఓ యతీంద్రా! నేనొక ఎలుకను. అటువంటి నాకు ఇప్పుడు ఈ దుర్లభమైన మోక్షము ఏ పుణ్యము వలన వచ్చిందో తెలియడం లేదు. పూర్వజన్మలో నేనెవరిని? ఏ పాపము వలన అలా ఎలుకనయ్యాను? ఏ పుణ్యము వలన ఈ దివ్యదేహమును పొందాను? దయగలవాడివై వివరించు. నేను నీ శిష్యుణ్ణి’ అని ప్రార్థించాడు.
ఆ యతి తన జ్ఞాన నేత్రముతో సర్వాన్నీ దర్శించి చెప్పసాగాడు. నాయనా! పూర్వము నువ్వు జైమినీగోత్ర సంజాతుడవైన బాహ్లికుడనే బ్రాహ్మణుడవు. బాహ్లిక దేశ వాస్తవ్యుడవైన నువ్వు- నిరంతరం సంసార పోషణా పరాయణుడివై స్నానసంధ్యాదుల్ని విసర్జించి, వ్యవసాయమును చేబట్టి, వైదిక కర్మానుష్ఠానులైన విప్రులని నిందిస్తూండేవాడివి. దేవతార్చనలను దిగవిడిచి సంభావనా లాలసతతో శ్రాద్ధభోజనాలను చేస్తూ నిషిద్ధ దినాలలో కూడా రాత్రింబవళ్ళు తినడమే పనిగా బ్రతికావు, చివరకు కాకబలులూ పిశాచబలులను కూడా భుజిస్తూ- వేదమార్గాన్ని
తప్పి చరించావు. అందగత్తె యైన నీ భార్య కందిపోకండా – ఇంటి పనులలో సహాయార్థము ఒక దాసీదానిని నియమించి, బుద్ధి వక్రించినవాడవై నిత్యం ఆ దాసీదానిని తాకుతూ, దానితో మాట్లాడుతూ, హాస్యాలాడుతూ, నీ పిల్లలకు దాని చేతనే భోజనాదులు పెట్టిస్తూ నువ్వు కూడా దానిచేతి కూటినే తింటూ అత్యంత హీనంగా ప్రవర్తించావు. నీకంటే దిగువ వారికి పాలు, పెరుగు, మజ్జిగ, నెయ్యి అమ్ముకుంటూ సొమ్ములు కూడబెట్టావు. అంతేగాదు ధనలుబ్ధుడవై నీ కూతురిని కూడా కొంత ద్రవ్యానికి, యెవరికో విక్రయింప చేశావు. ఆ విధముగా కూడబెట్టినదంతా
భూమిలో దాచిపెట్టి అర్థంతరముగా మరణించావు. ఆయా పాపాల కారణంగా నరకాన్ని అనుభవించి, పునః యెలుకవై పుట్టి యీ జీర్ణ దేవాలయంలో వుంటూ
బాటసారులు దైవ పరముగా సమర్పించిన దేవద్రవ్యాన్ని అపహరిస్తూ బ్రతికావు. ఈ
రోజు మహాపుణ్యవంతమైన కార్తీక శుద్ధద్వాదశి కావడం వలనా- ఇది విష్ణు
సన్నిధానమైన కారణంగానూ-నీ యెలుక రూపము పోయి ఈ నరరూపము
సిద్ధించినది.
పై విధంగా యతి చెప్పినది విని, తన గతజన్మ కృతపాపాలకు పశ్చాత్తప్తుడై, ఆ యతి యొక్క, మార్గదర్శకత్వంలోనే ఆ మరునాటి నుండి – కార్తీకశుద్ధ త్రయోదశి, చతుర్దశి పౌర్ణమిలలో మూడురోజులు సరస్వతీనదిలో ప్రాతఃస్నానాన్ని ఆచరించి, ఆ పుణ్య ఫలము వలన వివేకవంతుడై, బ్రతికినంత కాలమూ ప్రతీ సంవత్సరము కార్తీక వ్రతాచరణా, తత్పరుడై, మసలి, అంత్యములో సాయుజ్య మోక్షాన్ని పొందాడు. కాబట్టి, కార్తీక శుద్ధ ద్వాదశినాడు భాగవత్పరాయణుడై స్నాన దాన పూజా దీప మాలార్పణాదికములను నాచరించేవాడు. శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రుడు, పాపనిముక్తుడునై, సాయుజ్య పదాన్ని పొందుతాడని విశ్వసించు.
జనకమహారాజా! దామోదరునకు అత్యంత ప్రీతికరమైన ఈ కార్తీకము నెల రోజులూనియమముగా తారబూలదానమును చేసేవాళ్లు మరుజన్మలో భూపతులుగా జన్మిస్తారు. ఈ నెలలో పాడ్యమి పాడ్యమి లగాయితు రోజుకోక్కొక్క దీపము చొప్పున విష్ణుసన్నిధిని వెలిగించే వాళ్లు వైకుంఠగాములవుతారు. సంతానవాంచితుడు కార్తీక పౌర్ణమినాడు వాంఛ సంకల్ప పూర్వకంగా సూర్యుని సుద్దేశించి స్నానదానాలను చేయడం వలన సంతాన వంతులవుతారు. విష్ణుసన్నిధిని కొబ్బరికాయను దక్షిణ తాంబూలాలతో సహా దానమిచ్చిన వాళ్ళకి వ్యాధులు రావు. దుర్మరణాలుగాని, సంతాన విచ్చేదాలు కాని జరగవు.
పూర్ణిమనాడు విష్ణుసన్నిధిని స్తంభదీప ప్రజ్వలనం వలన వైకుంఠ పతిత్వం సిద్దిస్తుంది. రాతితోగాని, కొయ్యతోగాని స్తంభం చేయించి దానిని విష్ణ్వాలయమునకు ముందు పాతి, ఆ మీదట శాలిధాన్య వ్రీహిధాన్యమును, నువ్వులనుపోసి, దానిపై నేతితో దీపము పెట్టిన వాళ్లు హరిప్రియులవుతారు. ఈ స్తంభదీపాన్ని చూసినంత మాత్రం చేతనే సమస్త పాపాలూ నశించిపోతాయి. ఈ దీపమును పెట్టినవాళ్ళకి వైకుంఠపతిత్వము సిద్దిస్తుంది. ఇక దీపాన్ని దానము చేయడము వలన కలిగే పుణ్యాన్ని వర్ణించడము ణా వల్లనయ్యే పనికాదు. ఈ స్తంభదీప మహిమకు ఉదాహరణగా, ఒక కధను చెబుతాను విను, అని చెప్పసాగాడు వశిష్ఠుడు.
నానా తరుజాల మండితమైన మతంగముని అశ్రమములో ఒక విష్ణ్వాలయము వుండేది. ఎందరెందరో మునులా ఆలయానికి వచ్చి, కార్తీకావ్రతులై ఆ నెల్లాళ్ళూ శ్రీహరిని షోడశోపచారాలతోనూ ఆర్చిస్తూండేవారు. ఒకానొక కార్తీకమాసములో వ్రతస్థలములోని ఒక ముని, కార్తీకములో విష్ణుసన్నిధిని స్తంభదీపమును పెట్టడం వలన వైకుంఠము లభిస్తుందని చెబుతారు ఈరోజు కార్తీక పూర్ణిమ గనుక, మనము కూడా ఈవిష్ణ్వాలయ ప్రాంగణములో స్తంభదీపాన్ని వెలిగిద్దాము” అని సూచించాడు అందుకు సమ్మతించిన బూషులందరూ, ఆ గుడి యెదుటనే, కొమ్మలూ, కణుపులూ లేని స్థూపాకారపుచెట్టు నొకదానిని చూసి, దానినే స్తంభముగా నియంత్రించి, శాలివ్రీహి తిల సమేతముగా దానిపై నేతితో దీపాన్ని వెలిగించి విష్ణర్పణము చేసి, పునః గుడిలోకి వెళ్ళి పురాణ కాలక్షేపము చేయసాగారు. అంతలోనే వారికి చటచ్చటారావాలు వినిపించడంతో వెనుదిరిగి స్తంభదీపము వైపు చూశారు. వాళ్ళలా చూస్తుండగానే అ స్తంభము ఫటఫటరావాలతో నిలువునా పగిలి నేలను పడిపోయింది. అందులో నుంచి ఒక పురుషాకారుడు వేలువడంతో విస్మయచకితులైన ఆ ఋషులు ‘ఎవరునువ్వు? ఇలా స్థాణువుగా ఎందుకు పడి వున్నావు?
నీ కథ ఏమిటో చెప్పు’ అని అడిగారు. అందుకు ఆ పురుషుడు ఇలా చెప్పసాగాడు. ఓమునివరేణ్యలారా! నేను గతములో ఒక బ్రాహ్మణుడను అయినా, వేదాశాస్త్ర పఠనమునుగాని, హరి కథా శ్రవణమును గాని, క్షేత్రయాత్రాటనలను గాని, చేసి ఎరుగను. అపరిమిత ఐశ్వర్యము వలన బ్రాహ్మణా ధర్మాన్ని వదలి రాజువై పరిపాలన చేస్తూదుష్టబుద్ధితో ప్రవర్తించేవాడిని. వేద పండితులు. ఆచారవంతులు పుణ్యాత్ములు, ఉత్తములూ అయిన బ్రాహ్మణులను నీచసనాలపై కూర్చో నియోగించి, నేను ఉన్నతాసనముపై కూర్చునే వాడిని. ఎవరికీ దాన ధర్మాలు చేసే వాళ్లే కాదు. తప్పనిసరినప్పుడు మాత్రం , ‘ఇంతిస్తాను, అంతిస్తాను’ అని వాగ్ధానం చేసే వాన్ని, తప్ప, ద్రవ్యాన్నీ మాత్రము ఇచ్చే వాడిని కాను. దేవబ్రాహ్మణ ద్రవ్యాలను స్వంతానికి ఖర్చుచేసుకునే వాడిని. తత్ఫలితముగా దేహాంతాన నరకగతుడనై, అనంతరము , 52 వేల మార్లు కుక్కగాను, పది వేల సార్లు కాకిగాను, మరో పదివేల సార్లు తొండగానూ, ఇంకో పదివేల సార్లు విష్ణాశినైన పురుగుగానూ కోటి జన్మలు చేట్టుగానూ గత కోటి జన్మలుగా ఇలా మేద్దువలెనూ పరిణమించి కాలమును గడుపుతూన్నాను. ఇంతటి పాపినైన నాకు ఇప్పుడెందుకు విమోచనము కలిగిందో ఈ విశేష పురుషాకృతి ఎలా వచ్చినదో సర్వజ్ఞులైన మీరే చెప్పాలి.
ఆ అద్భుత పురుషుని వచనాలను విన్న ఋషులు తమలో మాటగా యిలా అన్నారు… “ఈ కార్తీక వ్రతఫలము యదార్ధమైనది సుమా! ఇది ప్రత్యక్ష మోక్షదాయకము. మన కళ్ళ ముందరే ఈ కొయ్యకు ముక్తి కలిగినది కదా! అందునా కార్తీక పూర్ణమినాడు స్తంభదీపమును పెట్టడం సర్వత్రా శుభప్రదము. మనచే పెట్టబడిన దీపము వలన ఈ మొద్దు ముక్తిని పొందినది. మొద్దయినా మాకైనా సరే కార్తీకములో దైవసన్నిధిని దీపాన్ని వహించడము వలన దామోదరుని దయవల్ల మోక్షమును పొందడం తథ్యము ‘ ఇలా చెప్పుకుంటూన్న వారి మాటలను విన్న ఉద్భూత పురుషుడు “అయ్యలారా! దేహి ఎవరు? జీవి ఎవరు? జీవుడు దేనిచేత ముక్తుడూ దేనిచేత బద్ధుడూ అవుతున్నాడో, దేనిచేత దేహులకింద్రియాలు కలుగుతున్నాయో వివరింపుడు” అని
ప్రార్థించదముతో, ఆ తాపసులలో వున్న అంగీకరసుడనే ముని అతనికి జ్ఞానబోధ చేయసాగాడు.
ఎనిమిదవ రోజు (అష్టమదిన) నాటి పారాయణము సమాప్తము.
Bhagavad Gita Sloka in Telugu ఈ రోజుల్లో జీవితం ఒక పెద్ద యుద్ధంలా మారింది. ఉదయం లేస్తే చాలు...…
Bhagavad Gita Sloka in Telugu ఈ రోజుల్లో చాలామంది యువతను వేధిస్తున్న పెద్ద సమస్య ఒకటుంది - "గందరగోళం".…
Bhagavad Gita Sloka in Telugu మనలో ప్రతి ఒక్కరిలోనూ ఒక ప్రత్యేకమైన వెలుగు ఉంటుంది. ఆ వెలుగు కొన్నిసార్లు…
Bhagavad Gita Chapter 10 Verse 20 మీరెప్పుడైనా కస్తూరి జింక గురించి విన్నారా? ఆ జింక తన శరీరం…
Bhagavad Gita Chapter 10 Verse 19 మీకు తెలుసా? ఒక చిన్న కథ చెప్తాను. సర్కస్‌లో ఏనుగు పిల్లను…
Bhagavad Gita Chapter 10 Verse 18 ప్రతి మనిషిలోనూ ఒక అపారమైన శక్తి సముద్రం దాగి ఉంటుంది. కానీ…